శేషాచలం అడవుల్లో వేలాడేసిన వెండి జలతారు

తిరుపతి సమీపాన శేషాచలం కొండల్లోని బ్రహ్మ తీర్థం నిరంతర సందడితో ఏదో వినిపిస్తున్నట్టుంటుంది

Update: 2024-09-23 02:30 GMT
బ్రహ్మ గుండం


ఎత్తైన నల్లని రాతి కొండ.. మబ్బులు కమ్మిన ఆకాశాన్నది తాకుతున్నట్టుంది. కొండ పొడవునా మెట్లు మెట్లుగా ఉంది. ఆ మెట్ల పైనుంచి తెల్లని పాల నురుగులా కిందకు దుముకుతోంది. వేలాడేసిన వెండి జలతారులా జలపాతం. శేషాచలం కొండల్లోని బ్రహ్మ తీర్థం నిత్యం రొద చేస్తూ తన సొదలు వినిపిస్తున్నట్టుంది.
ఇరవై మందిమి కలిసి (2022 సెప్టెంబర్ 12) ఆదివారం తెల్లవారుజామున నారాయణ తీర్థం బయలుదేరాం. తిరుపతి నుంచి రైల్వే కోడూరు వైపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుక్కల దొడ్డిని సమీపిస్తున్నాం. ఆ చీకట్లో రోడ్డుపక్కనే జింకల గుంపు వెదురు పొదల్లో మేత మేస్తున్నాయి. కుక్కల దొడ్డి నుంచి శేషాచలం అడవిలోకి సాగాం.
రైల్వే వంతెన కింద బురద నీళ్ళు దాటుకుంటూ మా వాహనాలు ముందుకు కదిలాయి. తెలతెలవారుతుండగా అటవీ శాఖ గేటు దాటుకుని లోనికి ప్రవేశించాం. పచ్చని అడవిలో పక్షుల పలకరింపులు. అడుగడుగునా రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తున్న కాలువలు. సిద్ధలేరు బేస్ క్యాంపును దాటుకుని సాగుతున్నాం.


దారికి అడ్డంగా ప్రవహిస్తున్న ఏరు


వర్షాలకు మట్టిదారి బాగా కొట్టుకుపోయి, ఎక్కడికక్కడ గండ్లు పడ్డాయి. కాలువలను దాటుకుంటూ సాగుతుంటే ఎదురుగా పచ్చని అడవి. దట్టంగా పెరిగిన వెదురు పొదలు. అక్కడక్కడా ఏనుగుల విసర్జితాలు. అవి ఏనుగులు సంచరించిన ఆనవాళ్ళు. దారికడ్డంగా పడిన వెదుర్లను తొలగిస్తూ సాగుతున్నాం.

కుక్కల దొడ్డి నుంచి మూడేర్లకురవ వరకు ఇరవై కిలోమీటర్లు వాహనాల్లో సాగాం. అక్కడి నుంచి నారాయణ తీర్థం వైపు ఏటిలోనే మా నడక. కొంత దూరం సాగే సరికి జలపాతపు హెూరు. అదిగో ఎదురుగా ఎత్తైన నల్లని కొండ పై నుంచి దుముకుతున్న జలపాతం. గత ఏడాది ఏప్రిల్లో నారాయణ తీర్థం వెళ్ళాం. అప్పుడు కనిపించని బ్రహ్మతీర్థం జలపాతం ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది! నిజమే అది ఎండాకాలం. జలపాతం జాలువారిన అనవాళ్ళు తప్ప, అప్పుడా ఎత్తైన కొండ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇదే బ్రహ్మ తీర్థం అన్నారు. తీర్థం లేని తీర్థం అనుకున్నాం.
వర్షాలు పడితేనే ఇది దుముకుతుంది. వేసవిలో నీళ్ళు లేక మూతిముడుచుకు కూర్చుంది. బ్రహ్మ తీర్థం అసలు రూపాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఎత్తైన రాతి ఈ మూల నుంచి ఆ మూల వరకు విస్తరించింది. ఒకే కొండ పైనుంచి పక్కపక్కనే రెండు జలపాతాలు హెూరుమంటున్నాయి! రెండూ కలిసి కింద ఉన్న నీటి గుండంలో పడుతున్నాయి.

వెండి జలతారు లా జాలువారు తున్న బ్రహ్మ గుండం ముందు ప్రకృతి ప్రియులు

వెండి జలతారులా జాలువారు తున్న బ్రహ్మ గుండం ముందు ప్రకృతి ప్రియులు


గుండంలోకి జాలువారుతున్న జలపాతం పక్కనే కుడి వైపు నుంచి కొండ ఎక్కుతున్నాం. అడుగులు జాగ్రత్తగా వేయాలి. చేతులతో పైకి పాకాలి. జలపాతం ఎంత ఉదృతంగా ఉంది! ఎత్తైన కొండ నుంచి ఒక అంచులో అగాం. మమ్మల్ని చూసి ఆ జలపాతం మరింత రొద చేస్తోంది. దాని ముందే కూర్చుని అల్పాహారం తిన్నాం. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియదు. తింటున్నంత సేపూ బ్రహ్మతీర్థం అందాలను వీక్షించడమే!

గత ఏడాది వచ్చినప్పుడు ఈ ఏర్లు పారడం లేదు. ఎండిపోయిన ఏటి మధ్యనుంచే సాగాం. ఇప్పుడలా కాదు. ఏర్లన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. నారాయణతీర్థం నుంచి వచ్చే ఏరు రెండు ఎర్రటి కొండల నడుమనుంచి బ్రహ్మ తీర్థం మీదుగా మూడేర్ల కురువ వైపు సాగుతోంది. ఏటికి ఇరువైపులా ఎత్తైన కొండ అంచులు. మధ్యలో నీటి ప్రవాహం. 

లోతుకు గజ మాల వేసినట్టు వేలాడు తున్న గిల్లి తీగ


వేలాడుతున్న కొండ చిలువ లాంటి గిల్లి తీగ. గజమాలను కొండ మెడలో వేద్దామా, ప్రవహిస్తున్న ఏటికి వేద్దామా అన్నట్టు అటు ఇటు రెండు పెద్దపెద్ద వృక్షాలు తమ బుజాన గిల్లి తీగను మోస్తున్నాయి. వేసవికాలానికి, వర్షాకాలానికి ఎంత తేడా! గత ఏడాది వేసవిలో ఈ ఏటి మధ్యలోనే గులకరాళ్లపైన నడుచుకుంటూ వెళ్ళాం. రెండు కొండల నడుమ ఏరు నక్కినక్కి ప్రవహించేది. ఇప్పుడా ఏరు తలెత్తుకుని ఏటి నంతా పరుచుకుని గంభీరంగా సాగుతోంది. ఈత కొడుతూ ముందుకు సాగాల్సిన నీటి గుండాలు పెరిగాయి. వాటిలో నీటి ప్రవాహమూ పెరిగింది. కొండ అంచులో ఒక పక్క సామాను పెట్టేసి ఏటిలో దిగక తప్పలేదు. ఈదుకుంటూ, ఈదుకుంటూ సాగుతున్నాం. ఆ ఏటిని ఎంత ఈదినా ఇంకా ఈదాల్సింది ఎంత ఉందబ్బా! అదిగో దూరంగా జలపాతపు హోరు. అదే నారాయణ తీర్థమే! ఆ గుండం దరి చేరాం.

ఎంత ఉదృతంగా దూకుతోంది! కొండపైనుంచి రెండు పాయలుగా చీలి పడుతోంది. మధ్యలో రెండూ కలిసి ఒకే పాయగా దూకుతోంది. గత ఏడాది వేసవి కంటే ఇప్పుడు ఉదృతంగా దుముకుతోంది. మధు, తిరుమల రెడ్డి మరికొందరు డేర్ డెవిల్ ట్రెక్కర్లు జలపాతం పక్కనుంచి ముప్పై అడుగుల కొండను అతి కష్టంపైన ఎక్కారు. పైన తాడు కట్టికిందకు వదిలారు. జలపాతం ఉదృతికి గత ఏడాదిలాగా తేలికగా ఎక్కలేకపోయాం. వేలాడుతున్న తాడును జలపాతం పక్కకు నెట్టేస్తోంది. అంతా పాకుడు. పట్టు దొరకడం లేదు. కొందరు మధ్యనుంచి నీటి గుండంలోకి జారిపడిపోతున్నారు. కొద్ది మంది మాత్రమే ఎక్కగలిగారు. జలపాతం మమ్మల్ని పైకి ఎక్కనివ్వడం లేదు.

పైన మరో పెద్ద నీటి గుండం మహాద్భుతం. ఆ మడుగును మూడు వైపులా కొండ తన బాహువుల్లో బంధించింది. ఆ కొండకున్న సొరంగం నుంచి నీటి ప్రవాహం వచ్చిపడుతోంది. ఎంత విచిత్రం! అయినా ఎంత సేపుండగలుగుతాం! మళ్ళీ వెనుతిరగక తప్పలేదు. ఈదుకుంటూ వచ్చేశాం.

ఉధృతంగా దుముకు తున్న నారాయణ తీర్థం జలపాతం


మధ్యాహ్నం ఒకటిన్నర దాటింది. పొద్దుటి నుంచి ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలు వీడిపోయాయి.

ఎండ మొదలైంది. నారాయణ తీర్థం ఏటికి ఇరువైపులా ఎత్తైన కొండలు. ఆ కొండలు, వాటిపైన మొలిచిన వృక్షాలు మాకుగొడుగును పట్టినట్టున్నాయి. ఎండ పొడ సోకనివ్వడం లేదు. భోజనాలు ముగించుకుని వెనుతిరిగాం. మూడేళ్ల కురవ వద్దకు వచ్చాం.

తిరుగు ప్రయాణంలో దారికి అడ్డంగా ప్రవహిస్తున్న ఏరు

ఒక నిశ్శబ్ద తరంగం

మాట్రెక్కింగ్ ఉప్పెనలో అతనొక నిశ్శబ్ద తరంగం. అతనికి అడివంటే ప్రాణం. అడివంటే అంతులేని ఇష్టం. అలివ్ గ్రీన్ దుస్తుల్లో తెల్లగా, పొట్టిగా ఉంటాడు. ట్రెక్కింగ్ అంటే అందరికంటే ముందుంటాడు. కెమెరా, స్టాండ్, టెంటు, బుజాన బ్యాగ్. యుద్ధానికి వెళ్ళే సైనికుడిలానో, కమేండో లానో కనిపిస్తాడు. బ్రూస్ఓలా సన్నగా రాటుదేలి ఉంటాడు. మాటల మాంత్రికుడు కాదు. పలకరిస్తేనే తప్ప నోరు విప్పడు. కర్ణుడి సహజ కవచ కుండలాల్లా అతని ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుంటుంది. గుండ్రటి ముఖంలో పెద్ద పెద్ద కళ్ళు ఎప్పుడూ అడవిని పరికిస్తూనే ఉంటాయి. నేను అంతగా గమనించలేదు కానీ, చాలాకాలంగా మాతోనే సాగుతున్నాడు. అతనొక నిశ్శబ్దం తరంగమైనా, హెూరెత్తే అలల మధ్యే ఉంటాడు. ఆయన డాక్టర్ ప్రసాద్ పీలేరులో వెటర్నరీ డాక్టర్. ప్రకృతి ప్రేమికుడు, ట్రెక్కింగ్ వీరుడు, జలపాత స్వాప్నికుడు.


Tags:    

Similar News