థ్యాంక్ యూ, డాడ్!
డా. గోపీకృష్ణ ‘మండే’ కవిత
Update: 2025-10-06 02:45 GMT
రెండు రోజులకొకసారి
ఇంటిప్రక్కన పేవ్‌మెంట్ పైనున్న
డబ్బాపెట్టె సెలూన్‌కెళ్ళి
షేవింగ్ చేసుకొస్తున్న నాన్ననడిగాను..
ఇంట్లోనే చేసుకొనేందుకు మీకు
షేవింగ్‌కిట్ నేను తెచ్చిచ్చాను..
అయినా ఎందుకని ఆ రోడ్డుసైడు
డబ్బా సెలూనుకెళ్తున్నారూ అని!
రిటైరైన నాన్న నవ్వి నాతోఅన్నాడు..
నేను గడ్డం చేసుకోలేక కాదు
షేవింగ్ క్రీమూ రేజర్ లేకాకాదు..
నిరుపేదైన తన ఆకలిని తీర్చేందుకు
వీలైనప్పుడు కాస్త పనివ్వాలని!
పనికోసం ఎదురుచూసే తనకి
కొంచెం చిరుసాయం చేద్దామని!
ఆత్మాభిమానంకల తను
ఊరికేఇస్తే తీసుకోడని తెలుసని!
మనిషికి మనిషి సాయంచేసుకోకుంటే
సమాజమెలా మనగలుగుతుందని!
..ఆ మాటలన్న నాన్న
నాకు కొత్తగా కనిపించాడు!
సాటిమనిషికి సాయపడాలన్న
పాఠం తను నాకునేర్పాడు!
చేసే సాయంలోనూ మనచెయ్యి
పైనుండరాదన్న సత్యం చెప్పాడు!
నిజమే...
మానాన్న చెప్పిన ఈమంచిమాట
ప్రోబయాటిక్ చద్దన్నంమూట!
తరాలుమారుతున్న సంధికాలంలో
సాటిమనిషిని మరవరాదన్నమాట!
థాంక్ యూ డాడ్..
థ్యాంక్ యూ వెరీమచ్..