రండి బాబూ రండి.. రైలెక్కండి
జగమంత ప్రపంచం నాది.. ఏకాకి జీవితం నాది అంటూ ఇక మీ చేతిలో నయాపైసా లేకపోయినా జగత్ ను చుట్టేసి రావొచ్చు. ఎంచక్కా రైలు ఎక్కి మీక్కావాల్సినవి చూసి రావొచ్చు
(ది ఫెడరల్ ప్రతినిధి, హైదరాబాద్)
జగమంత ప్రపంచం నాది.. ఏకాకి జీవితం నాది అంటూ ఇక మీ చేతిలో నయాపైసా లేకపోయినా జగత్ ను చుట్టేసి రావొచ్చు. ఎంచక్కా రైల్లో ఎక్కి మీక్కావాల్సినవి, మీరు చూడాల్సినవి చూసి రావొచ్చు. ఇదేంటనుకుంటున్నారు కదూ.. ఎస్. మీరు చదివింది నిజమే. రైల్వే శాఖ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత మనుషుల తీరు బాగానే మారింది. ఏమిట్రా ఈ జీవితం ఎదుగూబొదుగూ లేకుండా నిస్సారమైందనే భావన వచ్చింది. ఆవహించిన ఒంటరి తనం పొగొట్టుకునే టైం వచ్చింది. దీనికి తగ్గట్టు అప్పటివరకు ఉన్న షరతులు కూడా సడలిపోయాయి. హాలిడే ట్రావెల్ బాగా పెరిగింది. ప్రతి మనిషీ ఎంతో కొంత ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కోరుకోవడం మొదలైంది. రైల్వేశాఖకుఇది అర్థమైంది. ట్రావెల్ నౌ, పే లేటర్ స్కీం (TNPL) తెచ్చింది. ముందు ప్రయాణించండి.. తర్వాత డబ్బులు కట్టండనేది ఈ స్కీమ్. సమయానికి చేతిలో డబ్బుల్లేవే అనే ఆందోళన లేకుండా వెసులుబాటు కల్పించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. దాంతో పర్యాటకుల్నిరాబట్టుకోవడం ఎలాగూ ఉండనే ఉంటుంది. ఎంతైనా కార్పొరేట్ ప్రపంచం కదా.. లాభం లేకుండా ఏ పనీ చేయని కాలం కదా.
TNPL అంటే ఏమిటి?
మీ ఇంట్లో ఎల్సీడీ టీవీ ఉందా, ప్లాస్మా టీవీ ఉందా.. వాషింగ్ మెషిన్ ఉందా.. వాయిదాల పద్ధతి మీద ఇస్తామంటూ ఇప్పటి వరకు ఏ ఎలక్ట్రానిక్ షాపుల వాళ్లో, అమెజాన్, ప్లిప్కార్ట్ వాళ్లో ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు కొనుక్కోండి.. తర్వాత డబ్బులు తర్వాత కట్టండనే స్కీమ్ లు అనేకం ఉండేవి. ఇప్పుడా ఆ స్కీమ్ నే కాస్త అటు ఇటుగా మార్చి రైల్వే శాఖ తెరపైకి తెచ్చింది. ట్రావెల్ నౌ పే లేటర్ (టిఎన్‌పిఎల్) పేరు పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే సులభ నెలవారీ వాయిదాల పద్ధతన్నమాట. Make My Trip, expedia వంటి కొన్ని ట్రావెల్ సంస్థలు ఇలాంటి స్కీమ్ లను అందిస్తున్నాయి.
ప్రయాణ ఖర్చు ఎంత ఉండొచ్చు...
పెద్ద పెద్ద నగరాల్లో ఉండే ధనవంతులకు ఈ స్కీమ్ లతో పెద్దగా పనేమీ ఉండదు. వాళ్ల ప్లాన్లు వాళ్లకుంటాయి. ఎటొచ్చీ చిన్న, మధ్య తరహా పట్టణాల్లో ఉండే మధ్యతరగతి జనానికే ఇటువంటి స్కీమ్ ల అవసరం. అటువంటి వారికి TNPL ఓ చాయస్. చేతిలో డబ్బుంటే ఒక పద్ధతి, లేకుంటే మరో పద్ధతి. తినడానికే తికాణ లేకుంటే ట్రావెల్ ఎంటీ ఎంటర్టైన్మెంట్ ఏమిటనుకునే వాళ్లు కొందరైతే ట్రావెల్ లోన్‌లు ఉపయోగించుకునే వారు మరికొందరు.
TNPLలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటీ?
TNPL ఉపయోగించుకోవాలనుకున్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎట్రాక్టివ్ గా ఉందని టికెట్ కొనుక్కుంటే బొల్తా పడే అవకాశమూ లేకపోలేదు. ఎంపిక చేసుకునే ముందు అనేక అంశాలను చూడాలి. TNPL స్కీమ్ కి రీపేమెంట్ గడువు తక్కువ. అందువల్ల టైమ్ ప్రకారం కట్టకపోతే భారీ వడ్డీ కట్టాల్సి వస్తుంది. సకాలంలో డబ్బు కట్టకపోతే అప్పుపెట్టిన వాళ్ల క్రెడిట్ ప్రొఫైల్ కూడా దెబ్బతింటుంది. టూరిస్టులు నో కాస్ట్ EMI ప్లాన్‌ని ఎంచుకోవాలి . లోన్ రీపేమెంట్ టైమ్ ని ఎక్కువ కాలం పెట్టుకుంటే మంచిదని రైల్వే ప్యాసింజర్స్ సలహా మండలి మాజీ సభ్యుడు బుచ్చిరాజు సలహా. రీపేమెంట్స్ ఆలస్యమైతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. TNPL లోన్‌లను డిజిటల్‌గా పొందవచ్చు. పేపర్‌వర్క్ తక్కువే. అయితే క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండాలి.
TNPL కింద ఎంతవరకు లోన్ తీసుకోవచ్చునంటే...
క్రెడిట్ స్కోర్ ను బట్టి TNPL లోన్ ఆధారపడి ఉంటుంది. 10 వేల నుంచి మొదలై 40 లక్షల రూపాయల వరకు స్కీమ్స్ ఉన్నాయి. చిన్న మొత్తాలకైతే ఎటువంటి పూచీకత్తులు, గ్యారంటీర్లు అవసరం లేదు. పెద్ద స్కీమ్ లకైతే గ్యారంటీర్లు కావాలి. చిన్న స్కీంలకు ఆరు నెలలు.. పెద్ద మొత్తాలకైతే 6 ఏళ్ల లోపు రీపేమెంట్ గడువుంది. ప్రయాణీకులు తమకున్న ఆర్ధిక స్థోమత, తిరిగి చెల్లించే కెపాసిటీని బట్టి స్కీంలను ఎంపిక చేసుకుంటే మంచిది. ఆశలావు పీక సన్నం అన్నట్టు కాకుండా ఉంటే మంచిది.
ఎలా బుక్ చేసుకోవాలంటే..
పేటీఎంతో.. ఐఆర్ సీటీసీ పోర్టల్ లోకి లాగిన్ కావాలి. అయ్యాక ప్రయాణ వివరాలను ఎంటర్ చేయాలి. బుక్ టికెట్ పై క్లిక్ చేయాలి. పేమెంట్ సెక్షన్ లో పే లేటర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి, పేటీఎం పోస్ట్ పెయిడ్ ను ఎంపిక చేసుకోవాలి. పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేయడంతో టికెట్ బుకింగ్ పూర్తవుతుంది.
క్యాష్ ఈ.. ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లోకి లాగిన్ అయ్యాక ప్రయాణ వివరాలను ఎంటర్ చేసి బుక్ టికెట్ పై క్లిక్ చేయాలి. పేమెంట్ ఆప్షన్ లో టీఎన్ పీఎల్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి, క్యాష్ ఈ ను ఎంపిక చేసుకోవాలి. లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఈ పద్ధతిలో టికెట్ బుకింగ్ సొమ్ము మొత్తాన్ని ఈఎంఐ కింద మూడు లేదా ఆరు నెలల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
ఫిన్ టెక్ సంస్థ కూడా ఈ పేలేటర్ సదుపాయం కల్పిస్తోంది. అయితే, టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 14 రోజుల్లోపల సొమ్ము చెల్లించాలి. ఈ గడువు దాటితే సొమ్ముపై 36 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇవండీ వివరాలు. ఇక మీ ఇష్టం. ఎక్కడికి పోతారో, ఎలా ఎంజాయ్ చేసి వస్తారో, మీ ప్లాన్ ఏమిటో మీ ఇష్టం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఐఆర్ సీటీసీ పోర్టల్ ను చూడడం మర్చిపోకండి.