ఎలెక్టోరల్ బాండ్ల రద్దు తీర్పు ప్రాముఖ్యం వివరించిన ప్రొ. హరగోపాల్
ప్రభుత్వాల దృష్టిలో నల్ల ధనాన్ని అరికట్టడమంటే దాన్ని ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తమకివ్వచ్చు అనే. రాజకీయ పార్టీలకు ఇచ్చేది అంతా నల్లధనమే కదా!: ప్రొ. హరగోపాల్
By : రాఘవ
Update: 2024-02-17 13:02 GMT
ప్రొఫెసర్ జి. హరగోపాల్ తో రాఘవశర్మ ఇంటర్వ్యూ
ఎలెక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పౌరహక్కుల నాయకుడు ప్రొఫెసర్ జి. హరగోపాల్ ప్రశసించారు.భారత న్యాయవ్యవస్థపై అంతర్జాతీయంగా ఆరోపణలు వస్తున్న సమయంలో తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సి అవసరం వచ్చింది. ఒక దోషిగా న్యాయవ్యవస్థ నిలబడాల్సి వస్తున్న సమయంలో ఎలక్టోరల్ బాండ్లపైన సరైన తీర్పు ఇవ్వడం ఆహ్వా నించదగిన పరిణామం అని ఆయన వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు తీర్పు ఇది
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వెచ్చించడానికి ఎలక్ట్రోల్ ద్వారా కార్పొరేట్ సంస్థలు ఇచ్చే అంతులేని నిధుల తో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు జరప డం ప్రాథమిక హక్కుకు భంగకరం. ఏ రాజకీయపార్టీకి ఎవరు ఎంత మేరకు నిధులు ఇస్తున్నారనే సమాచారాన్ని రహస్యంగా ఉంచడం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని, రాజ్యాంగంలోని 19(1) ఏ ను అతిక్రమించడమేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ డి.వై. చంద్రచూడ్ ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా గురువారం నాడు తీర్పు వెల్లడించింది.ఈఈ తీర్పు నేపథ్యంలో శనివారం ఇచ్చిన టెలిఫోన్ జరిగిన ఇంటర్వ్యూ ఇది.
ఈ ఇంటర్వ్యూ పూర్తి భాగం.
ప్రశ్న : ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేయడం పై మీ స్పందన ఏమిటి?
హరగోపాల్ : సుప్రీంకోర్టు తీర్పును అందరూ ఆమోదించవలసిందే. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది. ఎన్నికల్లో డబ్బులు పంచడం పైన నియంత్రణ రావాలని కోరుకోవడాన్ని, ఎన్నికలకు విరాళాలు వసూలు చేసే విధానం పారదర్శకంగా ఉండాలని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొనడాన్ని సంతోషంగా ఆమోదిస్తున్నాను.
ప్రశ్న : ఎలక్టోరల్ బాండ్ల పథకం పైన 2018 లో స్టే విధించ డానికి తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం ఇప్పు డు ఎందుకు నిలుపుదల చేసింది?
హరగోపాల్ : న్యాయమూర్తి ఎవరైనప్పటికీ రాజ్యాంగం, న్యాయ ప్రమాణాల ప్రకారం ఎప్పుడైనా సరే న్యాయం ఒకే విధంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం న్యాయం అలా లేదు. న్యాయమూర్తిని బట్టి తీర్పులు ఉంటున్నాయి. చట్టాన్ని వ్యాఖ్యానించేటప్పుడు న్యాయమూర్తి ఎవరు? ఆయన ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వానికి ఎంత దూరంగా ఉన్నారు? ఎంత దగ్గరగా ఉన్నారు? అన్నదానిపై ఆధారపడి ఉంటోంది. ఎలక్టోరల్ బాండ్లపైన స్టే విధించడానికి మేం జోక్యం చేసుకోమన్న సుప్రీం కోర్టే ఇప్పుడు ఆ విధానాన్ని తిరస్కరించింది. అప్పుడు స్టే విధించడానికి తిరస్కరించిన న్యాయవ్యవస్థ ఇప్పుడు దాన్ని ఏకంగా రద్దు చేసింది. దీనిలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. 2012నాటి న్యాయవ్యవస్థతో పోల్చుకుంటే, ఇప్పటి నాయవ్యవస్థ ప్రతిష్ట క్రమక్రమంగా విశ్వసనీయతను కోల్పోతోందన్న విషయాన్ని నాయ్యమూర్తులు గమనించారు. మళ్ళీ తన విశ్వసనీయతను కాపాడుకోవాలన్న ఆకాంక్షే బహుశా ఈ తీర్పును ప్రభావితం చేసి ఉండవచ్చు.
ప్రశ్న: ఇంత వివాదాస్పదమైన పథకంపైన విచారణ జరపడానికి సుప్రీం కోర్టు ఇంత ఆలస్యం ఎందుకు చేసింది?
హరగోపాల్ : రాజకీయంగా ఇది చాలా సున్నితమైన విషయం. దేశాన్ని పాలిస్తున్న అధికార బీజేపీ అన్ని వ్యవస్థల్లో జోక్యం చేసుకుంటోంది. చివరికి న్యాయవ్యవస్థలో కూడా జోక్యం చేసుకోవడం విషాదమే. కానీ, న్యాయవ్యవస్థ కూడా ప్రభుత్వాన్ని కాదని చేసేదేమీ లేక, ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలనే ధోరణి కనిపిస్తోంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వెంకటాచలయ్య గారిచేత రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తున్నప్పుడు ప్రధాన మంత్రిగా పి.వి నరసింహారావు అక్కడే ఉన్నారు. ప్రమాణ స్వీకారం అయిపోయాక, ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మంచి సంబంధాలుండాలని జస్టిస్ వెంకటాచలయ్య గారితో ప్రధాని పి.వి. అంటే , జస్టిన్ వెంకటాచలయ్య గారు మంచి సంబంధాలు కాదు, సరైన సంబంధాలు ఉండాలి అన్నారు. ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు రాజ్యాంగ బద్దమైన సంబంధం ఉంటుందే కానీ, వ్యక్తిగత ఆత్మీయ సంబంధం కాదని వెంకటాచలయ్య గారి మాటల అర్థం.
ఇవాళ న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి స్నేహపూర్వక సంబంధాలుండాలనే మార్పు వచ్చింది. న్యాయవ్యవస్థలో ఈ మార్పు కొట్టవచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వంతో స్నేహంగా ఉన్న న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండ లేదు.
మన న్యాయవ్యవస్థపై అంతర్జాతీయంగా కూడ ఆరోపణలు వస్తున్న సమయంలో తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సి రావడంతో, ఒక దోషిగా న్యాయవ్యవస్థ నిలబడాల్సి వస్తున్న సమయంలో ఎలక్టోరల్ బాండ్లపైన సరైన తీర్పు ఇవ్వడం ఆహ్వా నించదగిన పరిణామం.
ప్రశ్న : ఏ రాజకీయ పార్టీకి ఏ కార్పొరేట్ సంస్థ ఎంత విరాళం ఇచ్చిందనే విషయాన్ని గోప్యంగా ఎందుకు ఉంచాలనుకున్నారు?
హరగోపాల్ : ఈ గోప్యత అనేది బీజేపీ వ్యవహారం, ప్రభుత్వ వ్యవహారం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక శాఖా మంత్రులుగా ఉన్న మన్మోహన్ సింగ్, చిదంబరం కార్పొరేట్ సంస్థలకు కావలసిన సదుపాయలను కల్పించారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా లొంగిపోయి, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షాలను బెదిరించే స్థాయికి పాలక పార్టీ వెళ్ళి పోయింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 22 కార్పొరేట్ సంస్థల అధిపతులతో రెండు గంటల వరకు చర్చలు జరిపారన్నది గోప్యంగా ఉంచారు. ఆ సమావేశంలో కనీసం ఆర్థిక శాఖ మంత్రి కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. కార్పొరేట్ సంస్థలు తమకు ఏం కావాలో, ఏవి అవసరమో ప్రధానితో చెప్పుకున్నారు.
కార్పొరేట్ సంస్థల అధిపతులు వ్యవసాయాన్ని కూడా కార్పొరేటీకరించాలని కోరి ఉంటారు. ఈ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ పరమైపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా కార్పొరేటుకు మద్దతు ఇచ్చింది కానీ, వాళ్ళకు పూర్తిగా లొంగిపోయి, వాళ్ళకు కావాల్సినవి ఇవ్వడాన్ని కొందరు అంతర్గతంగా వ్యతిరేకించారు. ఇవాళ ప్రధానిని వ్యతి రేకించడం అనేది ఆ పార్టీలో లేదు. ఎలక్టోరల్ బాండ్లలో తమ పార్టీకి ఎక్కువ ఇవ్వాలని, ప్రతిపక్షాలకు తక్కువ ఇవ్వాలని కార్పొరేట్లపైన ఒత్తిడి పెట్టారు. అందుకునే ఏ కార్పొరేట్ సంస్థ ఏ పార్టీకి ఎంత నిధులిచ్చిందనే విషయాన్ని గోప్యంగా పెట్టడానికే ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకొచ్చారు. ఆదాని వంటి వారు అధికార బీజేపీకి ఎక్కువ నిధులు ఇచ్చి ఉంటారనుకోండి. వారి దగ్గర అక్కడ డబ్బులు తీసుకుని, వాళ్ళకిక్కడ ప్రభుత్వం ఉపయోగ పడుతుంది. బీజేపీకి అత్యధికంగా నిధులు వచ్చాయి. దీంతో ప్రతిపక్షాలు మాట్లాడడానికి కూడా వెసులు బాటు వచ్చింది. ఆ అవకాశం లేకుండా గోప్యంగా పెడితే ప్రతిపక్షాలు అడగడానికి కూడా ఉండదు కదా!
కార్పొరేట్ సంస్థలకు, ప్రభుత్వానికీ మధ్య క్విట్ ప్రోకో ఉన్న విషయం బైటకు వస్తే అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అలా రహస్యంగా పెట్టింది. ఎలక్టోరల్ బాండ్ల విషయం తమ పరిధి కాదని, అది ఎలక్షన్ కమిషన్ పరిధి అన్న సుప్రీం కోర్టే దానిపైన ఈ రోజు తీర్పు చెప్పింది.
ప్రశ్న : ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం పారదర్శకంగా లేదని హక్కుల సంఘాలతో పాటు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా అభ్యంతరం చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు కొనసాగించింది?
హరగోపాల్: ఎలక్టోరల్ బాండ్ల పథకం పారదర్శకం ఎలా అవుతుంది? పారదర్శకం అన్న బీజేపీ వాదన ఎట్లా నిలుస్తుంది? వాళ్ళకు వీళ్ళు సాయం, వీళ్ళకు వాళ్ళ సాయం. ఇదే క్విడ్ ప్రో కో.
ప్రశ్న : 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కలిపి 8.7 బిలియన్ డాలర్లు ఖర్చుచేసినట్టు 'బ్లూమ్ బర్గ్' అనే సంస్థ నివేదిక వెల్లడించింది. ఈ వ్యయ భారం ఎవరిపైన పడుతుంది?
హరగోపాల్ : ప్రజల చైతన్య స్థాయి పెరుగుతున్న కొద్దీ, తమ వ్యవహారాలు ప్రజలకు తెలిసిపోతాయని భావించినప్పుడు, అధికార పార్టీ డబ్బులు ప్రవేశపెట్టి, దీనిలో పోటీ పడుతూ, సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రకటించింది. ఈ విధానం కూడా అవినీతిపరమైంది. రాజకీయ వ్యవస్థ అవినీతి కావడంతో ప్రజల్ని కూడా అవినీతికి అలవాటు చేస్తే, వారిలో ప్రశ్నించే నైతికత దెబ్బతింటుంది. అవినీతిపైన ప్రజలు కూడా గట్టిగా నిలదీయడానికి వెనకాడతారు. "మీరేమైనా డబ్బలు తీసుకోకుండా ఓట్లేశారా!?" అంటే ప్రజల దగ్గర సమాధానం లేదు. "అన్ని పక్షాల దగ్గరా డబ్బులు తీసుకోండి కానీ, మాకే ఓట్లేయండి." అనడం అన్లాఫుల్. ఓపెన్గా డబ్బులు తీసుకోండి. మా పార్టీకే ఓటేయండి. ఇది ఎన్నికల సారాన్ని, విలువలను పూర్తిగా దిగజార్చింది. ఎవరెంత డబ్బులు ఖర్చు చేస్తే వారు గెలుస్తారు.
ప్రశ్న : ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడం కోసమే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తెచ్చామని కేంద్రం అంటోంది. ఈ పథకం ద్వారా నల్లధనాన్ని ఏమైనా అరికట్టారా?
హరగోపాల్ : ఈ నల్ల ధనాన్ని అరికట్టడమంటే, వారి దృష్టిలో ఆ నల్ల ధనాన్ని ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తమకివ్వచ్చు అంటోంది. రాజకీయ పార్టీలకు ఇచ్చేది అంతా నల్లధనమే కదా! రాజకీయ పార్టీలకు ఇవ్వడం వల్ల అది తెల్లధనమైపోతోంది. ఇలా నల్లధనం తగ్గుతుందని, దాని ప్రభావం తగ్గిందని, అదిలా వైట్ మనీ అవుతోందని అంటున్నారు.
బ్లాక్ మనీని బ్యాంకులో పెట్టుకుని పన్ను చెల్లిస్తే సరిపోతుందని, అది వైట్ మనీ అయిపోతుందని అంటున్నారు. నల్లధనాన్ని తీసుకుని, తెల్లధనంగా ఇలా మారుస్తున్నామని అనడం చాలా హాస్యాస్పదం.
ప్రశ్న : మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును అధిగమించేలా చట్టం ఏమైనా తెచ్చే అవకాశం ఉందా?
హరగోపాల్ : ఏదైనాప్రయత్నం చేయచ్చుకానీ, ఎన్నికలు ఉన్నాయి కనుక అలా చేయడం చాలా కష్టం.
ప్రశ్న : ఇప్పటి వరకు 2024 ఎన్నికల కోసం ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను సుప్రీం కోర్టు రికవరీ పెట్టే అవకాశం ఏమైనా ఉందా?
హరగోపాల్ : సుప్రీం కోర్టు 2019 నుంచి వచ్చిన డబ్బు ఎంత వచ్చిందో ఎన్నికల కమిషన్ కు చెప్పమన్నదే తప్ప దాన్ని రికవరీ చేయమని చెప్పలేదు. ఎవరిచ్చారు, ఎంత డబ్బిచ్చారన్న వివరాలు పబ్లిక్ డొమైనలో పెట్టమన్నదే తప్ప స్వాధీనం చేసుకోమనలేదు. కార్పొరేట్ ఇచ్చిన విరాళాలు కనుక సుప్రీం కోర్టు రివకరీ వరకు పోలేదు.
2019 తరువాత వచ్చి న నిధుల వివరాలను మార్చి 31 లోపల చెప్పమందే కానీ, ఎక్కడి నుంచి వచ్చాయని కూడా చెప్పక పోవచ్చు.