అట్లాంటాలో హ్యమన్ రైట్స్ మ్యూజియం సందర్శన

పౌరహక్కుల ఉద్యమం సాధించిన విజయానికి ఈ మ్యూజియంని అంకితం చేశారు. లోపలికి వెళ్లి ఒక్కొక్క ప్రదర్శనాంశాన్ని చూస్తూ ఉంటే నాకు ఒళ్లు జలదరించింది.

Update: 2024-07-28 03:49 GMT

అమెరికా దేశంలోని జార్జియా రాష్ట్రానికి అట్లాంటా నగరం రాజధాని. వ్యాపార రీత్యా బాగా అభివృద్ధి చెందిన నగరం. వాయు రవాణా కేంద్రంలో పేరు పొందింది. అమెరికా హక్కుల ఉద్యమం కూడా అట్లాంటా నుంచే మొదలైంది.వాతావరణం కూడా సమ శీతోష్ణత తో ఉండడం వలన చాలా మంది అక్కడ స్థిర పడ్డారు. హైదరాబాదులో కలసి పని చేసిన ఇద్దరు మిత్రులు కూడా అట్లాంటాలోనే స్థిర పడ్డారు. వాళ్ళు అమెరికాలో స్థిరపడినా మా స్నేహం కొనసాగుతూనే ఉన్నది. వాళ్ల ఆహ్వానం మేరకు థాంక్స్ గివింగ్ సెలవులు వాళ్లతో గడపాలనే ఉద్దేశంతో అట్లాంటా బయలుదేరాను. అట్లాంటా హోక్స్ ఫీల్డ్ జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం చాలా పెద్దది. ప్రపంచం లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అట. అక్కడి నుంచే నగరం లోనికి వెళ్ళడానికి మెట్రో రైలు సౌకర్యం ఉన్నది. కానీ రూప ఎయిర్ పోర్ట్ కు వచ్చి నన్ను వాళ్ల యింటికి తీసుక పోయింది. ఉదయం ఎనిమిది గంటలకు వాళ్ళింటికి చేరాం. రూప నేను హైదరాబాదులో కలిసి పని చేసాము. ఆమె మ్యాథమెటిక్స్ టీచర్. దాదాపు ఇరవై యేండ్ల క్రితం అమెరికా వెళ్ళి అట్లాంటాలో స్థిరపడింది. ఆమె తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని బోధిస్తుంది.

అమెరికాలో అట్లాంటా కూడా పెద్ద నగరమే అయినా పెద్దగా టూరిస్టు ప్రదేశం కాదు. అయినా అక్కడ ఉన్నవే ఏవో నాకు చూపించాలనే ఆరాటం తనలో కనిపించింది. అట్లాంటాకు పెద్ద ఆకర్షణ అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్. తొంబైవేల చదరపు అడుగుల ఆకర్షణీయమయిన భవనం అది. దీనికి అర్కిటెక్ట్ ఫిలిఫ్ ఫ్రీలాన్ .




 అంతే. టిఫిన్ ముగించి మొదట స్వామినారాయణ టెంపుల్ కు బయలు దేరాము. మాతోపాటు వాళ్ల చిన్నక్క కూడా వచ్చింది. అమెరికాలో ఐదు నగరాలలో స్వామినారాయణ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అట్లాంటాలో ఉన్నది ఒకటి. దీని నిర్మాణం సెప్టెంబర్ 2005 లో మొదలయి ఆగష్టు 2007 లో ప్రజల సందర్శనార్థం ప్రారంభమైంది.




 లోపలికి వెళితే పాలరాతితో చెక్కిన శిల్పకళ అబ్బుర పరచింది. ప్రశాంతమైన వాతావరణం , అందమైన శిల్పకళ , రుచికరమైన ప్రసాదాలు తీసుకొని , ప్రాంగణమంతా తిరిగి చూసి , కొన్ని ఫోటోలు తీసుకొని అక్కడనుంచి సాయిబాబా టెంపుల్ కు వెళ్లాము. ఇది కూడా చాలా పెద్ద దేవాలయము. నిలువెత్తు బాబా విగ్రహం , ప్రశాంతమైన వాతావరణం , మేము మధ్యాహ్న సమయంలో వెళ్లి నందు వల్ల రద్దీ ఎక్కువగా లేదు. అక్కడ కొద్దిసేపు ఉండి షాపింగ్ కు వెళ్లాం. ఇండియా మిత్రుల అభ్యర్థన మేరకు బీడ్స్ కొనాలని ప్రయత్నం. చాలా పెద్ద షాపు. ఎవరికి కావలసినవి వాళ్లం కొనుక్కొని ఇంటికి చేరాం.


ఇంటికి చేరేసరికి రూప కూతురు అంజు రకరకాల వంటలు చేయడంలో నిమగ్నమై ఉంది. ప్రతి సంవత్సరం థాంక్స్ గివింగ్ రోజున డిన్నర్ పార్టీ ఉంటుందట. అందుకే ఆ హడావుడి. ఇండియన్ వంటకాలతోపాటు మెక్సికన్ మొదలైన ఇతర వంటకాలు కూడా తయారు చేశారు. ఏడు గంటలకల్లా రూప వాళ్ల చిన్నక్క కుటుంబం , చెల్లెలు రజని కుటుంబం వచ్చారు. పరిచయాల అనంతరం అందరూ కలిసి భోజనం ముగించారు. రాత్రి పన్నెండు గంటలదాకా కబుర్లు చెప్పుకుంటూ నిద్రకు ఉపక్రమించాము.



రూప వాళ్లు డిశంబరు లో ఇండియాకి వెళుతున్నారు కాబట్టి ఈ సమయంలో ఏ వస్తువు అయినా తక్కువ ధరకే లభిస్తుందని ఈ రోజు షాపింగ్ చేయాలని నేను కూడా ఏమైనా షాపింగ్ చేయవచ్చు అనే ఉద్దేశం తో షాపింగ్ కు బయలుదేరాము. సిటీలోకి వెళితే రద్దీ సమస్య అవుతుందని సిటీకి వెలుపల ఉన్న షాపింగ్ మాల్ వెళ్లాలని నిర్ణయించారు. వాళ్ల ఇంటి నుంచి ఈ మాల్ నలభై నిమిషాల దూరంలో ఉంది. ఉదయం పదిగంటలకు రెండు కార్లలో బయలు దేరాము. కానీ రద్దీ మూలంగా అక్కడకు చేరేసరికి దాదాపు మధ్యాహ్నం రెండు అయింది. పార్కింగ్ మరో పెద్ద సమస్య అయింది. ఎంత ప్రయత్నించినా ఒక్క కారు మాత్రమే పార్క్ చేయగలిగారు. ఏ షాపులో చూసినా చాంతాడంత వరుసలు కనబడ్డాయి. అక్కడ అప్పుడు షాపింగ్ చేయడం సాధ్యం కాదని తేట తెల్లమైంది. కనీసం ఎక్కడైనా భోజనం చేయడానికి ప్రయత్నిస్తే అదీ సాధ్యం కాలేదు. తిరిగి ఇంటికి చేరేసరికి సాయంత్రమైంది.




 ఆ రోజు అలా వ్యర్థమైందని రూప చాలా బాధపడింది. బ్లాక్ ఫ్రైడే రోజున షాపింగ్ కు వెళ్లడం వాళ్లకీ మొదటి అనుభవమే అట. తెలిస్తే ప్లాన్ చేసే వాళ్లము కాదు అనుకున్నారు. రద్దీ ఉంటుందని వినడమే కానీ ఇంతలా ఉంటుందా ! అని చూసి ఆశ్చర్య పోయాము. వందలాది కార్లు , వేలాది జనాలు... రంజాన్ సమయంలో మన చార్మినార్ ప్రాంతంలో ఉండే రద్దీ కన్నా ఎక్కువగా ఉంది. నాకైతే అది కూడా ఒక మంచి అనుభవమే అనిపించింది. అదే వాళ్లతో చెప్పాను. వీలుచేసుకొని వాళ్ల ఇంటికి రమ్మని ముందురోజు వాళ్ల చిన్నక్క చెప్పడం వల్ల ఆరోజు సాయంత్రం వాళ్ల ఇంటికి వెళ్లాము. ఈ మధ్యనే ఇల్లు కొనుక్కొని వాళ్లు అక్కడికి వచ్చారట. ఇల్లు చాలా బాగుంది. చిన్నక్క అమెరికాలో స్థిరపడిన విషయాలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె అక్కడ టీచర్ గా పని చేస్తుంది.


రేపు రజని రూపా వాళ్ల చెల్లెలు డిన్నర్ కు పిలిచింది. తను ఆర్టిస్టు. అందుకే వాళ్ల ఇల్లు ఒక ఆర్ట్ మ్యూజియం లాగా ఉంది. వ్యర్థమైన వస్తువులతో తాను రూపొందించిన కళాఖండాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ తాను చేసే పని కూడా ఇదే ఈవెంటుకు తగినట్లుగా అలంకరణ చేసి ఇవ్వడం తన పని.


అట్లాంటాలో చూడవలసిన వాటిలో అక్వేరియం ప్రధానమైంది. అయితే వాళ్లు చాలా సార్లు చూసి ఉండడం వలన నేను శ్రీ బయలు దేరాం. ఉదయం పది గంటల కల్లా అక్కడకు చేరుకున్నాం. ఉదయమే రావడం వల్ల రద్దీ పెద్దగా లేదు. నేను చికాగో లో కూడా అక్వేరియం చూసి ఉండడం వలన దానితో దీనిని సరి పోల్చుకుంటూ చూడడం మొదలు పెట్టాను. దీనిని నవంబర్ 23/2005 లో ప్రారంభించారు. 2012 దాకా ప్రపంచంలోనే పెద్దది గా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. అమెరికాలో మాత్రం ఇదే పెద్దది.





 13 ఎకరాల విస్తీర్ణం. పదకొండు మిలియన్ US గాలన్ ల నీళ్లతో దీని నిర్మాణం జరిగింది. ఇందులో Ocean Voyager , Cold water quest , Tropical Diver , Georgia Explorer , River Scout , Dolphin coast , Sharks Predators the Deep విభాగాలు ఉన్నాయి. వీటిలో ఉన్న చేపలు , నీటి జంతువుల సంఖ్య చెప్ప డానికి సాధ్యం కానిది. ఇందులోనికి ప్రవేశించగానే నాకు సముద్రం లోపల ఉన్న అనుభూతి కలిగింది. పైనా కిందా చుట్టు పక్కలా ఎటు వైపు చూసినా నీళ్లే..... అందులో రక రకాల చేపలు..... మన చుట్టే తిరుగుతున్న అనుభూతి. అద్భుతమైన అలాంటి నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించ కుండా ఉండలేను. కొన్ని విభాగాలను పైనుంచి చూసిన వాటినే మళ్లీ కిందనుంచి దగ్గరగా చూసే విధంగా కూడా నిర్మాణం జరిగింది. అక్కడక్కడా ఒక మోస్తరు సొరంగాల లాంటివి ఏర్పాటు చేశారు. పిల్లలు వాటిలో దూరి అక్కడ వున్న చేపలను చూసి కేరింతలు కొడుతూ బయటకు వస్తున్నారు. వాళ్లను చూసి నాకూ సరదా పుట్టింది. అతి కష్టం మీద ఒక సొరంగం లోకి మాత్రం వెళ్లి రాగలిగాను. అక్కడ కొన్ని సాహస క్రీడలు కూడా ఏర్పాటు చేశారు.





 పురితాడు వంతెన మీద నడవడం వాటిలో ఒకటి. కింద లోయ లాగా ఉండి నీళ్లుంటాయి. మన నడకకు వంతెన కదులుతూ ఉంటుంది. దాని పైన నడుస్తున్నప్పుడు నేను ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యా ను. మరోచోట టచ్ మి ( Touch me) అనే బోర్డు కనిపించింది. చేపలను కేవలం చూసి ఆనందించడమే కాకుండా వాటిని తాకి కూడా ఆనందించే అవకాశం అన్నమాట. అంతే. ఎందుకు ఊరుకుంటాను. చేతులు శుభ్రంగా కడుక్కొని వాటిని తాకి మరీ సంతోషించాను. అవి విషపూరితమైన చేపలు కావడం వలన మన సొంత రిస్క్ మీదనే ముట్టుకోవాలి. అందుకే అతి కొద్ది మంది మాత్రమే వాటిని తాకుతున్నారు. అన్నీ చూసుకొని బయటకు వచ్చేసరికి దాదాపు పన్నెండు కావచ్చింది. రూపావాళ్లు మమ్ముల్ని పిక్ అప్ చేసుకునే టైం ఇంకా గంటన్నర ఉంది. వేడివేడి కాఫీ తాగుతూ ఏం చేయాలా ? అని ఆలోచిస్తూ ఎదురుగుండా చూస్తే కోక్ కంపెనీ , నేషనల్ సెంటర్ ఫర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ (National Centre for Human Rights) మ్యూజియం కనిపించాయి.





 

హ్యూమన్ రైట్స్ అనగానే ఆసక్తి వేసింది. ఆ మ్యూజియం లోకి వెళ్ళాము. 2014 జూన్ 23న ఇది ప్రారంభమైంది. పౌరహక్కుల ఉద్యమం సాధించిన విజయానికి దీనిని అంకితం చేశారు. లోపలికి వెళ్లి ఒక్కొక్క ప్రదర్శనాంశాన్ని చూస్తూ ఉంటే నాకు ఒళ్లు జలదరించింది.




నల్ల వాళ్లు ఎంత అంటరాని తనాన్ని, హింసను అనుభవించారు అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు , ఆయా సందర్భానికి తగిన ధ్వనుల ఏర్పాటుతో సందర్శకులు దానిని అనుభూతి చెందే విధంగా ఏర్పాటు చేశారు. ఆయా సంఘటనలు చిన్నచిన్న సినిమాలుగా కూడా చూడవచ్చు. కానీ మాకు అంత సమయం లేనందు వల్ల మేం వాటిని చూడలేక పోయాము.




 అమెరికా హక్కుల ఉద్యమంతో పాటు ఇతర దేశాలలో జరిగిన ఉద్యమాలకు సంబంధించిన చిత్రాలు ఒక గదిలో ఉన్నాయి. మన దేశ స్వాతంత్ర్య ఉద్యమ చిత్రాలను మేము చూశాము. మార్టిన్ లూథర్ కింగ్ అట్లాంటా నగరంలో జన్మించాడు. ఆయన మన గాంధీజీని తనకు ఆదర్శంగా చెప్పుకున్నాడు. గాంధీజీ చిత్రాన్ని ఆరాధనగా చూస్తున్న మార్టిన్ లూథర్ కింగ్ చిత్రపటం ఉన్నది. ఈ మ్యూజియంలో ఆయనకు సంబంధించి ప్రత్యేక విభాగం ఉన్నది. అక్కడ ఫోటోగ్రఫీ నిషిద్ధం.




 మార్టిన్ లూథర్ కింగ్ చేతి రాత , ఆయన రాసిన పుస్తకాలు , వ్యక్తిగత గ్రంథాలయం మొదలైన వాటిని భద్రపరిచారు. విద్యార్థులకు , చరిత్ర పరిశోధకులకు , ప్రపంచ ఉద్యమ చరిత్రను తెలుసుకోవాలి అనుకునే ఉత్సాహవంతులకు ఈ మ్యూజియం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. రూప ఫోన్ కాల్ రావడంతో గబ గబా బయటకు వచ్చి కారెక్కాము.

అక్కడి నుంచి అందరం కలిసి శ్రీనివాస రెడ్డి యింటికి వెళ్లాము. అక్కడే భోజనాల ఏర్పాటు చేశారు. వీలైనంత తొందరగా అక్కడి నుంచి బయలుదేరి తిరుగు ప్రయాణంలో బొటానికల్ గార్డెన్ చూడాలనేది ముందుగా మేము వేసుకున్న ప్లాను. కానీ కబుర్లలో మునిగిన మాకు సమయమే తెలియలేదు. ఇంతకు మునుపే చెప్పినట్లుగా మేము ముగ్గురం హైదరాబాద్ లో సహోద్యోగులం.

అమెరికా విద్యా విధానం మా కబుర్ల లో చోటు చేసుకుంది. ఆయన నన్ను అక్కడి పాఠశాలకు తీసుకెళ్లి చూపించాడు. ఆయన పన్నెండో తరగతికి గణితాన్ని బోధిస్తాడు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే గ్రేడ్స్ నిర్ణయిస్తారు. ప్రతి యూనిట్ తరువాత పరీక్ష ఉంటుంది. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రాజెక్టులు కూడా విద్యార్థులు విధిగా చేయవలసి ఉంటుంది. ఉపాధ్యాయుల విద్యార్హతలను బట్టివేత నాలు నిర్ణయిస్తారు. ప్రతి రాష్ట్రంలో టీచింగ్ ఎడ్యుకేషన్ పరీక్షలు ఉంటాయి. విధిగా ఆ పరీక్షలు రాయాలి. పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఆ అయా రాష్ట్రాలలో బోధించే అర్హత ఉంటుంది. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉంటారు.




 ఏ విద్యార్థినీ ఉపాధ్యాయుడు శిక్షించడానికి వీలు లేదు. విద్యార్థీ టీచర్ సంబంధం స్నేహ పూరితంగా ఉండాలి.

శ్రీనివాస రెడ్డి పనిచేసేది హెన్రీ కౌంటీలో. ఇక్కడ ఒకే ప్రాంగణంలో ప్రైమరీ , మిడిల్ మరియు హైస్కూల్స్ ఉంటాయట. అమెరికాలో అన్ని చోట్లా ఇలాగే వుండాలనే రూల్ ఏమీ లేదు. అది ఆ కౌంటీ ప్రత్యేకత మాత్రమే ప్రైమరీ స్థాయిలో ఒకటినుంచి ఐదు తరగతులు, మిడిల్ స్థాయిలో ఆరు నుంచి ఎనిమిది తరగతులు, హై స్కూల్ స్థాయిలలో తొమ్మిది నుంచి పన్నెండు తరగతులు ఉంటాయి.

ఆయా కౌంటీలలో ఉన్న పాఠశాల స్థాయి విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక కౌంటీలో ఎన్ని పాఠశాలలు ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సగటున ఒక విద్యార్థికి పది వేల డాలర్ల నుంచి పదిహేను వేల డాలర్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. నాణ్యమైన భోజనం పాఠశాలలోనే ఉంటుంది. సబ్జెక్టులతో పాటు ఆటలకు సంగీతం లాంటి ఇతర కళలకూ ప్రాధాన్యత ఉంటుంది. పర్యవేక్షణ ఉంటుంది కానీ అధికార హోదాలో ఉండదు. స్నేహ పూరిత వాతావరణంలో ఉంటుంది. ఉపాధ్యాయులలో జవాబుదారీతనం ఉంటుంది. బాధ్యతాయుతంగా పనిచేస్తారు. పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సంతోషంగా ఉంటారు. అలా అని క్రమశిక్షణ ఉండదని కాదు. కాపీయింగ్ కూడా కొన్ని సార్లు జరుగుతుందట. అందుకే పరీక్షల సమయంలో మొబైల్ ఫోనులను , స్మార్ట్ వాచీలను ఈమధ్యనే నిషేధించారట. దీనితో చాలావరకు కాపీయింగ్ తగ్గినా పూర్తిగా తగ్గలేదని మిత్రులు వాపోయారు. కొన్నిసార్లు విద్యార్థి కాపీ చేస్తున్నాడని గమనించినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే..... టీచర్ ఆ విద్యార్థిని నిలబెట్టి చెక్ చేయకూడదు. అలా చేస్తే ఆ విద్యార్థిని అవమాన పరచినట్టు అవుతుందట. ఇలాంటి సందర్భాలలో ఉపాధ్యాయులకు కత్తిమీద సాము చేసినట్టు ఉంటుంది. విద్యార్థులే ఆయా ఉపాధ్యాయుల గదులకు వెళతారు. తరగతికి ముప్పై మంది వి ద్యార్థులు ఉంటారు. ప్రతి ఉపాధ్యాయునికి ప్రత్యేక గది ఉంటుంది. విద్యార్థులు తరగతి గదికి రాగానే మొబైల్ ఫోనును పక్కన ఏర్పాటు చేసిన ట్రేలో పెట్టాలి. ఈ సమాచారం అంతా మిత్రులతో జరిపిన సంభాషణ వల్ల తెలిసిందే

శ్రీనివాస్ రెడ్డి సహచరి వసంత ప్రీ ప్రైమరీ పాఠశాలలో పని చేస్తుంది. తరగతికి ఇరవై మంది విద్యార్థులు ఉంటారట. విధిగా ఇద్దరు టీచర్లు ఉంటారట. ఇలాంటివి తను పనిచేసే ప్రాంగణంలో మూడు ఉన్నాయట.

భారత దేశంలో కూడా మూడు స్థాయిలలో విద్యాబోధన జరుగుతుంది. అయితే ఉన్నత పాఠశాల స్థాయిలో పదకొండు , పన్నెండు తరగతులు చేరలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్య ప్రత్యేకంగా ఉన్నది. దీనికి కారణం ఈ స్థాయి విద్య కార్పొరేట్ల చేతుల్లో బలంగా బందీ కావడమే. పర్యవేక్షణ కూడా అధికారయుతంగానే అధికశాతం ఉంటుంది. పాఠశాలల్లో తగినన్ని వసతులు లేకపోవడం , ఆట స్థలాలు లేకపోవడం , ఆటలకు , కళలకు ప్రాధాన్యత లేకపోవడం , కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం , విద్యార్థి స్వయం ప్రతిపత్తితో చదవకుండా బట్టీయం చేయడం లాంటివి మన విద్యా వ్యవస్థలో లోపాలు.

మూడు రోజులు ఇట్టే గడిచి పోయాయి. ఇంకా కొన్ని రోజులు కలిసి వుంటే బాగుంటుందని అందరం అనుకున్నాం కానీ కుదరలేదు. రుచికరమైన ఇంటి భోజనం చేస్తూ గత అనుభవాలను తలచుకుంటూ ప్రస్తుతం ఉన్న విధా నాన్ని గమనిస్తూ రాబోయే మార్పును అంచనా వేస్తూ కాలక్షేపం కబుర్లతో కాకుండా అర్థవంతమైన చర్చలతో కాలం గడిపాము.


Tags:    

Similar News