దేశంలోని ఆదివాసీలపై సైనిక ప్రయోగం ఎందుకు జరుగుతోంది?
బస్తర్, జార్కండ్, ఒదిశా, గడ్చిరోలి వంటి చోట్ల సైనిక సాయంతో శక్తుల భూ అవసరాలకోసం ఆదివాసీలను తరిమేయడానికి అనుకూలమైన పరిపాలనను రూపొందుతూ ఉంది
By : రాఘవ
Update: 2024-07-08 07:48 GMT
‘‘భారత ప్రభుత్వం కశ్మీర్ లో, దేశంలో జరుగుతున్న ప్రజాఉద్యమాలలో ప్రజలను ఎన్ కౌంటర్ల పేరుతో చంపేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల మధ్య విద్వేషాన్ని, మధ్యభారత దేశంలో ప్రజలపై సైన్యాన్ని పురిగొల్పుతోంది. ఆందోళన చేస్తున్న రైతులపై మావోయిదస్టులని, మేధావులపైన అర్బన్ నక్సలైట్లని ముద్రవేసింది.’’ అని ప్రముఖ న్యాయవాది ఎహత్ మామ్ ఉల్ హక్ (Ehtmam ul Haque) అన్నారు. ఢిల్లీ న్యాయవాదిగా ఉంటున్న హక్ కార్పొరేటీకరణకు, ఆదివాసీలపై సైన్యాన్ని ప్రయోగించడం ఆపాలని ఉద్యమిస్తున్న వేదిక (
Forum Against Corporatization and Militarization :FACAM) సభ్యుడు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జులై 4వ తేదీ గురువారం జరిగిన విప్లవ రచయితల సంఘం 54వ ఆవిర్భావ దినోత్సవానికి హాజరుకాలేకపోయిన హక్ ఇంగ్లీషులో పంపించిన ప్రసంగ పాఠాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాఘవ చేసిన అనువాదం ఇది.
***
‘‘ప్రియమైన సహచరులారా, మహత్తరమైన విప్లవ పోరాటానికి అర్ధశతాబ్దం పూర్త చేసుకున్నందుకు విరసం కామ్రేడ్లకు అభినందనలు. విప్లవంలో భాగంగా ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని, సంస్కృతిని తీసుకురావడంలో విరసం కీలకమైన పాత్ర పోషించింది. కొన్ని ముఖ్యమైన, అనివార్యమైన పనుల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను.
ప్రజాస్వామికమైన అన్ని రకాల నిరసనలను, ప్రతిఘటనలను, శాంతియుతమైన ప్రజాఉద్యమాలను కానీ, సాయుధ పోరాలాలను కానీ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం అణచివేస్తున్న సమయంలో మనమిప్పుడు జీవిస్తున్నాం. అన్ని రకాల దోపిడీలకు అడ్డంకిగా ఉన్న ప్రజా ఉద్యమాలను అణచి వేయడానికి, ప్రజలను పీడించడానికి ఈ విధానాలను అనుసరిస్తున్నారు.
దేశంలోని బస్తర్, జార్కండ్, ఒడిషా, గడ్చిరోలి వంటి అన్ని ప్రాంతాల్లో సైన్యాన్ని దించడం ద్వారా, పెద్దపెద్ద కార్పొరేట్ శక్తులు, విదేశీ కార్పొరేట్ శక్తులు మన భూములను ఆక్రమించుకుని, మనల్ని తరిమేయడానికి అనుకూలమైన పరిపాలనను అందిస్తున్నారు. కశ్మీర్ వంటి అణచివేతకు గురవుతున్న జాతుల ఆత్మస్థైర్య ఉద్యమాలలో, ప్రజాస్వామ్యయుతమైన ప్రజా ఉద్యమాలలో ప్రజలను గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్ కౌంటర్ల పేరుతో ఫ్యాసిస్టు భారత ప్రభుత్వం చంపేస్తోంది.
మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రంలో నెలల తరబడి జాతుల మధ్య విద్వేషాలను నాటి, ఒక జాతికి వ్యతిరేకంగా మరొక జాతిని పురిగొల్పి జాతుల పోరాటాన్ని నీరుకారుస్తోంది. ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వమే ప్రజలపై మారణ హోమానికి పాల్పడడానికి సాయుధ మూకలను పురికొల్పి, మధ్య భారతదేశంలో ప్రజలపై ఒక పక్క సైన్యాన్ని ప్రయోగిస్తూ, మరొక పక్క నిస్సహాయతను ప్రకటిస్తోంది. ప్రభుత్వమే ఈ ఘర్షణలను కల్పిస్తూ ప్రజల మధ్య జరుగుతున్న ఘర్షణలను చూసి ఉలిక్కిపడుతోంది.
బ్రాహ్మణీయ హిందూత్వ ఫ్యాసిస్టు శక్తులు గడచిన పది సంవత్సరాలుగా తన బలాన్ని పెంచుకుంటూ భూములను, వనరులను దోచుకుంటూ, భారతదేశం అభివృద్ధి చెందుతూ వెలిగిపోతున్న దేశంగా చూపిస్తున్నాయి. ఇదే అభివృద్ధి నమూనా అని నమ్మబలు తున్నాయి. ఈరకమైన బూటకపు అభివృద్ధి కొత్త కాకపోయినప్పటికీ గత ప్రభుత్వంలో కూడా కొనసాగింది.
వనరుల దోపిడీ, కార్మికుల శ్రమశక్తి దోపిడీ, ప్రజలను విధ్వంసం చేయడమంటే వ్యవసాయాన్ని నాశనం చేసి, దానిపైన ఆధారపడేవారిని గనుల్లో బానిసలుగా చేయడం, తద్వారా పరిసరాలను విధ్వంసం చేసి దాన్ని అభివృద్ధిగా చూపిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థనంతా విదేశీ పెట్టుబడులతో నింపేయడానికి విలువైన వనరులను, మనుషులను కారు చవకగా ఇచ్చేసి, తక్కువ వేతనాలతో కార్మికుల చేత పనిచేయించుకుని, తక్కువ వ్యయంతో వస్తువులను ఉత్పత్తి చేసి, అదే వస్తువులను పది రెట్లు ఎక్కవ ధరలకు అదే ప్రజలకు మార్కెట్లో అమ్ముతున్నారు.
మన పర్యావరణాన్ని ధ్వంసం చేసి, మన ప్రజలను తరిమేసి, ఇలా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను ప్రజానుకూలమైందని చెపుతుంటే దీన్ని అభివృద్ధి అని ఎలా గుర్తించగలుగుతాం! ఈ రకమైన అభివృద్ధి కొందరు కార్పొరేట్ శక్తుల అభివృద్ధి మాత్రమే తప్ప మరొకటి కాదు. భారతదేశంలో ఈ తరహా అభివృద్ధిని కొనసాగించడానికి ప్రభుత్వ యంత్రాంగం, విదేశీ కార్పొరేట్ శక్తులు కలిసి, శ్రమిస్తున్న ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి.
గడచిన ఆరు నెలల్లో ఒక్క బస్తర్ జిల్లాలోనే 140 మందిని బూటకపు ఎన్ కౌంటర్లలో చంపేశారు. వీళ్ళలో ఎక్కువగా ఆదివాసీ రైతులు, నిరాయుధులైన మావోయిస్టు తిరుగుబాటు దారులు. దురాశాపరులను సంతృప్తి పరచడానికి తిరుగుబాటు దారులను, నిరాయుధులను పట్టుకుని చంపేసి, చట్టబద్ద పాలనను చెత్తబుట్టలో పడేశారు. ఈరకమైన విధానాన్ని ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమైనా అనుసరిస్తుందా అని మనం ప్రశ్నించాలి. న్యాయాన్ని అమలు చేసే విధానం ఇదేనా? చట్టాన్ని అమలు పరచే విధానం ఇది కాదు, ఇది కార్పొరేట్ యంత్రాంగాన్ని బలపరిచే విధానం.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి పేరు తెలియని ఆదివాసీ రైతును పట్టుకుని జైల్లో వేసి, బూటకపు ఎన్ కౌంటర్లో కాల్చి చంపేశారు. బస్తర్ జిల్లాలోని ప్రజాఉద్యమ నాయకులైన సర్జు టేకమ్, సునీత పొట్టం లను మావోయిస్టులని పేరున అరెస్టు చేశారు. గనుల తవ్వకానికి, రోడ్లు వేయడానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మావోయిస్తులన్న ముద్ర వేశారు.
నిరకంకుశ చట్టాలకు వ్యతిరేకంగా, కనీస మద్దతు ధర కోరుతూ పంజాబ్ లో ఆందోళన చేస్తున్న రైతులపై కూడా మావోయిస్టు లని ముద్ర వేశారు. మజ్దూర్ సంఘటన సమితి, కొత్తగా ఏర్పడిన అసంఘిటిత మజ్దూర్ మోర్చా నాయకులపై మావోయిస్టులని ముద్ర వేసి ఎన్ ఐ ఏ దాడులు చేసింది. ఈ విధ్వంసకరమైన తరహా అభివృద్ధిని వ్యతిరేకించినందుకు మేధావులను ‘అర్బన్ నక్సలైట్లు’ అని ముద్ర వేసి, వారి నోళ్ళు మూయించడానికి బీమాకోరేగాన్ కేసులో జైలులో పెట్టారు. ప్రతి పోరాటాన్ని, ప్రతిఘటించే ప్రజలపై మావోయిస్టులని ముద్ర వేశారు. క్రైస్తవ పూజారి స్టాన్ స్వామి, గాంధేయ వాది హిమాంశు కుమార్ వంటి వారి పైన మావోయిస్టులని ముద్ర వేశారు.
కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలను చుట్టుముట్టడానికి, ప్రజలకు కనీస సౌకర్యాలు లేని మధ్య భారత దేశంలో రోడ్లు వేయడం, టవర్లను నిర్మించడం, పారామిలటరీ శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు ‘ఆపరేషన్ సమాధాన్ - ప్రహార్’ పేరుతో మిలటరీని దించారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం, హిందుత్వ ఫాసిస్టు శక్తులు బలపడడానికి మోడీ, అమిత్ షా ఆమోదించిన 2022లో సూరజ్ కుండ్ పథకం వెలుగులోనే ఇది కొనసాగుతోంది.
సూరజ్ కుండ్ లో ఆమోదించిన పథకాన్ని అనుసరించి సమాధాన్ ప్రహార్ పేరుతో చేపట్టే చర్యల్లో భాగంగా శంభు బార్డర్ లో జరిగే కిసాన్ ఆందోళన పైన భాష్పవాయుగోళాలను, గ్రెనేడ్ లను వదులుతున్నారు. పట్టపగలు శుభకరణ్ సింగ్ ను కాల్చిచంపడం అనేది బస్తర్ లోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజలను భయకంపితులను చేయడానికే నని స్పష్టమవుతోంది. సూరజ్ కుండ్ పథకం అనేది అన్ని రకాల అసమ్మతులను, సాయుధులైన నక్సలైట్లను, కలాలు పట్టుకున్న సానుభూతి పరులను అణచివేయడానికి మాత్రమే.
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తులు బలపడుతున్న, మన వనరులను సామ్రాజ్యవాద శక్తులు దోచుకుంటున్న ఈ దశలో ప్రజాస్వామిక, అభ్యుదయ శక్తులు వీటికి వ్యతిరేకంగా ఏకం కావాలి. ఏరకమైన అసమ్మతి గొంతులను బ్రాహ్మణీయ హిందూ ఫ్యాసిస్టు శక్తులు సహించలేవు. ఈ ఫాసిస్టుల మారణహోమానికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రజలను ఏకం చేయాలి. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైతులు వివిధ రూపాల్లో పోరాడుతున్నారు. మార్పు లేక యువతరం నిరుత్సాహంగా ఉంది. ప్రజలను ఏకం చేస్తే తప్ప విముక్తి సాధ్యం కాదని శ్రామిక వర్గం భావిస్తోంది. ఇలా లక్షలాది మంది ప్రజలు పోరాడుతున్నారు. పోరాడుతున్న శక్తులన్నీ విప్లవ ఐక్యానికి ఏకం కావాలి.
సమైక్యంగా ఉండడాన్ని గుర్తు చేస్తూ ఒక కవిత ఉంది. నాజీ పరిపాలనను చవి చూసిన జర్మన్ కవి మార్టిన్ నయిమోల్లెర్ ఈ కవితను రాశాడు.
తొలుత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను మాట్లాడలేదు
నేను కమ్యూనిస్టు కాదు కనుక
తరువాత వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చారు
నేను మాట్లాడలేదు
నేను సోషలిస్టును కాదు కనుక
తరువాత వాళ్ళు కార్మిక నాయకుల కోసం వచ్చారు
నేను మాట్లాడలేదు
నేను కార్మిక నాయకుణ్ణి కాదు కనుక
తరువాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు
నేను మాట్లాడలేదు
నేను యూదును కాదు కనుక
తరువాత వాళ్ళు నా కోసం వచ్చారు
నా గురించి మాట్లాడడానికి ఎవరూ లేరు.
(సమాప్తం)