First Cousin Marriage | బావమరదళ్ల పెళ్లి కుదరదంటోంది బ్రిటన్

'మావూరి మేనబావ, నన్నే మరిచావా' అని ఇకపై మేన బావ, మరదళ్ల సరసాలు, పెళ్లిళ్లు కుదరదంటోంది బ్రిటన్. నాగరిక దేశంలో ఇంకా ఈ పెళ్లిళ్లేమిటంటున్నారు ఓ ఎంపీ

Update: 2024-12-17 08:04 GMT

Image courtesy-The Economist

'మావూరి మేనబావ, నన్నే మరిచావా' అని ఇకపై మేన బావ, మరదళ్ల సరసాలు, పెళ్లిళ్లు కుదరదంటోంది బ్రిటన్ ప్రభుత్వం. ఈ మేనరికాలు, మేనరికపు పెళ్లిళ్లు మన దేశానికే కాదు చాలా దేశాల్లో ఉన్నాయి. భార‌త‌దేశంలో ప్రత్యేకించి ద‌క్షిణాదిన ఈ మేన‌రికాలు అన్ని కులాలు, మతాలలో ఉన్నాయి. ద‌క్షిణ భార‌తంలో అన్న‌ద‌మ్ముల పిల్ల‌ల‌ను అక్క చెల్లెళ్ల పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం, మేన‌కోడ‌లిని మేన‌మామ‌కు ఇచ్చి పెళ్లి చేయడం చాలా మామూలు విషయం. ఈ తరహా పెళ్లిళ్లను ఇంగ్లీషులో "క‌న్‌సాన్‌జీనియ‌స్ మేరేజెస్", "ఫస్ట్ కజిన్ మేరేజెస్" అంటుంటారు. ఈ రకమైన పెళ్లిళ్లకు చాలా కారణాలు ఉన్నాయి. ఎంత మేలుందో అన్ని సమస్యలూ లేకపోలేదు. జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయని శాస్త్రవేత్తలు ఏనాడో నిగ్గుతేల్చారు. ఇటీవలి కాలంలో చదువుకున్న వర్గాలలో మేనరికాలు తగ్గు ముఖం పట్టిన సంప్రదాయాల మాటున గ్రామీణ భారతంలో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడిది ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక దేశంగా భావించే బ్రిటన్ లోనూ పెద్ద బెడదగా మారిందట.
ఎందుకు మేనరికాలు వద్దంటారంటే..
హిందూ వివాహ వ్యవస్థలో మేనరికపు పెళ్లిళ్లు, దగ్గర బంధువుల మధ్య వివాహాలు సర్వసాధారణం. రక్త సంబంధీకులను వివాహం చేసుకుంటే పుట్టే పిల్లలు మానసిక వైకల్యంతో పాటు కొన్ని రకాల వారసత్వపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన వ్యాధులు వస్తాయి. ఇది ఎంత వరకు నిజం? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనే దానిపై హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో వైద్యునిగా ఉన్న డాక్టర్ చీకట్ల సురేష్ కుమార్ ఇలా చెబుతున్నారు.
"మేన‌రికాలు వ‌ద్ద‌ని నా సలహా. ఏ కార‌ణం చేతనైనా చేసుకుంటే పిల్ల‌లు పుట్టే ముందు.. లేదంటే.. గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు జెనిటెక్ కౌన్సిలింగ్‌కి వెళ్ల‌డం మంచింది. వాళ్లు జెనెటిక్ ఎగ్జామినేష‌న్ చేసి పుట్టే బిడ్డ‌ల‌కు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉందో వివ‌రిస్తారు" అని డాక్టర్ సురేష్ అభిప్రాయపడ్డారు.
దగ్గరి బంధువులను, రక్త సంబంధీకులను వివాహాం(Marriage) చేసుకోవాలనుకుంటే భవిష్యత్తులో వారికి పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాలని సూచించారు. ఇలాంటి వివాహాల కారణంగా పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నారు.
సాధారణంగా జన్యుపరమైన లోపాలలో కొన్నింటిని డామినెంట్ డిసీజెస్ గా, మరికొన్నింటిని రెసిసివ్ డిసీజెస్ గా వర్గీకరిస్తారు. మేనరికపు వివాహాలు చేసుకునేటప్పుడు దంపతులలో ఎవరికైనా ఏదైనా డామినెంట్ డిసీజ్ ఉంటే వారికి పుట్టబోయే పిల్లలకు అది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు.
ఇక రెసిసివ్ లోపాలు (నివారించదగిన వ్యాధులు) ప్రత్యేకంగా పైకి కనిపించవు. కానీ, ఈ జన్యుపరమైన లోపం వారిలో ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి పెళ్లి చేసుకునే బంధువుల అమ్మాయికి లేదా అబ్బాయికి కూడా ఆ రెసిసివ్ జన్యు లోపం ఉంటే మున్ముందు అది ముదిరిపోయే ఛాన్స్ ఉండవచ్చు.
మేనరికపు వివాహాలలో అమ్మయి లేదా అబ్బాయిలో పైకి చూడడానికి ఆరోగ్యంగా కనిపించినా, మిగతా వారికంటే వీరికి పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే వైద్యపరంగా డాక్టర్లు చాలా వరకు ఇలాంటి వివాహాలను జరిపించొద్దని చెబుతుంటారు.
మరి, పూర్వకాలంలో మేనరిక వివాహాలు జరిగాయి కదా? వాళ్లు బాగానే ఉన్నారు కదా అంటే.. అన్ని రకాల మేనరికపు పెళ్లిళ్లలో ఖచ్చితంగా ఇదే జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు. పేరెంట్స్ నుంచి పిల్ల‌ల‌కు, అలా త‌ర‌త‌రాల‌కు DNA వెళుతుంది. ద‌గ్గ‌ర సంబంధాల పెళ్లిళ్ల వ‌ల్ల జ‌న్యువుల‌ మ్యుటేష‌న్ త‌క్కువ‌గా ఉంటుంది. దాంతో వారికి వంశ‌ పారంప‌ర్య జ‌బ్బుల‌ను త‌ట్టుకునే శ‌క్తి త‌గ్గుతుంది. రెసిసివ్ జీన్స్ కారణంగా పుట్టే బిడ్డ అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జన్యుపరమైన లోపంతో పుడితే అప్పుడు లైఫ్ లాంగ్ ఆ బిడ్డతో బాధపడాల్సి ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు రక్త సంబంధిత వివాహాలకు దూరంగా ఉండడమే బెటర్ అని గుంటూరుకు చెందిన మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విజయ సారథి సలహా ఇచ్చారు.
మేనరికం, దగ్గర చుట్టాల మధ్య వివాహాలు చేసుకుంటే ఆ దంపతుల పిల్లలకు జన్యపరమైన వ్యాధులే కాకుండా కంటికి సంబంధించిన సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రి జరిపిన లేటెస్ట్ రీసెర్చ్‌లో తెలిసింది.
దంపతులలో వంశపారంపర్యంగా కంటి సమస్యలు ఉంటే పుట్టే పిల్లలకు కార్నియా, రెటీనా వంటి కంటి నరాలకు సంబంధించిన సమస్యలే కాకుండా ఐ ఫోకస్ తక్కువగా ఉండటం, కంటిలో ఒత్తిడి పెరగడం, రేచీకటి, పగలు సమయాల్లో సక్రమంగా చూడలేకపోవడం వంటి సమస్యల ముప్పు అధికంగా ఉందని అధ్యయనంలో తేలింది.
బ్రిటన్ పార్లమెంటులో ప్రైవేటు బిల్లు..

సరిగ్గా ఈ క్రమంలో బ్రిటన్ కి చెందిన ఒక కన్జర్వేటివ్ మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు రిచర్డ్ హోల్డెన్ పార్లమెంటులో ఓ బిల్లు ప్రతిపాదించారు. ఫస్ట్ కజిన్స్ (మేనమామ లేదా మేనకోడలు) మధ్య వివాహం జరిగితే పుట్టే పిల్లలకు జన్యుపరమైన లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందని, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఈ సాంప్రదాయాన్ని నిషేధించాలని కోరారు.
ఆయన ప్రతిపాదనను మరో ఇండిపెండెంట్ ఎంపీ ఇక్బాల్ మొహమ్మద్ వ్యతిరేకించారు. ఫస్ట్ కజిన్స్ మధ్య పెళ్లిళ్లను నిషేధించాలనడం అసమంజసమన్నారు. జరిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తే సరిపోతుందని వాదించారు.
సంబంధిత మంత్రిత్వ శాఖ దీనిపై ఓ వివరణ ఇస్తూ.. మేనరికాల వల్ల కలిగే నష్టాలపై నిపుణుల సలహా స్పష్టంగా ఉందని, దీనిపై ఇప్పటికే ఓ చట్టం ఉందని, దాన్ని ఆలోచన లేదని సూచనప్రాయంగా ప్రకటించింది. ఈ తరహా వివాహాలను నిషేధించేలా చట్టాన్ని తీసుకురావాలా వద్దా అనేదాన్ని ప్రభుత్వం తన ప్రాధాన్యతలను బట్టి పరిశీలిస్తుందని ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.
హోల్డన్ ప్రవేశపెట్టింది ప్రైవేటు బిల్లు. ఈ తరహా బిల్లు పాస్ కావాలంటే ప్రభుత్వ మద్దతు లేనిదే సాధ్యం కాదు.
బ్రిటన్ లో ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం తోబుట్టువులు లేదా రక్త సంబంధీకుల పిల్లలతో వివాహాలు నిషేధం. ఆ చట్టంలో ఎక్కడా ఫస్ట్ కజిన్స్ అనే మాట లేదు. దాన్ని చేర్చాలని హోల్డన్ కోరుతున్నారు.
బ్రిటన్ లోని కొన్ని తెగల్లో దాయాదుల మధ్య వివాహాలు ఉన్నాయి. అయితే వీటి సంఖ్య తక్కువే. ఐరిష్, బ్రిటిష్ పాకిస్థానీలు, బ్రిటిష్ ఇండియన్ల వంటి కొన్ని తెగల్లో 20 నుంచి 40% శాతం వరకు ఈ తరహా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. బ్రిటన్ కి సంబంధించి ఈ శాతమైనా ఎక్కువే అనేది హోల్డన్ వాదిస్తున్నారు. ఫస్ట్ కజిన్స్ మధ్య పెళ్లిళ్లు జరిగితే వారికి పుట్టే బిడ్డల్లో రుగ్మతలు ఎక్కువగా ఉంటున్నాయని, అదే ఏ సంబంధం లేని వ్యక్తుల మధ్య వివాహాలు జరిగితే ఈ రుగ్మతల శాతం తక్కువగా ఉంటోందని వివరించారు. ఈ తరహా పెళ్లిళ్లు మహిళల స్వేచ్ఛకు భంగకరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఫస్ట్ కజిన్స్ మధ్య పెళ్లిళ్లను నిషేధిస్తేనే మేలని వాదించారు.
ఫస్ట్ కజిన్స్ మధ్య వివాహం "ఆధునిక బ్రిటీష్ సమాజానికి అనుకూలమైంది కాదు" అని హోల్డన్ చెప్పారు. "ఇది మన సమాజం, మన ప్రజాస్వామ్య విలువలు, పునాదులకు సంబంధించింది" అన్నారు.
హోల్డన్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ మొహమ్మద్ ఏమన్నారంటే.. ఫస్ట్ కజిన్స్ మధ్య వివాహానికి సంబంధించిన ఆరోగ్య ప్రమాదాలు ఉన్న మాట నిజమే అయినా బలవంతంగా వాటిని నిషేధించడాన్ని తాను అంగీకరించనన్నారు.
దీనిపై డ్యూస్ బరీ ఎంపీ మాట్లాడుతూ ఈ తరహా పెళ్లిళ్లను నిషేధిస్తూ చట్టాల్ని తెచ్చి వాటిని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వానికి అప్పగించడం వల్ల పెద్దగా ఉపయోగముండదన్నారు. దానికి బదులుగా మహిళలకు అవగాహన కల్పించి వారి ఇష్టాఇష్టాలకే వదిలేయం మంచిదన్నారు. "మేనరికాలను నిషేధించి వాళ్ల మనోభావాలను దెబ్బతీసే బదులు కాబోయే జంటలకు అధునాతన జన్యు పరీక్షలను అందుబాటులోకి తేవడం మంచిది" అన్నారు ఆ పార్లమెంటు సభ్యుడు.
మొత్తం మీద మేనరికపు పెళ్లిళ్లు బ్రిటన్ పార్లమెంటును తాకాయి. ఇప్పటికిప్పుడు నిషేధిస్తూ చట్టం తేలేక పోవచ్చు గాని ఓ చర్చయితే మొదలైంది.
Tags:    

Similar News