‘సైంధవ్’ మూవీ రివ్యూ

ఎమోషన్ తక్కువ, యాక్షన్ ఎక్కువై ప్రేక్షకులకు థ్రిల్ కలిగించని "సైంధవ్"

Byline :  The Federal
Update: 2024-01-13 14:00 GMT


(సలీమ్ బాషా)

ఈ సంక్రాంతి కి బరిలో దిగిన రెండో పెద్ద సినిమా ఇది. చాలా అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైంది. పైగా ఇది విక్టరీ వెంకటేష్ కి వజ్రోత్సవ సినిమా(75), ఈ సినిమా దర్శకుడు శైలేష్ కొలను ఇదివరకు చేసిన హిట్ సిరీస్ రెండు సినిమాలు హిట్ గా నిలిచాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో, ప్రమోషన్స్ లో, ట్రైలర్లలో ఒక భారీ ఎమోషనల్,యాక్షన్ థ్రిల్లర్ అని, విక్టరీ వెంకటేష్ ఇంతవరకు చేయని పాత్ర అని ఊదరగొట్టిన సినిమా ఇది. ఎంతో ఊహించుకొని సినిమాకి వెళ్లిన అభిమానులతో సహా ప్రేక్షకులు కూడా కొంచెం నిరాశకు గురికాక తప్పదు.
కథ గురించి చెప్పాలంటే
"స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) అనే ఒక అరుదైన జబ్బు ఉన్న
తన కూతురికి కావాల్సిన 17 కోట్ల రూపాయల ఇంజక్షన్ సంపాదించడం కోసం ఒక డార్క్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తండ్రి ఏం చేశాడు, చివరికి ఏమైంది" అన్నది ఈ సినిమా కథ
దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ " ‘స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ (SMA) ని సందేశాత్మకంగా చెప్పలేదు. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని సినిమాటిక్ గానే చెప్పాం. ఈ సమస్య ఎలా పరిష్కరించాలి? అనే దానిలోకి వెళ్ళలేదు. సినిమా చూసిన ప్రేక్షకులే ఒక ఆలోచనలోకి వస్తారు. చాలా ఆర్గానిక్ గా రాసిన కథ ఇది. అందరికీ కనెక్ట్ అవుతుంది. లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది." అన్నాడు. కానీ సినిమా చివర్లో అందరికీ ఇంజక్షన్ ఎలా ఇవ్వాలన్న దాన్ని చూపించాడు. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, సినిమాటిక్ గా చెప్పిన కథ ఇది అని చెప్పాడు. అయితే సినిమాటిక్ గా కూడా ఈ కథ సరిగా అతకలేదు.
ఇది ఒక ఎమోషన్ తో(తండ్రి-కూతురు) కూడిన యాక్షన్ థ్రిల్లర్ అని ముందే ప్రకటించారు. అయితే ఇందులో ఎమోషన్స్ తక్కువ ఉన్నాయి, థ్రిల్ కూడా తక్కువే. కానీ యాక్షన్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంది. అదే సినిమాని తక్కువ చేసింది. తండ్రి కూతురు మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నప్పటికీ, అవి మనసుకు హత్తుకునేలా లేవు. ఇలాంటి సినిమాకి ఇవే ముఖ్యం. దాంతోపాటు సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్లో మ్యూజిక్ కన్నా, తుపాకుల శబ్దాలు, బ్లాస్ట్ లు, బాంబుల మోత ఎక్కువగా ఉంది.
కొట్టొచ్చినట్లు కనిపించే లోపాలు
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎఫెక్టివ్ గా లేకపోవడమే కాకుండా, హీరో బ్యాగ్రౌండ్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయబడలేదు. అక్కడ సైకో( హీరోని విలన్ గ్యాంగ్ భయంతో పిలుచుకునే పేరు) పాత్ర చిత్రణ స్పష్టంగా లేదు . ఇక్కడ ఒక విషయం చెప్పాలి. "సైకో" అంటే SAINDHAV KONERU ( సైంధవ్ కోనేరు), అని చెప్పాడు దర్శకుడు. పాత్ర కూడా అలాగే ప్రవర్తిస్తుంది కాబట్టి బాగానే ఉందనిపించింది.
ఆ లెక్కన మరో "సైకో" SAILESH KOLANU(దర్శకుడు శైలేష్ కొలను). నిజానికి ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికి నిజమైన సైకో లాంటివాడు(బాగా చేసినప్పటికీ గుడ్ యాక్షన్ ఇన్ ఏ రాంగ్ ఫిలిం). ఈ సినిమాకు మరొక మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే, కథనం. కథ కొంచెం కొత్తది అయినప్పటికీ కథనం చాలా వీక్ గా ఉండడం తోపాటు స్పష్టత లేకపోవడం వల్ల ఈ సినిమా ఒక మామూలు యాక్షన్ సినిమా అయింది.
OPTOMETRY (ఆప్టొమెట్రీ అంటే కంటిని పరీక్షించి దానిలో లోపాలు కనుక్కొని, సరైన సలహాలు సూచనలు ఇచ్చే కోర్సు లో డాక్టరేట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను తన స్క్రీన్ ప్లే లో లోపాలు కనుక్కోలేకపోవడం విచిత్రమే.
నేటివిటి చిక్కలేదు...
“డ్రగ్ కార్టేల్స్, గన్ బిజినెస్..ఇలా పెద్ద స్కేల్ లో ఇందులో కథ జరుగుతుంటుంది. ఈ కథ సముద్రతీరంలో జరగాలి. వైజాగ్ లో ఇంత పెద్ద కార్యకలాపాలు జరుగుతాయంటే నమ్మశక్యంగా వుండదు. ముంబైలో పెట్టుకుంటే నేటివిటీ పోతుంది. అందుకే ‘చంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్ ని క్రియేట్ చేశాం” అని చెప్పాడు దర్శకుడు. ఇక్కడే తప్పులో కాలేశాడు. నిజంగా ఏ బొంబాయి లోనో, వైజాగ్ లోను జరిగినట్లు చూపించి ఉంటే, అది ఫిక్షన్ అయినా సరే కొంత నేటివిటీ ఉండేది. సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవాళ్ళు. కల్పిత నగరం చుట్టూ కథ అల్లడం వల్ల అది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.

మరో ముఖ్యమైన విషయం ఇందులో తండ్రి కూతురు మధ్య ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, మరికొంత ప్రాధాన్యత థ్రిల్లింగ్ గా నడపడానికి ఇస్తూ, యాక్షన్ కు కొంత మాత్రమే ప్రాధాన్యతనిస్తూ సినిమా తీసి ఉంటే అది బాగుండే అవకాశాలు ఎక్కువ ఉండేవి. ఈ మధ్యనే వచ్చిన " హాయ్ నాన్న" అనే సినిమా కొంత బావుండడానికి ఇదే కారణం. అందులో కూడా హీరో కూతురికి " సిస్టిక్ ఫైబ్రోసిస్" అనే అరుదైన వ్యాధి ఉంటుంది.
" ఆంగ్లంలో వచ్చిన సెవెన్, ఈక్వలైజర్ అనే సినిమాలు చూసి తెలుగులో కూడా అలాంటి సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది. అని అనుకున్నాను" అన్నాడు దర్శకుడు. చెప్పినట్లే ఈ సినిమాను ఆ సినిమాల లాగే తీశాడు! అందుకే నేటివిటీ తగ్గిపోయింది
 ఉత్కంఠ మధ్యలో మాయమైంది
“మొదట.. వెంకటేష్ గారు, పాప, శ్రద్దా శ్రీనాథ్ పాత్రలు ఆసక్తికరంగా పరిచయమౌతూ కథ చాలా హాయిగా మొదలౌతుంది. పదిహేను నిమిషాల తర్వాత ప్రేక్షకులు తల తిప్పుకోలేరు. అంత ఉత్కంఠభరితంగా సాగుతుంది” అని దర్శకుడు చెప్పిన దాంట్లో మొదటి సగం నిజంగానే జరుగుతుంది. కానీ రెండో సగంలో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్నది మాత్రం కనపడలేదు.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో కొత్త నగరాన్ని సృష్టించడం మొదలైంది(ఉదాహరణకు సలార్ సినిమా). నిజానికి దీంతో దర్శకుడికి ఎక్కువ సినిమా లిబర్టీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో దర్శకుడు చంద్రప్రస్థ అనే నగరాన్ని సృష్టించి, కథ మొత్తం అందులో నడిపాడు. చాలా ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడు.
ముఖ్యంగా గన్ ఫైట్స్. చాలా అసహజంగా ఉన్నాయి. దారమే బాలేనప్పుడు, దండ గురించి మాట్లాడకూడదు. ఈ సినిమాకి మరో ముఖ్యమైన మైనస్ పాయింట్ క్యారెక్టరైజేషన్. ఏ పాత్ర కూడా సరిగా మలిచినట్లు లేదు, హీరో పాత్ర సహా. నవాజుద్దీన్ సిద్ధికి కి ఎక్కువ ఫుటేజ్ ఇవ్వడం వల్ల, సినిమా లో విలనిజం పలుచబడి సీరియస్ నెస్ లేకుండా పోయింది. హిట్ సీరిస్ సినిమాల్లో "ఫిట్" గా స్క్రీన్ ప్లే రాసుకున్న శైలేష్ కొలను, ఈ సినిమాను "ఫిట్" గా రాసుకోలేకపోయాడు. ఈ సినిమాని కొంచెం వదులుగా రాసుకున్నాడు. అయినప్పటికీ దాన్ని బాగా నడపడానికి ప్రయత్నం చేశాడు, కానీ సక్సెస్ కాలేకపోయాడు.
ఇంకా మిగతా విషయాలు దగ్గరికి వస్తే 63 ఏళ్ల వయసులో కూడా వెంకటేష్ ఫైట్ సీక్వెన్స్ లలో ఫిట్ గా ఉండడం. నటనకు ఆస్కారం ఉన్న సన్నివేశాల్లో వెంకటేష్ బాగా చేయడం. కానీ స్క్రీన్ ప్లే పకడ్బందీగా లేకపోవడం వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సినిమాలో ఇంకా లోపాల గురించి చెప్పాలంటే శ్రద్ధ శ్రీనాథ్(మనోజ్ఞ పాత్రలో) పాత్ర మలిచిన తీరు కథకు సరిగ్గా అతకలేదు.
వెంకటేష్ నడిపించాడు కొంత
నటనా పరంగా చెప్పాలంటే వెంకటేష్ ఈ సినిమాను తన నటనతో కొంతవరకు నడిపించాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో తమిళ హీరో ఆర్య పాత్ర గురించి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు, అలాగే ఆండ్రియా కొంతవరకు బానే చేసింది. నవాజుద్దీన్ సిద్ధికి(కొంచెం అతిగా అనిపించినా) బానే చేశాడు. శ్రద్ధ శ్రీనాథ్ కు నటన ప్రదర్శించే అవకాశాలు కొంచెం తక్కువే. అయినా పర్వాలేదు. ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ రుహాని శర్మ యాక్టింగ్. డాక్టర్ పాత్రలో మెరిసింది. ముఖేష్ ఋషి, జయప్రకాష్ లాంటి వాళ్ళకి ఇది మామూలే.

‘హిట్ 2’ విడుదలైన తర్వాత వెంకటేష్ కలిసి సైంధవ్ కథ చెప్పినప్పుడు, ‘ఇది నా 75వ సినిమా అనిపిస్తోంది’ అని వెంకటేష్ చెప్పినట్లు దర్శకుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. "వెంకటేష్ గారు ఎమోషనల్ సీన్స్ లో చాలా అద్భుతమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్ డీల్ చేయడంలో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి." అని కూడా చెప్పాడు ఈ సినిమా చూస్తే ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు సరిగ్గా పాటించాడా లేదా అన్న అనుమానం వస్తుంది.

ఒక మాటలో చెప్పాలంటే కొంతవరకు భరిస్తే అభిమానులు మాత్రం చూడగలరు.

తారాగణం: వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ ,రుహానీ శర్మ, ఆర్య, ఆండ్రియా జర్మియా
నవాజుద్దీన్ సిద్దిఖీ
రచన ,దర్శకత్వం: శైలేష్ కొలను
ఛాయాగ్రహణం: ఎస్. మణికందన్
కూర్పు: గ్యార్రి బి.హెచ్
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత :వెంకట్ బోయనపల్లి
నిర్మాణ సంస్థ :నిహారిక ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ 2024 జనవరి 13
బడ్జెట్: దాదాపు 85 కోట్లు!


Similar News