CHITRA SANTA | బెంగళూరు చిత్ర సంతను చూసొద్దాం పదండి!

బెంగళూరు.. సుందరనగరం..రస హృదయం.. కుమార కృప రోడ్డు (Kumara Krupa Road) కిటకిటలాడుతోంది.;

Update: 2025-01-04 12:20 GMT

బెంగళూరు.. సుందరనగరం..రస హృదయం.. కుమార కృప రోడ్డు (Kumara Krupa Road) కిటకిటలాడుతోంది. వినీలాకాశం విదిల్చిన రంగులద్దిన్నట్టున్న లక్షలాది కళాఖండాలు కను విందు చేస్తున్నాయి. ఓ శీతాకాలపు రాత్రి చిట్టడవిలో తలపైకెత్తి చూస్తే చుక్కలెలా ఉంటాయో, చూస్తే కాని చెప్పనలవి కాదు. కుమార కృప రోడ్డు కుప్పలు తెప్పలుగా వస్తున్న బొమ్మల అలలతో హోరెత్తుతోంది. వీధి ఆ చివర్నుంచి ఈ చివరి వరకు బొమ్మలే బొమ్మలు.. ఇసుకేస్తే రాలనంత జనం.

 

కొంచెం మంచు.. మరికొంచెం చలి.. కుంచెలు కదలాడుతుంటాయి. ఓ బ్రష్ స్టోకర్ తన కోర మీసంపై చెయ్యేసి, తన గొప్పతనాన్ని చాటుతుంటాడు. మరో చిత్రకారుడు నడుం మీద చెయ్యిపెట్టుకుని.. తన బొమ్మ వెనుక కథను గానం చేస్తుంటాడు. ఇంకో ఆర్టిస్టు మనల్ని నిలబెట్టి బొమ్మేసి బిల్లు చేతిలో పెడుతుంది. ఇలా వందల వేలమంది చేయితిరిగిన కళాకారులు, పెయింటర్లు, ఔత్సాహికులు.. చిత్ర సంక్షేత్రంలో నగరపు కాన్వాస్‌పై కళా ప్రతాపం చూపుతుంటారు. మనకి కూరగాయల సంతలు తెలుసు. పశువుల సంతలు తెలుసు. తిరనాళ్లు తెలుసు. తీర్థాలు తెలుసు. పుస్తకాల ప్రదర్శనలూ, పచ్చళ్ల ఎగ్జిబిషన్లు, కార్నివాల్స్ కూడా తెలిసొచ్చాయి. కానీ అచ్చంగా ఈ చిత్రాల సంతేమిటీ? ఈచిత్రమేంటీ? దీనికి దేశ దేశాల నుంచి లక్షలాది మంది తరలిరావడమేమిటీ?

ఈ మొత్తం చిత్రానికి బెంగళూరు వేదిక. ఏడాదిలో ఒకే ఒక రోజు జరుగుతుంది. అదీ జనవరిలో ఏదైనా ఆదివారంనాడు. అచ్చంగా ఈ ఒక్క ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసమే ఏడాది పొడవునా బొమ్మలేసి (పెయింటింగ్స్) ఈ సంతకు తీసుకువచ్చి అమ్ముకుని పోయే నిజమైన కళాకారులూ ఉంటారు. అమ్మకాలతో నిమిత్తం లేకుండా తమ కళా వైభవాన్ని చాటే అనుభవజ్ఞులైన, అమేచ్యూర్ కళాకారులూ ఉంటారు. ఇవెన్ని ఎలాగున్నా కళాత్మక ప్రతిభ ఈ ఒక్కరోజు బెంగళూరు వీధుల్లో వెలిగిపోతుంది.

2025 జనవరి 5..ఆదివారం. కుమార కృప రోడ్డులో 22వ చిత్ర సంత కనువిందు చేస్తోంది. 22వ చిత్ర ప్రదర్శనను ఆస్వాదించేందుకు 4.5 లక్షల మందికి పైగా ప్రజలు తరలి రావడంతో రంగుల విందుగా మారింది. జాతీయ స్థాయి కళా ఉత్సవం ఇది. కర్ణాటక చిత్రకళా పరిషత్ నిర్వహిస్తున్న 22వ చిత్ర సంత ఈసారి హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. ఆన్లైన్ ప్రదర్శన ఒక నెల పాటు కొనసాగుతుందని పరిషత్ డైరెక్టర్ బి.ఎల్. శంకర్ అన్నారు. ఈ ఉత్సవంలో 22 రాష్ట్రాలకు చెందిన సుమారు 1,780 మంది కళాకారులు తమ సృజనాత్మకతను ప్రదర్శించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథి.

 

22 రాష్ట్రాల నుండి వచ్చిన 3,177 దరఖాస్తులలో 1,420 చిత్రాలు ఎంపిక అయ్యాయి. వీటిలో 189 చిత్రాలు సీనియర్ సిటిజన్లవి. 152 చిత్రాలు వికలాంగులవి. 292 చిత్రాలు అభిరుచితో నడిపే కళాకారులవి. 769 చిత్రాలు ప్రొఫెషనల్స్‌వి. 18 చిత్రాలు కళాశాలలకు సంబంధించినవి. సీనియర్ సిటిజన్ల కోసం అదనపు స్టాళ్లు సేవాదళ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా 22 రాష్ట్రాల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. వీధి వీధంతా రంగురంగులతో మెరిసిపోతోంది. వేలాడదీసిన వేలాది పెయింటింగ్స్ తో పెళ్లి పందిరిలా ఉంది. హైపర్ రియలిస్టిక్, సంప్రదాయ, ఆధునిక, సమకాలీన, అబ్స్ట్రాక్ట్ వంటి భారీ కళాఖండాలు వీటిలో ఉన్నాయి. అమేచ్యూర్ కళాకారుల ప్రతిభ వీధులు వెలుగులీనేలా చేసింది.

కళా ప్రేమికులు, సందర్శకులు వివిధ కళా రూపాల్లో తరించనున్నారు. వాటర్‌కలర్, అక్రిలిక్, ఆయిల్ పెయింటింగ్‌లు, చెక్క కళ, సీసాలపై కళ, ఇసుక కళ, మట్టి వృత్తులు, మైసూరు, తంజావూరు చిత్రాలు, మధుబనీ, గోండ్, రాజస్థానీ సంప్రదాయ చిత్రాలు ఉన్నాయి.

 

ఏపీ నుంచి కాటూరి చిత్రాలు...

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తన భారీ చిత్రాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. "చిత్ర సంతలో పాల్గొనడం ఓ గొప్ప అనుభవం. సేల్స్ తో నిమిత్తం లేకుండా ఇక్కడికి వస్తుంటాం. ఇక్కడ బొమ్మ పెట్టకపోతే కళాకారుని కుంచెకు అర్థమే ఉండదంటారు ఆయన. ఇదే అతిపెద్ద జనసందోహం, అధిక సంఖ్యలో కళాకారుల ప్రదర్శన" అన్నారు కాటూరి.

బుల్‌హార్న్‌ల ద్వారా సంగీతం ప్రతిధ్వనిస్తుంది. కెసీపీ విద్యార్థులు పాటలు పాడతారు. పిల్లలు డాన్స్ ఆడతారు. క్యాంపస్‌లో ఫ్లాష్ మాబ్ ప్రదర్శన పెద్ద హైలెట్ అంటారు కాటూరి రవీంద్ర. రోడ్లపై జనాలు తిరుగుతూ ప్రత్యక్ష చిత్రలేఖనం ఆస్వాదిస్తారు. ఇక్కడ ప్రదర్శించే పెయింటింగ్స్ వంద నుంచి లక్షల రూపాయల వరకు ఉంటాయి. 2024లో అత్యధిక ధర పలికిన కళాఖండం రూ. 3 లక్షలు. ఇది ఆయిల్ పెయింటింగ్.

 

చిత్ర సంత.. ప్రతి ఏటా జనవరి చివరి ఆదివారం జరుగుతున్న ప్రఖ్యాత కళా ఉత్సవం. బెంగళూరులో ప్రతి ఏటా జరుపుకునే కళా ఉత్సవం. ఈ ఉత్సవానికి ప్రజలు అధిక ఉత్సాహంతో హాజరవుతారు. ఇది కాలక్రమేణా విస్తరించింది. "చిత్ర సంకేత్ర" అంటే సాధారణంగా "కళా మార్కెట్" అని అర్థం. కన్నడలో "చిత్ర" అంటే "డ్రాయింగ్/చిత్రం" అని, "సంకేత్ర" అంటే "గ్రామ మార్కెట్" అని అర్థం. జనవరిలో బెంగళూరులో ఉన్నప్పుడు, ఈ వార్షిక ఉత్సవం "తప్పకుండా చూడాల్సిందిగా"గా మారింది. కళాభిమానులు, సాధారణ ప్రజలు కొన్ని అద్భుతమైన కళాఖండాలను సొంతం చేసుకునేందుకు ఈ ఉత్సవం అవకాశం కల్పిస్తుంది. దేశం నలుమూలల నుండి కళాకారులు తమ కళను ప్రదర్శించడానికి ఇక్కడ చేరతారు.

Tags:    

Similar News

అతను అంతే...