బ్రిటన్ రాజు పుట్టిన రోజు వేడుకల్లో అవార్డు అందుకోనున్న హైదరాబాద్ అమ్మాయి

తెలుగు నేలపై పుట్టి విదేశీ గడ్డపై కీర్తిని చాటిన తెలుగు వజ్రాలు ఎందరో ఉన్నారు. వారి జాబితాలో తాజాగా మరో వజ్రం చేరింది. ఆ వజ్రం పేరే అర్చన దన్నమనేని.

Update: 2024-06-29 02:00 GMT

తెలుగు నేలపై పుట్టి విదేశీ గడ్డపై కీర్తిని చాటిన తెలుగు వజ్రాలు ఎందరో ఉన్నారు. వారి జాబితాలో తాజాగా మరో వజ్రం చేరింది. ఆ వజ్రం పేరే అర్చన దన్నమనేని. బ్రిటన్ రాజు చార్ల్స్ 3 తన 76వ పుట్టిన రోజును ఈ ఏడాది నవంబర్ 14న జరుపుకోనున్నారు. ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వాటిలో అర్చన ఓ ప్రత్యేక అవార్డు అందుకోనున్నారు. పలు రంగాల్లో అద్భుత సేవలు అందించిన కొందరు వ్యక్తులకు రాజు పుట్టిన రోజు వేడుకల్లో ప్రత్యేక అవార్డులు అందించనున్నారు. ఈ వేడుకలకు హాజరుకావడమే పెద్ద విషయంగా అనేక మంది భావిస్తారు. అటువంటి ఈ వేడుకల్లో ప్రత్యేక అవార్డు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి అవకాశాన్ని మన హైదరాబాద్ అమ్మాయి అర్చన దన్నమనేని అందుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే చార్ల్స్ 3 జన్మదిన వేడుకల్లో ఆమె అవార్డు అందుకోనున్నారు.

యూకే వ్యాప్తంగా ప్రజలకు అందించిన సేవలను గుర్తిస్తూ అధికారులకు ఈ అవార్డులు అందిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది రాజు పుట్టినరోజు వేడుకల్లో అవార్డులు అందుకోవడానికి మొత్తం 20 మంది వ్యక్తులను ఎంపిక చేశారు. ఈ అవార్డులు అందుకునే వారిలో చారిటీ రంగం, మిలటరీ, వ్యాపారం, వాణిజ్యం రంగాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరంతా రాజు పుట్టినరోజు వేడుకల గౌరవాలను కూడా అందుకోనున్నారని టార్డ్ ల్యూటనెంట్ జో రోప్నర్ వివరించారు. ‘‘సమాజానికి అపారమైన సేవలు చేసిన వారి సేవలను గుర్తించడంలో భాగమే రాజు బర్త్‌డే గౌరవాలు. నార్త్ యార్క్‌షైర్‌లో గౌరవించబడిన వారు వివిధ రంగాలకు చెందిన వారు. వారిని గౌరవించడం దేశంలో జీవితం ఎంత వైవిధ్యంగా ఉంటుందో వివరిస్తుంది. అవార్డులు అందుకున్న వారంతా తమ తమ రంగాల్లో అపారమైన అంకిత భావాన్ని చూపారు. వారంతా కూడా రాజు పుట్టినరోజు వేడుకల్లో భాగం కానున్నందుకు గర్వపడాలి’’అని జో రోప్నర్ చెప్పారు.

వారిలో మన హైదరాబాద్‌కు చెందిన అర్చన రావ్ దన్నమనేని కూడా ఉన్నారు. ఆమె చర్చ్ ఫెంటన్‌కు చెందిన అధికారి. పన్నుకు సంబంధించిన రంగంలో ఆమె అందించిన అమోఘమైన సేవలను, అంకిత భావాన్ని గుర్తిస్తూ యూకే ప్రభుత్వం.. రాజు పుట్టినరోజు వేడుకల్లో అవార్డులు అందుకునే వారిలో ఆమె పేరును కూడా జోడించారు. అర్చన.. రెవెన్యూ అండ్ కస్టమ్స్ విభాగంలో సీనియర్ ట్యాక్స్ స్పెషలిస్ట్, ట్యాక్స్ ప్రొఫెషనల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్చన.. ఆదేశ ఖజానాకు రెండు బిలియన్ పౌండ్ల ఆదాయం సమకూర్చడంతో ఈ అరుదైన గుర్తింపు దక్కింది. మెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డుకు ఎంపికయ్యారు. బ్రిటన్‌లో ఎదరైన అనుభవాలు ఆమె మాటల్లోనే..

ఈ అవార్డే సాక్షం

‘‘ఎక్కడో భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ ఒంటరిగా ప్రయత్నించి ఇప్పుడు ఈరోజున ఈ స్థానియిలో ఉన్నానంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగు, అంకితభావంతో చేసే ప్రతి పనీ, నిజాయతీగా పడే కష్టం మనల్ని విజయానికి చేరువ చేస్తాయి’’ అని చెప్పుకొచ్చారామే. అందుకు నాకు ఈ అవార్డు దక్కడమే ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు.

ఇదొక అరుదైన గౌరవం

‘ఈ వార్డుకు ఎంపిక చేయడం కోసం స్వయంప్రతిపత్తి ఉన్న హానర్స్ కమిటీ ఒకటి ఉంటుంది. అది అన్ని శాఖలను వడపోసి కొందరి పేర్లతో జాబితాను సిద్ధం చేస్తారు. దానిని ప్రధానికి అందిస్తుంది. దానిని పరిశీలించిన తర్వాత ప్రధాని ఆ జాబితాను రాజు ముందుంచుతారు. ఆ జాబితాలో నా పేరు కూడా ఉంది. నవంబర్‌లో బంకింగ్ హామ్ ప్యాలెస్ వేదికగా జరిగే రాజు పుట్టినరోజు వేడుకల్లో ఆ అవార్డును అందుకోనున్నాను’’ అని అవార్డుల ఎంపికను కూడా వివరించారామే. ‘‘ఈ అవార్డు నాకు రావడాన్ని నేనే నమ్మలేకున్నా. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఎందుకంటే నాకు తెలిసి ఈ అవార్డు అందుకున్న వారిలో పెద్ద క్రీడాకారులు, ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు అంతటి ప్రతిష్టాత్మక పురస్కారం నాకు లభిస్తుందంటే ఇది కలేమో అన్న అనుమానం నాకే వస్తుంది. కాదు నిజమే అన్న ప్రతి సారి పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నా’’ అని తన సంతోషాన్ని మాటల్లో చెప్పడానికి తెగ ప్రయాస పడ్డారు ఆమె.

భారత్ పద్మా అవార్డుల్లానే

భారతదేశంలో పద్మ అవార్డులు ఉన్న విధంగా ఇక్కడ కూడా పలు అవార్డులు ఉన్నాయి. వాటిలో నైట్ హుడ్, ఓబీఈ, ఎంబీఈ ప్రధానమైనవి. ఇవి విశేష సేవలు అందించిన వారికి దక్కే అవార్డులు. వీటిలో నైట్‌హుడ్ అవార్డు అందుకున్న వారు వాళ్ల పేరు ముందు సర్ అని పెట్టుకోగలుగుతారు. వీటిలో నేను ఎంబీఈ అవార్డుకు ఎంపికయ్యాను. కాబట్టి నేను ఇక ఎంబీఈ అని అధికారికంగా రాసుకోవచ్చు. ఈ అవార్డులు అందుకున్న వారికి యూకేలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఏదో రావాలని, ఎవరో గుర్తించాలని నేను పని చేయను. నేను చేసే పనిని పూర్తిగా ఆస్వాదిస్తాను. పని కష్టాన్ని భారంగా కాకుండా ఛాలెంజ్‌గా తీసుకుంటా. అందుకే ఉద్యోగ పరంగా ప్రతి నిమిషం కూడా ఒక అడ్వేంచర్‌లానే ఉంటుంది. ఇదే నా విజయ రహస్యం’’ అని వివరించారు.

సివిల్స్ కొట్టడమే లక్ష్యం

‘‘నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. పదోతరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివాను. ఆ తర్వాత చెన్నైలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్(ఈసీ) చేశాను. స్కాట్‌లాండ్ రాజధాని ఎడిన్‌బరాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విత్ హ్యూమన్ రీసోర్సెస్ మాస్టర్స్‌ను 2008లో పూర్తి చేశాను. అది పూర్తయిన తర్వాత కెన్నేళ్లు లీడ్స్‌లోని ఓ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేశా. అప్పుడు 18వేల మంది సిబ్బంది బాధ్యతలు చూసుకున్నాను. చిన్నప్పటి నుంచి నా కల ఒక్కటే అదే సివిల్స్‌ను క్రాక్ చేయడం. భారత్‌లో ఉన్నా ఇదే చేసేదాన్ని. యూకేలో ఉన్నా కబట్టి ఇక్కడ కూడా అటువంటిదే చేశాను. అప్పటి నుంచి హెచ్‌ఎంఆర్‌సీలో పలు హోదాల్లో విధులు నిర్వర్తించాను’’ అని చెప్పారు.

వివక్ష చూశాను

‘‘నా భర్త కూడా లీడ్స్ యూనివర్సిటీలో చదువుకున్నారు. మామయ్యగారు సింగరేణిలో పని చేసేవారు. మేం ప్రస్తుతం లీడ్స్‌లో ఉంటున్నాం. ఇక్కడ కూడా మహిళల పట్ల వివక్ష ఉంది. నా విషయానికే వస్తే.. ఇప్పుడు ఒక్కసారిగా ఒక మహిళ ఇంత ఉన్నత స్థానానికి చేరిందంటే చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. కొందరు నా ముందే అన్నారు కూడా. కెరీర్ ప్రారంభంలో కూడా ఇటువంటి తరహా వివక్షనే చూశాను. ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళితే ఇంగ్లీష్‌ వాళ్లు.. ‘ఏంటీ.. ఇప్పుడు ఇంత చిన్న పిల్లల్ని కూడా బయటకు పంపుతున్నారా’ అని అన్నారు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కుని ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను. నేను పనిచేస్తున్న విభాగంతో పాటు మొత్తం సివిల్ సర్విస్‌కి ఒక హెడ్ ఉంటారు. ఆ స్థాయికి చేరాలన్నది నా ఆశయం’’ అని తెలిపారు.

Tags:    

Similar News

ఆమె ఒక తోట