సెప్టెంబర్, నువ్వొక రక్త వర్ణ చంద్రుడివి

గీతాంజలి ‘12 నెలల కవితలు’. ఇపుడు సెప్టెంబర్ కవిత

Update: 2025-10-02 04:53 GMT

ఎలా వచ్చావు నువ్వసలు?

నీకేమైనా గుర్తుందా నీ ఆగమనం?

వేసవి నుంచి మెల్లిగా శరదృతువులోకి వచ్చావు!

ఎన్నింటిని తప్పించుకుని
మరెన్నింటినో వదిలించుకుని,
కావలసిన వాటిని వెంటేసుకుని
ఎలా,ఎలా వచ్చావో కదా సెప్టెంబర్!
*
ప్రపంచ యుద్ధం(2) నీలోనే మొదలైనా,
నీలోనే ముగిసిన గొప్ప ఓదార్పు కాలాన్ని కూడా
మోసిన అద్భుతానివి నువ్వు!
అప్పటి నుంచీ ఇప్పటి పాలస్తీనా దాకా
జాతి హత్యాకాండాల రక్తంలో తడుస్తూనే ఉన్నావు.
అడవి గర్భాలు ప్రసవిస్తున్న
నూతనమానవుల నిర్దాక్షిణ్య
ఎన్కౌంటర్లకు కన్నీట
అమరత్వ గీతాల్ని కూడా పాడుకున్నావు కదా!
*
శరద్రుతువులో లోకం లోని
తోటలన్నింటినీ రాలిన
ఆకుల తివాచీలుగా మార్చేస్తావు!
ఎండిన ఆకులు చేసే శబ్దంలో
చిట్లిన హృదయాల లోక సంగీతాన్ని వినిపిస్తావు!
కొమ్మని వీడిన ప్రతి ఆకు
వియోగ దుఃఖాన్ని తడుముతావు కదా సెప్టెంబర్!
రాలిన ఆకులు చెప్పే కథల్ని
అక్టోబర్ కి చెప్పటానికి మూటగట్టుకుంటావు!
*
వేసవికి వీడ్కోలు పలకడం
నీకు ఏమాత్రమూ ఇష్టం ఉండదు.
కానీ నిన్ను మోహించిన శరదృతువు
నీలో ప్రణయాగ్నిని రేపి
నిన్నిక నిలవనీయదు చూడు!
అప్పుడు నువ్వు, మీరా-మల్హర రాగంతో
మేఘాలను వేడుకొని వర్షంలో నీ దేహ తాపాన్ని
తడుపుకుంటూ, శరదృతువుతో
సమాగమానికి ఆరాటంగా వెళ్ళిపోతావు!
*
ఇది నీకు
ఎంత వింత కాలమో చూడు సెప్టెంబర్!
బతికుండగా అమ్మ నాన్నలను
మరిచిపోయిన ఆమ్నేషియా రోగగ్రస్తుల లాంటి పిల్లలు,
చచ్చాక "పితృపక్షం" అంటూ
పటాలకు పూజలు చేసి,పిండాలు పెట్టబోతారు!
వాళ్ల క్రూర హాస్యాన్ని చూసి గుండె
బ్రద్దలై తట్టుకోలేని నువ్వు
అక్టోబర్ నెలలోకి పారిపోయి దాక్కోబోతావు!

*
సెప్టెంబర్! ఈసారి నీకు నీ ఆకాశం,
మహా సౌందర్యవంతమైన రక్త వర్ణపు
ఎర్రని చంద్రుణ్ణి కానుకగా ఇచ్చింది.
నేలా, అడవిని ముంచుతూ ఎర్రని వెన్నెల
లోకమంతా పరుచుకుంది!
అంతేనా సెప్టెంబర్?
నీ ఆకాశం ఎంత లౌకికమైందో చూడు!
"ఈద్ మిలాద్ ఉన్ నబీ"
అంటూ నెలవంకని కూడా వెలిగించుకుంది!
*
నువ్వు ఊరకనే వెళతావా మరి సెప్టెంబర్?
పోతూ పోతూ..
ఈ లోకం పూజకి తిరస్కరించిన
పూలన్నింటినీ పేర్చి,
గడప గడపకీ బతుకమ్మలను,
వానాకాలపు ఖరీఫ్ పంటలను కానుకగా ఇచ్చి,
కడసారి అల్విదా చెబుతూ వెళ్ళిపోతావు!
**
ఇంకేముందీ,
మనుషుల నఖరాలను చూసిన నువ్వు
ఇక ఈ నెల రోజుల యాత్ర చాలనుకుంటావు!
మెల్లిగా వణికించే చలి కాలపు వెచ్చని
రజాయిలా మారిపోతూ,
అక్టోబర్ నెలలోకి మొహమాటంగా అడుగుపెడతావు.
అప్పటికే అంతులేని నిరీక్షణలో,
విరహంతో చలి నెగళ్లను వెలిగించుకున్న
అక్టోబర్ నీకో గజల్ ని కానుకగా ఇస్తూ,
నిన్ను వెచ్చగా కౌగలించుకుని
తనలోకి తీసుకుంటుంది!


Tags:    

Similar News