దేవీప్రసాద్ చటోపాధ్యాయ ‘భారతీయ నాస్తికవాదం’ పై చర్చాగోష్టి
భారతీయ నాస్తిక వాదం (Indian Atheism)అనేది ప్రఖ్యాత తత్వవేత్త దేబీ ప్రసాద్ చటోపాధ్యాయ రాసిన గొప్ప పుస్తకానికి తెలుగు అనువాదం. ఈపుస్తకం మీద నవంబర్ 24,ఆదివారం ఉదయం 9.30.గం నుండి సాయంత్రం 6గం వరకు గుంటూరులో చర్చాగోష్టి జరుగుతుంది.
ఈ గోష్ఠి లో 1.వృద్ధుల కళ్యాణ రామారావు, 2.విఠపు బాలసుబ్రమణ్యం Ex.MLC, 3.జి.భార్గవ, 4.రెంటాల వెంకటేశ్వరరావు (పుస్తక అనువాదకులు) పాల్గొంటారు.
ఈ పుస్తకం గురించి దేబీ ప్రసాద్ చటోపాధ్యాయ స్వయంగా అన్న మాటలివి:
"ఇవాళ భారతదేశంలో సామ్యవాదంకోసం జరుగుతున్న పోరాటానికీ భారతీయ తాత్వికవారసత్వం కోసం జరుగుతున్న పోరాటానికీ సంబంధం ఉందన్న ఎరుకమీద ఆధారపడి వచ్చింది. ఈ పుస్తకం. ఆ తాత్విక వారసత్వం అర్ధం కావాలంటే రెండు పనులు చెయ్యాలి.
మొదటి పని, అసలైన భారతీయ తాత్విక సామగ్రిని వస్తుగత దృష్టితో విశ్లేషించి, అందులో ఏది సజీవమో ఏది మృతమో చూసుకోవాలి. రెండవది, సజీవమైన దాన్ని పోషించుకోవాలి, చనిపోయినదాన్ని తొలగించాలి. సజీవమైన దాన్ని పోషించడం అంటే ఏమిటి? దాంట్లో ఇమిడి ఉన్న శక్తిని సరైన దిశలో విస్తరింపచేయడం. అది అంతిమంగా ఎక్కడకు తీసుకుని వెళుతుందో చూడడం.
అంటే- ఆ తర్వాత చారిత్రకంగా పోగుపడుతూ వచ్చిన శాస్త్రీయసామగ్రి ద్వారా అది మనల్ని సుసంపన్నమయిన స్థితికి తీసుకుని వెళ్లేటట్టు చూడడం. ఆ పనిని చక్కగా చేసినట్టయితే అది మార్క్సిజం మౌలికసూత్రాలకు చేరుస్తుందని నాకు నమ్మకం చిక్కింది. అయితే ఈ మాటకి 'సాంప్రదాయిక భారతీయ తాత్వికతలో మార్క్సిజాన్ని 'కనిపెట్టడం" అనే దురర్థం తియ్యకూడదు.
ఈ సందర్భంలో అసలంటూ కనిపెట్టడం అనేమాట వాడవచ్చని అనుకుంటే, అర్థం ఏమిటంటే భారతీయ తాత్వికతలోని కొన్ని నిర్దేశాలు, వాటిని సరిగా అర్థం చేసుకున్నట్టయితే, ఇవాల్టి భారతీయుడిని మార్క్సిజం దగ్గరకు తీసుకుని వెళతాయని. ఫలితంగా, అతను సామ్యవాదంకోసం చేస్తున్న పోరాటంలో అతనికి అతిశక్తిమంతమైన భావజాలరూపక ఆయుధం ఒకటి దొరుకుతుంది. అదికూడా, అతని జాతీయ వారసత్వం పూర్తిగా అనుమతించిన ఆయుధం.
అయితే ఆ పని ఈ పుస్తకంలో అసంపూర్తిగా మాత్రమే నెరవేరింది. అందుచేత దానిని ఇతరులు కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ విషయానికి (భారతీయ నాస్తికవాదానికి) ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకో పెద్దగా వివరించాల్సిన పనిలేదు. మార్క్సిజం ఫక్తునాస్తిక రూపమని అందువల్ల మన జాతీయ వారసత్వానికి అది నాశనకారి అని, అస్తిత్వ చరమవాస్తవాన్ని మన సంప్రదాయం భగవంతుడిలో చూస్తుందని ఒక ప్రచారం ఉంది. భారతదేశంలో ఇవాళ మార్క్సిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలలో ఇంతకన్న పెద్ద రొద మరొకటి లేదు. ఈ ప్రచారకులకి నాదొక చిన్న ప్రశ్న. నాస్తికం కాబట్టి మార్క్సిజాన్ని తిరస్కరించాలి అని వాదించడానికి ముందు, వాళ్లు నిజంగా మన తత్వవేత్తల అసలైన రచనలను చదివేపాటి శ్రద్ద తీసుకున్నారా? లేకపోతే, 'భారతీయవివేకం అంతా ప్రధానంగా భగవత్ కేంద్రకం' అన్న తమ కల్పనను ఏ కల్పనతో భారతదేశంలో మార్క్సిజం వ్యాప్తిని అడ్డుకోవాలనుకుంటున్నారో ఆ కల్పనను- కాపాడుకోవడం కోసం ఆ రచనలను నాశనం చేస్తున్నారా?
పుస్తకాన్ని 094900 98654 కు రూ 300 ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్,అడ్రస్ వాట్స్ అప్ చేసి పొందవచ్చు. పుస్తకం రిజిస్టర్ బుక్ పోస్ట్ లో మీకు అందుతుంది.