స్వచ్ఛమైన కూరగాయలు కావాలా ? ఛలో బాలన్‌ పల్లి!

కాయగూరల కోతకు ముందే కొనుగోలు దారులు పొలాల దగ్గరే క్యూ కడతారు!

Update: 2025-12-19 08:07 GMT
పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో బెండ, మిర్చీ ఆకుకూరలు సాగు చేస్తున్నాం.వాటితో బంతిపూల సాగు కూడా చేస్తున్నాం. పండుగ సీజన్లలో మంచి ఆదాయం వస్తుంది.అంటారు పార్వతమ్మ

 ఒక్క సారి ఇక్కడి కూరగాయలు రుచి చూస్తే అస్సలు వదలరు.

చిక్కుడు, కాకర , బెండ కాయల రుచే వేరు ! బీర కాయలైతే పచ్చివే తినాలనిపిస్తుంది! ఇక్కడ పండిన పచ్చి మిర్చి, పాల కూర పప్పులో వేసుకుంటే

మామూలుగా ఉండదు! అందుకే కాయగూరల కోతకు ముందే కొనుగోలు దారులు పొలాల దగ్గరే క్యూ కడతారు! అసలీ పంటలు ఎలా పండిస్తున్నారు? ఈ రైతుల వెనుక ఎవరున్నారు? తెలుసు కోవాలంటే నాగర్‌ కర్నూల్‌ జిల్లా బాలన్‌పల్లి గ్రామం చూడాలి.

ఒకప్పుడు కరువు తో అల్లాడిన ఈ ప్రాంతం నేడు ప్రకృతి సేద్యంతో పచ్చల హారంగా మారింది. ఇదంతా సీపీపీ ప్రాజెక్ట్‌ మహిమ అంటారిక్కడి రైతులు! ఈ ప్రాజెక్ట్‌ లేక పోతే వలసలు తప్ప వేరే దారి లేదని కొందరంటారు...

 పందిర్ల మీద తీగజాతి కూరగాయలు పెంచడం వల్ల దిగుబడి బాగుంది. మార్కెట్‌లో డిమాండ్‌ కూడా పెరిగింది అన్నారు బాలన్‌ పల్లి రైతు రామకృష్ణ.

తెలంగాణా లోని నాగర్‌ కర్నూల్‌ జిల్లా, తాడూరు మండల్‌, బాలన్‌ పల్లి లో ఎక్కువ శాతం పత్తి, వరి సాగుచేస్తుంటారు. అయితే వారు ఎంత కష్టించినా తగిన దిగుబడులు వచ్చేవి కాదు. దీనికి కారణం క్లైమోట్‌ ఛేంజ్‌ !

పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో తీవ్రమార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరువు పరిస్ధితులు తలెత్తడం తో వ్యవసాయం దెబ్బతిని రైతులు, రైతుకూలీలు జీవనాధారం కోల్పోతున్నారు.

ఈ పరిస్ధితుల నుండి బయట పడాలంటే, వాతావరణ మార్పులను ఎదుర్కొనే

‘ వాతావరణ నిర్ధారణ ప్రాజెక్ట్‌ ’ ని అమలు చేయాలని బాలన్‌ పల్లి రైతులు గ్రామ సభలో తీర్మానం చేశారు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ ఆర్ధిక సహకారంతో, ఎస్‌.డి.డి.పి.ఎ సంస్ధ 2019 నుండి 2023 వరకు రైతుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అమలు చేసింది.

సిపిపి ప్రాజెక్ట్‌ అంటే ఏమిటి? 

నిరంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో తీవ్రమార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవ మనుగడకు, వ్యవసాయానికి ఇబ్బందిగా మారాయి. కరువ పరిస్ధితులు తలెత్తడం తో వ్యవసాయం దెబ్బతిని చిన్న రైతులు,రైతుకూలీలు జీవనాధారం కోల్పోతున్నారు. పంట ఉత్పాదకత తగ్గి ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉంది.

ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులను ఎదుర్కొని భూసారాన్ని కాపాడి, పంటల దిగుబడులు పెంచే ఒక వినూత్న ప్రాజెక్ట్‌ సిపిపి. దీనిని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) బాలన్‌ పల్లి లో అమలు చేసింది.

మారిన సేద్యం పెరిగిన దిగుబడి

సిపిపి ప్రాజెక్ట్‌ అమలు అనంతరం ఒకప్పటి కరువు ప్రాంతం , నేడు పచ్చని పైరులతో కళకళలాడుతుంది. దీని వెనుక బాలన్‌ పల్లి విలేజ్‌ వాటర్‌ షెడ్‌ కమిటీ సభ్యుల శ్రమ, నాబార్డ్‌ ఆర్ధిక సాయం, ఎస్‌.డి.డి.పి.ఎ సంస్ధ ప్రతినిధుల కార్చాచరణ ఉంది.

సిపిపి ప్రాజెక్ట్‌లో విత్తనాలు ఇచ్చి కూరగాయల సాగుకు సహాయం చేశారు. వారానికి ఒక సారి దిగుబడి వస్తుంది. ఆప్పులు లేకుండా జీవిస్తున్నాం. అంటున్న భీమయ్య .

పర్యావరణ హితం

‘క్లైమేట్‌ ప్రూఫింగ్‌ ప్రాజెక్ట్‌’ మెట్టప్రాంతాల్లో నాబార్డ్‌ చేపట్టిన ఒక పర్యావరణ హిత కార్యక్రమం. వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ అనంతరం సహజ వనరుల అభివృద్ధికి తోడ్పాటును అందించి, సుస్ధిర వ్యవసాయ దిశగా రైతులను నడిపించడానికి ఉద్ధేశించిన కార్యక్రమమిది. దీనిలో భాగంగా, నాగర్‌ కర్నూల్‌ జిల్లా, తాడూర్‌ మండలం, బాలనపల్లి గ్రామంలో ఎస్‌.డి.డి.పి.ఎ అనే ఎన్‌జిఒ ద్వారా కార్యక్రమం అమలు చేశాం. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సాగు విధానంలో మార్పులు తెచ్చి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పెంచేలా రైతులకు శిక్షణలు ఇచ్చాం. భూగర్డ జలాలను పొదుపుగా వాడే సూక్ష్మసేద్య పరికరాలను అందించాం. బోర్‌వెల్‌ రీఛ్చార్జి పాయింట్స్‌ , పెండాల్స్‌ , వ్యవసాయ పనిముట్లను రైతులకు సమకూర్చాం. దీనివల్ల వాతావరణ మార్పుల్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించి,రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడం ద్వారా రైతుల ఆదాయం గతం కంటే మెరుగైంది. దిగుబడిపెరిగింది’ అన్నారు,

నాబార్డ్‌ నాగర్‌ కర్నూల్‌ జిల్లా డెవలప్‌ మెంట్‌ మేనేజర్‌ పి.మనోహర్‌ రెడ్డి.

ఐకమత్యంగా అభివృద్ధి 

ఒకపుడు బాలన్‌ పల్లి గ్రామంలో సేద్యం కష్టసాధ్యం అయి పంటలు పండిరచ లేక రైతులు కూలీ పనులకు పోవాల్సి వచ్చేది. ఈ పరిస్ధితిని మార్చడానికి నాబార్డ్‌ , ఎస్‌.డి.డి.పి.ఎ సంస్ధ ద్వారా సర్వే చేయించి, వ్యవసాయ విధానంలో మార్పులు చేసింది. సిపిపి ప్రాజెక్ట్‌తో భూసారం, తేమ, పచ్చదనం వంటి సహజవనరులను కాపాడారు. ఈ ప్రాజెక్ట్‌ విజయ వంతంగా అమలు అయింది.ప్రాజెక్ట్‌ అమలుకు ముందు చురుకైన రైతులతో విలేజ్‌ వాటర్‌ షెడ్‌ కమిటీ ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతీ సమస్యను అందరం కలిసి చర్చించుకొని పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నాం. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా , వాననీటిని సంరక్షించడం ద్వారా భూగర్బజలాలు గతం కంటే పెరిగాయి.’ అన్నారు.’ ఎస్‌.డి.డి.పి.ఎ సంస్ధ ప్రతినిధి వెంకటేశ్వరరావు.

ఎస్‌.డి.డి.పి.ఎ సంస్ధ ప్రతినిధి వెంకటేశ్వరరావు.

మా పొలం దగ్గరకే వ్యాపారులు వస్తున్నారు 

‘ ఈ ప్రాజెక్ట్‌ వల్ల మాకు డ్రిప్‌ ఇరిగేషన్‌ యూనిట్‌, పెండాల్స్‌ (పందిర్లు) ఇచ్చారు.

అంతంత మాత్రమే ఉన్న భూగర్బ జలాలను పొదుపుగా వాడుతూ, ప్రతీ మొక్కకు

అందేలా డ్రిప్‌ ఇరిగేషన్‌, రెయిన్‌ గన్‌ టెక్నాలజీతో పొదుపుగా వాడుతున్నాం. ఈ ప్రాజెక్ట్‌ అమలు తరువాత ఒక్క రైతు కూడా నష్టం అనేది లేకుండా పాడిపంటలతో హ్యాపీగా ఉన్నారు. సొంతంగా కషాయాలు. ద్రవ, ఘనజీవామృతం వంటివి తయారు చేసుకొని పంటలపై పిచికారీ చేస్తూ ఆరోగ్యవంతమైన పంటలను పండిస్తున్నాం కూరగాయల సాగు చేస్తూ వారానికి 10,000 లకు పైగా ఆదాయం పొందుతున్నాం. హోల్‌ సేల్‌ వ్యాపారులు మా పొలాల దగ్గరకు వచ్చి కూరగాయలు కొంటున్నారు.’ అన్నారు బీర,కాకర , చిక్కుడు కోసి బస్తాల్లో నింపుతున్న సుదర్శన్‌.

పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో బెండ, మిర్చీ ఆకుకూరలు సాగు చేస్తున్నాం

ఇదే ప్రాంతంలో ఉన్న కొన్ని బీడు భూములను పండ్లతోటలుగా మార్చారు. బాలన్‌పల్లికి చెందిన ఒక రైతుకు 7 ఏండ్ల క్రితం 200 మామిడి మొక్కలు ఇవ్వగా ఇపుడ అవి కాతకు వచ్చాయి. అంతర పంటలుగా అపరాలు సాగు చేస్తున్నారు.

క్లైమేట్‌ ప్రూఫింగ్‌ ప్రాజెక్టుతో మారిన సేద్యం! 

1, లోదుక్కుల ద్వారా నేల సారం పెంచారు. భూ సారం పెంచడానికి జీలుగ పంటలను ప్రోత్సహించారు.

2, బోర్‌ వెల్‌ రీచార్జి పాయింట్స్‌తో బోర్లలో నీటి మట్టం పెంచారు. దీనివల్ల 36 హెక్టార్లు సాగు చేస్తున్నారు.

3, భూగర్బ జలాలను కాపాడడానికి 18 డ్రిప్‌ ఇరిగేషన్‌ యూనిట్లు,

రెయిన్‌ గన్‌ వంటి ఆధునిక టెక్నాలజీని సమకూర్చడంతో దాదాపు 26 హెక్టార్లలో కూరగాయల దిగుబడి పెరిగింది.

4, నీటి వృధాను అరికట్టడానికి 3 సాయిల్‌ మాయిశ్చరైజ్‌ యూనిట్లు సమకూర్చారు. దీనివల్ల నేలలో తేమ శాతం తెలుసుకొని మిర్చి, కూరగాయల సాగులో దిగుబడి పెంచుతున్నారు.

5, నేలలో తేమను కాపాడి, కలుపు నివారణకు రైతులకు మల్చింగ్‌ షీట్స్‌

సమకూర్చారు. దీని వల్ల మొక్కల ఎదుగుదల బాగుంది.

6, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ సిస్టమ్‌లో భాగంగా రైతుకు నిరంతర ఆదాయం కోసం, నాబార్డ్‌ సహకారంతో 300 బంగినపల్లి మామిడి మొక్కలను రైతులకు ఇచ్చారు. దీని వల్ల 2 హెక్టార్ల బీడు భూమి నేడు పండ్లతోటలుగా మారింది.రైతుల ఆదాయం పెరిగింది.

6, తీగజాతి కూరగాయల కోసం పెండాల్స్‌ని సమకూర్చారు. దీనివల్ల

కాకర,బీర, చిక్కుడు వంటి పంటలు దిగుబడి పెరగడమే కాక నాణ్యత పెరిగింది.

7, రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువుల పై రైతులకు అవగాహన కలిగించడం వల్ల బాలన్‌ పల్లి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా మారింది.

గతంలో ఒక పంట పండిరచడమే అసాధ్యమైన రైతులు సిపిపి ప్రాజెక్ట్‌ అమలు అనంతరం నేడు రెండు పంటలు పండిస్తున్నారు.

నాబార్డ్‌ అమలు చేసిన ఈ ప్రాజెక్ట్‌ రైతుల జీవనోపాధులను మెరుగు పడటమే కాక, వ్యక్తిగత, ఆదాయ భద్రతను చేకూరింది.ఒకపుడు ఉపాధికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన రైతులు, నేడు వాపస్‌ వచ్చి వ్యవసాయం చేసుకుంటూ సుస్ధిర జీవనోపాధులు పొందుతున్నారు. వాతావరణ మార్పులకు తగిన విధంగా సేద్యంలో మార్పులు చేస్తే వ్యవసాయం సుసంపన్నమవుతుందని ఈ రైతులు నిరూపించారు.

Tags:    

Similar News