శేషాచలం అడవుల్లో ఫాసిల్ ట్రాక్స్
రాళ్లపై జంతువుల అడుగుల ముద్రలు ఎలా ఏర్పడతాయి?;
పరిపూర్ణమైన శిలలో జంతువు పాద ముద్రల్ని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగడం సహజం దానితో పాటు మన మదిలో ఉద్భవించే ప్రశ్న?
ఒక జంతువు ఓ బండరాయి మీద అడుగు వేసిందని తెలుస్తోంది కానీ అది శిలగా ఎలా మారింది? ఎంత పాతదైవుంటుంది ?? అసలు ఇది సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఫాసిల్ ట్రాక్స్ (Fossil Tracks) అనే అద్భుత ప్రక్రియ.
అడుగుల ముద్రలు ఎలా ఏర్పడతాయి?
ప్రాచీన కాలంలో జంతువులు, అప్పటి మానవులు, డైనోసార్లు, పెద్ద పాములు, కీటకాలు మొదలైనవి మృదువైన నేలపై నడిచినప్పుడు ఏర్పడిన పాద ముద్రలు తరువాతి కాలం లో ఎండ వేడిమికి ఎండి ,గాలికి ఆరి గట్టి పడివుంటాయి. ఆ తరువాతి వాతావరణ అననుకూల పరిస్థితులలో ఏర్పడిన భూకంపాలు, భూమి పొరల్లోని పగుళ్లు మొదలైన ప్రక్రియల వలన ఈ పాదముద్రలు వున్న నెల పై భూపొరలను పొరలు పొరలుగా ఏర్పరచిఉంటాయి, కాలక్రమేణా ఆ ముద్రలు వున్న ఆ మట్టి భూమిలోని అధిక ఒత్తిడి వలన మరియు ఉష్ణం వలన శిలలుగా మారుతాయి. అలా, జంతువు వేసిన పాద ముద్రలు శిలలో ఫాసిల్ ట్రాక్‌లుగా స్థిరపడతాయి. అవి ఆ స్థితిలోనే వేల, లక్షల,కోట్ల సంవత్సరాలు భూమి పొరలలో అలాగే నిక్షిప్తమై ఉండిపోతాయి.
భూమి లోపలి ఫాసిల్ ట్రాక్స్ బయటకు ఎలా వస్తాయి?
భూమి లోపల మిలియన్ సంవత్సరాలుగా నిక్షిప్తమైన ఫాసిల్ ట్రాక్స్ బయటకు కనిపించేందుకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు అవసరం. ఇవి ప్రకృతి ప్రక్రియల వల్ల లేదా , మానవ పరిశోధనల ద్వారా వెలుగులోకి వస్తాయి.
1. ప్రకృతి ప్రక్రియల ద్వారా
వర్షం వలన గాని లేదా గాలులు వల్ల గాని భూమి లోపల పాదముద్రలతో పదిలంగా వున్న శిలల పై ఉన్న మట్టి పొరలు తొలగిపోవడం వలన లేదా భూకంపాలు లేదా భూ ఉపరితలపు చలనాల వల్ల లోపల దాగిన శిలలు వెలుగులోకి వస్తాయి. కొన్నిసార్లు నదుల ప్రవాహం లేదా వర్షాల వలన జరిగే soil ఎరొసిఒన్ జరిగి ఫాసిల్ ట్రాక్స్ బయటపడతుంటాయి.
2. మానవ అన్వేషణల ద్వారా
శాస్త్రవేత్తలు భూగర్భ పరిశోధనలు చేస్తూ, పాత శిలల్లో జీవావశేషాల కోసం తవ్వకాలు నిర్వహిస్తారు.పురావస్తు లేదా జీవశాస్త్ర అన్వేషణలు చేస్తున్న సమయంలో ఈ ఫాసిల్ ట్రాక్స్ బయటపడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో బొగ్గు గనులు, రహదారి నిర్మాణాల సమయంలో జరిపే తవ్వక పనుల సమయంలో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా కూడా ఈ ఫాసిల్ ట్రాక్స్ బయటపడుతుంటాయి.
ఇవి ఎంత పాతవై ఉంటాయి?
జంతువుల అడుగుల ముద్రల వయస్సు వాటి నిల్వదైన శిల తరాన్ని బట్టి మారుతుంది.కొన్ని కోటి సంవత్సరాల పాతవైఉంటాయి. మరి కొన్ని 20 కోట్ల నుంచి 25 కోట్ల సంవత్సరాల నాటి పాద ముద్రలుగా కూడా గుర్తించబడ్డాయి. ఇంతవరకు భారతదేశం ఎక్కడెక్కడ ఫాసిల్ ట్రాక్స్ బయటపడాయి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ,మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఇటువంటి ముద్రలు కనుగొనబడ్డాయి.
ఇటీవలి అధ్యయనాలలో శేషాచల అభయారణ్యంలో కూడా ఇలాంటి జంతువుల అడుగుల ముద్రలు గుర్తించబడ్డాయి.
Fossil 1
శేషాచల అభయారణ్యం లో జంతువుల గిట్టల గుర్తులు, ఏనుగు పాద ముద్రలు, పాతకాలం నాటి మానవుని పాదముద్రలు వంటి ఎన్నో ఆసక్తికరమైన గుర్తులు కనుగొనబడ్డాయి. ఇవి ఆ కాలంలో అక్కడ జీవించిన జంతువుల వైవిధ్యం, వాటి కదలికలు, జీవన శైలిపై విలువైన ఆధారాలను అందిస్తాయి. "శేషాచలంలో కనిపించిన ఈ అడుగుల ముద్రలు అక్కడి రాళ్ల ఆకారం, గాలికి లేదా వర్షాలకు జరిగిన సాయిల్ ఏరోషన్,
అలాగే వాతావరణ మార్పులతో సంబంధం ఉండే అవకాశం ఉంది." ఇవి శేషాచల జీవ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని తెరచే అవకాశాన్ని సూచిస్తున్నాయి.
ఈ పాదముద్రలు ఎంత పాతవో ఖచ్చితంగా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ‘రేడియోమెట్రిక్ డేటింగ్’ (Radiometric Dating) అనే శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో రాళ్లలో ఉండే కొన్ని రకాల మూలకాలు (ఉదాహరణకు యూరేనియం, పొటాషియం, కార్బన్-14 మొదలైనవి) ఎంతమేరకు క్షీణించాయో (decay) కొలుస్తారు. ఆ క్షీణత రేటు ఆధారంగా రాళ్ల వయస్సు, దాంతో పాటు పాదముద్రల వయస్సును కూడా అంచనా వేయవచ్చు. ఈ విధానం ద్వారా కొన్ని ముద్రలు కోట్ల సంవత్సరాల కిందటివని కూడా నిర్ధారించగలుగుతున్నారు."
Fossil 2
శాస్త్రీయ ప్రాముఖ్యత
ఈ రాళ్లపై జంతువుల అడుగుల ముద్రలు జీవ పరిణామ చరిత్రకు కీలక ఆధారాలు. అవి ఏ జంతువు వేసింది, ఎటు వైపు నడిచింది, ఎంత పెద్దది, బరువు ఎంత, వేగం ఎంత, చలనం ఎలా ఉండేది — అన్నిటినీ అంచనా వేయవచ్చు.ప్రత్యక్షంగా ఆ పాదముద్రను వదిలిన జంతువు జీవించి లేకపోయినా, అడుగుల ద్వారా దాని జీవన శైలి గురించి తెలుసుకోవచ్చు. అందుకే, ఈ అడుగుల ముద్రలు శాస్త్రీయంగా ఎంతో విలువైనవి.
ముగింపు
రాళ్లపై ఉన్న అడుగుల ముద్రలు కేవలం ముద్రలు మాత్రమే కావు, అవి ప్రకృతి దాచుకున్న జీవ చరిత్ర పుటలు. వేల లక్షల సంవత్సరాల క్రితం ఓ జీవి వేసిన అడుగు, మనముందు ఒక శిలా శాసనంగా నిలుస్తుంది. ఈ ప్రక్రియ మనకు భూమి జీవరాశిపై కాలం తిరిగి చెప్పిన కథలులా ఉంటాయి. శేషాచలం వంటి ప్రాచీన పర్వతాలలో ఈ ముద్రలు కనిపించడం, ఆ ప్రాంత ప్రాచీన జీవ వైవిధ్యాన్ని బలంగా సూచిస్తోంది.
ఇది మనకు ఓ సంకేతం
ప్రకృతి మన చరిత్రను రాళ్లపై చెక్కి, తరతరాలకూ చెప్పాలనుకుంటోంది అని. ప్రకృతి ఎంత శక్తివంతమైందో, ఒక క్షణం ముద్రను శతాబ్దాల చరిత్రగా మార్చగలదో… ఇది మరోసారి మనకు గుర్తు చేస్తుంది.