చిరు ధాన్యాలతో వంట.. ఇంటి నిండా కాసుల పంట!
తింటే జొన్న మురుకులు తినాలి... చూస్తే రాజేంద్రనగర్ నూట్రీహబ్ చూడాలి..శిక్షణ పొందండి, స్టార్టప్ పెట్టండి, జనారోగ్యం కాపాడండి..;
By : The Federal
Update: 2025-08-06 06:32 GMT
(వలేటి గోపీచంద్)
తింటే జొన్న మురుకులు తినాలి... చూస్తే రాజేంద్రనగర్ నూట్రీహబ్ చూడాలి.. ఓ శాస్త్రవేత్త స్టేట్మెంట్ ఇది.
ఇటీవల కాలంలో చిరుధాన్యాల ఉత్పత్తలకు గిరాకీ ఏర్పడింది. ఒకనాటి పేదల ఆహారం ఈ రోజు ధనవంతుల హోదాకు మారు పేరు అయింది. జీవన శైలి మార్పుల ప్రభావంతో వచ్చిన ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం వీటి వినియోగం అనివార్యం కావటం గమనార్హం.
ముడి ధాన్యాలకు అదనపు విలువ జోడింపుతో మార్కెట్ లో పలు చిరు ధాన్యాల ఉత్పత్తులు ఆకర్షణీయ ప్యాకింగ్ తో వినియోగ దారులను ఆకట్టుకుంటున్నాయి. అన్ని రకాల శ్రేణుల ఉత్పత్తులు ఈ వరుసలో ఉన్నాయి.
చిరు ధాన్యాల బియ్యం, నూక, పిండి, రవ్వతో పాటు వర్మీ సిల్లీ, నూడుల్స్, పాస్తా, పలు రకాల బిస్కెట్లు, కుకీస్, అటుకులు, Flakesతో కూడా మురుగులు (చక్రాలు) దగ్గర నుంచి పలు తిను బండారాల వరకు. జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, వరిగలు, ఊదలు, కొర్రలు, అరికెలు, అండు కొర్రలు వంటి తృణ ధాన్యాలతో ఉన్న బహుళ ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా మాట్లాడు తున్నారు. వీటిని న్యూట్రీ సీరియల్స్ అంటున్నారు. ఇవి అన్నీ ఒకనాటి మన రోజు వారి ఆహారం లో భాగంగానే ఉన్నా, కాల గమనంలో వరి, గోధుమలకు అలవాటు పడటం జరిగింది. ఇప్పుడా ఆ పరిణామ క్రమం జోలికెళ్లి విశ్లేషించాల్సిన అవసరం లేదు గాని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం.
అంతర్జాతీయ స్థాయి నుంచి లోకల్ వరకు...
భారత ప్రభుత్వ చొరవతో ఐక్య రాజ్య సమితి 2023ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అప్పటి నుంచి చిరుధాన్యాల ప్రాధాన్యత సర్వత్రా విస్తరించింది. ఇండియా ప్రభుత్వం శ్రీ అన్న పేరుతో ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించి వీటికి పూర్వ వైభవం తీసుకు రావాలని సంకల్పించింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ లోని చిరు ధాన్యాల పరిశోధన కేంద్రాన్ని గ్లోబల్ హబ్ గా ప్రకటించింది.
ఒకనాటి అఖిల భారత జొన్న పరిశోధన సమన్వయ కేంద్రం భారత చిరు ధాన్యాల పరిశోధన సంస్థగా రూపాంతరం చెందింది. గ్లోబల్ హబ్ గా ప్రకటించిన ప్రభుత్వం 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి, వాటి ఖర్చుకు ఒక ముసాయిదా తయారు చేసి అమలు చేయాలని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. వీటిలో పరిశోధనలతో పాటు ప్రాసెసింగ్, అదనపు విలువ జోడింపునకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని భారత చిరు ధాన్యాల పరిశోధన సంస్థ లో Nutri Hub ఏర్పాటు చేశారు.
ప్రాసెసింగ్ సమస్యకు పరిష్కారం..
చిరు ధాన్యాల సాగు చేసిన రైతులకు ప్రాసెసింగ్ ఒక ప్రధాన సమస్య. సాగు విస్తీర్ణం తగ్గిన కొద్ది ప్రాసెసింగ్ సౌకర్యాలు తగ్గటం సహజం. అయితే ఇప్పుడు తిరిగి ఆ పంటల సాగు దిశగా అడుగులు పడుతున్నాయి. తప్పని సరిగా పరిశోధనతో పాటు ప్రాసెసింగ్, మార్కెటింగ్, అదనపు విలువ జోడింపు మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. అందుకు ఈ Nutri Hub ఒక Incubatorగా పని చేస్తుంది. ప్రాసెసింగ్ కోసం ఇక్కడ అత్యున్నత ప్రమాణాలు తో మిల్లింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు.
గంటకు ఒక టన్ను ధాన్యం ప్రాసెస్ చేసే శక్తి సామర్థ్యం లో పనిచేసే యంత్రాలు ఉన్నాయి. ఆసక్తి గల వారు ఇక్కడ వారి ధాన్యాన్ని రుసుం చెల్లించి ప్రాసెస్ చేసుకో వచ్చు. లేదా ఇక్కడ శిక్షణ తీసుకుని వారి వారి ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని బట్టి చిన్న చిన్న యంత్రాలు ప్రాసెసింగ్ కోసం ఏర్పాటు చేసుకోవచ్చు. గతం లో ప్రతి ఊరిలో రైస్ మిల్లు, అంతకు ముందు చిరు ధాన్యాల ప్రాసెసింగ్ మిల్లులు ఉండేవి. అవసరం తగ్గేకొద్దీ అవి మాయమయ్యాయి.
అదనపు విలువ జోడింపునకూ మార్గం ఉంది...
ప్రాసెసింగ్ తో పాటు Nutri Hub లో చిరు ధాన్యాల ఉత్పత్తులు కి అదనపు విలువ జోడింపు మీద ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పరచుకోవొచ్చు. వరి, గోధుమలు తో చేసే అన్నింటిని చిరు ధాన్యాలతో చేసుకోవొచ్చు. ఇవి వాటికంటే బల వర్ధకమైనవి. పోషక విలువలు కలిగి ఉన్నాయి. అనేక జీవన శైలి ప్రతి కూలతలకు పరిష్కారం ఈ చిరు ధాన్యాలు. రోజు రోజుకు ఈ న్యూట్రిహబ్ ద్వారా శిక్షణ పొంది, స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసే వారు పెరుగుతూ ఉన్నారు.
మరో వైపు యువ పారిశ్రామిక వేత్తలు ప్రత్యేక దృష్టి సారించి వీటి ఉత్పత్తుల తయారీ లో కి వస్తున్నారు. వారి వారి బ్రాండ్స్ పేరుతో మార్కెట్ చేస్తూ మిల్లెట్ స్నాక్స్ ను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఉన్నారు.
ఉత్పత్తులు ఎలా ఉంటాయో చెప్పటానికి, చూపించటానికి న్యూట్రిహబ్ ద్వారా అనేక వాటిని తయారు చేసి మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఇవి అందరికీ అందు బాటులో ఉండే విధంగా రాజేంద్ర నగర్ , హిమాయత్ సాగర్ ప్రధాన ప్రధాన రహదారి లో సంస్థ ప్రధాన ద్వారం ప్రక్కన కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆదివారం మినహా కార్యాలయం వేళల్లో పని చేస్తుంది. వీరికి ఎక్కడ శాఖలు లేవు. ఒకటి రెండు సంవత్సరాలలో న్యూట్రిహబ్ ప్రభావం తప్పక ఉంటుందని చెప్పక తప్పదు.
మరో ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ సంస్థ తన విస్తరణ సేవల కార్య క్రమం లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలు తో పాటు ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నీ ఆదివాసీ ప్రాంతాల్లో పని చేస్తూ ఉన్నారు. కొండ ప్రాంతాల్లో సాగు చేసే చిరు ధాన్యాల కు ప్రాసెసింగ్, మార్కెటింగ్,అదనపు విలువ జోడింపు మీద ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారి ఆర్థిక ప్రగతికి చేయూత అందిస్తూ ఉన్నారు. వీరు కొన్ని ప్రాంతాల్లో నాబార్డ్ వారు ఏర్పాటు చేసిన FPO లు ద్వారా , మరి కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో చిరుధాన్యాల సవ్వడి గణ గణ మ్రోగెలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆసక్తి కలవారు Nutri Hub CEO Dr stanleyని ఈ ఫోన్ లో +918979517923 సంప్రదించవచ్చు.
రచయిత- ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం కన్వీనర్, ఆకాశవాణి సీనియర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ (రిటైర్డ్)