విజయవాడ గాంధీ కొండ చూడకపోతే చాలా మిస్ అయినట్టే!
గాంధీ హిల్ – అదో వారసత్వ చరిత్ర
By : Pedapolu Ravi
Update: 2025-10-17 11:14 GMT
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్భాగం విజయవాడ. వాణిజ్య కూడలిగా చాలా మందికి తెలుసు గాని నిజానికది ఓ చారిత్రక కొండ కూడా..
విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనకు ఓ పెద్ద కొండ కనపడుతుంది. దాన్ని ఎక్కి పైకి వెళితే చరిత్రను శ్వాసించే గాలిని పీల్చవచ్చు. దానిపేరే గాంధీ హిల్. పూర్వం ORR హిల్ అని పిలిచేవారట.
గాంధీ హిల్‌కి బ్రిటిష్ కాలం నాటికి వాడుకలో ఉన్న పాత పేరు. 1968లో గాంధీ స్మారకం నిర్మించే దాకా ఈ కొండను స్థానికంగా, రైల్వే రికార్డుల్లో “ORR Hill” అని పిలిచేవారు. రైల్వే ప్రారంభంలో మిస్టర్ ఓర్ (Orr) అనే ఇంజనీర్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారట. అందుకని ఆయన పేరును ఆ కొండకు పెట్టారట. అప్పుడదో ల్యాండ్ మార్క్.
1968 తర్వాత గాంధీ హిల్‌గా మార్పు చెందింది.
ఈ స్థూపం వెనుక పెద్ద చరిత్రే ఉంది. 1921 మార్చి 31న విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహాత్మాగాంధీ సహా అనేక మంది కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
సమావేశాల ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభకు సుమారు 20 లక్షల మంది వచ్చారని అంచనా. స్వాతంత్య్రానంతరం 1948 జనవరి 30న ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపుతాడు.
ఆ తర్వాత ఏర్పాటైన గాంధీ స్మారక నిధి సంస్థ నిర్వాహకులు విజయవాడలో మహాత్ముణ్ణి స్మరించేలా ఏదైనా స్మారకం నిర్మించాలనుకున్నారు.
దాని పర్యావసానమే ఈ గాంధీ హిల్. దానికి 1964 నవంబర్ 9న ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ శంకుస్థాపన చేశారు. 1968 అక్టోబర్ 6న రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆవిష్కరించారు.
గాంధీ స్మారకంతో పాటు స్మారక భవనం నిర్మించారు. అప్పటి నుంచి అది Gandhi Hillగా మారింది. 52 అడుగుల ఎత్తైన స్తూపం అది. ఇది ఆ పర్వతానికి కొత్త జీవం ఇచ్చింది. మహాత్మాగాంధీ పేరిట దేశంలో నిర్మించిన తొలి ఏడు స్థూపాలలో ఇది ఒకటి.
పర్వతం ఎక్కే మార్గంలో ప్రతి బోర్డు, ప్రతి రాతి పలక గాంధీ జీవితంలోని విలువలను చెబుతుంది. సత్యం, అహింస, సేవ, సమానత్వం, క్షమ, ధైర్యం, స్వేచ్ఛను ప్రబోధిస్తుంది.
పిల్లలకు చరిత్ర తెలిపేలా గ్రంథాలయం ఉంటుంది. పిల్లలు, పెద్దల్ని అలరించేలా సర్కూట్ రైలు ఉంటుంది. ఆ కొండపై నుంచి చూస్తే మనకు దుర్గమ్మ కొండ కింద గలగలాపారే కృష్ణమ్మ కను విందు చేస్తుంది. విజయవాడ నగర విహంగ వీక్షణం చేయవచ్చు.
ప్లానిటేరియం లోకి వెళ్లి గాంధీ తత్వాన్ని తెలుసుకోవచ్చు. ప్లానిటేరియంలో లైట్ అండ్ సౌండ్ షో కూడా ఇటీవల ప్రారంభమైంది.
గాంధీ మహాత్ముని విగ్రహం కింద కనిపించే “Be the change you wish to see in the world” (ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు మీతోనే మొదలు కావాలి)” అనే వాక్యం ఒక్కటి చాలు పర్వతం ఎక్కినంతగా మనసు లోతుల్లోకి పాతుకుపోతుంది.
అది కేవలం చరిత్ర కాదు – మన సమాజం ప్రస్తుతం ఏది మరచిపోతుందో దాన్ని గుర్తు చేస్తుంది. గాంధీ హిల్ ఒక పర్యాటక స్థలం కాదు, అదో చరిత్ర, ఆత్మసాక్షి, ఆత్మశాంతి.
విజయవాడకు వెళ్లి గాంధీ హిల్ ఎక్కకుండా ఉండడమంటే ఆ నగరపు చరిత్రలోని అత్యంత ముఖ్యమైన పేజీని చదవకపోవడమే అవుతుంది.
(ఫోటోలు- రవి పెదపోలు, అనుసరణ- ఆకుల అమరయ్య)