ఎవరిది మోసం....

గోపీకృష్ణ ‘మండే’ పోయెమ్

Update: 2025-10-20 03:51 GMT


భూమిని నమ్ముకొన్న రైతు

వర్షాలు సకాలంలో‌ కురవక..

తెగుళ్ళతో పంటపండక

పురుగుమందులు కొనలేక..

బజారులో అమ్మే యూరియా

క్యూలలో నిలబడినా దొరకక..

పశువులు కబేళాకమ్మేశాక

పల్లెలోని దిబ్బ‌ మాయమయ్యాక..

కృత్తిమ ఎరువులు కుమ్మరించేసి

భూమికి జీవం పోయాక..

పండించిన కొద్ది పంటకు

మార్కెట్లో గిట్టుబాటుధర లేక..

ఎదిగిన కొడుకుకు

వేరే ఉద్యోగాన్ని చూపించలేక..

వ్యవసాయంలోకి రమ్మని

తననిపిలిచే ధైర్యమన్నదిలేక..

బ్రతికేందుకు అవకాశం‌ లేక

నలిగి నాశనమైయాడు!

చచ్చేందుకు ధైర్యం చాలక

కొన ఊపిరితో బ్రతికున్నాడు!

ఇలాగే పదేళ్ళు గడిచిపోయాక

చివరి ఆశా ఆవిరైపోయాక..

ప్రాణంలా చూసుకొన్న నేలను

తాకట్టులో ఇరికించేశాక..

కన్నతల్లిలాంటి భూమిని

కుదువ విడిపించుకోలేక..

అప్పులు ఎక్కువైపోయి

అమ్మేసే సమయమొచ్చేశాక..

తరతరాల తాతతండ్రులశ్రమను

తను అమ్మకానికి పెట్టేశాడు..

కుటుంబ ఆత్మహత్యకన్నా

ఇదే నయమనుకొన్నాడు!

బెంజికారులోంచి దిగిన

బాగా బలిసిన రియల్టరు

మెడలో బంగారు గొలుసులు

పదివేళ్ళకూ ఉంగరాలేసుకొని..

పండని నేలంటూ గీచిగీచి

బేరమాడి తక్కువధరకే కొని..

పేపర్‌పై ప్లాన్లు వేసుకొని

గళ్ళుగా ఫ్లాట్లను గీసుకొని..

మధ్యతరగతి మనుషులతో

రేటు పెరిగి తీరుతుందని..

విమానాశ్రయం త్వరలోనే

మీ ఇంటిముందే వస్తుందని..

మాల్సూ సూపర్‌మార్కెట్లూ

మీప్రక్కనే వస్తున్నాయని..

ఆకాశంలో మేడలు చూపించేసి

తను సొమ్ముచేసుకొన్నాడు!

ఎవరికేది ప్రాప్తమో

చివరకు అదే దక్కుతుంది!

భూమిని నమ్మినోడికన్నా

అమ్మినోడికే కాలంకలిసొస్తోంది!

తండ్రితాతలు చెమటతో

సాగుచేస్తున్న మెట్టపొలం

తను సాగు చెయ్యలేక

కూలికి మనుషులు దొరకక

కనీసధరలు గిట్టబాటుకాక

వేరే బ్రతుకుతెరువు లేక

పొలాన్ని పదిలక్షలకు

తన మనసు చంపుకొని

గుండెల్లో కన్నీళ్ళు దాచుకొని

ఆరైతు పొలాన్ని అమ్మేశాడు!

కొన్న ఆ రియల్టర్ దొర

రెండు జేసీబీలను తెచ్చి

గుంతగుట్టలను చదునుచేసి

రెండులారీల కంకరపొడిని చల్లి

ట్రాక్టర్ రాతికూసాలను పాతి

ప్లాట్లంటూ పేపర్‌పై గళ్ళుగీసి

ప్రక్కసిటీ మధ్యతరగతికి

పబ్లిసిటీతో ఒకటే ఊదరగొట్టి

అనాయాసంగా అవలీలగా

పదికోట్లు సొమ్ముచేసుకొన్నాడు!

నా సందేహం ఒకటే...

మోసం చేసింది ఎవరు?

తరతరాలుగా

తననే నమ్ముకొన్నా

జాలిచూపని భూమాతా?

లౌక్యంతో స్వార్థంతో

కోట్లు కొల్లగొట్టిన

కనికరంలేని సాటిమనిషా?



Tags:    

Similar News