మనవూరి పాండవులు శోభ గుర్తుందా! 44 ఏళ్లు గడిచినా వీడని మిస్టరీ!!

శోభ.. ప్రముఖ దర్శకుడు బాలూ మహేంద్ర భార్య.. ఆమె జీవితంలో అది కూడా ఓ గెస్ట్ పాత్రేనేమో.. 18 ఏళ్లు రాకుండానే అద్భుత సినిమాలు చేసి అర్థంతరంగా రాలిపోయింది

By :  A.Amaraiah
Update: 2024-03-05 02:53 GMT
శోభ.. (ఫోటో కర్టసీ వికీపీడియా)

పాండవులు, పాండవులు తుమ్మెదా మనవూరి పాండవులు తుమ్మెదా.. ఈ పాట గుర్తిందిగా. మహాభారతానికి ఆధునిక కావ్యం అంటుంటారు. ఏ లోకాన ఉన్నాడో మహానుభావుడు బాపూ తీసిన సినిమా మనవూరి పాండవులు. చిరంజీవి, భానుచందర్, మురళీ మోహన్, ప్రసాద్ బాబు, కృష్ణంరాజు, రావు గోపాలరావు లాంటి ఉద్దండ పిండాలు నటించిన 1980ల నాటి సిన్మా. ఆ సినిమాలో అద్భుత అందెగత్తె అయిన ఓ పిచ్చిమనిషి పాత్ర ఒకటుంటుంది. ఆ పాత్రను పోషించింది మహాలక్ష్మి మీనన్ ఎలియాస్ శోభ. ఈ శోభే ఆ తర్వాత మహాదర్శకుడు బాలూ మహేంద్ర భార్య అయింది. అర్థంతరంగా తనువు చాలించింది.

ఇక్కడ సీన్ కట్ చేస్తే..

ఎన్నికలు వచ్చినప్పుడల్లా మన దేశంలో వినపడే వాటిల్లో ప్రధానమైంది కులం, మతం. దీని గురించి కారల్ మార్క్స్ మొదలు అంబేడ్కర్ వరకు ఎందరెందరో ఎన్నెన్నో విశ్లేషణలు చేశారు."మతం అనేది మత్తు మందని, అది హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిదని, స్పూర్తి లేని పరిస్థితుల్లో స్ఫూర్తినిచ్చేదని, అందువల్లే అది ప్రజల పాలిట మత్తుమందు" అంటారు కారల్ మార్క్స్. మార్క్స్ స్నేహితుడైన ఎంగెల్స్ ఇంకో అడుగు ముందుకేసి "మతాన్ని తొలగించాలంటే, మతాన్ని సృష్టించిన పరిస్థితులను తొలగించాలంటారు. మత భావనలు బలంగా కొనసాగటానికి భయం, అదృష్టం, అతీతశక్తులు వంటివేవో అనేకం రూపుమాపాలి. శాస్త్రీయ భావజాలం ప్రజల్లో బాగా వ్యాపిస్తే మతం అవసరం మానవుడికి ఉండదని మహామహులు ఎందరో చెప్పారు. అయినా అది తొలిగిపోకపోగా మరింత ముదురుతోంది. అది వేరే విషయం.

ఇక్కడ చెప్పాలనుకున్న సంగతేంటంటే ఈ మధ్య చూసిన ఓ సినిమా... 'ఒరు వీడు ఒరు ఉళగం' (ఒక ఇల్లు ఒక ప్రపంచం) గురించి! ఆ సినిమాలో హీరోయిన్ శోభ. ఆమె పుట్టుకతోనే నటి అయినట్టుంది. అసలు పేరు మహాలక్ష్మి మీనన్. సినిమాల్లో పేరు శోబా. పుట్టుకతోనే కొన్ని కొందరికి అబ్బుతాయంటారే అలాంటి మనిషి. డాన్స్, నటనలో ఆమె పెట్టింది పేరు. చిన్నప్పటి నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న అందుకున్న ఈమె పెళ్లి కూడా ఓ వివాదమే. నిండా పదిహేడేళ్లు కూడా నిండని ఆ అమ్మాయి జీవితం అర్థంతరంగా ముగిసిపోతుంది. అదో విషాద కావ్యం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. స్టార్ స్టేటస్. అద్భుతమైన రోల్స్. సమకాలీన నటీమణులకు నిజంగానే దడ పుట్టించేంత నటనా వైదుష్యం.. ఇవన్నీ నటి శోభ సొంతం. తల్లిదండ్రులు మలయాళీలు. కానీ శోభ పుట్టి పెరిగిందంతా చెన్నై. ఆమె తల్లి ప్రేమ కూడా మలయాళ నటే. 'తట్టుంగల్ తిరక్కపడుమ్' అనే తమిళ సినిమాతో బాలనటిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి విజయ శిఖరాలు ఎక్కారు శోభ. 18 ఏళ్లు రాకుండానే అర్ధంతరంగా రాలిపోయారు.

ఆమె నటించిన 'ఒరు వీడు ఒరు ఉళగం' (ఒక ఇల్లు ఒక ప్రపంచం) సినిమాపై ఇటీవల మలయాళంలో మొదలైన చర్చ ఇప్పుడు దేశమంతటా జరుగుతోంది. ఆ సినిమాలో ఆమె నటించేనాటికి ఆమె వయసు మహా అయితే పదహారేళ్లు. కానీ ఏం నటన! వావ్! అన్పించేంతగా.. కథ ప్రకారం ఒక బ్రాహ్మణ కుటుంబంలోని అమ్మాయి (శోభ) తన మాస్టారికి జ్వరం తగ్గాలని తల్లి (పండరీబాయి) దగ్గరికి వచ్చి తులసి ఆకుల కషాయం అడుగుతుంది. ఆ కషాయం తీసుకుని వెళ్తూ, ఆయన జ్వరం తగ్గేందుకు పెరుమాల్ (వెంకటేశ్వర స్వామి)కి మొక్కుకోమని చెబుతా అని తల్లితో అంటుంది. తల్లి నవ్వి, 'మీ మాష్టారు క్రైస్తవుడే! వాళ్లకు బాగవ్వాలంటే మేరీమాతను మొక్కుకోవాలి' అంటుంది.

ఆ అమ్మాయి చర్చికి వెళ్లి మేరీమాత విగ్రహం ఎదుట నిలిచి 'అయిగిరి నందిని.. నందిత మేదిని' అంటూ అమ్మవారి స్తోత్రం పాడుతుంది. "నిన్నెలా వేడుకోవాలో నాకు తెలియదు తల్లీ! అందుకే ఇది పాడాను" అంటుంది. ఆ మొక్కు ఫలితమో, మరేమో కానీ మాష్టారికి జ్వరం తగ్గిపోతుంది. ఇంక కషాయంతో పని లేదని తీసుకెళ్లిపోతుండగా ఆయన పిలిచి, దాన్ని తీసుకుని తాగుతాడు. "నువ్వు నమ్మకంగా తెచ్చినదాన్ని నేను తాగకుండా ఎలా ఉంటానని" అంటాడు.

ఇది 1978 నాటి సినిమా! మతం.. అతి మామూలు విషయంగా చలామణీ అయిన సమయం అది. పరస్పర సహకారాలు, మతాభిమానాలు పూర్తి ఆమోదం పొందిన కాలం. ఆ కాలంలో ఇలాంటి సన్నివేశాలు ఉండేవి. ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలు పెడితే తల్లకిందులుగా వేలాడదీసి నిట్టనిలువునా శిలువేసేస్తారు. ఉభయ వర్గాలు దుమ్మెత్తిపోయవచ్చు. మత ద్వేషని ముద్రవేసి బోనులో నిలబెట్టడమో, కటకటాల వెనుక కూర్చోబెట్టడమో చేయవచ్చు. అప్పుడూ ఇప్పుడూ మతం ఉన్నా అది ఎవరి మనసుల్లో వారికి ఉండేది. లోలోన నిలిచి ఉండేది తప్ప ఇవాళ్టి మాదిరిగా అసూయ, ద్వేషంతో కత్తులు, గండ్రగొడ్డళ్లతో నరుక్కునేంత లేదు. దేశభక్త సిద్ధాంతాలకు ముడిపడి లేదని చెప్పడం కోసమే పైన కారల్ మార్క్స్ ను కోట్ చేసినా అంబేడ్కర్ ప్రస్తావించినా.. ఈ సినిమాను వీలయినంత ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరం నేడుందనేది వాస్తవం.

ఇక శోభ గురించి...

ఈ 'ఒరు వీడు ఒరు ఉళగం' సినిమా దర్శకుడు దురై. ఆ తర్వాత ఆయనే 'పసి' అనే సినిమా తీశారు. శోభ కెరీర్లో అతి ముఖ్యమైన సినిమా అది. ఆ చిత్రంలో ఆమె చేసిన 'కుప్పమ్మ' పాత్రకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కింది. అప్పటికి ఆమెకు 17 ఏళ్లు. అవార్డు అందుకునేలోగానే ఆత్మహత్య చేసుకున్నారామె. ఆమె చనిపోయిన నాలుగేళ్లకు ఆమె తల్లి ప్రేమ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అతి పెద్ద విషాదం.

బాలు మహేంద్రతో వివాహం...

శోభకు ప్రముఖ దర్శకుడు బాలూ మహేంద్రంటే పిచ్చి. ఆ సినిమాలంటే వెర్రి అభిమానం. అందువల్లే ఆమె తన కంటే 26 ఏళ్లు పెద్దవాడు, అప్పటికే పెళ్లయిన బాలు మహేంద్రను ఇష్టంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాలూ మహేంద్ర టాలెంట్ ఆ రేంజ్ లో ఉండేది. శోభ తల్లిదండ్రులు వద్దని చెప్పినా ఆమె వినలేదు. విషయమేమిటో తెలియదు గాని ఆమె జీవితం అర్థంతరంగా ముగిసిపోవడం సినీ ప్రపంచానికి తీరని లోటు. ఇన్నేళ్లయినా శోభ మరణం ఇప్పటికీ మిస్టరీయే. ఆమె బలవన్మరణానికి బాలూ మహేంద్రపై ఆరోపణలు వచ్చాయి. శోభ ది హత్యా, ఆత్మహత్యా, ఏదైనా కుట్ర దాగి ఉందా అనేది ఇంకా తేలలేదు. ఆమె చనిపోయి 44 ఏళ్లు గడిచినా ఈ మిస్టరీ మాత్రం వీడలేదు. కేజీ జార్జ్ దర్శకత్వంలో 1983లో వచ్చిన మలయాళ చిత్రం 'లేఖయుడే మరణం ఒరు ఫ్లాష్‌బ్యాక్' శోభ జీవితం ఆధారంగా తీసిన సినిమా అంటుంటారు.

Tags:    

Similar News