సమ్మర్‌లో చల్లగా.... చలిలో వెచ్చగా

ఈ ఇంట్లోకి అడుగు పెడితే అమ్మ ఒడిలోకి చేరిన ఫీల్ ఉంటుంది.

Update: 2025-09-18 12:53 GMT

ఎర్రమట్టితో గోడలు నిర్మించి మట్టి ,ఆవుపేడ,గడ్డి కలిపిన పూతను గోడలకు వేశారు. ఈ ఇంటిలోకి అడుగు పెట్టిన మాకు మట్టి వాసనతో ఆహ్లాదంగా ఉంది. సమ్మర్‌లో కూల్‌గా శీతాకాలంలో వెచ్చగా ఉంటుందని దానిని నిర్మించిన శ్రవణ్‌ చెప్పారు. మనం ఊపిరి పీల్చుకున్నట్టే ఈ మట్టి గోడలు కూడా బయట గాలిని పీల్చుకొని లోపల ఉన్నవారికి చల్లదనం ఇస్తాయి. ఇంట్లోకి రాగానే ఫ్యాన్‌ , లైట్‌ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అని ఆయన లోపల గదులు చూపిస్తూ చెప్పారు. వెదురు పై పరిశోధన చేసి , తెలంగాణలోని, మల్కాపూర్‌ (యాదాద్రి భువనగిరి జిల్లా) లో వెదురు యూనిట్‌ పెట్టారు. అక్కడేమి జరుగుతుందో చూద్దాం...

ఇండోనేషియాలోని బాలిలో వెదురుతో తయారు చేస్తున్న వైవిధ్యమైన ఫర్నిచర్‌ చూసినపుడు శ్రావణ్‌ కుమార్‌కు వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే వెదురిల్లు కాన్సెప్ట్‌. ఆ తరువాత నాణ్యమైన వెదురు కోసం అస్సాం వెళ్లినపుడు వెదురు బొంగులతో అధిరి పోయే కళారూపాలు తయారుచేసే సృజనకారులను చూసి, వారి కళను,పనితనాన్ని పరిశీలించారు.

వెదురు ఇల్లు నిర్మాత శ్రావణ్‌

అక్కడ అనేక రకాల వెదురు ఉత్పత్తులతో ఏకంగా అక్కడ భారీ మాల్స్‌ చూశాక శ్రావణ్‌ ఆలోచన మారిపోయింది.

అరుదైన వెదురు కళను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భావించాడు.

 అరుదైన వెదురు ఇల్లు

హైదరాబాద్‌కి చెందిన శ్రావణ్‌ కుమార్‌ చివుకుల సివిల్‌ ఇంజనీర్‌. అడ్వాన్స్‌కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాడు. దానిలో భాగంగా ఫారెస్ట్‌ ఏరియాలో వెదురు వెరైటీల పై అధ్యయనం చేసి ‘వుయ్ లివ్‌ ఇన్‌ బాంబూ’ (We live in Bamboo ) సంస్ధను ఏర్పాటు చేసి, తెలంగాణలోని మల్కాపూర్‌ (యాదాద్రి భువనగిరి జిల్లా) లో వెదురు ఫర్నిచర్‌ తయారీ యూనిట్‌ పెట్టారు.

‘‘ కాంక్రీట్‌ నిర్మాణాల వల్ల మనం ప్రకృతి నుండి దూరంగా వెళ్లిపోతున్నాం. ఇలాంటి పరిస్ధితుల్లో సహజసిద్ధం అయినది ఏదైనా ఉందంటే అది వెదురు మాత్రమే. ప్రపంచ వ్మాప్తంగా తీవ్రంగా పెరుగుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా నిర్మాణరంగలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సహజంగా దొరికే మెటీరియల్‌ వాడటం వల్ల పర్యావరణ పరిరక్షణ తో పాటు భూతాపాన్ని తగ్గించ వచ్చు. ఇలా వెదురు, మట్టి తో మాకు సావాసం మొదలైంది. వెదురుబొంగు మా చేతికి వచ్చిన వెంటనే, సెలయేరు పక్కన అందమైన పొదరిల్లుగా, ఫర్నిచర్‌గా ,ఫామ్‌ హౌస్‌గా, కౌషెడ్‌గా ఇలా ఎన్నో రకాలుగా రూపాంతరం చెందుతుంది!’’ అస్సాం కళాకారులతో కలిసి ఫర్నిచర్‌ తయారు చేస్తూ అన్నాడు శ్రావణ్‌.

 వెదురు ఫర్నిచర్‌ తయారీలో అస్సాం కళాకారులు

12 మంది అస్సాం సంప్రదాయ చేతివృత్తి నిపుణులకు ఉపాధి కల్పించి వారితో వివిధ కళాకృతులను, వెదురుకి మట్టిని అనుసంధానం చేసి ఎకో గృహాలు( eco-friendly house ) కడుతున్నారు. అంతే కాదు, ఎవరైనా సరే స్వయంగా తమ ఇల్లును ఈజీగా సొంతంగా కట్టుకునే అవగాహన కూడా కల్పిస్తున్నారు.

వెదురులో 1400 జాతులు ఉంటాయి. అవి ప్రాంతాలను బట్టి, భూసారాన్ని బట్టి పెరుగుతాయి. ప్రతీ జాతి విలువైనదే.

అమ్మ ఒడిలా

‘వియ్‌ లివ్‌ ఇన్‌ బాంబూ’ ప్రధాన ఉద్దేశం వెదురుతో అందమైన ఇల్లు .వెదురుతో బుట్టలు, తట్టలకు మాత్రమే పరిమితం కాకుండా బాంబూ హౌసింగ్‌ ,ఫర్నిచర్‌ ని ఎంపిక చేసుకున్నాం.

200 చదరపు గజాల్లో ఒక మోడల్‌ బ్యాంబూ హౌస్‌, మరో మట్టి ఇల్లును హైదరాబాద్‌ శివారులోని కొంపెల్లలో నిర్మించారు. క్యాబిన్స్‌, ఫాల్‌ సీలింగ్స్‌, మెట్లు అన్నీ వెదురు, మట్టితోనే . సిమెంట్‌, ఐరన్‌, ఇసుక అస్సలు వాడరు.

పై కప్పును తడకలు, గడ్డితో నిర్మించారు. సిమెంట్‌ ,ఇనుము నిర్మాణం వేడిని ఆకర్షిస్తుంది. కానీ వెదురు చల్లగా ఉంటుంది. మెయింటెనెన్స్‌ పెద్దగా వుండదు. పైగా వెదురిళ్లతో పర్యావరణానికి బోలెడంత మేలు. ఎర్రమట్టితో గోడలు నిర్మించి మట్టి ,ఆవుపేడ,గడ్డి కలిపిన పూతను గోడలకు వేస్తాం. ఈ ఇంట్లో సమ్మర్‌లో కూల్‌గా శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. మనం ఊపిరి పీల్చుకున్నట్టే ఈ మట్టి గోడలు కూడా బయట గాలిని పీల్చుకొని లోపల ఉన్నవారికి చల్లదనం ఇస్తాయి. ఇంట్లోకి రాగానే ఫ్యాన్‌ , లైట్‌ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సహజమైన వెలుతురు, చల్లదనం ఉంటుంది. కరెంట్‌ బిల్లు చాలా వరకు తగ్గిపోతుంది. ఈ ఇంటిలోకి అడుగు పెడితే అమ్మ ఒడిలోకి చేరిన ఫీలింగ్‌ కలుగుతుంది. 80 ఏండ్లవరకు చెక్కు చెదరదు. వీటిని కట్టడం కంటే కూల్చడమే ఎక్కువ శ్రమ. ’’ అన్నాడు తాము నిర్మించిన బాంబూ హౌస్‌ మిద్దె మీదకు తీసుకొని వెళ్తూ.

పర్యావరణ హితంగా

వెదురు ఇల్లు కేవలం అలంకరణ కోసం కాకుండా పర్యావరణ హితంగా నగరాల్లో ఎలా ఉపయోగించుకోవాలి అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు.

ఇంటి నిర్మాణానికి స్క్వేర్‌ ఫీట్‌ కు 900 నుండి 1100 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇదంతా నేచురల్‌ మెటీరియల్‌. రెండు డిగ్రీల వరకు చల్లగా ఉంటుది. వెదురులో సిలికా ఉంటుంది. వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకునేలా వెదురుకు ప్రత్యేకంగా కెమికల్స్‌ పూస్తారు. దీని కోసం పెద్ద చెరువును కూడా నిర్మించారు. రక్షణ గురించి భయం లేదు. బయటి నుంచి పెయింటింగ్‌ వేస్తారు. మొత్తమ్మీద ఆశ్రమం లాంటి అందమైన ఇల్లుని 90 రోజుల్లో కట్టించి ఇస్తామంటున్నారు శ్రావణ్‌ బృందం.

ఇది అసంఘటిత రంగం కాబట్టి భవిష్యత్తులో వెదురు వాడకాన్ని పెంచాలన్నదే ఇతని ధ్యేయం. అస్సాం నుండి 11 రకాల వెదురును రప్పించి దానితో 580రకాల ఫర్నిచర్‌ ని చేస్తున్నారు.

‘‘ వెదురు ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అవగాహన లేకపోవడం వల్ల వెదురును సరిగా ఉపయోగించుకోవడం లేదు. వెదురిళ్లు తో పాటు పశువుల శాలలను కూడా నిర్మిస్తున్నారు. వినియోగదారులు చాలా సంతృప్తిగా ఉన్నారు ’’ కొంపల్లిలో కొత్తగా నిర్యించిన కౌ షెడ్‌ని చూపిస్తూ శ్రావణ్‌.

ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌ కాబట్టి ఇప్పటి వరకు నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ లేదు. వీరి దగ్గర అస్సాం నుండి వచ్చిన కళాకారులకే కాక పరోక్షంగా మరి కొందరికి ఉపాధి దొరుకుతోంది. వెదురు ఉత్పత్తితో ముడిపడి ఉన్న వాళ్లందరికీ లాభం చేకూరుతుంది.

రీసైక్లింగ్‌ యూనిట్‌ 

బాంబూ హౌజ్‌ తో పాటు ఏడాది కిందటే ఒక రీసైక్లింగ్‌ యూనిట్‌ ప్రారంభించారు. కారు టైర్లు ఇతరత్రా వేస్టేజీ తీసుకొని వాటితో కుర్చీలు తయారు చేస్తున్నారు పార్కులకు, కార్పొరేట్‌ ఆఫీసులకు ఇస్తున్నారు. ఇలా రీ సైక్లింగ్‌ కాన్సెప్ట్‌ని ఎగ్జిబిషన్‌లలో ప్రమోట్‌ చేస్తున్నారు.

ఇప్పటి వరకు అడవిలో పెరుగుతున్న వెదురును రైతులు తమ భూముల్లో సాగు చేసేలా శ్రావణ్‌ ప్రోత్సహిస్తున్నాడు. ఎకరంలో వెదురు సాగుకు 25వేల వరకు ఖర్చు అవుతుంది.వ ూర్కెట్‌లో డిమాండ్‌ బాగా ఉండటం ,చీడ పీడల బెడద లేక పోవడం వల్ల ఈ సాగు లాభదాయకంగా ఉంటుందని వారికి అవగాహన కల్పిస్తున్నాడు.

వియ్‌ లివ్‌ ఇన్‌ బాంబూ’ సంస్ధ తయారు చేస్తున్న వివిధ రకాల ఫర్నిచర్‌.

ప్రపంచమంతా కాంక్రీట్‌ జంగిల్‌ గా మారుతున్న సమయంలో కలప, మట్టి పరిమళమే కరువైంది. అందుకే మరిచిపోతున్న పల్లెను నగరాల్లో ప్రతిష్టించే గొప్ప సామాజిక బాధ్యతను తలకెత్తుకుంది ‘వియ్‌ లివ్‌ ఇన్‌ బాంబూ’ సంస్ధ. ఈ ఆలోచన వెనుక బిజినెస్‌ తో పాటు కొందరికి ఉపాధి, అరుదైన పర్యావరణ హితం కూడా ఉంది. వెదురు ఇల్లు సొంతంగా నిర్మించుకోవాలన్నా , మీరుకోరుకున్న తీరులో కట్టి ఇవ్వాలన్నా శ్రావణ్‌ని ( V liv in Bamboo- Ph - 9703-226266 ) సంప్రదించండి!

ఎదురు లేని వెదురు 

1, సాధారణ చెట్ల కంటె వెదురు కార్బన్‌ డైఆక్సైడ్‌ని ఎక్కువ పీల్చుకొని 35శాతం ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

2, వెదురు ఇల్లు జీవితకాలం ఉపయోగించిన వెదురు నాణ్యత, నిర్మాణ పద్ధతుల పై ఆధారపడి ఉంటుంది.

3, వెదురు అత్యంత మన్నికైన కలప, తెగుళ్లు నిరోధకతకు ప్రసిద్ధి చెందింది.

4, వెదురు ఇంటిలో రెండు డిగ్రీల వరకు చల్లగా ఉంటుది. వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకునేలా వెదురుకు ప్రత్యేకంగా కెమికల్స్‌ పూస్తారు.

5, ఒక సారి నిర్మించిన వెదురు ఇల్లును అవసరమైన చోటుకు సుళువుగా తరలించ వచ్చు.

బొంగులో ఇల్లు! 

ఈ ఇంట్లో సమ్మర్‌లో కూల్‌గా శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. మనం ఊపిరి పీల్చుకున్నట్టే ఈ మట్టి గోడలు కూడా బయట గాలిని పీల్చుకొని లోపల ఉన్నవారికి చల్లదనం ఇస్తాయి. లోపలకు రాగానే ఫ్యాన్‌ , లైట్‌ అవసరం ఉండదు. సహజమైన వెలుతురు, చల్లదనం ఉంటుంది. ఈ వెదురు ఇంట్లోకి అడుగు పెడితే అమ్మ ఒడిలోకి చేరిన ఫీలింగ్‌ కలుగుతుంది.

Tags:    

Similar News

ఆగస్టు నెల !