రోజుకు అర్ధరూపాయి కూలీ..

నూరు ఎకరాలకు రైతుగా ఎలా మారాడు ?

Update: 2025-10-09 02:30 GMT
తన ఇంటి ముందు కాటన్‌ విగ్రహానికి ధాన్యాభిషేకం చేస్తున్న కంద రెడ్డి

 ‘‘ మా గోదావరి డెల్టా లోని రెండు జిల్లాలో అతివృష్టి , తుఫానులతో ముంపుకు గురై, అనావృష్టి వలన కరువుకాటకాలకు లోనై, ప్రజలు అష్టకష్టాలు పడుతూ, పస్తులతో బతికేటోళ్లండీ. తీవ్రమైన తుఫాను, ఉప్పెన వల్ల పొలాలు, గ్రామాలు మునిగి పోయి, వేలాది జనం కాందిశీకులుగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళవలపి వచ్చిందని... నా చిన్నపుడు మా పూర్వీకులు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితుల్లో , తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా, విజ్జేశ్వరాలను కలుపుతూ గోదావరి నదిపై ఆనాడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆనకట్ట కట్టక పోతే, ఇపుడు మా బతుకులు ఎలా ఉండేవో ఊహించండి..’’ అంటాడు, తన అరటి తోటలో పారతో పాదులు తీసి, నీళ్లను పారిస్తున్న సత్తి భాస్కరరెడ్డి.

ఉభయ గోదావరి జిల్లాలను కరవు నుండి కాపాడి, సస్యశ్యామలంగా మార్చిన అన్నదాత, కాటన్‌ దొర అంటే ఆయనకు అంతులేని గౌరవం. ఆ కృతజ్ఞతతో లక్షల రూపాయలు ఖర్చు చేసి తన ఇంటి దగ్గర 9అడుగుల కాటన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాటన్‌ జయంతి, వర్ధంతిని ఒక సందడిగా నిర్వహించి విగ్రహానికి ధాన్యంతో అభిషేకం చేస్తారు. తన పూర్వీకులకు చేసినట్టు కాటన్‌కు కూడా ఏటా పిండప్రదానం చేస్తున్నారు.

‘‘మా ప్రాంతంలో పండే ప్రతీ గింజా కాటన్‌ దయవల్లనే... భావి తరాలు ఆ మహనీయుడిని గుర్తు పెట్టుకోవాలని ఇదంతా చేస్తున్నాను.’’ అంటాడు వినయంగా సత్తి భాస్కరరెడ్డి.

ఎవరీ రైతు?ఏమిటి ప్రత్యేకత?

తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలం, దుళ్ల గ్రామం వెళ్లి సత్తి భాస్కరరెడ్డి ఇళ్లెక్కడండీ అంటే, ఎవరూ చెప్పలేరు.

కందరెడ్డి ఇల్లు ఎక్కడండీ అని అడిగితే మాత్రం.. ‘‘ అదిగో కాటన్‌ దొర విగ్రహం ఎదురుగా ఉన్న మేడ.. ’’అని చూపిస్తారు. భాస్కరరెడ్డి కందరెడ్డిగా మారడం వెనుక మరో స్టోరీ ఉంది.

పొలం పనిలో కంద రెడ్డి  

1953లో పుట్టిన భాస్కరరెడ్డి నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. చదువు సాగలేదు. కుటుంబ భారం తానే మోయాల్సి రావడంతో 11 ఏళ్ల వయస్సులో ఓ మోతుబరి రైతు దగ్గర పాలికాపుగా నెలకు 15 రూపాయల జీతానికి చేరాడు. ఆ స్థితిలో ఉన్న చాలా మంది చివరికి రైతు కూలీలుగా మిగిలి పోతారు. కానీ జీవితంలో ఎదగాలనే తపన భాస్కర రెడ్డిని ఎక్కువ కాలం పాలేరుగా ఉండనివ్వలేదు. అయిదేళ్లు పాలేరుగా ఉన్నపుడే సాగుబడిలో మెలకువలు నేర్చుకున్నాడు. పదహారేళ్ల వయసులో అరెకరం పొలం కౌలుకు తీసుకుని సొంత వ్వవసాయం మొదలు పెట్టాడు.

నాలుగేళ్లు గడిచాక తిరిగి కష్టాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో కౌలుకు పొలం దొరకని పరిస్థితి. దీంతో సొంతూరు రావులపాలెం వదిలేసి దుళ్ల గ్రామానికి వచ్చారు.

ఓ రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు.

అప్పట్లో ఎవరూ పండిరచడానిక ఇష్టపడని కంద పంటను వేశారు. అధిరిపోయే దిగుబడి వచ్చింది.

తన జీవితంలో అంతకు ముందెన్నడూ చూడనంత లాభాలు సాధించారు.

కంద దుంపల సాగు అతని జీవితాన్నే కాదు, పేరునూ మార్చేసింది. అలా భాస్కరరెడ్డి, కందరెడ్డిగా మారారు.

వంద ఎకరాలకు రైతు 

మట్టిని మచ్చిక చేసుకున్న ఆయన ఇక వెనుతిరిగి చూడలేదు. అంచలంచెలుగా వ్యవసాయం విస్తరించుకుంటూ, ఇప్పుడు వంద ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు.

అదంతా కౌలుకు తీసుకుందే.

మిగతా రైతులంతా వరిని మాత్రమే పండిస్తుంటే ఈ రైతు బహుళ పంటలను సాగు చేసేవాడు.

‘‘అరటి , కంద ఎక్కువగా వేస్తాను. విత్తనం కూడా సొంతంగా తయారు చేసుకుంటాం, అంతర పంటగా బొంబాయి పెండలం, కర్ర పెండలం, బీర, బెండ, దోస, పుచ్చకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ వంటి ఇదవై రకాల పంటలను పండిస్తున్నాం. అందుకే మా పొలంలో 365 రోజులూ పచ్చదనం ఉంటుంది. ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంట కాపాడుతుంది. ఏడాదికి మా పంట దిగుబడులు 200 లారీలు. తెలంగాణ, తమిళనాడు, మహరాష్ట్ర,బెంగాల్‌,బీహార్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం.’’ అని వివరించాడు భాస్కర రెడ్డి.

పంటను మార్కెట్‌కి తరలిస్తున్న కందరెడ్డి

ఏడాదిలో కంద, అరటి వెయ్యి టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. కూరగాయలను స్థానిక మార్కెట్లకు తరలించి మరింత ఆదాయం అందుకుంటాడు.

సెంటు భూమి లేని సంపన్నుడు

కంద రెడ్డి పెద్దగా చదువుకోలేదు కానీ, మార్కెట్లో ఎప్పుడు ఏ పంటకు సరైన ధర ఉందనే విషయాన్ని గమనించి దానికి తగ్గినట్టుగా సాగు చేస్తుంటాడు.

నేలనే నమ్ముకొని, వ్యవసాయాన్ని ఔపోసన పట్టిన భాస్కరరెడ్డికి ఇప్పటికీ సెంటు భూమి కూడా సొంతంగా లేదు. అంతా కౌలు వ్యవసాయమే. తనకు గానీ, తన భార్యకు గానీ పట్టాదారు పాస్‌బుక్‌ లేదు. ఏడాదికి కౌలు కే రూ.30 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

కంద రెడ్డి పొలంలో పండిన కంద పంట

మల్టీ క్రాప్‌ సిస్టమ్‌, మేలైన యాజమాన్య పద్ధతులు, నీటి సంరక్షణలో ఆయనకు ఆయనే సాటి. అలా వందలాది మందికి ఆయనో స్ఫూర్తిగా మారారు.

ఆయన కృషి ఊరికే పోలేదు. ఆయన సాధించిన విజయాలు గుర్తించిన అనేక సంస్ధలు ఆయన్ని అవార్డులతో సత్కరించాయి. ఉత్తమ కృషీవలుడిగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డులు అందుకున్నారు.

వ్యవసాయ విద్యను అభ్యసించే, విశ్వవిద్యాలయ విద్యార్ధులు క్షేత్రపర్యటన కోసం వచ్చి భాస్కర రెడ్డి చేస్తున్న వ్యవసాయాన్ని అధ్యయనం చేసి వెళుతుంటారు.

సమాజ సేవలో...

సేద్యంలో అద్భుత ఫలితాలు రాబట్టి,ఆహార సమస్యను తీర్చడంతోనే ఆగి పోలేదు ఈ రైతు.

వచ్చిన ఆదాయంలో కొంత ప్రజా సేవకు వెచ్చిస్తున్నారు. బడి,గుడి, మసీదులు, చర్చిలు, పార్కుల అభివృద్ధికి విరివిగా విరాళాలు ఇస్తుంటారు. తమ చుట్టుపక్కల గ్రామాల వికలాంగులకు ఉచిత బస్‌సాస్‌లు ఇచ్చారు. మూడు గ్రామాలకు ట్రాక్టర్లు ఇచ్చారు.

ఒకపుడు రోజుకు 50పైసల కూలీకి పనిచేసిన ఈ రైతు, నేడు తన సొలంలో 50మందికి

ఉపాధి కల్పిస్తూ ఒక్కొక్కరికి రోజుకు 600 రూపాయలు చెల్లిస్తున్నారు.

పరోక్షంగా వందమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఉత్పాదకతే కాదు,ఉపాధిని సృష్టించిన భాస్కర రెడ్డి 70 ఏండ్లు దాటినా రోజూ ఉత్సాహంగా సూర్యుడు ఉదయించక ముందే గోదావరిలో ఈత కొట్టి , పొలానికి వెళ్లి కూలీలతో పాటు పనులు చేస్తుంటారు.

Tags:    

Similar News