నేను మధ్యతరగతివాడిని ...
డాక్టర్ గోపీకృష్ణ ‘మండే’ పోయెమ్
Update: 2025-10-13 02:47 GMT
నేను మధ్యతరగతివాడిని...
కష్టం విలువ తెలిసిన వాడిని!
అదృష్టంపై నమ్మకంలేనివాడిని!
భవిషత్తుపై భయమున్నవాడిని!
నేను మధ్యతరగతివాడిని...
కొత్త మాడల్ వచ్చిందని
పాత ఫోన్‌ని మార్చేయను!
పాతటీవీని ఇకమీదట రిపైర్
చెయ్యలేమనేంతవరకు వాడతాను!
మిక్సీజారు కొత్తది కొనకుండా
బ్లేడ్లు బుష్షులనే మార్చుకొంటాను!
నేను మధ్యతరగతివాడిని...
టూత్‌పేస్టు చివరివరకూ
పూర్తిగా వత్తి మరీ వాడతాను!
షాంపూ అయిపోయాకా
నీళ్ళు గలగరించి పోసుకొంటాను!
అరిగిపోయిన సబ్బుముక్కని
కొత్తసబ్బుకు అతికించుకొంటాను!
నేను మధ్యతరగతి వాడిని...
రాత్రి అన్నం మిగిలిపోతే
పులిహోర చేసుకొని తింటాను!
లేదా వీధికుక్కలకోసం
కాస్త కూరకలిపి బయట పెడతాను!
స్విగ్గీలు జొమాటాలంటూ
ఇల్లు ఒళ్ళు నేను గుల్లచేసుకోను!
నేను మధ్యతరగతి వాడిని...
ఎప్పుడైనా హోటల్‌కు వెళ్ళినా
క్యాన్‌వాటరే కావాలని అంటాను!
అవసరం అనిపించకపోతే
ఇంటికొచ్చి నీళ్ళు తాగుతాను!
మినరల్‌బాటిల్ మంచినీళ్ళకోసం
ఇరవై రూపాయలు చస్తేఇవ్వను!
నేను మధ్యతరగతి వాడిని...
నాలుగడుగులు వేస్తే వచ్చేఇంటికి
ఆటోలు ట్యాక్సీలు ఎక్కబోను!
ప్లాట్‌ఫారంపైన కూలీకోసంచూడక
నా లగేజీ నేనే మోసుకొంటాను!
ఊబర్ ర్యాపిడోలకన్నా
సిటీబస్సులనే ఎక్కువ వాడతాను!
నేను మధ్యతరగతి వాడిని...
ఎండాకాలంలో కూడా
నేను ఫ్యానుతో సర్దుకొంటాను!
వేడి మరీ ఎక్కువయితే
ఏసీ వేసి చల్లబడ్డాక ఆపేస్తాను!
ఏసీ ఇచ్చే సుఖం బావున్నా
కరెంటుబిల్లుకు నేభయపడతాను!
నేను మధ్యతరగతి వాడిని...
కొత్తసినిమాకోసం గంగవెర్రులెత్తి
వెయ్యిరూపాయలు ఖర్చుచేయను!
ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫారంకూ
వేలరూపాయలు నేను కట్టబోను!
మా కేబుల్‌టీవీలో వేసే
సినిమాలే నాకు చాలనుకొంటాను!
నేను మధ్యతరగతి వాడిని...
ఆఫీసునుండి సాయంత్రంవస్తూ
వీధిలో కూరగాయలు తెచ్చుకొంటాను!
మాల్స్‌లోని ఏసీలో కూరగాయలు
ఫ్రెష్షుగా ఉంటాయని నేననుకోను!
నాతోపాటూ కూరలమ్మేవాడు
కాస్త బ్రతకాలని కోరుకొంటాను!
నేను మధ్యతరగతి వాడిని...
కష్టపడి సంపాదించిన డబ్బును
వడ్డీతక్కువైనా బ్యాంకుల్లోనేవేస్తాను!
రాత్రికి రాత్రి తలరాతలుమార్చే
షేర్‌మార్కెట్లను నేను నమ్మను!
రియలెస్టేట్ మాయాజాలంలో
ఉన్నడబ్బును ఇరికించలేను!
నేను మధ్యతరగతి వాడిని...
ఐదేళ్ళకొకసారి లైన్లోనిలబడి
డబ్బుకమ్ముడుపోక ఓటువేస్తాను!
నలుగురికీ న్యాయంచేసే
నాయకుడే కావాలనుకొంటాను!
అర్హులెవరూ లేరనుకొంటే
నోటాకే ఓటేసి గర్వంగావస్తాను!
నేను మధ్యతరగతి వాడిని...
స్కూటర్ కొనమని మెకానిక్అన్నా
పాతస్కూటర్నే రీబోర్ చేయిస్తాను!
బెంజ్‌కారుకొన్న స్నేహితుడినిసైతం
మైలేజ్ ఎంతిస్తుందనే అడుగుతాను!
కొత్తది కొంటే వచ్చే సౌఖ్యంకన్నా
పాతదాని ఎమోషన్తో కనెక్టవుతాను!
ఔను...
నేను మధ్యతరగతివాడిని!
సామాన్యుడిగా ఉన్నందుకు
ప్రతీనిమిషం సంతోషిస్తూంటాను!
సంపన్నుడిగా మారనందుకు
ఒక్కక్షణమైనా నేనుదిగులుపడను!
కష్టపడితే వచ్చే కొద్దిఫలితంతో
సంతృప్తిగా రాత్రి నేను నిద్రపోతాను!
సంతృప్తిగా రాత్రి నేను నిద్రపోతాను!
సంతృప్తిగా రాత్రి నేను నిద్రపోతాను!
Yes...
I am a hard core
middle class man..
and I am proud of my status!!