యుద్ధ వీరుల స్మారక చిహ్నం ఇండియా గేట్ !

తిరుపతి నుంచి మా ఢిల్లీ యాత్ర-8;

Update: 2025-04-15 05:31 GMT

విశాలమైన భవనాల్లో విశ్రాంతి తీసుకుంటున్న నేతలు. రేయింబ వళ్ళు కంటికి రెప్పలా కాపలా కాస్తున్న జవానులు. వీరుల ప్రాణ త్యాగాలకు చిహ్నంగా కర్తవ్య పథం. హస్తిన చెత్త కుప్పల్లో ఏపూటకాపూట అదృష్టాన్ని వెతుక్కుంటున్న భావి భారత పౌరులు.

ఢిల్లీ నగర వీక్షణానికి బయలుదేరాం. సోమవారం ఉదయం బహదూర్ ఘడ్ నుంచి మేం బయలు దేరే సమయానికి చంద్రఓబుల్ రెడ్డి వచ్చి వీడ్కోలు పలికారు. నగరంలోకి కెళ్ళే రోడ్లన్నీ మట్టితో నిండి, దుమ్మురేపుతున్నాయి. రోడ్లన్నీ చాలా రద్దీగా ఉన్నాయి.

ఎక్కడికెళదాం? డ్రైవర్ ముందు మా ధర్మ సందేహం. "ఎక్కడికి తీసుకెళ్ళమం టే అక్కడికి" డ్రైవర్ సమాధానం. ‘‘రెడ్ ఫోర్ట్ కు వెళదాం. తరువాత పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం చూద్దాం’’ అన్నాను. ‘‘ఈ రోజు రంజాన్. రెడ్ ఫోర్ట్ వద్దకు వెళ్ళనివ్వరు. పోలీస్ బందోబస్తు ఉంటుంది’’ అన్నాడు. ‘‘అయితే ముందు ఇండియా గేట్ చూద్దాం.’’ అన్నారు వాకా. ‘‘కుతుబ్ మినార్ కూడా చూడాలి’’ అన్నాను. ‘‘ముందు సరోజినీ మార్కెట్ చూడండి’’ అన్నాడు డ్రైవర్ కిషన్.

‘‘సరోజినీ మార్కెట్ లో షాపింగ్ చేయచ్చు’’ అన్నారు హరీష్, పరమేశ్వరరావు. ‘‘మన తిరుపతిలో దొరకని వస్తువులా!’’ అన్నాను. ‘‘ఏం కొనకపోయినా మర్కెట్ ను చూసొద్దాం’’ వాకా ముక్తాయింపు. ‘షాపింగ్’ అంటే నాకు గుర్తొచ్చింది. ఒక నటి ముఖం ముందు మైక్ పెట్టి ‘‘వాటీజ్ యువర్ హాబీ?’’ అని అడిగాడు ఒక రిపోర్టర్. ‘‘షాపింగ్’’ అంది ఆ నటి హొయలు పోతూ. ‘‘ఎందులోనూ పొందని ఆనందాన్ని ‘షాపింగ్’ లో పొందుతాన’’ని చెప్పింది చలువు కళ్ళ జోడును సరిచేసుకుంటూ, జుట్టును వెనక్కి తోసుకుంటూ. నాకు ఆశ్చర్యమేసింది. షాపింగ్ లో కొన్న వస్తువులన్నీ దాచుకోవడానికి ఇంట్లో గోడౌన్ ఏమైనా ఉందా !?.

ఢిల్లీ లో ఎపుడూ కిటకిటలాడే సరోజనీ మార్కెట్ 

నగర వీధులను చూస్తూ సాగుతున్నాం. ఇదే సరోజినీ మార్కెట్ అన్నాడు కిషన్. కొన్ని పెద్ద పెద్ద షాపులు ఇంకా తెరవలేదు. పదకొండు గంటలకు కానీ తెరవరట! లోపలికి వెళ్ళాం. రెడీమేడ్ దుస్తులు, కర్టెన్లు, బెల్టులు, చెప్పులు, బూట్ల నుంచి అనేక రకాల వస్తువులు. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. సామాన్య మధ్యతరగతి వారికోసం ఏర్పడిన ఎంత పెద్ద మార్కెట్టో! మార్కెట్ చూట్టానికే ఒక రోజు సరిపోయేట్టు ఉంది. మనం ఏదైనా వస్తువును చూస్తే, కొనేంతవరకు వెంటపడతారు. కేవలం చూట్టానికే వచ్చాం తప్ప కొనడానికి రాలేదు.

మెడలో పాములు వేసుకున్నట్టు కొందరు యువకులు మెడ చుట్టూ బెల్టులు వేసుకుని, బుజాన వేసుకున్న బ్యాగులో మరి కొన్ని దూర్చుకుని తిరుగుతున్నారు. అలా ఇరవై అడుగులకొకరు వెంటపడుతున్నారు. ‘‘ఎంత?’’ అని అడిగాను. ‘‘తీసుకోండి’’ అంటూ బెల్టు ఇవ్వబోయాడు. ‘‘ధరెంతో చెప్పు’’ అన్నాను. ‘‘దీనిపైన 1450 అని ఉంది. 500 కు ఇస్తాను’’ అన్నాడు. ‘‘వందరూపాయలు’’ అన్నారు వాకా. ‘‘మూడొందలు’’ అన్నాడతను. చివరికి 150కి తీసుకున్నాను. నేను ఒకటి , హరీష్ రెండు బెల్టులు తీసుకున్నారు. "కాశీకి వెళ్ళి కొంగ రెట్ట పట్టుకొచ్చినట్టు' ఢిల్లీకి వెళ్ళి బెల్టు తెచ్చానా అన్న సందేహం!

రాష్ట్రపతి భవనం ముందు వా కా ప్రసాద్, హరీష్, పరమేశ్వర రావు, రాఘవ

ఎంత చెప్పి, ఎంతకిచ్చాడు! బెల్టు బాగుంది. ఇదీ సరోజినీ మార్కెట్ బేరం! అందుకునే అమ్మే వాళ్ళతోనే కాదు, కొనే వాళ్ళతో కూడా ఈ మార్కెట్ కళకళలాడుతోంది. ‘‘పాపం అతనికేం గిట్టుబాటవు తుంది’’ అన్నాను. ‘‘గిట్టుబాటు కాకపోతే ఇవ్వడు కదా!’’ అన్నారు పరమేశ్వరరావు. ‘షాపింగ్’ గురించి నాకు బొత్తిగా తెలియదు. ఏదైనా తప్పనిసరైతే తప్ప, ఆ వస్తువు కొనకపోతే జరగదు అనుకుంటే తప్ప ఏ వస్తువూ కొనను. అంతా నాలాంటి వాళ్ళైతే ఈ మార్కెట్ మూసేసుకోవలిసిందే.

అవసరం ఉన్నా, లేకపోయినా వస్తువులు కొనే ఈ ‘షాపింగ్’ హాబీ ఉంది చూశారూ, అది ఎన్ని కుటుంబాలను బతికిస్తోందో కదా! మార్కెట్ ను సుసంపన్నం ఎంత చేస్తోం దో కదా!

తొలుత సరోజినీ మార్కెట్ కు వెళ్లడం టైం వేస్ట్ అనుకున్నానా, దాన్ని చూశాక అసలు వదలబుద్ది కాలేదు. ఆ మార్కెట్ కిటకిటలాడుతోంది. దిగువ, మధ్యతరగతి ప్రజల పాలిట నిజంగా ఇది కల్ప తరువే. నెల్లూరులో సండే మార్కెట్, హైదరాబాద్ లో సుల్తాన్ బజార్ దీన్ని పోలినవే. ఇది చాలా విశాలమైంది. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది.

ఇండియా గేట్ కు ఇరువైపులా ఎంత అందంగా నిర్మించారో!

అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాం. ‘‘ఇప్పుడెక్కడి కెళ్ళాలి?’’ కిషన్ ప్రశ్న. ‘‘పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ చూద్దాం. అటు నుంచి ఇండియా గేట్ కు వెళదాం’’ అన్నాం. సుందరమైన నగర వీధుల గుండా మా కారు సాగుతోంది. వెడల్పైన రోడ్లు. వాటి పక్కన పచ్చని చెట్లు. ఆ విశాలమైన రోడ్డు ఎన్ని గుండ్రటి సర్కిళ్ళను తిరిగిందో!

ఒక ఇంటి చుట్టూ ప్రహరీగోడలా ఉన్న ఎత్తైన ఫెన్సింగ్. లోపల మరో గోడ ఉందేమో! బయటకు మనుషులు కనపడడం లేదు. విశాలమైన పెరటిలో పెద్ద పెద్ద చెట్లు. ఏ మాత్రం రద్దీ లేదు. ఆ ఇంటి ప్రహరీలాంటి ఫెన్సింగ్ చుట్టూ అడుగడుక్కీ తుపాకులతో బిఎస్ ఎఫ్ జవానుల కాపలా. అక్కడక్కడా పోలీస్ ఔట్ పోస్ట్లు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. మా కారు ఆ పోలీస్ ఔట్ పోస్ట్ట్ దగ్గర ఆగింది. ఇక్కడ ఆగకూడదని బి.ఎస్. ఎఫ్ జవానుల సైగ. ‘‘ఇదే ప్రధాన మంత్రి ఇల్లు.’’ అన్నాడు కిషన్. కారులో సాగిన కొద్దీ ఆ ఇంటి ప్రహరీ గోడ మా వెంటే సాగుతోంది! ఒక్క మనిషి కోసం ఎకరాల కొద్దీ ఉన్న తోట! చుట్టూ ఎంత భద్రత!

‘‘ఇదే తీన్ మూర్తి భవన్. ఇందిరా గాంధీ నివాసం. ఈ ఇంట్లోనే భద్రతా జవాన్లు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ ఇందిరాగాంధీని కాల్చి చంపింది. శక్తి స్థల్.’’ అన్నారు వాకా ప్రసాద్. సహజంగా ఆ ఇంటిని సందర్శించవచ్చు. కానీ, రంజాన్ పండుగ వల్ల ఆరోజు సందర్శకులకు అనుమతి లేదు. ఆ రోడ్లలో మా కారు చక్కర్లు కొడుతూనే ఉంది. సమీపంలోనే సోనియా గాంధీ నివాసం. రాహుల్ గాంధీ నివాసం, స్పీకర్ ఓంబిర్లా నివాసం. మంత్రులు, పార్లమెంటు సభ్యుల నివాసాలు. అక్కడ ఉన్న అన్ని ఇళ్ళూ దాదాపు ప్రధాని నివాసంలాగా, విశాలంగా, పచ్చని తోటల మధ్య, కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉన్నాయి. ఒకే చోట కేంద్రీకృతమైన అధికారం. రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా కాపాడే సాయుధ జవానులు.

ఈ నగరంలోనే సరోజినీ మార్కెట్ లో బతకడానికి కొనుగోలుదారుల వెంటపడుతున్న యువకులు! రోడ్డు పక్కనే కూర్చుని అడ్డుకునే వృద్ధుడు! తన జాతకమేంటో తెలియక, ఇతరుల జాతకం చెప్పడానికి రోడ్డు పక్కన తుండు గుడ్డ పరుచుకుని కూర్చున్న మరో వృద్ధుడు. లయబద్దంగా తాళాలు వేస్తూ చిల్లర కోసం ఎదురుచూసే ఇంకో నిర్భాగ్యుడు! వీరంతా ‘జానెడు పొట్టకోసం’ కాదు కాదు, గుప్పెడు పొట్టకోసమే! పగలంతా రోడ్లలో తిరుగుతూ, రాత్రి పూట ఏ రోడ్డు పక్కనో, ఏ చెట్టు మాటునో, ఏ సిమెంటు పైపుల్లోనో తల దాచుకునే భావి భారత పౌరులు. చెత్తలో తిండి కోసం వెతుకులాడుతున్న పసి చేతులు. వాళ్ళ ఒంటి పైన సరైన గుడ్డలు కూడా లేవు. ఛీఛీ.. ఈ దేశాధికా రానికి సిగ్గు లేదు!

అదిగో అదే రాష్ట్రపతి భవన్. ఆ పక్కనే కొత్తగా కట్టిన పార్లమెటు భవనం ‘సెంట్రల్ విస్టా’. దాని పక్కనే బోసి పోతున్న పాత పార్టమెంటు. భద్రతా వలయం మధ్య ఘనమైన ’మన ప్రజాస్వామ్య’ సౌధాలు. అనుమతి లేనిదే లోనికి ప్రవేశించనివ్వరు. బైట నుంచే ఫొటోలు తీసుకున్నాం. ఆకలి వేస్తోంది. ‘‘దగ్గరే ఆంద్రాభవన్’’ అన్నాడు కిషన్.

ఆంధ్రాభవన్ కు బయలుదేరాం. రాష్ట్ర విభజనతో పాటు అది కూడా విభిజతమైంది; తెలంగాణా రాష్ట్ర భవన్ , ఆంధ్రప్రదేశ్ భవన్. ఆంధ్రప్రదేశ్ భవన్ లో కెళ్ళి మంచి తెలుగు భోజనం చేశాం. అక్కడి నుంచి ఇండియా గేట్ వేపు సాగాం.

‘‘అదిగో ఇండియా గేట్’’ చూపించారు దూరం నుంచే వాకా ప్రసాద్. ఇండియా గేట్ ముందర రోడ్డులో ఎడమ వైపున మా కారు ఆగింది. కుడి వైపున రోడ్డుకు ఆవల దూరంగా ఇండియా గేట్ కనిపిస్తోంది. నేరుగా వెళ్ళడానికి వీలులేదు. ఎడమ వైపున విశాలంగా ఉన్న ఉద్యానవనం లోని అండర్ పాస్ ద్వారా కుడి వైపున నచుడుకుంటూ వెళుతున్నాం. ఆరోజు రంజాన్ సెలవు దినం కావడంతో చాలా మంది ముస్లింలు వచ్చారు. ఈ నిర్మాణం దగ్గర గౌరవ భావాన్ని ప్రకటిస్తున్నారు.

పసుపు, ఎరుపు రంగులు కలిసిన ఇసుక రాయితో, ఎనభైనాలుగు అడుగుల ఎత్తైన ఇండియా గేట్ ఎంత ధీరోదాత్తంగా ఉందో! మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన 70 వేల 187 మంది భారతీయ సిపాయిల స్మారకార్థం దీన్ని నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 మధ్య జరిగింది. మొదటి ప్రపంచయుద్ధంతో పాటు ఫ్రాన్స్, ఫ్లాండర్స్, మెసొపొటోమియా, పర్షియా, తూర్పు ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో 1921 వరకు జరిగిన యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. ఎత్తైన ఇండియా గేట్ ను చూస్తుంటే, మధ్య నుంచి ఆవల సుభాస్ చంద్రబోస్ విగ్రహం కనిపిస్తోంది.

జార్జి లిట్టెట్ అనే వాస్తు నిపుణుడు ఇండియా గేట్ కు రూపకల్పన చేశాడు. ఇది పురాతన రోమ్ వాస్తు నిర్మాణ శైలిలో చాలా గొప్పగా నిర్మించారు. దీని నిర్మాణ రాళ్ళ పైన 13, 300 మంది వీర జవానుల పేర్లను చెక్కారు. దీన్ని రాజ్ పథ్ అని, కర్తవ్య పథ్ అని అంటారు. దీన్ని చూట్టానికి సమయం అంటూ లేదు. ఎప్పుడైనా సందర్శించవచ్చు.

ఇండియా గేట్ లోంచి చూస్తే దూరంగా బోసు విగ్రహం

ఇండియా గేట్ నుంచి బయటకు వస్తున్నాం. సాయంత్రం కేరళ ఎక్స్ ప్రెస్ ఎక్కాలి. రెడ్ ఫోర్ట్ చూడలేదన్న అసంతృప్తి మాలో మిగిలిపోయింది. ‘‘కుతుబ్ మినార్ వెళదాం అన్నాను.’’ ఆ దిశగా మా కారు బయలుదేరింది.

(ఇంకా ఉంది)

Tags:    

Similar News

పూల గొడుగు

ఆటోగ్రాఫ్