మానసిక ఆరోగ్యంతో బహు పరాక్!
అక్టోబర్ 10 న వరల్డ్ మెంటల్ హెల్త్ డే
By : డాక్టర్ ఎస్ రాము
Update: 2025-10-10 04:41 GMT
కన్నతల్లే బిడ్డను పట్టుకెళ్లి ఏట్లో పడేసి చంపేస్తోంది.
కన్నతండ్రే సొంత బిడ్డను కొట్టి చంపుతున్నాడు.
కన్నకొడుకే తండ్రిని గదిలో బంధించి అమ్మ గొంతు కోసి శవాన్ని రెక్కపట్టి గుంజుకుంటూ పోయి బైటపడేసి ఇంట్లో కూర్చొని సినిమా పాటలు ఆస్వాదిస్తున్నాడు.
పసి కందులను తాతయ్య వరస అయ్యే వాడు చెరుస్తున్నాడు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ పిల్లలను చితకబాదుతున్నాడు. పీ హెచ్ డీ స్టూడెంట్ ను గైడ్ రాచిరంపాన పెడుతోంది.
భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు చిన్న చిన్న విషయానికి కొట్టుకు చస్తున్నారు. హింసించుకుంటున్నారు. స్నేహితుల మధ్య ఏదో ఒక గొడవ.
వీధిలో గొడవ చేయవద్దని అన్నందుకు పోకిరీలు ఇంటి ఓనర్ ను బైటికి ఈడ్చి కొట్టి చంపుతున్నారు. బస్సుల్లో, రైళ్లలో, పార్కుల్లో ఎవరు ఎందుకు ఎప్పుడు గొడవకు దిగి మాటల దాడి చేస్తారో, పిడిగుద్దులు కురిపిస్తారో, చేతికి అందిన వస్తువుతో తలపగలగొట్టి చంపుతారో తెలియదు. ఏ మాత్రం పరిచయం లేని వాహనదారులు చిన్న టక్కర్ కే రోడ్డు మీద బూతులు దోక్కుంటూ కసిదీరా కొట్టుకుంటున్నారు.
ఆఫీసులో హింస మరీ ఘోరంగా ఉంది. బాసులు మాటలతో, చేతలతో హింస పెట్టి చంపడం ఒకటైతే, తోటి ఉద్యోగులు చేసే రాజకీయం, పెట్టే పుల్లలు మరో పక్క అశాంతికి గురిచేస్తున్నాయి.
ఇదంతా ఒక పార్శ్వమైతే, అడిగింన చిన్న వస్తువు ఏదో ఇవ్వనందుకు, పోటీ పరీక్షలకు బాగా చదవాలని మాస్టారు కొద్దిగా గట్టిగా చెప్పినందుకు, ప్రేమ పెళ్లి వద్దు అని వారించినందుకు మానసిక కల్లోలానికి గురై ప్రాణాలు తీసుకుంటున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. గంటకో ఆత్మహత్య జరుగుతున్నదంటే ప్రేరేపకుల హింసా ప్రవృత్తి అర్థం చేసుకోవచ్చు. విషతుల్యమైన నరరూప రాక్షసుల ప్రభావం వల్ల, పరిస్థితులు సరిగా అదుపులోకి తెచ్చుకోలేక మతి చెడిపోతున్న వారు కూడా పెరుగుతున్నారు.
ఇట్లా ప్రతి మానవ సంబంధం సంక్షోభంలో పడి రక్తమోడుతోంది. అంతదాకా ఎందుకు?వాట్సాప్ గ్రూప్ లో, పేస్ బుక్, ఇంస్టా లాంటి సోషల్ మీడియా గ్రూపుల్లో తాను పెట్టిన మెసేజ్ కు లైక్స్, కామెంట్స్ వచ్చాయా? లేదా? అని మాటిమాటికీ చూసుకుంటూ మానసికంగా ఆగమాగమై పోతున్నవాళ్ళు మన కాళ్ళ ఎదుటే ఎందరో ఉన్నారు. ఫోన్ కాల్ ను వెంటనే అటెండ్ కాకపోయినా పిసుక్కుని చస్తున్నారు జనం. స్వార్ధం, ఆగ్రహం, అహం, ఆధిపత్య భావం, అధికార దర్పం వంటివి ఈ అఘాయిత్యాలకు ప్రేరేపకాలుగా అనిపిస్తున్నా వ్యక్తుల మానసిక ఆరోగ్యం అసలు కారణం.
ఒంటికి గాయాలు అయితోనో, జబ్బున పడితోనో ఆసుపత్రికి వెళ్లే మనం నిశ్శబ్దంగా నవనాదులను కుంగదీసి కలత, ఆందోళన, కంగారు, దడ, వికారం వంటి మానసిక రుగ్మతలను నిర్లక్ష్యం చేస్తున్నాం. హాయిని, ప్రశాంతతను, ఆనందాన్ని, జీవన మాధుర్యాన్ని ప్రభావితం చేస్తూ వ్యక్తులను అంతర్లీనంగా దెబ్బతీస్తున్న మెంటల్ హెల్త్ సమస్య సమాజానికి చెప్పనలవిగాని చేటు చేస్తోంది. సమాజంలో ఆనందాన్ని భయంకరంగా ఆవిరిచేస్తోంది.
144 దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన మెంటల్ హెల్త్ అట్లాస్ సర్వే ప్రకారం, దాదాపు వంద కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు మానసిక ఇబ్బందితో ఉన్నారని కూడా మరొక సర్వే చెబుతోంది. దాన్ని ఒక సమస్యగా చూడడం గానీ, వైద్య నిపుణుల సహాయం కానీ వారు తీసుకోవడం లేదు. సర్వేలు పక్కన పెట్టి చుట్టూ ఒకసారి చూస్తే మనకే మానసిక అనారోగ్యం తో ఇబ్బంది పడుతున్న వారు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. సర్వకాల సర్వావస్థలలో ఒకేరకంగా, ప్రశాంతంగా, మనిషిలాగ ప్రవర్తించే వారు దాదాపు కరువయ్యారు. మానసిక అలజడీ, తిక్క ప్రవర్తనా, అతి స్పందన, తీవ్ర ప్రవర్తన ఉన్నవారితోనే మనం సర్దుకుని, బిక్కుబిక్కుమని బతకాల్సి వస్తోంది. ప్రతిదానికీ రుసరుసలాడే వారు మనకు సర్వాంతర్యాములు అయ్యారు.ఇది సున్నిత మనస్కుల ప్రపంచం. క్షణికావేశాలు సర్వసాధారణం. ఈ అవాంఛిత వాతావరణంలో ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రపంచ ప్రాధాన్యంగా చేయాలన్న సమున్నత పిలుపుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్ 10 నాడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తోంది. మెంటల్ హెల్త్ గురించి ప్రతి ఒక్కరూ కొద్దిగా ఆలోచించాల్సిన తరుణమిది. పరపీడన పరాయణత్వం, ఇతరులను కాల్చుకు తినడం ఆపడం ఎలాగూ అయ్యే పనికాదు. ఎదుటి వాడిని కనికరం లేకుండా చిన్నచూపు చూడడం, హింసించడం అత్యంత సాధారణమైన ఈ రోజుల్లో ఇంటా బైటా మెంటల్ హెల్త్ గురించి చర్చ జరగకపోతే మన సమాజం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
వస్తు వ్యామోహ సంస్కృతి, పోటీ తత్త్వం ప్రబలంగా ఉన్న ఈ రోజుల్లో అనుక్షణం నవ్వుతూ బతకడం అంత తేలిక కాకపోయినా రోజులో ఉండే 24 గంటల్లో ఒకటి, రెండు గంటలు అయినా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మరీ పెద్ద కష్టం కాదు. ఇది తక్షణావసరం. మనిషి నివసిస్తున్న పరిస్థితులలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనుషులు, మనసులు, మమతలతో పనిలేదు. ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక్క మొబైల్ చేతిలో ఉంటే చాలు, ఏదో ఒక విధంగా బతికేయవచ్చు. ప్రతి చిన్న దానికీ ఏ ఐ టూల్స్ ని అడిగి సలహా తీసుకునే తరం వచ్చింది.
ప్రభుత్వాలు ఆరోగ్య రంగానికే నిధులు అనుకున్న స్థాయిలో కేటాయించని ఈ రోజుల్లో మెంటల్ హెల్త్ బడ్జెట్ గణనీయంగా ఉండాలని కోరుకోలేని పరిస్థితి. దాంతో పాటు, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం అవమానంగా భావించడం కూడా సమస్యాత్మకంగా ఉంది. మనసు మరీ బాగోలేక వైద్యుడిని సంప్రదించాలన్న స్పృహ లేకపోవడం ఒక సమస్య అయితే, ఒక వేళ కొందరు సంప్రదించినా సమాజం దాన్ని పిచ్చి కింద లెక్కగట్టి ప్రచారం చేయడం మరొక ఇబ్బందికరమైన సంగతి. ఈ విషయంలో జన్ జీ మెరుగ్గా ఉందనీ, మెంటల్ హెల్త్ కోసం ఆన్ లైన్ కన్సల్టేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయన్న సత్యం కొద్దిలో కొద్దిగా ఊరట ఇచ్చే అంశం.
మనిషి సంఘ జీవి (సోషల్ ఆనిమల్) అని గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు కానీ, వినూత్న ఆవిష్కరణలతో నిత్యం కొత్తపుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మనుషులను దగ్గరకు చేసి మనసులను దూరం చేయడం మన కళ్ళ ముందు జరుగుతోంది. అడ్డూ అదుపూ లేని సమాచారం ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ తో మొబైల్ లో వచ్చి వాలి బుర్ర మీద ప్రభావం చూపడంతో చిన్నా పెద్దా అల్లల్లాడుతున్నారు. తెలియని దేనికోసమో వెంపర్లాట ఎక్కువయ్యింది. కల్లోల సముద్రంలో పడవ ప్రయాణం ప్రమాదకరంగా ఉంది.
ఏంట్రా నాయనా.... అట్లా ఉన్నావ్? అని పలకరించి మనసుకు ఊరట ఇచ్చే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మాయమై పోవడం, ఎవడెట్లా పోయినా పర్లేదు గానీ తానూ సుఖంగా ఉండాలన్న స్వార్ధ చింతన బలపడడం, అనుకున్నది సాధించకపోతే చావడం తప్పు కాదన్న పిచ్చి సూత్రం వంటబట్టడం సమాజంలో కనిపించని నష్టాన్ని కలిగిస్తోంది. భౌతిక సంపదలు, సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఎక్కువగా పెరుగుతున్నాయో, దానికి రెట్టింపు అనుపాతంలో మానసిక దృఢత్వం తగ్గుతోంది. ఈ ప్రమాద ఘంటికలను అర్థం చేసుకుని విరుగుడు చర్యలు తీసుకోకపోతే అమెరికా తదితర దేశాల్లో మాదిరిగా రోడ్డు మీదికు వచ్చి కనిపించిన ప్రతి ఒక్కడినీ కాల్చిపారేసే లేదా గాయపరిచే మానసిక వికలాంగులు వర్ధిల్లుతారు.
మనిషి జీవితం ఒడిదొడుకుల సమాహారం అనీ, సమస్యలు ఎన్ని ఎదురైనా.... నవ్వుతూ బతకాలిరా... అన్న సూత్రాన్ని ఒక పెద్ద ఉద్యమంలా ప్రచారం చేయకపోతే, ఎప్పుడు ఎవరికి వెర్రి పెరిగి ఎవరిని నరికి పోగులు పెడతారో చెప్పలేం. ఆనందం పెంచే బృహత్ కార్యక్రమాన్ని, ఏవో కారణాల వల్ల మనసు వికలమై లో లో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి వ్యక్తి స్థాయిలో మొదలు కావాలి. నవ్వుతూ, నవ్విస్తూ ఉండకపోయినా పర్వాలేదు గానీ, సవాలక్ష సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి మీద మన మాటలు, చేతలతో ఇంకొంత భారం వేసి కుంగదీయకుండా ఉంటే అదే పదివేలు.
సిక్ మైండెడ్ జనాల సంఖ్య మరింతగా పెరిగి మన మనుగడకు పెను సవాలుగా మరకముందే వ్యవస్థ మేలుకోవాలి. బతుకుదాం, బతకనిద్దాం (లైవ్ అండ్ లెట్ లివ్) అన్న మాటను జీవన సూత్రంగా మార్చకపోతే మనకే కష్టం, నష్టం.