బెడ్ రూమ్ (SUNDAY POEM)

ఇల్లు సీక్వెల్ -14 : పెళ్లికి ముందు ...పెళ్ళి తరువాత కొన్ని పడక గదులు పొందే పరిణామం మీద గీతాంజలి కవిత

Update: 2024-06-16 03:35 GMT


పెళ్లికి ముందు పడక గది-ఆమె అందమైన ఏకాంత స్థలం !

అక్కడ ఆమె మాస్క్ లేకుండా అమ్మ ఇచ్చిన ముఖంతో ఉండేది.

చిందర వందర బట్టలు.. పుస్తకాలు...

హర్బేరియం రికార్డులు...అల్లరిగా మోగే రేడియో!

గోడకి వేలాడే పర్సు.

పుస్తకాల మధ్య ప్రేమ లేఖలు..కొన్ని బర్త్డే కార్డులు ...

కొన్ని ఎండిన పూల రెక్కలు !

పూర్తి చేయని హోంవర్క్ కాగితాల రెపరెపలు.

నేల మీద కొరికి పడేసిన ఆపిల్ ముక్క…

వాడిపోయి వెంట్రుకలు వీ డిన గులాబీ పువ్వు !

రాత్రి కలల్లాగే ..ఆమె పెదవంటిన టీ మరకల కప్పు !

కాటుక మరకల అధ్ధం..

ఆమె కళ్ళ వెన్నెలను గదిలో పరుస్తూ..

అద్దంలో ఆమె మెహన రూపం!.

ఉండీ.. ఉండీ వాఁట్సాప్ మెస్సేజీ లతో వెలిగే ఫోను...

పెళ్లికి ముందు పడక గది ఆమెకి ఒక్క కలలగది మాత్రమే !

స్వేచ్ఛగా ఈదే సముద్రం .

కమ్మగా నిద్రపోయే వెచ్చని అమ్మ ఒడి.

ఆమె మంచం ఆమెని నిద్రపుచ్ఛే మధుపాత్ర

పరుపు ఆమెనే మాత్రం గాయ పరచని మెత్తని పత్తి పూల తోట !

పడక గది ఆమె స్వేచ్చా పతాక !

గట్టిగా అరుస్తుంది దేహం అంతా తబలా మోగినట్లే గల గలా నవ్వుతుంది...

"ఆధా హై చంద్రమా రాత్ ఆధీ..

రెహన జాయే తెరీ మేరీ బాత్ ఆధీ ములాఖాత్ ఆధీ"

అంటూ చంద్రుడుకి వినిపించేంత పెద్దగా పాడుకుంటుంది...

మైకంలో నాట్యం చేస్తుంది.

పడక గది ఆమెకు తనేం కాదల్చుకుందో

కచ్చితంగా నిర్ణయించుకునే కోర్టు గది !

అప్పుడప్పుడూ.. నాన్న నిఘాని తప్పించుకుంటూ

పడకగదిలో రహస్యంగా కవితలు రాసుకునేది.

పడక గది రోజూ ఆమె రెక్కల్ని గట్టిగా కుట్టుకునే కుట్టు మిషన్ !

ఆ పడక గదిలో కలల కనురెప్పల్ని భద్రంగా కాపాడుకుంటుంది.

తన కిటికీకి అల్లుకున్న

రాధాకృష్ణ తీగల్ని ఆకుపచ్చగా సవరించుకుంటుంది.

పడక గది ఆమెకు మార్గ దర్శి !

పడక గది నుంచే ఆమె ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.

తలుపులనీ ..కిటికీలని పూర్తిగా తెరిచి పెట్టుకుని

కలలతో సహా గాలిలో ఎగిరిపోయి చంద్రుణ్ణి ముద్దాడి

ఏ వెన్నెల రాత్రో తిరిగొచ్చి తన పరుపుపై అలసటగా వాలిపోతుంది.

పడక గది ఆమెకంత స్వేచ్ఛ నిస్తుంది లేదా ఆమె తీసుకుంటుంది.

ఆమె ముఖాన్ని దించుకునే దిండుకి ఆమె కలల ఆచూకీ తెలుసు..

అందుకే కలలు కనే ఆమె కళ్ళతో సహా

ఆమె ముఖాన్ని తన హృదయంలో మెత్తగా...

భద్రంగా ఇముడ్చుకుంటుంది..

ఆమె కలలో తనని సున్నితంగా స్పర్శించే రాకుమారుడు...

అందమైన పడకగది..ప్రేమికుల సంగీతాన్ని పాడుతూ !


పెళ్లి తరువాత ఆమె పడక గది !


ఆమె పెళ్లికూతురిగా బియ్యపు చెంబుని కాళ్ళతో తన్ని ఇంట్లోకి వస్తుంది.

ఆ తరువాత ఆమె తన్న బడుతుంది... అన్ని గదుల్లోకి తరమబడుతుంది.

ఆమెకి కొన్ని వంటింటి, పెరటి, వాకిలి,

స్నానాల గదుల రంగులు అద్దాక...

అతను ఆమెను పడక గదికి అపురూపంగా తీసుకెళతాడు.

అక్కడ ఆమెకు ఆ రాత్రి నొప్పితో పండిన ఎర్రని రంగు అద్దబడుతుంది.

అతడు పడక గదిని తనలా మగవాడిగా మార్చేస్తాడు ఎప్పుడో !

అప్పుడు పడక గది కావలసిన రంగు వచ్చేదాకా

రోజూ ఆమెకు లిట్మస్ పరీక్ష చేసే లేబో్రేటరీ!

అద్దం సాక్షిగా..

పడకగదిలో ఆమె రోజూ కొత్తగా తయారు కాబడుతుంది.

అతని జేబులో ఎప్పుడూ కత్తెరలు.. సూదులు దారాలు ఉంటాయి.

"ఏంటవి ?"అడుగుతుంది ఆమె...

"నా ఆయుధాలు...మన కోసమే

మా తాత నుంచి సంక్రమించినవి ...

మా నాన్న ఇచ్చాడు" అంటాడతను ముసి ముసిగా నవ్వుతూ..

ఇక ఆమె తొలినాడు వచ్చినప్పటి ఆమెలా ఉండదు !

మొదటగా ఆమె పెదాలు కుట్టి వేయ బడతాయి!

పాదాల వేళ్ళను చేతి వేళ్ళను కలిపేస్తూ

కదలకుండా మధ్యలో చర్మాన్నీ కుట్టేస్తాడు.

కనురెప్పలు కొద్దిగా కుట్టబడతాయి.

చెవుల లోపల అతగాడు రాసిన కొత్త పదాలు మాత్రమే వినిపించేట్లు

ఆమె కర్ణభేరి సరిచేయబడుతుంది.

పడక గదిగా మారిన అతడు

ఆమె రెక్కలు కత్తిరించి గోడకి వేలాడ దీస్తాడు !

ఆమె ఊపిరితిత్తులకి కేవలం

అతని శ్వాస మాత్రమే అందించ బడుతుంది.

పడక గది చివరికి ఆమె గుండె లయని కూడా

గడియారపు ముల్లుని మార్చినట్లు మారుస్తుంది.

ఆమె రొమ్ముల్లో సిలికాన్ ద్రవాన్ని నింపి...

గోడ మీద షో పీస్ ని పెట్టుకున్నట్లు గర్వంగా మురిసిపోతుంది.

పడక గది ఆమె నోటికే కాదు..

వెజైనాకీ హస్బెండ్ స్టిచ్ వేసుకుని బిగుతు చేసుకుంటుంది!

పడక గది ఆమె దేహ కొలతల్ని పూర్తిగా మార్చేసుకుంటుంది.

మెదడుతో సహా ఆమె గర్భసంచీని స్వాధీనం చేసుకుంటుంది!

చివరికి ఆమెనొక ఏక కణ అమీబాగా మార్చేస్తుంది.

***

పడక గది నుంచే ఆమె రోజూ అన్నీ గదుల్లోకి రవాణా కాబడుతూ ఉంటుంది.

పూజ గదిలోకి ఉపవాస నోములవ్రతాల పసుపుకుంకుమ

కుప్పల్లోకి నిలువెల్లా ముంచబడుతుంది.

పడకగది నించే ఆమె వంటింటి చితిలో

రోజూ పచ్చి మాంసమై కాల్చ బడుతుంది.

పడక గదే ఆమె గర్భ సంచీని

పిల్లల గదిగా మార్చి పడేస్తుంది.

మగ పిల్లాడిని కనేదాకా మాటి మాటికీ

ఆమె గర్భసంచీని కోస్తూనే..ఉంటాడు.

అమ్మ ఇచ్చిన మొఖం కోసేసి ..

ఆమెకి కొత్త మొఖం తొడుగుతాడు

రోజొక్క మాస్కు వేసి

ఆమెని పడక గది తలుపులు తీసి బయటకు తోస్తాడు.

*****

పడక గది ఆమెకు పడకుండా అయిపోతుంది.

అయినా ఆమె..

ఓర్చుకొమ్మన్న వాళ్ళను తలుచుకుంటూ

పాపం వోర్చుకుంటూంటుంది.

అంతా తన భ్రమ అని కూడా అనుకుంటుంది.

పడక గదిలో అతని కోసం...

తన నూతన మానవుడి కోసం వెతుక్కుంటూనే ఉంటుంది.

పడక గది అలమారాల్లో

కుర్చీ మీద మంచం మీద

గది మూలల్లో అతని కోసం వెతుక్కుంటూ ఉంటుంది

అతగాడివి అనేక నీడలు !

పడక గదిలో చిక్కటి చీకట్లో అతగాడి నీడలు

చేతుల్లో కత్తెరతో నోట్లో కూరలతో తిరగాడుతూ కనిపిస్తాయి.

ఆమె అనుమతి లేకుండా అతడు ఆమెను నగ్నం చేస్తాడు.

ఆమె దేహం మీద మృగ విన్యాసాలు చేస్తాడు.

ఆమె కన్నీళ్లతో విల విల్లాడుతుంది

ఇంకా సిద్ధం కాలేదంటుంది.

నేను సిద్ధమయ్యాను అంటాడు ఆమె లోపల కత్తిని దింపుతూ !

అప్పుడు పడక గది ఆమెదైన పరిమళాన్ని..

కిటికీ పైన విరసిన మల్లె.. సుగంధాన్ని కోల్పోతుంది.

మంచం కూడా నొప్పితో మూల్గుతుంది.

కిటికీ చంద్రుడు ఆగ్రహంతో తెల్లారిపోతాడు.

పరుపు పైని తెల్లని దుప్పటి ఆమెని మృత వస్త్రమై చుట్టేస్తుంది.

****

యుగాలుగా అతను కోటానుకోట్ల వీర్యకణాలుగా

ఆమెలోకి ఈదుతూనే ఉంటాడు.

ఆమె తిరస్కరిస్తూనే ఉంటుంది.

అతనే కాదు..వీర్య కణం కూడా కత్తే !

ఆమె లోని అండాన్ని కూడా పొడిచి పొడిచి

పిండంగా మారాలనుకుంటుంది.

***

అతను జీవితం లోకి వచ్చిన రోజు ఆమె ఉత్సవం చేసుకుంది.

పడక గదిని పూల తోటగా మారుస్తుంది

కానీ అతడొక పామై ఆమెను కాటేస్తుంటాడు.

ఆమె లోపల కొన్ని సుఖ వ్యాధి క్రిముల్ని వదులుతాడు

అవి బయటకి రాకుండా

చావకుండా ఆమెను అన్ని వైపుల నుంచీ కుట్టేస్తాడు.

ఆమె రోజూ మరణిస్తూఉంటుంది.

రోజూ తన జీవశ్చవాన్ని

పడక గది తలుపు కొక్కానికి తగిలించి నిద్ర పోతుంది.

తెల్లారి ఆమె ఒంటి మీది

అతని సరస శృంగారపు మచ్చల్ని చూసి అద్ధం దుఃఖిస్తుంది.

అతను గర్వంగా మగతనపు మృగంలా నవ్వుతాడు

కోరలు తళుక్కున మెరిసేలా !

"ఇది శృంగారం ఎట్లా అవుతుంది..ప్రేమ ఎట్లా అవుతుంది

మొగుడు చేసిన రేప్ అవుతుంది కానీ" అని

పదే పదే అడుగుతూన్న ఆమెతో పాటు అద్దం వల వల ఏడుస్తుంది.

అతను లేనప్పుడు పడక గది ఆడది !

అప్పుడు

నాలుగు గోడలు ఆమెను వెచ్చగా కౌగలించుకుని ఓదారుస్తాయి.

గోడల మీద ఆమె అదృశ్య చిత్ర పటం

మారుతున్న రంగులతో వేలాడ బడుతుంది

నాలుగు గోడలు నేలా ఛత్

గుస గుసలు పోతూ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి.

అతనితో ఆమె ఉన్నప్పుడు చూడ లేక మొఖాలు తిప్పుకుంటాయి.

రక్షించలేక పోతున్నామే అని విల విలలాడతాయి !

అతని చేతిలో కత్తెరలు సూది దారాలు లాగి పడేయ్యడానికి

యుద్ధం చేసి.. చేసి ఆమె నీరస పడిపోతుంది.

కిటికీలని, గోడలను ఆశ్రయిస్తుంది.

పడక గది కిటికీ వంద గోడలతో సమానం.

పడక గదితో పాటు ఆమెనూ వెలిగించాలని చూస్తుంది కిటికీ.

ఆమెతో పాటు చిన్నబోయి చీకటవుతుంది.

తెల్లారి ఆమె నొప్పులను గాయాలను

తన రెక్కలను విశాలంగా తెరిచి బయటకు పంపిస్తుంది

ఆమెకి కాస్త ఆక్సిజన్ అందిస్తుంది .

కొన్ని ముసలి పడక గదులుంటాయి..

అవి వయాగ్రాలైపోయి

మెనోపాస్ లో ఎండిన ఆమె యోని ని చీలుస్తాయి.


అదృశ్య పడక గది


ఆమెలో కూడా ఒక అదృశ్య పడక గది ఉంది

ఎవరికీ కనపడని ఆమె కలల గది

మళ్లీ తన పుస్తకాలు తన అద్దం తన రెక్కలు తన బట్టలు

తనలాగే నవ్వుతూ మాట్లాడుతూ పాడుతూ

అమ్మ ఇచ్చిన మొఖాన్ని

మాత్రమే చూపిస్తూ..

ఆ పడక గదిలో సున్నితమైన పెదవులను ముల్లులా గుచ్చే అతను వద్దు

పడక గది తలుపు అతన్ని లోనకి రానివ్వద్దు అంటాయి.

ఆమెకా గది కావాలి గదిలో ఏకాంతం కావాలి.

ఆమెకి పడకగది అంటే నిద్ర పోయే గది మాత్రమే కాదు

విరిగిన కలల్ని అతికించుకునే స్థలం.

తన కలల పడక గదిలో

ఆమె యుగాలకొద్దీ నిద్ర పోవాలని ఎదురుచూస్తుంటుంది.

కానీ అతను ఇవ్వడు

పడక గది తో పాటు..అమెనీ బంధిస్తాడు.

తనలోంచి విడుదల చేయడు ఆమెని.

అందుకే ఆమెని ప్రేమించే అద్దం

ఆమెను దగ్గరికి పిలిచి అతని పడకగది తలుపులను కాదు

నేరుగా గోడలనే బద్దలు కొట్ట మంటుంది.

****

ఆమె కలలు కనడం మానదు...అందమైన

నొప్పినివ్వని పడక గదిని కల కంటూనే ఉంటుంది.

*****

కొన్ని పడక గదులు శృంగారం కోసమే కాదు ...ప్రేమ కోసం కూడా!

కొన్ని పడక గదులు దేహాల్ని కాకుండా

మనసును ప్రేమిస్తాయి స్పర్శిస్తాయి !

ఆమెకది కలల పడక గది !

ఆమెకా ప్రేమ కావాలి !

ఆ పడక గదిలో..

అతగాడి ఒక్క చూపుతోటే..

ఆతని ఒక్క ముద్దు తోటే..

మనోదేహాలు రెండూ పులకించి పోతాయి !

ఆమె అతడికి దేవత !

ఆమె కోసం చందమామని తెచ్చి ఆమె పడక గదిలో వెలిగిస్తాడు

పడక గదిలో సౌగంధికా పుష్పాలను పూయిస్తాడు.

శృంగారం అంటే రెండు దేహాల కండరాల రాపిడి మాత్రమే కాదంటాడు !

శృంగార భాషకి లిపి ప్రేమంటాడు !

అతను ఆమె పాదాలను కళ్లకద్దుకుని

శృంగారాన్ని మొదలు పెడతాడు !

అప్పుడక్కడ నొప్పిలేని ఒక దేహ ప్రయాణం ..

ఒక గొప్ప మైకంలో కొనసాగుతుంది.

ఆమె అతడూ రెండు

మోహ సముద్రాలై ఒకరిలో ఒకరు ఈదులాడుతారు.

ఇద్దరి మధ్యలో రాగాలేవో గమకాలు పోతూ కమ్ముకుంటాయి.

అతను చాలా జాగ్రత్తగా ఆమె దేహంలో నుంచి ఆమె హృదయంలోకి ప్రవేశిస్తాడు.

దేహాన్ని తాకకుండానే హృదయాన్ని చేరే

మార్గం కూడా అతనికి తెలుసు !

ఆమె పడక గది నాలుగు గోడలు

ఆ సుందర దృశ్యాన్ని ఫోటో తీసి గది హృదయంపై ఫ్రేమ్ కడతాయి !

చాలా సార్లు ఆమె తనకు తానే

తన కలల పడకగది గా మారిపోతుంది.

అప్పుడా పడక గది కూడా ఆడదై పోతుంది !

పడకగది ఆమె సామ్రాజ్యమవుతుంది.

పడక గదిలోకి కాలు పెట్టటం అంటే..

అతని హృదయంలోకి చేరడమే అనుకుంటుంది.

రోజూ వెన్నెల రాత్రుళ్ళల్లో..

అతడామే చెవుల్లో ఆమె పేరుని మాత్రమే జపిస్తాడు !

స్పర్శ ద్వారా ప్రేమను వ్యక్తపరిచే శృంగార భాషగా అతను మారిపోతాడు.

My Dear!

With your permission, you are my sunshine... అంటూ

ఆమె అనుమతితోనే

అతను ఆమె నుదుటిమీదా కళ్ల మీదా పెదవుల మీదా

ప్రేమ నిండిన తన హృదయాన్ని దాచిన

ఆమె వెచ్చని మృదువైన చర్మం

అణువణువూ ముద్దులను ముద్రిస్తాడు !

ప్రేమని వ్యక్తపరచడానికి

స్పర్శా దేహం సాధనాలు మాత్రమే అంటాడు !

ఆమె వొంటినిండా వేసిన కుట్లని విప్పేస్తాడు.

ఆమె రెక్కలని ఆమెకి అతికిస్తాడు.

అందుకే ఆమె స్వంత పడక గది ఆమెకి ఒక కలల గది అవుతుంది.

కోరిక తీర్చే లైంగిక వస్తువుగా కాకుండా

వ్యక్తిగా ఆమె దేహాన్ని గౌరవించే పడక గదిలో

ఆమె విరగని రెక్కలతో సురక్షితంగా ఉంటుంది.

***

కొన్ని పడక గదులు ఉంటాయి

అందులో కొంతమంది స్త్రీలుంటారు !

అక్కడినుంచి విముక్తిని కోరు కునే స్త్రీలు...

అవయవాలన్నీ మార్చ బడ్డ స్త్రీలు

రెక్కలు కత్తిరించబడ్డ స్త్రీలు..

వికలాంగులై న స్త్రీలు ...

ఇక ఓపిక నశించి ఆగ్రహంతో వొణికి పోయే స్త్రీలు...

ఒక చేత్తో వంటగదిని..మరో చేత్తో పడక గదిని

తమ భుజాల మీద వేసుకుని...

యుగాలనుంచీ రహస్యంగా తవ్వుకున్న

సముద్రంలో విసిరేయడానికి

రెక్కలు మొలిపించుకుని...ఎగిరి పోతారు !

కొన్ని పడక గదులుంటాయి..కొంత మంది స్త్రీలుంటారు...

కనురెప్పల్ని కుట్టేసినా...కలలు కనడం మానని స్త్రీలు !

కత్తేర్లను...పడక గదులను స్వాధీనం చేసుకునే స్త్రీలు !


Tags:    

Similar News