తిరుపతి ‘పితృగళ’ అడవిలో చరిత్ర పూర్వయుగ చిత్రాలు

ఈ సారి ట్రెక్ విశేషం: అందమయిన ప్రకృతి,అబ్బుర పరిచే జలపాతాల మధ్య వేల సంవత్సరాల కిందట మనిషి గీసిన చిత్రాలు చూడ్డం

Update: 2024-12-27 01:17 GMT
ప్రవహిస్తున్న పితృగళ తీర్థం

మధ్యాహ్నమైనా

పొగమంచు తెరల్లోనే ‘పితృ గళ’ తీర్థం నక్కిఉంది

సన్నని తుంపరలో

అడవంతా మంచుముత్యాలు పూస్తున్నట్లుంది... 


పచ్చని అడవిలో సన్నని తుంపర పడుతోంది.. ఎటు చూసినా కనుచూపు మేర తెల్లని మంచు పొర కప్పేసింది.. ఆకాశం అంతటా నల్లని మబ్బులే.. కొండల్లోంచి రొదచేస్తూ దుమికే జలపాతాలు...రాళ్ళ పై నుంచి గలగలా పారే సెలఏర్లు. ఓహ్... ‘పిత్రు గళ’.. ఏమున్నది భళా..! ‘పిత్రు గళ’ తీర్థంలోకి దుముకుతుంటే..ఏం మజా! స్వయంగా అనుభవించాలే కానీ, మాటలకందని ఆనందం. అక్షరాలకు చిక్కని అనుభూతి. పితృగళ అనేది తిరుపతి సమీపాన శేషాచలం అడవుల్లో ఉండే ఒక తీర్థం.

గురువారం ఉదయం పదకొండున్నరకు మధు నుంచి ఫోనొచ్చింది. ‘‘ ‘పిత్రు గళ’కు వెళుతున్నాం వస్తారా?’’ అని. ‘‘ఊ’’ అన్నా. ‘‘అయితే.. పది పదినిమిషాల్లో ‘హరేరామా హరేకృష్ణ’ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఆఫీసు వద్దకు వచ్చేయండి. ప్రభాకర్ రెడ్డి సార్ వస్తున్నారు. జీప్ లో వెళుతున్నాం. లేట్ చేస్తే వెళ్ళిపోతాం’’ అన్నాడు. అంతే..‘సిరికిన్ జెప్పడు..శంఖు చక్రమున్ చేదోయి సందింపడున్’ అన్నట్టు గబగబా బట్టలు వేసుకుని ఫారెస్ట్ ఆఫీసు వద్దకు వెళ్ళే సరికి అప్పటికే వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే, ‘‘బొంతాలమ్మ గుడిదగ్గర శివారెడ్డి షాప్ దగ్గర ఉన్నాం. వచ్చేయండి’’ అన్నాడు. అక్కడికి చేరాను. అప్పటికప్పడు అనుకుని బయలు దేరిన ట్రెక్కింగ్.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, మధు, తిరుమల రెడ్డి, డెంటల్ సర్జన్ డాక్టర్ పవన్, శివారెడ్డి, కార్తీక్ తోపాటు, నవీన్ జీప్ పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. మధ్యాహ్నం భోజనం ప్యాక్ చేయించుకున్నాం. మా ఎనిమిది మందితో నవీన్ మిలటరీ జీప్ ఒంటి గంటకు తిరుపతి నుంచి  కోడూరు వేపు దూసుకుపోతోంది.

అమరరాజా వద్దకు వచ్చేసరికి వర్షం మొదలైంది. చలిగాలులు వీస్తున్నాయి. ఆకలీ వేస్తోంది. అయినా మా కబుర్లతో జీప్ ముందుకు దూసుకుపోతోంది. జాతీయ రహదారంతా గుంతల మయం. కోడూరుకు నాలుగు కిలోమీటర్ల ఈవల మాధవరం దగ్గర కుడి వైపు తిరిగాం. అది గుంజన వెళ్ళే దారే. అక్కడక్కడా కొన్ని గ్రామాలు, మధ్యలో అరటి బొప్పాయి, మామిడి తోటలు. గులక రాళ్ళు నిండిన గుంజనలో నీళ్ళు ప్రవహిస్తున్నాయి. మా జీప్ అటవీ శాఖ గేటు దాటుకుని లోనికి వెళుతోంది.  

పితృగళ దారిలో...

రోడ్డు పైన గుంతల్లో గంతులేస్తూ మా జీపు అడవిలో రయ్ న దూసుకుపోతోంది. నవీన్ వీరోచితంగా జీప్ ను నడుపుతున్నారు. ఏమిటీ వేగం! అది ఆఫ్ లైన్ వాహనం. అందుకే ఆ వేగం.మట్టి రోడ్డుకు ఇరువైపులా దట్టమైన అడవి. వీస్తున్న చలిగాలికి అడవి పులకరించిపోతోంది. ఎటు చూసినా అది మంచు దుప్పటి కప్పుకుంది. రోడ్డంతా ఎన్ని మెలికలు! ఆ మెలికల్లో ఎంత సాహసం!

రోడ్డుకు అడ్డంగా మోకాలు లోతు నీళ్ళు ప్రవహిస్తున్నాయి. ఈ నీళ్ళమధ్యలో జీప్ ఆగిపోదుకదా! సైలెన్సర్ లోకి నీళ్ళు పోవు కదా! మళ్ళీ నీళ్ళలో దిగి జీప్ ను తోయాల్సొస్తుందేమో! అన్నీ సందేహాలే. నవీన్ ఒకటో గేర్ లో వేగంగా నీళ్ళలోంచి జీప్ ను లాగించేశాడు. గట్టు ఎక్కేదగ్గరకు వచ్చి జీప్ ఆగిపోయింది. సైలెన్సర్ లోకి నీళ్ళు పోయాయి. మరి కాసేపటికి జీప్ కదిలింది. అలా మరొకటి, మరొకటి రోడ్డుకు అడ్డంగా నీటి ప్రవాహాలు. 

పొగమంచు పొరల్లో అడవి...

ఘాట్ మెలికల్లో జీప్ వేగంగా దూసుకుపోతోంది. చుట్టూ పొగ మంచు, చల్లని వాతావరణం, పచ్చని అడవి మధ్యలో జీప్ లో వేగంగా వెళుతుంటే ఎంత గొప్ప అనుభూతి! మధ్యాహ్నం రెండు అవుతోంది. గుంజన లోయ వద్ద ఉన్న దొంగల బండకు నాలుగు కిలోమీటర్ల ఈవల మా జీప్ కుడివైపున తిరిగింది. కాస్త దూరం వెళ్ళగానే పులుగోరు పెంట అటవీ బేస్ క్యాంప్. అక్కడే మా జీప్ ను ఆపేశాం. 

ప్రతి చెట్టూ మంచు మత్యాలు పూస్తున్నట్లు...

పై నుంచి సన్నగా జల్లు పడుతోందా, మంచు కురుస్తోందా తెలియడం లేదు. పై నుంచి దిగుతున్న చెమ్మతో బట్టలన్నీ తడిసిపోతున్నాయి. ఆకులపై పరుచుకున్న నీటి బింధువులు. ఎంత ముచ్చటగా ఉందో ఆ వాతావరణం. తడిసిన మనిషెత్తు రెల్లు పొదల మధ్య నుంచి లోయలోకి దిగుతున్నాం. వింజామరల్లాగా గాలికి ఊగుతున్న రెల్లు పొదలు మమ్మల్ని సుతారంగా తాకి, గంధాన్ని చిలికి నట్టు మా పైకి మంచు బిందువులను విసురుతున్నాయి. దిగువున పారుతున్న ఏటి శబ్దాలు. అది రాళ్ళ పైనుంచి దుముకుతూ సందడి చేస్తోంది. లోయలోకి దిగేసి, కుడివైపునకు వెళుతున్నాం.

పితృగళ లో పారుతున్న స్వచ్ఛమయిన సెలయేరు


రాళ్ళన్నీ తడిసి ఉన్నాయి. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. ట్రెక్కింగ్ హ్యాండ్ స్టిక్ లేదు. మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి. కిందటి తడవ తుంబురు కెళ్ళే దారిలో ప్రవహిస్తున్న ఏటిలో హ్యాండ్ స్టిక్ కాస్తా కొట్టుకుపోయింది. రెండు కొండల నడుమ లోయలో ఏరు ప్రవహిస్తోంది. నీళ్ళలో దిగక తప్పడం లేదు. రాళ్ళ ను ఎక్కుతూ దిగుతూ కాస్త ముందుకు వెళ్ళే సరికి ఒక పెద్ద పలక లాంటి కొండ రాయికి ఏవో చెక్కి ఉన్నాయి. అనుమానం లేదు. చరిత్ర పూర్వ యుగపు మానవుడు చెక్కిన చిత్తరువులే. 


చరిత్ర పూర్వ యుగ మానవులు చెక్కిన చిత్తరువు లు

పై నుంచి ప్రవహిస్తున్న రెండు ఏర్లు కలిసి రాళ్ళ పైనుంచి జాలువారుతూ కింద ఉన్న గుండ్రటి రాతి గుండంలోకి దుముకుతోంది. పై నుంచి ఎంత నీటి ప్రవాహం వచ్చిపడుతోందో ! ఆ గుండం పక్కనే కూర్చుని భోజనాలు చేసేశాం. అప్పటికి మధ్యాహ్నం మూడు గంటలైంది. ఒకరొకరు నీటి గుండంలోకి దూకుతున్నారు. డాక్టర్ పవన్ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. వేసుకున్న బట్టలు తప్ప ఎవ్వరూ అదనంగా బట్టలు తెచ్చుకోలేదు. 

పితృగళ గుండంలో ఈదులాడుతూ...

నేను, ప్రభాకర్ రెడ్డి మాత్రం గట్టునే కూర్చుని ఆనందిస్తున్నాం. ‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు’ ‘మీరు కూడా దూకేయండి’ అంటున్నారు. ‘‘గుడ్డలు తెచ్చుకోలేద’’ న్నాం. ‘‘మేం మాత్రం తెచ్చుకున్నామా?’’ అంటూ మధు గళానికి అంతా బృంద గానం చేశారు. దూకక తప్ప లేదు. ‘‘దూకేయ్ మంటే దూకేస్తానే నీ కోసం’’ అంటూ ప్రభాకర్ రెడ్డితో పాటు నేను కూడా గుండంలోకి దూకేశా.


తొలుత చలికి భయపడ్డామా, నీళ్ళలోకి దూకేసరికి ఎంత వెచ్చగా ఉంది ! ఆ వెచ్చదనానికి పైకి లేవ బుద్ధి కాలేదు. గుండానికి ఈ చివరన కూర్చుని అంతా సమూహికంగా జలపాతం వైపు ఒక్క సారిగా ఈదాం. జలపాతం దుంకే ప్రవాహానికి ఎదురీదడం కష్టమే మరి! ఎన్ని జల విన్యాసాలు! ప్రవాహం కిందకు జాలువారుతున్న రాతి గట్టు మీద కూర్చుని కాళ్ళు కిందకు వేలాడదీస్తుంటే, ఆ ప్రవాహం కాళ్ళను కిందకు లాగేస్తోంది. 


పితృగళ జలపాతం దూకుతున్న గుండం


 అక్కడి నుంచి చిన్న గుండంలో పడి, ఏట వాలుగా ఉన్న రాతి పైనుంచి కింద ఉన్న పెద్ద నీటి గుండం లోకి జలపాతంలా దుముకుతోంది. ఎటు చూసినా కొండలే, ఎటు చూసినా నీళ్ళే. ఆకాశమంతా మబ్బులే. విప్పిన చొక్కా గట్టున పెట్టినా, మంచుకు తడిసిపోయింది.

నాలుగున్నరవుతోంది. ‘‘ఇక లేవండి’’ అన్నారు ప్రభాకర్ రెడ్డి. అంతా లేచే సరికి సాయంత్రం అయిదైంది. ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, వచ్చిన దారినే మళ్ళీ నడక. మోకాలు లోతు నీళ్ళను దాటుకుంటూ, నీళ్ళలో మునిగిన బోద పైన నడుస్తూ, పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ పైకి చేరాం. రెల్లు పొదల్లోంచి మళ్ళీ పులగోరపెంట బేస్ క్యాంప్ వద్దకు చేరాం. 

పొగ మంచు కప్పిన అడివిలో దారి... 

సాయంత్రం అయిదున్నర కాకుండానే అడవిలో వెలుతురు తొలిగిపోతోంది. చీకటి పడబోతోంది. అంతా వచ్చాక జీప్ వెనుతిరిగింది. జీప్ కు అటు ఇటు ఫుట్ రెస్ట్ పైన నిలుచుని, ముందు బ్యానెట్ పైన కూర్చుని మాట్రెక్కర్లు పిల్లలైపోయి ఎంత ఆనందించారో !

అడవి దాటాక, రోడ్డుకు ఇరువైపులా కొట్టేసిన అరటి తోట. మధ్యలో కొన్ని గెలలు వదిలేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. కనీసం కోసి, పట్టణాలకు, నగరాలకు తరలిస్తే కూలి కూడా గిట్టడం లేదు. దళారులు కారుచౌకగా అడుగుతున్నారు. టౌన్లో వాటిని అధిక ధరలకు అమ్ముకుంటారు. పడిపోయిన గెలల్లో కొన్ని పండిన అరటి కాయలను కోసుకు తింటే, ఎంత రుచిగా ఉన్నాయో ! రైతు కష్టం ఇలా నేలపాలవుతోంది !

జాతీయ రహదారి ఎక్కాం. బాగా చీకటి పడిపోయింది. రోడ్డంతా గుంతల మయం. అడవిలో సాగిన వేగం జాతీయ రహదారిపై తగ్గిపోయింది. తిరుపతి నుంచి మాధవరం వరకు యాభై కిలోమీటర్లు. అడవిలో పన్నెండు కిలో మీటర్లు. పులగోర పెంట బేస్ క్యాంప్ నుంచి పితృగళ తీర్థానికి దాదాపు కిలో మీటరు నడక. నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు జీప్ లో వెళ్ళినా, రెండు కిలో మీటర్లు లోయలో నడక. తిరుపతికి వచ్చేసరికి రాత్రి ఏడున్నరైంది. ఇళ్ళకు చేరే సరికి ఎనిమిదైంది.

అనుకోకుండా పితృగళ వెళ్ళి, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాం. ఎంత సాహసం, ఎంత ఆనందం, ఎంత భిన్నమైన ప్రకృతి. ఒక అరపూట అడవిలో ఇలా ఎనిమిది మందిమి కలసి ఆనంద తాండవమాడాం.

Tags:    

Similar News