మోసం చేశావే మామిడీ!

మదనపల్లె చుట్టుప్రక్కల టమేటాలకు గిట్టుబాటు ధరలేక రోడ్లపై పారబోసేవారు ఈసారి హృదయవిదారకంగా రోడ్డుప్రక్కన మామిడిపళ్ళు దర్శనమిస్తున్నాయి. ఆ వేదన, దుఃఖంలో నుంచి;

Update: 2025-07-13 02:19 GMT

మధురమైన మామిడిపళ్ళు

రైతుల బ్రతుకులో

హాలాహలాన్ని నింపాయి!

తియ్యనైన బంగినపల్లి

కర్షకుల జీవితాల్లో

చేదువిషాన్ని ఒంపింది!

ఆదుకొంటాయనుకొన్న

నీలం తోతాపురులు

ఆశలపై నీళ్ళు చల్లేశాయి!

విరగకాసిన మామిడి

తనుకూర్చున్న కొమ్మను

తనే నరికేసుకొంది!

పథకాలు ఫ్రీబీల దెబ్బకు

రైతుకు కూలీలు దొరకక

పొలాలన్నీ తోటలైపోయాయి!

భవిషత్తుకు భరోసా అని

రైతులు కలలుకన్న పంట

మొదలుకే మోసం చేసేసింది!

లీజుకు తీసుకొన్న మనిషి

రేటులేదని అడ్వాన్స్ వదిలేసి

మొహం చాటేశాడు!

కూలీలు పెట్టుకొని కోసి

బాడుగబండిలో తోలితే

గిట్టుబాటుధర వెక్కిరిస్తోంది!

ఎవరికీ అక్కరలేని

కన్నబిడ్డల్లాంటి కాయలను

రోడ్లపై రైతుపారబోస్తున్నాడు!

మనసు విరిగిన రైతులు

మామిడి తోటలను

మొదలంటా నరికేస్తున్నారు!

భూమిని నమ్ముకొన్న రైతు

అప్పుల ఊబిలోపడి

భూస్థాపితమై పోతున్నాడు!

భూమిని అమ్ముకొనే రియల్టర్లు

మాయమాటలు చెప్పి

స్మశానాలూ అమ్మేస్తున్నారు!

రైతును రక్షించుకొంటేనే

రేపు మనం తినేందుకు

అసలేవైనా మిగిలుంటాయి!

రాక్షసబల్లిలాగా రైతుకూడా

అంతరించిపోతే ఇక

ప్రళయం తప్ప ఏముంటాయి!


-డాక్టర్ గోపికృష్ణ

(అమృత హాస్పిటల్, మదనపల్లె)

Tags:    

Similar News

సుమ గీతం

కదిలే దీపం