చంద్రగిరి సమీపాన రాక్షస గూళ్ళు

ఎందుకు ప్రభుత్వం విస్మరిస్తున్నది?;

Update: 2025-01-07 07:30 GMT

నలుదిక్కులా ఆ రాళ్లు పేర్చిన తీరు గమనించండి. ఆ రాళ్ల పేర్పు పైన పెద్ద రాతి బండ నుంచిన వైనం ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తున్నదో గదా! ఆ బండ కింద 2,500 సంవత్సరాల కిందటి ప్రాచీన కళ దాగి ఉంది. ఆలనా పాలనా లేకపోవడం వల్ల వాటిని చెక్కేసిన వారు, దాని మీద సొంత పేర్లను గీక్కున్న వారు, కింద మంటల్ని పెట్టి రాతల్ని చెరిపేస్తున్నవారు... అనుకుంటే చాలా పెయిన్ గా ఉంటుంది. ఎన్నాళ్ళదీ ప్రాచీన సంపద. ఆ అద్భుత కట్టడమేంది? ఆ ప్రాచీన కళ ఏంది ? ఆ పేర్పులోని ఇంజనీరింగ్ టెక్నిక్ ఏంది? అస్సలు ఆ రాతల అర్థమేంది?

నిన్ననే తమిళనాడు ముఖ్యమంత్రి INDUS VALLEY SCRIPT చదివి అర్థం చెప్పిన వారికి కోటి రూపాయల బహుమానం ప్రకటించినారు. మా తిరుపతి చుట్టుపక్కల తాటి కోనలో,మల్లయపల్లెలో ,మల్లె మురుగు కాల్వల్లో, శేషాచలం యుద్ధ గళంలో,పిత్ప గళ తీర్థంలో కొన్ని వందల సంఖ్యల్లో ఇట్టాంటి రాతల్ని, బొమ్మల్ని చూసినాము. వాటిని పరిష్కరించి ,అర్థం వివరిస్తే నాటి పురాతన కాలపు విశేషాలు ఎన్నో తెలుస్తాయి కదా? ఏదీ ఆ ఇంగితం.

ఈ సోమవారం మెగాలితే ట్రెక్కింగ్. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి,దోర్న కంబాల దారిలో మల్లయ్య పల్లె కొండల్లో ఉందీ అద్భుత చిత్రం. దీన్ని ఆ పల్లెటూరివారి పాండవ గుళ్లు అంటారు. తెలిసిన చరిత్రకారులు ప్రాచీన మానవుని సమాధులు అంటారు. ఇట్టాంటిదీ తాటికోనలో కూడా ఉంది. అసలు మా తిరుపతి చుట్టూ పక్కల ఉన్న ప్రాచీన సంపద అబ్బురపరుస్తుంది. ఎన్నెన్ని మంటపాలు, ఎన్ని కూలిపోయిన,ధ్వంసమైన,పాడైపోయిన గుళ్లు ,గోపురాలు. తాటకోన దగ్గరైతే 20,000 టన్నుల రాతి గుండు పైన అద్భుతమైన గోపురం ఉంది. వీటిని ఎవరు ఏ కాలంలో కట్టించినారు,వాటి విశేషాలు, పురా సంగతులు తెలుసుకోవాలి కదా. రెడ్డి పల్లె దగ్గర ధ్వంసమైన దేవాలయమైతే నాటి చారిత్రిక పుటల్ని అనేక తీరులుగా విప్పేట్టు ఉంది.

మా చంద్రగిరి, విజయనగర ఆఖరి చక్రవర్తి వెంకటపతి రాయల పరిపాలనా దక్షత గురించి ఈ తరం తెలుసుకోవాల్సి ఉంది. రాక్షస తంగడి యుద్ధం తర్వాత, హంపీ ధ్వంసమయినాక విజయనగరం అంతమయినట్టుగా చాలామంది అనుకుంటున్నారు. ఆ తర్వాత పెనుకొండ, చంద్రగిరి, రాయవెల్లూరు రాజధానులుగా విజయనగర సామ్రాజ్యవైభవం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటపతి రాయలు గాలి గోపురం కట్టించటమే కాదు, తిరుమల వేంకటేశ్వరునికి సమర్పించిన కానుకల చిట్టా, చుట్టూ చెరువులు, కాల్వలు కట్టించిన దాచేస్తే దాగని చరిత్ర పుటలు తెరవాల్సి ఉంది.

చరిత్ర స్పృహ మనల్ని వర్తమానంతో పులకింపజేస్తుంది. అందుకే ఎన్ని మార్లయినా ఇట్లా చారిత్రక ప్రదేశాల్ని దర్శించుకునేది.

ఈ దఫా మల్లయ్య పల్లె నుంచి మెగాలిత్ కు మోటరబుల్ కంకర దారిని చూసి చాలా సంతోషమేసింది. ఊరి వాళ్ళే నేరుగా పోయి రావటానికి ఈ ఏర్పాటు చేసినట్టున్నారు. చూసే వారి సంఖ్య పెరిగే కొద్దీ ఊరి ప్రాశస్త్యం వొక్క వెలుగు వెలుగుతుంది కదా!

తిరుపతి చుట్టుపక్కల కొన్ని పదుల సంఖ్యట్లో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. శేషాచలం చుట్టూ అడవుల్లోనయితే కొన్ని వందల తీర్థాలు,సత్రాలు ,ప్రకృతి అందచందాలు ఉన్నాయి. వీటిని ప్రజలందరికీ చేరువలో ఉంచాలనీ సంకల్పమయితే ప్రభుత్వాలకు ఉండాలి కదా!

Tags:    

Similar News

అతను అంతే...