యాప్ టచ్ చేస్తే చాలు పని మనిషి ప్రత్యక్షం...
అర్బన్ కంపెనీ ‘ఇన్ స్టా హెల్ప్' విప్లవాత్మకమా, కొత్త దోపిడీయా;
-సుదీప్ సుధాకరన్
"యాప్ లోకి వెళ్లి క్లిక్ చేస్తే చాలు ..15 నిమిషాల్లో ఇంటి పని మనిషి ప్రత్యక్షం" ఇదేంటి అనుకుంటున్నారా? ఈ ప్రకటనే అందరినీ ఆకర్షిస్తోంది. కార్పోరేట్ వ్యాపారానికి ఏదీ అనర్హం కాదన్నట్లు ఇంటి పనిమనుషులు ఆ జాబితాలో చేరిపోయారు.
భారతదేశంలో అతిపెద్ద గిగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన అర్బన్ కంపెనీ ఇటీవల తాజా ఆఫర్‌తో ఈ బిజినెస్ లో అడుగుపెట్టింది. ఇన్ స్టా హెల్ప్ పేరిట మొదలైన ఈ ఫ్లాట్ ఫాం ను ముందుగా ముంబైలో పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించింది.
"గంటకు కేవలం 49 రూపాయలే, ప్రారంభ ధరకే వంట , ఇల్లు తుడవడం , గిన్నెలు శుభ్రం చేయడం వంటి ఏ పనులైనా చేసేస్తారు. ఫోన్ చేసినా , ఆదే ఆర్డర్ పెట్టినా పావు గంటకే మా కంపెనీ నుంచి మనిషి ఇట్టే వాలిపోయాడు" ఈ ప్రకటనలతో మార్కెట్ లోకి వచ్చిన అర్భన్ కంపెనీ ఎందరిని ఆకట్టుకుంటోందో గాని, అన్ని విమర్శలను మూటగట్టుకొంటోంది. ఇది గృహ వినియోగదారులలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందన్న కంపెనీ మాటలెలా వున్నా, సాంప్రదాయంగా సాగుతూ వస్తున్న పని మనుషుల వ్యవస్థకు ఇది గొడ్డలి పెట్టుఅన్న వాదన బలంగా వినిపిస్తోంది. అది నిజం కూడా. అయితే చట్టపరంగా, న్యాయబద్దంగా తాము వినియోగదారులకు మంచి సేవలు అందిస్తామని కంపెనీ చెబుతోంది.ముంబైలో ఈ ప్రాజెక్టు విజయం సాధిస్తే దేశ వ్యాప్తంగా విస్తరించడానికి అర్బన్ కంపెనీ సిద్ధంగా వుంది.ఇప్పటికే వృత్తి పని కార్మికులను కూడా తమ బిజినెస్ ప్లాన్ లో భాగం చేసుకున్న అర్బన్ కంపెనీ దృష్టి ఇప్పుడు ఇంటి పనిమనుషులపై పడింది.
సాంప్రదాయ పనికి చేటు తెస్తారా ?
భారతదేశంలో ఇంటి పనిమనుషులు చాలా కాలంగా అనధికారికంగా తక్కువ వేతనాలు, చట్టపరమైన రక్షణ లేకుండా నడుస్తున్న గిగ్ వ్యవస్థ.
ఇంటి పని మనుషులు అసంఘటిత రంగంలో భాగంగానే ఉన్నారు...అంటే వారికి ఉద్యోగ భద్రత లేదు.అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008 ద్వారా ఈ రంగంలో పనిచేసేవారికి మెరుగైన జీవితం అందించడానికి , జీవనానికి భద్రత కల్పించడానికి ప్రయత్నించినా అది అంతగా ఫలించలేదు.ఈ విషయంలో విఫలం అయింది.అయితే నమ్మకస్తులుగా రెండు, మూడు ఇండ్లలో పనిచేసుకుంటూ నిర్దిష్టంగా నెలవారీ వేతనం పొందుతూ వీరంతా జీవనం సాఫీగా గడుపుతున్నారు.
గృహలలో పనిచేసే కార్మికులలో ఎక్కువ మంది అణగారిన సమాజం నుంచి అంటే దళిత , ఆదివాసీలు ఇతర వర్గాలకు చెందినవారే. వలస కార్మికులుగా పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకూ వలస వచ్చిన వారే.
వారంతా వివక్ష , దోపిడీకి గురవుతున్నా, తమకు అనుకూలంగా పనులు చేసుకుంటూ వెళుతున్నారు.
ఇప్పుడు అర్బన్ కంపెనీ ఇంటి పని వ్యవస్థను ఆన్ డిమాండ్ గిగ్ సర్వీస్‌గా మార్చడం ద్వారా, అభద్రతను మరింత పెంచుతూ , ప్రమాదకర స్థితిలోకి ఆ రంగాన్ని మరింతగా తీసుకు వెళుతోందని భావిస్తున్నారు.
మండిపడుతున్న కార్మిక సంఘాలు
అర్బన్ కంపెనీ ఇంటి పనిమనుషుల రంగంలోకి రావడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. గృహ కార్మికుల హక్కుల సంఘం(DWRU),స్త్రీ జాగృతి సమితి నాయకులు ఈ వ్యాపార దృక్పథం పై పలు సందేహాలు వ్యక్తంచేశారు. గృహ కార్మికుల శ్రమను దోచుకోవడానికి పెద్ద కుట్రగా అభివర్ణించారు.గంటకు 49 రూపాయల వేతనం చట్ట ప్రకారం చెల్లుతుందా అని ప్రశ్నించారు. కార్మికుల ఉద్యోగ భద్రత , ప్రయోజనాలు, చట్టపరమైన రక్షణను కంపెనీ తొలగించిందని ఆందోళన వ్యక్తంచేశారు.
కంపెనీ మర బొమ్మలు గా కార్మికులు!
అర్బన్ కంపెనీ నిర్దేశించిన నమూనాలో కార్మికుడి లాజిస్టిక్స్ కూడా ప్రధాన అంశం. నిర్ణీత ప్రదేశానికి కార్మికుడు, కార్మికురాలు 15 నిమిషాలలో ఎలా చేరుకోవాలన్నది ఆందోళన కల్గించే అంశమే. నగరాలలో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో వుంచుకుంటే అది కార్మికులపై తీవ్ర ఒత్తిడిని గురిచేస్తుంది. రవాణా భారమవడం, ప్రమాదాలు పొంచి వుండటం కూడా పరిగణలోకి తీసుకోవాలి. వినియోగదారుల నుంచి గంటకు 49 రూపాయల ఫీజు వసూలు చేసే సదరు కంపెనీ ఫ్లాట్ ఫాం ఫీజు మినహాయించి , కార్మికులకు చెల్లించేది తక్కువగా వుంటుంది. అందుకే ఎక్కువ ఇళ్లలో పని కోసం ఎక్కువ ఆర్డర్ల కోసం ఎదురు చూపులలో మానసిక వత్తిడి కి గురవుతారు. ఇతర గిగ్ వర్కర్ల లాగా అల్గొరిథమిక్ నిర్వహణ, నియంత్రణ కు లోనయ్యే పరిస్థితి వుంటుంది. వారి పనితనాన్ని వినియోగదారులు ఇచ్చే రేటింగ్ ఆధారంగా కొలుస్తారు కాబట్టి, రేటింగ్ కోసం తాపత్రయ పడాల్సి వస్తుంది. ఒక్కోసారి వినియోగదారులు ఇచ్చే రాంగ్ రివ్యూలు, నిజమైన అవకాశాలు తగ్గేలా చేస్తాయి. రివ్యూ లు, రేటింగ్ ల ఆధారంగా పని నుంచి ముందస్తు నోటీసు లేకుండా తీసివేసే వెసులుబాటు కంపెనీ కి వుంటుంది. దాంతో రెంటికీ చెడ్డ రేవడిలా కార్మికుల జీవనమే తల్లకిందులయ్యే సందర్భాలు వస్తాయి. మొత్తంగా ఇందులో చేరిన కార్మికులు కంపెనీ చేతిలోని మర బొమ్మలుగా మారి, ఆ కంపెనీ ఉన్నతికి దోహదం అవుతుంది తప్ప, కార్మికులకు అదనంగా లభించే ప్రయోజనం వుండదు.
దేశంలో గిగ్ ఫ్లాట్ ఫామ్ ల నిబద్ధత ఎంత?
తక్కువ సమయంలో తక్కువ ధరలకు ఇంటి ముందు వాలతామనే గిగ్ యాప్ సంస్కృతికి కొందరు మద్దతిస్తున్నా, ఆయా కంపెనీలు సజావుగా నడిచే పరిస్థితి మన దేశంలో లేదు. కేవలం సంపన్న వర్గాలే టార్గెట్ కాకుండా మధ్య తరగతిని దృష్టిలో వుంచుకొని కంపెనీ మొదట్లో, తక్కువ ధరలూ ఆఫర్లు అందిస్తుంటాయి. ఆ తరువాత కంపెనీపై ఆర్థిక ప్రభావం, ఉద్యోగుల జీతాల పెరుగుదల , నిర్వహణ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో వెనుకడుగు వేస్తున్నాయి. అటువంటిది ఇంటి పని కార్మికుల సర్వీస్ అంత ఆషామాషీ వ్యవహారం కాదని కొందరు వాదిస్తున్నారు.
కార్మికుల భద్రత.. మరెన్నో అనుమానాలు
కార్మికులు ఇండ్లలో పని చేయడానికి వెళ్లినప్పుడు వారి భద్రత మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా మహిళా కార్మికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్లలో వేధింపుల నుంచి కార్మికులను రక్షించడానికి మార్గదర్శకాలు వున్నాయా? POSH చట్టం ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూడా తప్పనిసరి. గృహ కార్మికులు కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిధిలోకి వస్తారా రారా అన్నది తేల్చాలి. లేకుంటే వారిని ఆ పరిధిలోకి తేవాలి.మరో అతి ముఖ్యమైన సమస్య ఫ్లాట్ ఫామ్ ఆధారిత పనిలో వున్న వారిని కార్మిక చట్టాల పరిధిలోకి అనుమతించని కారణంగా వారంతా కనీస వేతనాలు, పీఎఫ్, గ్రాడ్యుటీ, కార్మిక బీమా సౌకర్యాలను పొందలేరు. కంపెనీలు కూడా ఆ బాధ్యతలు, చెల్లింపుల నుంచి తప్పించుకుంటున్నాయి.
ప్రభుత్వ చట్టాలు మారాలా..?
ప్రస్తుత కార్మిక చట్టాలు ఒక ప్రదేశంలో వుండి, ఒక యాజమాన్యం కింద పనిచేసే కార్మికులను ఉద్దేశించి చేసినవి. ప్రస్తుతం ప్రభుత్వాలు గిగ్ కార్మికులను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాలి. కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని ప్రకటించినా, యాప్ ప్రమాణిత ఫ్లాట్ ఫామ్ ల ఆధారంగా పనిచేసే వర్కర్లను దృష్టిలో ఉంచుకోవాలి.
ఈ పరిణామాల నేపధ్యంలో ఆర్బన్ కంపెనీ ఇంటి పనిమనుషుల కోసం ఇన్ స్టా హెల్ప్ పేరిట మొదలు పెట్టిన ఫ్లాట్ ఫాం విమర్శల పాలవుతోంది. అనేక సమస్యలు ఎదురయ్యే పరిస్థితుల నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఆలోచించాలి, తగిన చర్యలు చేపట్టాలి.1948 కనీస వేతన చట్టం, 1971 కాంట్రాక్టు లేబర్ చట్టం, ఇతర కార్మిక చట్టాలు తెలంగాణ, తెలుగు రాష్ట్రాల పరిధిలో అమలవుతున్నా, ఇంట్లో పనిమనుషులుగా చేసేవారు, ఎలాంటి రాతపూర్వకంగా ఎలాంటి ఒప్పందం యాజమానితో చేసుకోరు కాబట్టి, వారికి చట్టపరంగా ఎలాంటి రక్షణ దొరకడం లేదు. కర్ణాటక వంటి రాష్ట్రాలు గిగ్ వర్కర్ల కోసం 2024 చట్టం చేసినా, ఈ పనిమనుషులు అందులోకి రావడంలేదు. అయితే వీరికి అందేవల్లా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రమే. ప్రస్తుతం ఆర్బన్ కంపెనీ ఒక ప్రయోగం చేసింది కాబట్టి యాప్ సంస్థల నుంచి ప్రభుత్వాలు పనిమనుషుల వివరాలు సేకరించి చట్టాల పరిధిలోకి వారినీ తీసుకువస్తే భవిష్యత్ లో మంచి జరిగే అవకాశాలు వున్నాయి.
(అనువాదం: వెలది. కృష్ణ కుమార్)