షుగర్" ని కంట్రోల్ చేశాను, మందులు వాడక నేటికి మూడేళ్లు
ఇఫ్టూ ప్రసాద్ వ్యక్తి గత అనుభవం
By : The Federal
Update: 2024-09-24 12:36 GMT
-ఇఫ్టూ ప్రసాద్
మందులు లేకుండా 32 నెలల తర్వాత (24-9-2021 & 24-9-2024) నా Hb A1C & క్రియాటినిన్ రీడింగులతో 22-5-2024న ఓ రైటప్ రాశా. మరో నాలుగు నెలలు గడిచి మందులు మాని మూడేండ్లు నిండింది. నాలుగు నెలలుగా ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నా. స్టాండర్డ్ లాబ్స్ లో ఒకటైన "థైరో కేర్" ద్వారా మొన్న టెస్టు చేయించా. మేలో HbA1C 6.5 ఉంటే, ఇప్పుడు 6.1 కి తగ్గింది. క్రియాటినిన్ నాడూ నేడూ 1 గానే ఉంది. డయాబెటిస్ పై గత రైటప్స్ లో వ్యక్తం చేసిన వివరాల్ని తిరిగి ప్రస్తావించడం లేదు. డయాబెటిస్ కి ఉనికిలో వున్న వైద్య విధానం ప్రకారం "హై షుగర్" కంటే "లో షుగర్" వల్ల ప్రమాదం ఎక్కువ. మందులు వాడే పేషెంట్లు గంటగంటకూ తినాలి. తినడం ఆలస్యమైతే వణుకుడు వస్తుంది. ముప్పై ఏండ్ల ఈ చేదు అనుభవాలన్నీ నేడు ఓ పీడకలగా మారాయి.
మే నుండి ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నా. జూన్ నుండి వారానికో రోజు 24 గంటల ఫాస్టింగ్ పాటిస్తున్నా. 9-6-2024న 1pm కి లంచ్ చేసి మరునాడు 2pmకి లంచ్ చేసే వరకూ మంచినీళ్లు తప్ప ఆహారం తీసుకోలేదు. నేను ఏ షేకింగ్, షాకింగ్ కీ గురికాలేదు. నా డయాబెటిస్ జీవితంలో అదో కీలకదినం. నాటి నుండి వారానికో రోజు 24 గంటల ఫాస్టింగ్ నీ అమలు చేస్తున్నా.
సభలు, సెమినార్లు, కమిటీల సందర్భాల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వేళలు సమీపిస్తుంటే సాటి కామ్రేడ్స్ వార్నింగ్ బెల్స్ కొట్టేవారు. మా డయాబెటీస్ పేషెంట్లకి మా సహచర నాన్ డయాబేటిక్ కామ్రేడ్స్ వంట ఆలస్యమైతే బిస్కట్స్ వంటివి ఇచ్చేవారు. నాన్ డయాబెటిక్ సమాజాన్ని సైతం "షుగర్" ఈ స్థాయిలో ప్రభావితం చేసింది.
డయాబెటిస్ ని మందులు లేకుండా రివర్స్ చేయొచ్చనే వైద్య విధానం పట్ల నిబద్ధత ఏర్పడ్డా అవగాహనపరంగా నాలో లోపాలు కొనసాగాయి. అది మెరుగుపడే క్రమంలో ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేపట్టా.
నేడు 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' మధ్యతరగతి, విద్యాధికుల్లో ప్రాచుర్యం పొందింది. వారికి వివరించే అవసరం లేదు. కానీ నా పాఠకుల్లోని గణనీయమైన శ్రామిక శ్రేణుల కోసం క్లుప్తంగా వివరిస్తా. దీన్ని "అడపాదడపా ఉపవాసం" అంటారు. 24 గంటల రోజుని 'తినేకాలం', 'ఉపవాసకాలం' గా భాగిస్తారు. ఇవే 'ఈటింగ్ విండో', 'ఫాస్టింగ్ విండో'! ప్రకృతిలో ప్రతిజీవీ అమలుచేసే ప్రక్రియే. వాటి స్లీపింగ్ కాలాన్ని ఫాస్టింగ్ కాలంలో లెక్కిస్తారు.
నిద్రాకాలం మనిషికి రోజుకు 6 నుండి 8గంటలు. నిద్రకి వెళ్లే ముందువరకు తిని, బెడ్ టీతో లేచే వాళ్ల ఫాస్టింగ్ కాలం వేరు. రాత్రి తిన్నాక చాలా సేపటికి నిద్రించి, పొద్దున లేచాక చాలా సేపటికి తినేవాళ్ల ఫాస్టింగ్ కాలం వేరు. తొలిరకం వారు ఆరుగంటలు నిద్రిస్తే 'ఫాస్టింగ్ కాలం' ఏడుగంటలు మించక పోవచ్చు. రెండోరకం వారు ఆరు గంటలు నిద్రిస్తే, 'ఫాస్టింగ్ కాలం' పది నుండి పన్నెండు గంటలుండొచ్చు. మిడ్ నైట్ బిర్యానీలు తిని బెడ్ ఎక్కి, తెల్లారి బెడ్ టీలతో నిద్ర లేచే వాళ్ళ నిద్రాకాలం, ఫాస్టింగ్ కాలం మధ్య గంటమించదు. గతతరాల ప్రజల నిద్రాకాలం, ఫాస్టింగ్ కాలం మధ్య ఐదారు గంటలుండేది. అది ఆనాటి ప్రజారోగ్యానికి మేలుచేసేది. నాటికీ, నేటికీ మధ్య ఆహార విధానాల్లో, వ్యాయామంలో తేడాలతో పాటు ఫాస్టింగ్ కాలాల తేడా కూడా అప్పటి ప్రజల ఆరోగ్యానికి ఉపకరించే అంశమే. EAT LESS, MOVE MORE లేదా LOW CARBO, HIGH FATS వంటి వైద్య విధానాల కంటే 'ఫాస్టింగ్ కోడ్' పాటిస్తే ఎక్కువ ఉపయోగం. ఫాస్టింగ్ కాలాన్ని 16 గంటలకి పెంచితే ఇన్సులిన్ నిరోధకతని అధిగమించడానికి అవకాశం ఉంది. "THE DIABETESE CODE" రచయిత జాసన్ ఫంగ్ సహా చాలామంది నేడు ఇదే చెబుతున్నది. (రోజుకు 30, 36 గంటల ఫాస్టింగ్ ని కూడా సూచిస్తున్నారు.) ఫాస్టింగ్ నిజానికి ప్రజలందరికీ మేలు చేసినా, డయాబేటీస్, ఓబేసీటీ వంటి పేషెంట్లకు అత్యవసరమైనది.
"తినేకాలం" 8 గంటలంటే 8 గంటలూ తింటూ ఉండడం కాదు. బ్రేక్ ఫాస్ట్ 9 AMకి చేస్తే ఆరోజు చివరి ఆహారం 5PM కి తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ ని బంద్ చేసుకొని 12 NOON కి లంచ్ చేస్తే చివరి ఆహారం 8 PM కి తీసుకోవాలి. రోజులో ఆహారం మొదలెట్టి, ముగించే వేళ మధ్య 8 గంటలని అర్ధం. నేను ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ ని 135 రోజులుగా పాటిస్తున్నా. ఇందులో 50 శాతం రోజుల్లో 16 నుండి 18 గంటల ఫాస్టింగ్ చేశా. కనీసం 10 రోజుల్లో 20 గంటలకు పెంచా. (ఇవి 24 గంటల ఫాస్టింగ్ రోజులు కాక) నేను సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ ని వదిలేసి ఎక్కువసార్లు 12 NOON TO 6PM లేదా 1PM TO 7PM లేదా 11AM TO 5PM అనే 6 గంటల ఈటింగ్ టైమ్స్ పాటిస్తున్నా. అరుదుగా 9AM TO 10AM మధ్య బ్రేక్ ఫాస్ట్ చేస్తే, 2PMకి ఆరోజు ఇక ఈటింగ్ విండోని ముగిస్తున్నా.
నేడు ఉనికిలో ఉన్న తప్పుడు మెడికేషన్ ని అడ్డం పెట్టుకొని గ్లూకోజ్ తో నిండిన తిండిని గంటగంటకూ మింగించడంతో క్లోమగ్రంధి కూడా గంటగంటకీ ఇన్సులిన్ ని స్రవిస్తుంది. అది వేళపాళ లేకుండా స్రవించడం వల్ల మొద్దుబారి ఇన్సులిన్ నిరోధకతకి దారితీస్తుంది. ఈ నిద్రించే ఆరేడు గంటలే కాక మరో ఏడెనిమిది గంటలు ఇన్సులిన్ స్రవించకుండా క్లోమగ్రంధికి విశ్రాంతిని ఇచ్చే సూత్రమిది. 16 కంటే పైబడ్డ గంటల ఫాస్టింగ్ కాలంలో అది పూర్తి విశ్రాంతి పొందుతుంది. 8 గంటల కంటే తక్కువగా తినేకాలంలోనే ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా దానికి చురుకైనపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇది మెడికల్ సైన్స్ సూత్రం. వరస వర్షాలతో తడి ఆరని నేలకూ, ఎండకి ఎండి, తిరిగి తడిసిన నేలకూ మధ్య దిగుబడిలో తేడా వంటిది. రోజుకు 16 గంటల ఫాస్టింగ్ వల్ల రక్తంలో గ్లూకోజ్ బర్న్ కావడమే కాక లివర్ లో గ్లైకోజిన్ నిల్వ కరిగి ఇన్సులిన్ నిరోధకత తగ్గే సూత్రం ఇమిడి వుంది. ఇతర ఎన్ని శాస్త్రీయ వైద్య చికిత్సలున్నా ఫాస్టింగ్ శ్రేష్ఠమైనదని రుజువవుతోంది. ఫాస్టింగ్ పై జాసన్ ఫంగ్ "THE MOST IMPORTANT CONCLUSION WAS A SAFE AND EFFECTIVE THERAPY THAT ANY BODY COULD REASONABLY FOLLOW" అంటాడు.
ఉనికిలో ఉన్న ఆలోపతి వైద్య పద్దతి ప్రకారం షుగర్ పేషెంట్లు తింటే "హై షుగర్", తినకపోతే "లో షుగర్" కి గురౌతారు. "హై షుగర్" స్లో పోయిజనస్ వంటిది. తక్షణ ప్రాణహాని లేదు. "లో షుగర్" స్పృహ తప్పడంతో పాటు మరణాలకూ దారితీస్తుంది. మందులు వాడే పేషెంట్లు గంటగంటకూ తింటేనే "లో షుగర్" ప్రమాద నివారణ సాధ్యం. ఇది చెలామణిలో ఉన్న వైద్య విధానం చెప్పేది.
క్లోమగ్రంధిలోని బీటా సెల్స్ ని ఫంక్షనింగ్ చేయించి ఇన్సులిన్ సహజ ఉత్పత్తి పెంపుదలకూ, దాని సెన్సివిటీని పెంచుటకూ తగిన చర్యల్ని చేపట్టుటకు జీవనశైలిలో తగు మార్పులు సరిపోతాయి. మందులతో బయటి నుండి అందించడం వల్ల ఇన్సులిన్ నిరోధకతతో దుష్ఫలితాలకు దారితీస్తుంది.
రేపు మందుల్ని వాడకుండా రోగులు ఆరోగ్యంగా జీవించే స్థితిని కల్పించడానికి ఈరోజు మందుల్ని వాడడం శాస్త్రీయ విధానమే. రేపటి మెడికేషన్ లేని స్థితికి నేటి మెడికేషన్ ఓ సాధనమైతే శాస్త్రీయమే. నేటి మందులు మున్ముందు వాటిని కొనసాగించడానికీ, మరింత వినియోగానికీ దారితీస్తే, అది అశాస్త్రీయ వైద్య విధానమే. నేడు తక్కువ మందుల వాడే విధానం భవిష్యత్ లో ఎక్కువ వాడకానికీ, నేడు "షుగర్" కి ఒక వేలు తొలగించి రేపు కాలును తీసివేయడానికీ చేపట్టే వైద్యం అశాస్త్రీయమే. అనుచిత మెడికేషన్ పద్దతి వల్ల ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి మున్ముందు మరింత ఇన్సులిన్ తీసుకునే స్థితిని కల్పిస్తుందనీ, గంటగంటకూ తినే పరిస్థితి ఏర్పడి పేషెంట్లని అంతిమంగా మరణాల వైపు నడిపించే ఓ హానికర వైద్య విధానమనీ వాస్తవ చరిత్ర నిరూపిస్తోంది. క్రమపద్దతిలో మందుల్ని ఆపి గంటగంటకూ తినే పద్దతి నుండి బయటపడే అవకాశం ఉంది. మెడికేషన్ లేకుండా LCHF ఆహార కోడ్ తో పాటు ఫాస్టింగ్ కోడ్ పాటిస్తే ఇన్సులిన్ నిరోధకత నుండి బయటపడటమే కాకుండా క్రమంగా ఇన్సులిన్ సెన్సివిటీ సాధించవచ్చని శాస్త్రీయంగా రుజువవుతోన్నది.
ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే, 1pm కి లంచ్ చేయకపోతే, 5 PM కి స్నాక్స్ తినకపోతే, 9pmకి డిన్నర్ చేయకపోతే, తమకు ఏ ప్రమాదం జరుగుతుందో అనే మానసిక భయాన్ని నేటి మెడికల్ వ్యవస్థ డయాబెటిస్ పేషెంట్లలో సృష్టించింది. అది భ్రమేనని నా జీవితానుభవం ఆచరణలో నిగ్గుతేల్చింది.
మందులు వాడిన రోజుల్లో ఒక దశలో నా HbA1C 8 కి పెరిగింది. క్రియాటినిన్ 2 కి పెరిగింది. మూడేండ్ల క్రితం మెడికేషన్ ఆపాకే HbA1C క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 6.1 కి తగ్గింది. క్రియాటినిన్ కూడా తగ్గి నిలకడగా 1 వద్ద వుంది. అంతేకాకుండా నేటికి నా డయాబెటిస్ వయస్సు 33 ఏళ్ళు. తాజా టెస్టులో RBC- 4.07; హిమోగ్లోబిన్ 12.1; HDL కొలెస్ట్రాల్ (D) 56; LDL కొలెస్ట్రాల్ (D) 91; టోటల్ కొలెస్ట్రాల్ 154, ట్రిగ్లీసెరైడ్స్-42; VLDL కొలెస్ట్రాల్ 8.5 చొప్పున ఉన్నాయి. ఇవి డయాబెటిస్ కి 33 ఏళ్ల, మెడికేషన్ లేకుండా మూడేళ్ళ తర్వాత రీడింగ్స్ కావడం గమనార్హం. ఏది ఏమైనా నా ప్రాక్టికల్ జీవితం ఎదుట నేడు ఉనికిలో ఉన్న సోకాల్డ్ మెడికేషన్ థియరీ ఓటమి పొందింది. ఐతే నేను ఇంకెంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఈ శాస్త్రీయ దృష్టితో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ PV సత్యనారాయణ గారు విశేష ప్రచారకృషి చేస్తున్నారు. ఇటీవల ఆన్ లైన్ తరగతుల్ని నిర్వహిస్తున్నట్లు తెల్సింది. తెలుగు రాష్ట్రాల్లో ఒబేసిటీ, డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు, థైరాయిడ్, బీపీ వంటి అనేక వ్యాధులకు గల మూల కారణాల్ని, నివారణ చర్యల్ని గూర్చి బోధిస్తున్న మరికొందరు కూడా వున్నారు. వారిలో సత్యనారాయణ గారు ఓ ప్రముఖులు. వారి నుండి నేర్చుకోవాల్సి ఉంది. ఇది సమగ్ర రైటప్ కాదని మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.
నేటికీ ఇన్సులిన్ నిరోధకత నుండి బయటపడ్డానని చెప్పడం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. స్థల కాలాదుల మీద, నా శారీరక స్థితి మీద, నా గత చికిత్సా పద్ధతులు కలిగించిన ప్రభావాల మీద, నా శారీరక, మానసిక స్థితిగతుల మీద, నా ప్రయాణాలు, ఇతర పని బాధ్యతలపై ఆధారపడింది. ఇన్ని రోజులు ఇలా చేశాననీ, ఇక పూర్తిగా బయటపడ్డాననీ ఇదో పరమ సత్యంగా చెప్పే మాట కాదు. ఇదో నిరంతర చలన సూత్రాలను సాపేక్షిక దృష్టితో నిత్య అధ్యయనం చేయడంపై ఆధారపడింది.
1921లో బాంటింగ్ ఇన్సులిన్ కనిపెట్టడం అద్భుతమే. అది షుగర్ పేషెంట్లకి వరం. మరో ముప్పై ఏళ్ల తర్వాత షుగర్ పేషెంట్లలో టైప్-1, టైప్-2 వర్గీకరణ కనుగొన్నారు. ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత టైప్-2 పేషెంట్లలో ఇన్సులిన్ కొరత లేదని తేలింది. మరి కొన్నేళ్లకి ఇన్సులిన్ నిరోధకతని కూడా కనుగొన్నారు. ఈ శతాబ్దంలో మెడికల్ ప్రపంచంలో అదొక పాపులర్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇన్సులిన్ నిరోధకత ఓ ప్రధానాంశమే.
ఇన్సులిన్ కనుగొనడానికి ఐదేళ్ల ముందే ఇల్లియట్ జోస్లిన్ 1916 లో "ఫాస్టింగ్ కోడ్" కనుగొన్నారు. అది వైద్య శాస్త్ర విజయమే. కార్పోరేట్ కంపెనీలు ప్రజారోగ్యాన్ని ఓ లాభసాటి బడా వ్యాపారంగా మార్చే క్రమంలో ఇన్సులిన్ స్వరూపమే మారిపోయింది. మానవజాతి ప్రయోజనాల కోసం 'వైద్యశాస్త్రం' (మెడికల్ సైన్స్) సాధించిన అద్భుత విజయాల్ని కూడా 'బూర్జువా వర్గం' హైజాకింగ్ చేసిన చరిత్ర ఉంది. డయాబెటిస్ పేషెంట్ల శ్రేయస్సు కోసం శాస్త్రవేత్తలు తమ మేధోశక్తితో కనుగొన్న ఇన్సులిన్ ని సైతం ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం సరుకుగా మార్చుకుంది. తదనంతర కాలంలో అది కోట్లాదిమంది ఒబేసిటీ, డయాబెటిస్ పేషెంట్ల పాలిట శాపంగా మారింది.
అలోపతిగా పిలిచే ఆధునిక వైద్యశాస్త్ర ఆవిర్భావమనేది మానవజాతి చరిత్రలో ఒక మహత్తర విజయం. అది గత శతాబ్దాల్లో అంటువ్యాధులు, ఇత్యాది ఉపద్రవాల నుండి కోట్లాది ప్రజల ప్రాణాలను కాపాడింది. నేడు కార్పోరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకొని ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాలకు ఓ పావుగా మారి ప్రజల్లో 'అలోపతి' అపహాస్యం పాలౌతుంది. ఐనా శాస్త్రీయత రీత్యా, వైజ్ఞానిక ప్రమాణాల రీత్యా, వైద్యపరంగా నేటికీ 'అలోపతి' ఉన్నతమైనదే. అదే సమయంలో ప్రజలు కేంద్రంగా కాకుండా, లాభమే పరమావధిగా దిగజార్చబడ్డ కారణంగా 'అలోపతి' నేడు ప్రజల్లో భ్రష్టుపట్టింది. పైగా 'అలోపతి' తన ఆవిర్భావ దశ నుండి ఒకట్రెండు శతాబ్దాల వరకూ ప్రబలిన వ్యాధుల తీరు వేరు. నేటి వ్యాధుల తీరు వేరు. అవి ప్రధానంగా మానవ శరీరాల పై బయటి నుండి దాడిచేసిన వ్యాధులు కాగా, తద్భిన్నంగా ఈనాడు ప్రధానంగా మానవ శరీరాల్లో పుట్టి పెరుగుతున్న వ్యాధులు కావడం గమనార్హం. సహజ ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా కృత్రిమ వాతావరణంలో ఎదిగి, కృత్రిమ ఆహారాలతో, పర్యావరణ కాలుష్య స్థితిలో, కల్తీ తిండి తింటూ జీవించే ఆధునిక మనుషుల్లో రోగాలు బయటి నుండి రానక్కర్లేదు. మన శరీరాల్లోనే మెటబాలిక్ ప్రక్రియ ద్వారా డయాబెటిస్, ఒబేసిటీ, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్, గుండె జబ్బుల వంటివి పుట్టుకొస్తున్నాయి. ప్రధానంగా మెటబాలిజానికి సంబంధించిన వ్యాధులు మానవజాతికి ప్రమాదంగా మారాయి. రెండు శతాబ్దాల క్రితం ఆధునిక వైద్యశాస్త్రం అద్భుతంగా మానవజాతికి ఆత్మబంధువైనది. అందులోని "ఆధునిక" నేడు కొరవడింది. జీవనశైలి వ్యాధుల్ని జీవన విధానాన్ని మార్చడం ద్వారా నిర్మూలించాలి. మెటబాలిక్ సిండ్రోమ్ దుష్ఫలితాలను, ఆ చికిత్సా పద్దతులతోనే నయం చేయాలి. పిడుక్కీ బియ్యానికీ ఓకే మంత్రం ఫలించదు. రోగం ఒకటైతే చికిత్స మరొకటి కాకూడదు. 'అలోపతి' నేటికీ అద్భుతమైనదే. అత్యవసర శస్త్ర చికిత్సల వంటి అనేక రకాల వ్యాధుల నివారణకు నేటికీ దాని సుపీరియర్ పాత్ర దాచేస్తే దాగనినిజం. ఐతే అది అప్డేట్ కావడం లేదు. జబ్బు ఒకటైతే మందు మరోకటి ఇచ్చేదిగా మారింది. అందుకు కారణం ఆధునిక వైద్యశాస్త్ర వైఫల్యం కాదు. దాన్ని నేటి కార్పోరేట్ ప్రపంచం కబంధ హస్తాల్లో చిక్కడమే.
పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా వ్యాయు, జల, భూ, ధ్వని కాలుష్యాలు, పర్యావరణ విధ్వంసం, ఆహార, పానీయ కల్తీ వంటివి మానవజాతికి సంక్రమించి రకరకాల రోగాల పుట్టుక, వ్యాప్తిలకు కారణంగా మారిన కాలమిది. వీటిని అదే పెట్టుబడిదారీ వ్యవస్థ శాశ్వత నివారణ చేస్తుందనే ఆశలు పెట్టుకోరాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ కబంధ హస్తాల నుండి వైద్యశాస్త్రం విముక్తి కాకుండా మానవజాతికి స్వతసిద్దంగా ఉపయోగపడే ప్రాతిపదిక ఉండదు. అదేసమయంలో ఈ లోపు అడుగడుగునా వైద్యం పేరిట సాగే దోపిడీకి వ్యతిరేక ఉద్యమ కృషిని చేపట్టాలి.
షుగర్ ఓ వ్యాధి కాదు. అదో మెటబాలిక్ క్రియకి చెందింది. జీవనశైలిలో మార్పుల ద్వారా నివారించేది. వ్యాధి కాకుండా, వ్యాధిగా మార్చి నేడు లక్షల కోట్లు పెట్టుబడిదారీ వ్యవస్థ గడిస్తోంది. అందుకు నాలుగు కార్పోరేట్ వ్యవస్థలు పరస్పర సమన్వయంతో సాగించే ఓ అమానుష దాడిని చూద్దాం.
1-ఫుడ్ కార్పోరేట్ వ్యవస్థ విధి పాత షుగర్ పేషెంట్ల వ్యాధిని తీవ్రం చేసే హైకార్బో ప్రాసెస్డ్ ఫుడ్స్ ని మార్కెట్లో ముంచెత్తి, కొత్త వ్యాధిగ్రస్తుల్ని సృష్టించడం.
2-డ్రగ్ కార్పోరేట్ వ్యవస్థ విధి వ్యాధిని నయం చేస్తుందంటూ హాస్పిటల్స్ కి మందులు సప్లై చేయడం.
3-ఫార్మా కార్పోరేట్ వ్యవస్థ విధి మందుల్ని ఉత్పత్తి చేసి డ్రగ్ కార్పొరేట్ వ్యవస్థకు అందించడం.
4-మెడికల్ కార్పోరేట్ వ్యవస్థ విధి పై కార్పోరేట్ వ్యవస్థల చేతుల్లో సాధనంగా మారిన అమెరికా డయాబెటిస్ అసోసియేషన్ (ADA) విడుదల చేసే మార్గదర్శక ప్రమాణాల ప్రకారం వైద్య వ్యవస్థతో ప్రెస్క్రిప్షన్స్ రాయించి చికిత్స చేయడం.
పైన పేర్కొన్న ఫుడ్, ఫార్మా, డ్రగ్స్, మెడికల్ మాఫియా వర్గాల లాబీకి లొంగి అడా (ADA) రూపొందించే వైద్య మార్గదర్శక నియమాలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది పేషెంట్లు బలై పోతున్నారు.
ఆఖరి కార్పోరేట్ వ్యవస్థ పట్ల ఓ స్పష్టత ఇవ్వాలి. మెడికల్ మాఫియాలో వైద్యులు భాగం కాదు. కార్పోరేట్ హాస్పిటల్స్ డాక్టర్లకు కూడా వర్తించదు. ఆ విమర్శ కార్పొరేట్ హాస్పిటల్స్ ని నెలకొల్పిన బడా కార్పొరేట్ మెడికల్ వ్యవస్థకి వర్తిస్తుంది. కార్పోరేట్ హాస్పిటల్స్ లో చేరి, ధనాశతో ప్రజల పట్ల కొందరు వైద్యులు ఒకవేళ తప్పిదాలకు పాల్పడి, ప్రజాగ్రహానికి గురైనా కార్పోరేట్ల క్రిందికి రారు. వారి పొరపాట్లను సైతం బాధిత ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిందే. అదే సమయంలో స్వయంగా కార్పొరేట్లనూ, ఆ కార్పొరేట్ల చేతుల్లో పనిముట్లుగా మారిన వైద్యుల్ని ఓకేగాటన కట్టరాదు.
భూమి, భుక్తి, విముక్తి వంటి మౌలిక నినాదం కాక భౌతిక స్థితిని బట్టి మారే నినాదాలూ ఉంటాయి. ఒక తరం కూడు, గూడు, గుడ్డ నినాదం ప్రజల ఆదరణ పొందింది. తర్వాత మెరుగైన కూడు, మెరుగైన గూడు, మెరుగైన గూడు నినాదం ఇవ్వాల్సిన భౌతిక స్థితి ఏర్పడితే పాత నినాదం ద్వారా ప్రజాదరణ సాధ్యం కాదు. తర్వాత కరంటు, రోడ్లు, నీళ్లు రగిలే సమస్యలుగా (బర్నింగ్ ఇష్యూస్) మారిన స్థితిలో పాత నినదాలిస్తే ప్రజాదరణ పొందలేరు. నిత్యం ప్రజావసరాలతో పాటు ప్రజాకాంక్షలు మారతాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం పట్ల నినాదం నేడు ప్రజాదరణ పొందే కొత్త స్థితి ఏర్పడితే అదే ప్రాసంగీకత కలిగి ఉంటుంది. ఏడెనిమిది దశాబ్దాల క్రితం విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేసే అవసరం లేని భౌతికస్థితి ఉండేది. నేడు కొత్త జబ్బుల్ని తెప్పించడమే కాక వారి జేబులు కొల్లకొట్టే కార్పోరేట్ వ్యవస్థ సామాన్య జనజీవితాల్ని శాసిస్తోంది. ఏ నినాదాలు నేడు ప్రజాదరణ పొందేదీ, ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న శక్తులు అంచనా వేసుకోవాలి. ప్రజారోగ్యాలతో చెలగాటమాడే కార్పోరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రజారోగ్య, ప్రభుత్వ వైద్య పరిరక్షణ కోసం నినాదం ఓ ఉద్యమ కార్యాచరణ ధరించే అవకాశం ఉంది. సృజనాత్మక దృష్టితో రూపొందించే సజీవ పోరాట నినాదాల్లో ఇదొక శక్తివంతమైనది కావచ్చేమో!
గమనిక: నేను వైద్యుణ్ణి కాదు. నన్ను ఆదర్శంగా తీసుకొని ఎవరూ మెడికేషన్ ఆపరాదని సూచిస్తున్నా. మెడికేషన్ ఆపిన తర్వాత అనేక మెరుగైన ఫలితాల్ని సాధించినా BMI ప్రమాణాల ప్రకారం అండర్ వెయిట్ లోకి వెళ్ళా. నా ఆరోగ్యం దెబ్బతిన్న భావం కలగకపోగా "వెయిట్ లాస్ బట్ హెల్త్ ప్లస్" భావమే మనస్సులో సంతృప్తి ఉంది. ఐనా ఏ లోపాలున్నాయో, ఏ పొరపాట్లను ఇంకా దిద్దుబాటు చేసుకోవాలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రయత్నిస్తా.