అడవిలో ఏరు పక్క.. వణికించే చలిలో ఓ రాత్రి.. !

రొద చేస్తూ ప్రవహిస్తున్న ఏరు. ఏటి ఒడ్డున వణికించే చలి.. ఆ రాత్రి అనుభూతే వేరు..

Update: 2025-12-19 06:30 GMT
అడివిలో చలి మంట ముందు ప్రకృతి ప్రియులు

ఇరువైపులా అడవి. మధ్యలో రొద చేస్తూ ప్రవహిస్తున్న ఏరు. ఏటి ఒడ్డున వణికించే చలిలో ఒక రాత్రంతా గడిపిన అనుభవం,. ఎంత కాలమైంది ఇలా అడవిలో నిద్రించి! తిరుపతికి 28 కిలోమీటర్లు, మామండూరుకు రెండు కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్న ఏరు ఇలా గడపడం ఒక వింతైన అనుభూతి.

‘‘అడవిలో నైట్ స్టే చేద్దామా?’’ అన్నాడు మధు. ‘‘కిందటి ఆదివారమే కదా ‘బావికాడ లైను’ కు వెళ్ళింది! మళ్ళీ ఎక్కడికి?’’ అన్నాను ‘‘వెళదాం రండి మామండూరు దగ్గరకే’’ అన్న సమాధానం. బుధవారం మధ్యాహ్నం మూడున్నరకు బొంతాలమ్మ గుడి నుంచి మామండూరు వైపు బయలు దేరాం. మధు, ఆర్య, భరత్, శివారెడ్డి, ఆంజనేయులు, లక్ష్మణ్, నేను; ఏడుగురం కలిసి బయలు దేరాం. డ్యూటీలు ముగించుకుని రాత్రికి మరో బ్యాచ్ వచ్చి చేరుతుందన్నాడు మధు.

దాదాపు పాతిక కిలోమీటర్లు కోడూరు వైపు సాగాం. మామండూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు వెళ్ళే ఆర్చి దాటుకుని, అటవీ సిబ్బంది క్వార్టర్స్ పక్క నుంచి వెళ్ళే బండి బాటలో సాగుతున్నాం. ‘బండికాడ లైను’ పై భాగం లో ఏరు చాల బాగుంటుందని ఎవరో చెప్పారు. నిజానికి అది ఎక్కడుంటుందో మాకు తెలియదు.

దారిలో చెప్పే వాళ్ళెవరూ లేరు. అంతా నిర్మానుష్యం. ‘గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్టు’ సాగుతూనే ఉన్నాం. ఎడమ వైపున బండి బాట పోతోంది. మధు గూగుల్ లో చూస్తున్నాడు. ఈ బాటలో పోదామా, ముందుకు వెళ్ళి పోదామా? అన్నీ సందేహాలే. ముందుకెళ్ళి ఎడమ వైపునకు మళ్ళాం. మళ్ళీ మూడు దారులు! ఎటు పోవాలి? ఒక మనిషి కనిపించి ‘‘ఇటు కాదు, అటు’’ అన్నాడు. సరే అని వెళ్ళిన దారిలో కాకుండా, మరో దారిలో సాగుతున్నాం. మధ్యలో దారికి అడ్డంగా కాలువ ప్రవహిస్తోంది.

 కాలువ ను దాటు తున్న వైనం

కాలువ దాటి ఆవలి వైపు సాగుతున్నాం. అలా మరో రెండు కాలువలు వచ్చాయి. అక్కడి నుంచి దారి సరిగా లేదు. అక్కడే పొలాల్లో మా స్కూటర్లు, మోటారు బైకులు ఆపేశాం. టెంట్లు, బ్యాగులు మోసుకుని పొలాల గెనాల (గట్ల) పైన నడుచుకుంటూ వెళుతున్నాం. బ్యాలెన్స్ తప్పుతోంది. ఈ మధ్య బాగా వర్షాలు పడ్డాయి. పొలాల గట్ల మీద కూడా బురదగా ఉంది.

ఒక విశాల మైదానం వచ్చింది. మైదానం దాటితో అంతా దట్టమైన అడవి. అక్కడ కూడా నేలంతా బురదగా ఉంది. దూరంగా ఒక మనిషి కనిపించాడు. దగ్గరకెళ్ళి అతన్ని అడిగాం. దారి చూపించాడు. అడవి మధ్యలో నడుచుకుంటూ వెళుతున్నాం. దట్టమైన వెదురు పొదలు. పొదల మధ్య నించి నడుచుకుంటూ వెళుతున్నాం. వెదురు పొదలు ఆకాశాన్ని కప్పేశాయి. ఎక్కడా ఆకాశం కనిపించడం లేదు.

బురద గా ఉన్న పొలం గట్ల పై నుంచి సాగు తూ..

దూరంగా పారుతున్న ఏటి శబ్దం వినిపిస్తోంది. ముందుకు సాగే సరికి ఎదురు గుండా ఏరు ఎడమ నుంచి కుడికి ; పడమర నుంచి తూర్పుకు సాగుతోంది. ఏటికి ఆవల కూడా దట్టమైన అడవి. ఏరు పక్కన కొట్టుకొచ్చిన గులకరాళ్ళు. ఏటి పక్కన అంతా రాళ్ళ మయం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా వెతికాం. ఎక్కడా చదునైన ప్రాంతం కనిపించలేదు.

అడివిలో ఏటి ఒడ్డున వేసిన టెంట్లు

అడవికి, ఏటికి మధ్య, చెట్లను ఆనుకుని పలుచగా ఉన్న రాళ్ళను ఏరేసి టెంట్లు వేసుకోవడానికి కావలసిన స్థలాన్ని చదును చేసుకున్నాం. గబగబా టెంట్లు వేసేశారు. చీకటి పడబోతోంది. చలి మొదలవుతోంది. శరీరమంతా చెమట పట్టింది. ఏటిలోకి దిగాలి. ప్రవహిస్తున్న నీటిలో కాళ్ళు పెడితే జిల్లుమంటున్నాయి.

ఒకరొకరం ఏటిలోకి దిగుతున్నాం. చీకటి పడబోతోంది. ఒక్క మునుగు వరకే చలి. నిండా మునిగితే చలీలేదు, గిలీ లేదు. ప్రవహిస్తున్న ఏటిలో పీకలదాకా మునిగితే ఎంత హాయిగా ఉందో! ఏరు శబ్దం చేసుకుంటూ, మా పై నుంచి సాగిపోతోంది. ఏటిలో చేతులు గులకరాళ్ళ పైన ఆనించి శరీరాన్ని ప్రవాహం వైపు వెనక్కి వదిలేస్తే, నీటిపైన తేలాడుతూ ఎంత గొప్ప అనుభూతి. ఎంత స్వచ్ఛమైన నీళ్ళు! అటు, ఇటు అడవి. మధ్యలో వంటరిగా ప్రవహిస్తున్న ఏరు. మేం తప్ప అంతా నిర్మానుష్యం.

ఒక పక్క టెంట్లు, మరొక పక్క చలి మంట ముందు కబుర్లు

ఎంత సేపుంటాం! చీకటి పడింది. ఒకరొకరం లేచాం. టెంట్ల దగ్గర లైట్లు అమర్చాం. ఎండిన దుంగ దగ్గరే, ఎండిన కట్టెపుల్లలు ఏరుకొచ్చి చలిమంట వేశాం. నీటి లోంచి పైకి వచ్చాక శరీరంలో ఒక వింతైన అనుభూతి. మా వాళ్ళు వంటలు మొదలు పెట్టారు. చలిమంట ముందు కూర్చుని మాటా మంతి మొదలు పెట్టాం.

ఈ లోగా మరొక అయిదుగురు మిత్రులు కార్తీక్, బుర్రా మధు, శ్రీహరి, రవి, మరొకరు కలిసి వచ్చారు. మధు పెట్టిన గూగుల్ మార్గం ద్వారా ఆ చీకట్లో దారి తెలుసుకోలేక, బురదగా ఉన్న పొలాల్లో అడ్డంగా పడి, చాలా దూరం నడుచుకుంటూ వచ్చారు. అంతా కలిసి పన్నెండు మంది అయ్యాం. ఆ నిర్మానుష్యంలో ప్రవహిస్తున్న ఏటి గలగలలు తప్ప ఏమీ వినిపించడం లేదు. చలి మంట ముందు ఎంత సేపు కూర్చుంటాం. ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతీలను తినేసి గుడారంలోకి దూరిపోయాను. మా మిత్రుల మాటలు వినిపిస్తున్నాయ్.

ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా కనిపించే బుర్రా మధు కబుర్లు మొదలు పెట్టాడు. దాదాపు ప్రతి ఏడాది బుర్రామధు అయ్యప్ప మాల వేసే భక్తుడు. అతని మాటలను కొందరు శ్రద్ధగా వింటున్నారు. కొందరు వినీ విననట్టున్నారు. ఏటి ప్రవాహంతో అతని మాటలు పోటీ పడుతున్నాయి. బుర్రా మధు సంస్కృతంలో ప్రవచనాలు మొదలు పెట్టాడు.

బాగా అలిసిపోయానేమో, కళ్ళ పైకి నిద్ర వచ్చేసింది. నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. పది గంటలకు మెలకువ చ్చింది. అప్పటి వరకు చలిమంట ముందు కూర్చుని ప్రవచనాలు విన్న మాట్రెక్కర్లు, ఒకరొకరు టెంట్లలోకి దూరేశారు. చలి చంపేస్తోంది. మధ్యలో అవసరం ఏర్పడినా లేవబుద్ది కావడం లేదు. ఎంత గాఢ నిద్ర ఉన్నా, ఏటి గలగలలు చెవికి సోకుతూనే ఉన్నాయి.

తెల్లవారుజామున మెలకువ వచ్చింది. టైం చూసుకుంటే, అయిదున్నర అవుతోంది. ఇంకా తెల్లారలేదు. ఒకరొకరూ లేచి చలిమంట ముందుకు చేరుతున్నారు. అప్పుడే తెలిసింది ఈ రోజు ఆర్య పుట్టినరోజని. ఇరవై మూడు నిండి ఇరవై నాలుగవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భం. ఒక వింతైన పద్ధతిలో కేక్ కట్ చేయాలనుకున్నారు.

వింతయిన పద్ధతిలో ఏ టి మధ్యలో ఆర్య హ్యాపీ బర్త్ డే కేక్ కట్ చేయడం.

రవి ఏటిలో కొచ్చి కూర్చుండి పోయి, తన తల పైన కేక్ పెట్టుకున్నాడు. అంతా చుట్టూ చేరాం. కేక్ కట్ చేసి ఆర్యకు కేక్ తినిపిస్తూ, హ్యాపీ బర్త్ డే చెప్పారు. ఏటిలో హ్యాపీ బర్త్ డే జరుపుకోవడం వింతగా లేదూ ! బుర్రా మధు మరి కొందరు ఏటిలోకి వెళ్ళి మళ్ళీ ఒక సారి మునకేశారు. తెలతెలవారు తుంటే టెంట్లు ఖాళీ అవుతున్నాయి. వేడి వేడి టీ తాగుతూ, చలి మంట ముందు కూర్చుని మళ్ళీ కబుర్లలో పడిపోయారు.

ఏడున్నర అవుతున్నా, ఎండ జాడ లేదు. ఆకాశమంతా మబ్బులు కమ్మే ఉన్నాయి. చలి కూడా కాస్త తగ్గింది కానీ, పూర్తిగా తగ్గలేదు. బట్టలు వేసుకుంటూ, టెంట్లు సర్దేస్తున్నారు. ఒక విషయం చెప్పడం మరిచాను. ఏటి ప్రవాహం ఒడ్డున సన్నగా పారుతున్న చోట మామండూరు గ్రామస్తుడొకతను చేపలు పట్టడానికి పుల్లలతో చేసిన వలను ఏర్పాటు చేశాడు.

మామండూరు గ్రామస్తుడు సన్నగా, పొట్టిగా ఉన్నాడు. వలలో చేపలను తీసుకెళ్ళడానికి వచ్చాడు. అతనితో కాసేపు మాటా మంతి జరిపాం. అతను కూడా వచ్చి చలిమంట ముందు కూర్చున్నాడు. ఈ మధ్య కురిసిన వర్షానికి ఏటి ప్రవాహం బాగా పెరిగిందని, పెద్ద పెద్ద చేపలు కూడా తన వలలో పడ్డాయని చెప్పాడు. ఈ రోజు చిన్న చిన్న చేపలు మాత్రమే పడ్డాయని చూపించాడు. ఇక వర్షాలు పెద్దగా పడకపోవచ్చు. మరి కొన్ని రొజులు పోతే ఏటిలో ప్రవాహం కూడా తగ్గిపోతుందన్నాడు. అతని వలలో పడ్డ చేపలు కొట్టుకుంటున్నాయి. అతను కూడా బతుకు పోరాటంలో కొట్టుమిట్టాడుతున్నాడు.

నిండుగా ప్రవహిస్తున్న ఏ రు.

తిరుగుప్రయాణమయ్యాం. అతను కూడా మాతో పాటు కొంత దూరం వచ్చాడు. దట్టమైన వెదురు పొదల అడవిలో నడుస్తున్నాం. అప్పుడే సూర్యుడు కనిపిస్తున్నుడ. మధ్యలో కొన్ని దారులు. ఏ దారెటుపోతుందో తెలియదు. మధు ‘‘ఫాలోమీ’’ అన్నట్టు ముందకు సాగుతుంటే, మేమంతా అనుసరించాం. మళ్ళీ పొలాల గట్ల మీద నుంచి, నీళ్ళ లొంచి, బురద లోంచి అడుగులు వేస్తూ, స్కూటర్ల, మోటారు బైకులు పెట్టిన చోటికి వచ్చేశాం.

అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాం. మధ్యలో రెండు చోట్ల నీటి కాలువలు దాటాల్సి వచ్చింది. అడవిలో, చేలలో నడక రెండు కిలో మీటర్లుంటే, బండి బాటలో కిలో మీటరు దూరం వెళ్ళాక జాతీయ రహదారి వచ్చింది. అక్కడి నుంచి తిరుపతికి పాతిక కిలోమీటర్లు. చాలా కాలం తరువాత రాత్రి పూట అడవిలో గడిపిన అనుభూతిని నెమరేసుకుంటూ ఇంటి ముఖం పట్టాం.

Tags:    

Similar News