ఎక్కడికి పిలవను నిన్ను?

గీతాంజలి రాస్తున్న‘ఇల్లు’ సీక్వెల్ కవితల్లో ఇది మూడవది.

Update: 2024-03-28 05:24 GMT


ఎక్కడికి పిలవను నిన్ను?


-గీతాంజలి


 నా ఇంటికి వస్తానంటావు..
నేనూ పిలవాలను కుంటాను.
నువ్వు నా ప్రత్యేకమైన అతిథివి !
కానీ నాకు ఇల్లేదీ ?
అమ్మిల్లు..అత్తిల్లు,పిల్లల ఇల్లు.,నా ఇళ్లేలా అవుతాయి చెప్పు?
ఆడదాన్ని కదా మరి, అవి నా స్థావరాలు మాత్రమే !
పక్షులు వాలే చెట్టు కొమ్మల్లా
కాస్త వెతుక్కోనీ నా ఇంటిని
నా ఇల్లు నాకు దొరకనీ
సరే..మరి నిన్నెక్కడికి పిలవాలి ?
నా ఇల్లు సముద్రంలో ఉంది
భూమి పొరల్లో... మొలకలెత్థే విత్తనాల పచ్చి వాసనలో ఉంది
నా ఇల్లు భూమ్యాకాశాల మధ్యన వేలాడే శూన్యంలో ఉంది
పూలల్లో కనిపించని సుగంధాల్లో ఉంది
అడవిలోని గాఢాంధ కారమే నా ఇల్లు
అదిగో..యుగాలుగా ఏడుస్తున్న ఆ స్త్రీ దుఃఖ ధ్వనిలో ..ఆమె దూకి చనిపోయిన దిగుడు బావిలో ఉంది
ఒక్క సారి తొంగి చూడు ..ఆత్మల సమావేశాన్ని !
నా కళ్ళు చూసావా..అందులోని విషాదమే నా ఇల్లు
సూర్యచంద్రుల్లో ..ఆ నీలి మేఘాల దేహపు మడతల్లో...
నక్షత్రాల చమక్కులోఉంది కదా నా ఇల్లు
హృదయాన్ని కోసే పాటలోఉంది. అంతెందుకు..నీ కవిత్వంలోనే ఉంది కదా నా ఇల్లు
ఈ ప్రకృతంతా నా ఇల్లే ! ఎడారిలో కూడా ఉంది నా ఇల్లు
నువ్వు తట్టటానికి నా ఎడారి ఇంటికి గడపలు.. కిటికీలు..తలుపులు లేవు..
నాకు గోడలు కట్టిన ఇల్లు లేదోయి...
నన్ను బంధించే ఇల్లు నాది కానే కాదు
నా కోసం ఎక్కడికని వస్తావు చెప్పు ?
ఎక్కడ లేదని నా ఇల్లు ?
యుగాలుగా వెతుకుతూనే ఉన్నా నాకు లేని ఇంటిని..దొరకనీ !
అందుకే..అక్కడే ఉండు !
ఎక్కడ ఉన్నావో... అక్కడ...
నీ చుట్టూ..నీ లోపల నేనున్నాను !
ఉండు ..అక్కడే మరి !


Tags:    

Similar News