మా పెరట్లో పచ్చగా, మిసమిసలాడుతూ పెరుగుతున్న మా అమ్మ లాంటి నిమ్మ చెట్టు ఎట్టకేలకు తరలి వెళ్ళిపోయింది! దాని కొమ్మలు నరికి, చుట్టూ పాతుకుపోయిన వేళ్ళను నరికి, తల్లివేరుకు గోనిపట్టాలు చుట్టి, వ్యాన్ లో ఎక్కించి, తరలిస్తుంటే, మా అమ్మను అంతిమయాత్ర కు తరలిస్తున్నట్టు గుండె ఎంత బరువెక్కిందో! అది అలా వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయాం!
ఎంత కాపు కాసిందో ఈ నిమ్మ చెట్టు! ఎంత కాలంగా కాస్తోందో ఈ అమ్మ చెట్టు! ఆ నిమ్మకాయలను చాలా మందికి ఇచ్చాం. చివరికి హైదరాబాదుకు కూడా వెళ్ళాయి. నా మిత్రుడు వాకా ప్రసాద్ ఇంటికి కూడా వెళ్ళాయి. ‘‘నిమ్మకాయలు ఎంత బాగున్నాయబ్బా! మార్కెట్ లో కొనేటివి ఇట్లా ఉంటాయా! ఫ్రిజ్ లో పెడితే పదిహేను రోజులైనా చెడిపోకుండా ఉంటాండాయి. పిండితే ఎంత రసం వస్తాందో! ఏడ తెచ్చినావబ్బా!?’ అని మా అంజనా అంటా ఉంది’’ అని వాకా ప్రసాద్ చెపుతూ ఒకసారి ఆ చెట్టును చూసి ఎంత మురిసిపోయారో!
తరలించ క ముందు మా పెరటి లో నిమ్మ చెట్టు
అసలీ నిమ్మ చెట్టు మా పెరట్లోకి ఎలా వచ్చింది!? మేం తెచ్చి నాటిన చెట్టు కాదు. మమ్మల్ని ఏరి కోరి, మా పెరట్లో పడిమొలిచిన చెట్టది. ముప్ఫై ఏళ్ళ క్రితం అక్కడొక బత్తాయి(చీనీ) చెట్టును తీసుకొచ్చి నాటాను. పదిహేనేళ్ళు బాగా కాయలు కాసింది. ఆ తరువాత చాలాకాలానికి దాని పాదులోనే ఒక నిమ్మ చెట్టు పడిమొలిచింది. మేం నలభై ఏళ్ళు జీవించిన మా పాత పెంకుటింటి టాయిలెట్లకు ఎదురుగా, మేం ఎవరికీ కనిపించకుండా గుమ్మటంలా విస్తరించింది.
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు, ఏ కారణం చేతనో బత్తాయి చెట్టు కాస్తా ఒక్కొక్క కొమ్మా ఎండిపోతూ చచ్చిపోతోంది. ఆ పాదులోనే ఉన్న పచ్చటి నిమ్మ చెట్టు ఏపుగా పెరగడం మొదలు పెట్టింది. ఆరు నెలలకోసారి వేప పిండి తప్ప, దానికి ఏ ఎరువూ వేయలేదు. నీళ్ళు మాత్రం పట్టేవాళ్ళం. దాని పుణ్యాన మా ఇంట్లో నిమ్మకాయలే కాదు, ఎప్పుడూ దాని ఊరగాయ కూడా ఉండేది. మా అమ్మకు ఆ నిమ్మ చెట్టంటే ఎంత ఇష్టమో! రోజూ దాన్ని ప్రేమగా చూసేది. ఆ నిమ్మకాయ ఊరగాయను ఇష్టంగా వేసుకుని, పెరుగులో నంచుకు తినేది. అన్నం తినటం అయిపోయినా, పుల్లగా ఉన్న నిమ్మ ముక్కను చిన్న పిల్లలా నాకుతూ కూర్చునేది.
‘‘పెరట్లో నిమ్మ చెట్టుండకూడదు. అరిష్టం’’ అని కూడా కొందరు సింటిమెంట్లను మా పైన విసిరే సి తమ 'జ్ఞానాన్ని' ప్రదర్శించిన వారు లేక పోలేదు. వారి'జ్ఞానాన్ని' మేం లెక్క చేయలేదు.
నిమ్మ చెట్టున్న స్థలం మా తమ్ముడి వాటాలోకి వెళ్ళిపోయింది. పడమర వైపున గేటుకు అడ్డంగా నిమ్మ చెట్టు ఉందని, ఇల్లు కట్టడానికి ఆటంకంగా ఉందని మా తమ్ముడు దాన్ని కొట్టేయాలనుకున్నాడు. రెండున్నరేళ్ళ క్రితం పోయిన మా అమ్మ బతికుండగానే ఈ చెట్టును కొట్టేయాలంటే ఎంత బాధపడేదో! ఆ మాటే చెపితే వాకా ప్రసాద్ కూడా చాలా బాధపడిపోయారు. ‘‘మీరు కొట్టేయకండి. నేను తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర నాటతాను.’’ అన్నారు. ఆ మాట వినేసరికి నాకు, మా చెల్లెలికి ప్రాణం లేచొచ్చినట్టనిపించింది. మా అమ్మలాంటి నిమ్మ చెట్టు ఎక్కడో ఒక చోట బతికి పోతే చాలనుకున్నాం.
నేను, వాకా ప్రసాద్, ఇద్దరం కలిసి తిరుపతిలో ఉండే చీనీ నిమ్మపరిశోధనా కేంద్రం ప్రొఫెసర్ వద్దకు వెళ్ళాం. ‘‘నిమ్మ చెట్టు తరలించడానికి వీలవుతుందా?’’ అని అడిగాం. ‘‘మంచి వర్షాలు పడినప్పుడు, చుట్టూ రెండున్నర అడుగుల వెడల్పు, రెండున్నర అడుగుల లోతుగా గుంత తవ్వి, తల్లి వేరు దెబ్బతిన కుండా తీసుకెళితే బతకవచ్చు. తీసేముందు కొమ్మల్ని ఒక మేరకు కొట్టేస్తే చెట్టుకు తక్కువ నీరు అవసరం పడుతుంది.’’ అని చెప్పారు. పడి మొలిచింది, కాపు బాగా కాస్తుందని చెపితే, ‘‘మాకు కూడా కొన్ని కాయలివ్వండి. సీడ్ను డెవలప్ చేస్తాం’’ అన్నారు. ఈ సంభాషణ మూడు నెలల క్రితం జరిగింది.
నిమ్మ చెట్టు తీసేయడానికి మా తమ్ముడు తొందరపడుతున్నాడు. చెట్టు తరలించడానికి వాకా ప్రసాద్ వాయిదాలపైన వాయిదాలు వే స్తున్నారు. ‘తరలించామంటే, తరలించడం కాదు, అది బతికేలా తరలించాలి కదా’ అన్నది వాకా ప్రసాద్ మాట. నిజమే కదా! ఎట్టకేలకు చెట్టును తరలించడానికి తగిన మనుషులు దొరికారు. కిందటి ఆదివారం ఉదయం వచ్చారు. ఇద్దరే ఇద్దరు.
చెట్టుకు చివరి కాపు కూడా వాడుకున్నాం. చివరి కాపు ఎవరి కన్నా ఇవ్వాలంటే ఇవ్వబుద్ది కాలేదు. మళ్ళీ మా చెట్టు కాయలు దొరకవు కదా! అందుకని. కాపు అయిపోవడం ఆలస్యం, ఆ వెంటనే పూత పూసి, పిందె వేస్తుంది. ముందు రోజు చెట్టు పాదు నిండా రెండుసార్లు నీళ్ళు పట్టాం. చెట్టు నిండా చిన్న చిన్న నిమ్మ పిందెలు. దాని కొమ్మలు కొట్టేస్తుంటే ఎన్నిపిందెలు రాలిపోయాయో! వాటిని చూస్తే ఉసూరుమనిపించింది. మా నిమ్మ చెట్టు తో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే మాటలు చాలవు.
చెట్టు చుట్టూ తవ్వుతూ, వెడల్పుగా చొచ్చుకుపోయిన వేర్లను నరికేస్తూ, తల్లి వేరు దగ్గరకు వెళ్ళారు. తల్లి వేరు ఒకటొకటి నరికిన వెంటనే గొనెపట్టాతో చుట్టేసి, పురికోసతో కట్టేశారు. అలా తల్లివేరునుంచి వచ్చిన ప్రతివేరుకు గోనెపట్టా చుట్టేశారు. మొదలుతో పాటు పైకి తీశారు. గేటు దగ్గరకు వ్యాన్ వచ్చింది. ముగ్గురు కలిసి వ్యాన్ ఎక్కించారు. అది తరలిపోతుంటే, మా అమ్మను ఆస్పత్రికి తరలిస్తున్నట్టే అనిపించింది. మా అమ్మ ఆస్పత్రి నుంచి ఎన్ని సార్లు తిరిగి రాలేదు! కానీ, అమ్మ లాంటి నిమ్మ చెట్టు ఇక తిరిగి రాదు. అది తరలిపోయే వీధి చివరి వరకూ చూస్తూనే ఉన్నాం నేను, మా చెల్లెలు గాయత్రి.
వాకా ప్రసాద్ వాళ్ళింటిదగ్గర ముందుగానే గుంత లోడిపెట్టారు. చెట్టు రావడం ఆలస్యం, వెంటనే దాన్ని పాతిపెట్టారు. బతుకుతుందా, లేదా అన్న అనుమానం. నాకెంత టెన్షన్ గా ఉందో, వాకా ప్రసాద్ కు అంతకంటే ఎక్కువ టెన్షన్. చాలా శ్రద్ధగా నిమ్మ చెట్టుకు నీళ్ళు పట్టారు. వరుసగా రోజూ వర్షాలొస్తున్నాయి. ఎక్కడా వాడిపోలేదు. ఆకులు కొన్ని రాలిపోయినా, పచ్చగా కళకళలాడుతోంది. నిమ్మ చెట్టు బతికి పోయింది. చెట్లంటే నాకెంత ప్రేమో, వాకా ప్రసాద్ కు కూడా అంతే ప్రేమ. రోజూ దాని ఫొటోలు పంపుతూనే ఉన్నారు.
వాకా ప్రసాద్ ఇంటికి చేరిన నిమ్మ చెట్టు
నిమ్మ చెట్టు ఎలా ఉందో రోజూ దాని ఫొటోలు తీసి పంపు తున్నారు. "యశోద కృష్ణున్ని రోకలికి కట్టేసినట్టు, చెట్టుకు, పక్కన ఉన్న అటవీ సరిహద్దు దిమ్మెకు తాడు కట్టేశాను, మీ ఇంటికి వెళ్లిపో కుండా" అంటూ దాన్ని కట్టేసిన ఫోటో పెట్టారు. ఒక విషయం చెప్పడం మరిచాను. వాకా ప్రసాద్ ఇల్లు తిరుమల కొండ సాను వులలో, అడివిని ఆనుకుని ఉంటుంది. అడవికి వాళ్ళ ఇంటికి మధ్య అడవి జంతువులు రాకుండా ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ ఆవలి వరకు జింకలు, నెమళ్లు వస్తూనే ఉంటాయి. కను విందు చేస్తూనే ఉంటాయి.
ప్రేమగా తెచ్చుకున్న చెట్టుకు నీళ్ళు పడుతున్న వాకా ప్రసాద్
నిమ్మ చెట్టు తరలిపోయి ఈ శనివారానికి నాటికి వారం పూర్తవుతుంది. శుక్రవారం కూడా విడవకుండా వర్షాలు. ఎంత వర్షం వచ్చినా, ఎన్ని నీళ్ళు వచ్చి చేరినా నిమ్మకు నీరెక్కినట్టు, నిమ్మకు ఏమీ కాదు. పోయిన మా అమ్మ తిరిగి రాదు కానీ, అమ్మ లాంటి నిమ్మ చెట్టు ఎక్కడోక్కడ బతికిపోతోంది. అంతకంటే తృప్తి ఏముంటుంది చెప్పండి !