తెలంగాణ గిరిజన గూడెంలో ‘పుష్ప’ సూపర్ హిట్
గూడెంలో ఎటుచూసినా ‘పుష్ప దశావతారాలే’. ఊరందరికి ఇన్స్పిరేషన్;
-రామగిరి ఏకాంబరం
మడకం పుష్పారాణి ట్రాక్టర్ నడిపి పొలాన్ని దున్ననుంది. మిర్చి, వరి, పత్తి పంటల వ్యవసాయం అవలీలగా చేస్తుంది. చేనులకు మందు స్ప్రే చేస్తుంది. మేకలను పెంచుతుంది. తాటి చెట్టు ఎక్కి కాయలు తెంచుతుంది. ముంజలు వలుస్తుంది. ద్విచక్ర వాహనం వేసుకుని ఆచట్టుపక్కలెల్ల దూసుకుపోతూ అంతటా తానై కనిపిస్తుంది 33 సంవత్సరాల కోయ తెగకుచెందిన పుష్పారాణి.
నెత్తిన పత్తి మూటతో పుష్ప
పుష్పారాణికి 18 సంవత్సరాలకే పెళ్లిచేశారు. దీనితో చదువు ఆగిపోయింది. చదివితే కొలువు వస్తుంది. చదువు ఆగిపోయింది కదా అందుకే వ్యవసాయం కొలువు సృష్టించుకున్నానంటుంది. ఇపుడుమహిళా రైతు అంటుంది. సేద్యంలో ఆమె చేయని పనిలేదు. నేనెపుడు ఇది భారం అని భావించలేదు. సేద్యం జీవితం. జీవితం భారం ఎలా అవుతుంది అని ఎదురు ప్రశ్నవేస్తుంది.
వ్యవసాయం అనేది కేవలం పురుషులకే పరిమితమైన పనిగా భావించి సమాజంలో, తన పట్టుదల, కృషి, నిబద్ధతతో వ్యవసాయ రంగంలో సరికొత్త విజయాన్ని సాధించిన గిరిజన మహిళ మడకం పుష్పారాణి. మారుమూల గ్రామంలో జన్మించి, అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ, వ్యవసాయ రంగంలో తనదైన ముద్రవేసిన ఆమె జీవితం, అనేక మంది మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ యువతకు మార్గదర్శకం.
పంటకు మందు స్ప్రే చేస్తున్న పుష్ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరక్‌గూడెం మండలం, రాయన్నపేట గ్రామంలో కొమరం భూపతయ్య – శాంతమ్మ దంపతులకు జన్మించిన పుష్పారాణి వ్యవసాయ మధ్యే పెరిగింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తూ, చదువును కొనసాగించింది. ఇంటర్మీడియట్ వరకు చదువు పూర్తి చేసిన అనంతరం, అశ్వాపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మడకం సాదుతో వివాహం జరిపించారు. అయితే, వివాహం చదువు ఆపేసినా జీవితంలో ఎదుగుదలకు అడ్డంకిగా మారలేదు, జీవితాన్ని మరింతగా సవాల్‌గా తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇద్దరు పిల్లలను పెంచుతూ వ్యవసాయం చూసుకుంటూ, కిరాణా షాపు నడుపుతూ “అయ్యో, బతుకు భారమైంది,” అని ఎపుడూ నిస్పృహకు ఆమె లోను కాలేదు. ఈ మధ్యనే ఆమె భర్తకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఒక దఫా ఆయన సర్పంచ్ గా కూడా పని చేశారు. ఎపుడూ 2008 లో రాసిన పరీక్షకు ఇపుడు టీచర్ పోస్టింగ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు వద్దన్నా తాను వ్యవసాయం వదలడం లేదని ఆమె ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు.
పారపట్టిన పుష్ప
"సంపాదన కోసం పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేదు"
వివాహానంతరం పుష్పారాణి, సాధారణ గృహిణిగా కాకుండా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సంకల్పించింది. ఆమెకు ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమిని సక్రమంగా అభివృద్ధి చేసుకుని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని నిర్ణయించింది. కేవలం పొలంలో పనులు చేయడం మాత్రమే కాదు, ట్రాక్టర్ నడిపి పొలాన్ని దున్నడం, తాటి చెట్లు ఎక్కి కాయలు కోయడం,ముంజలు వలచడం, మేకల పెంపకం అన్ని పనులు చేస్తుంది.వీటితో పాటు కూడా కిరాణా షాప్ నిర్వహిస్తుంది.
తాటి చెట్టు మీద పుష్ఫ
“మహిళలు కూడా వ్యవసాయం చేయగలరు. వ్యవసాయం చేసుకుంటే సంపాదన కోసం పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేదు!" అని ఆమె చెప్పారు. చదువుకున్నమహిళలు ఉద్యోగాలు చేసినట్లు, గ్రామీణ ప్రాంతాలు సేద్యం, లేదా మరొక వృత్తి చేపట్టవచ్చు. ఈ కాలంలో ఇవి పురుషులు చేసేవి, అవి మహిళ్లు చేసే పనులు అనే విభజనకు అర్థం లేదు అంటుంది తాటి ముంజలు వలుస్తూ.
తాటిముంజలు వలుస్తూ పుష్ప
ఇది మగవాళ్ళు పని వ్యవసాయానికి బ్రాండ్ వేయడం ఆమె ఇష్టం లేదు.
ఆర్థిక స్వావలంబన – స్వశక్తితో సంపాదించుకున్న విజయపథం
కృషి, పట్టుదలతో పుష్పారాణి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంది. ప్రస్తుతం ఆమె ఏటా 5 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తూ, తన కుటుంబాన్ని ఆర్థికంగా స్వతంత్రంగా నిలిపింది. వ్యవసాయంతో పాటు, గొర్రెల పెంపకం, కిరాణా షాప్ నిర్వహణ, వరి రకం మార్పులు వంటి కొత్త ప్రయోగాలతో తన భూమిని మరింత లాభదాయకంగా మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. "కష్టపడి పని చేసే వాళ్లను విజయం ఎప్పుడూ వదిలిపెట్టదు!" అనేది ఆమె నమ్మకం.
పుష్ప కిరాణ షాపు
ఇలా శ్రమ చేయడంతో పుష్పారాణికి వూర్లో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ముక్కున వేలేసు కోవడానికి బదలు పుష్పారాణి కృషిని గ్రామస్థులు గర్వంగా చూస్తున్నారు.
గ్రామ పెద్ద పూనం విజయ్ మాట్లాడుతూ, “ఇలాంటి మహిళలు గ్రామాభివృద్ధికి దారి చూపిస్తారు. వ్యవసాయంలో మహిళల పాత్ర పెరిగితే గ్రామం బలపడుతుంది,” అని ప్రశంసించారు.
వ్యాపారి చిన్నూరి సంపత్ మాట్లాడుతూ, “పుష్పారాణి కేవలం తన కుటుంబాన్ని మాత్రమే కాదు, గ్రామంలోని ఇతర మహిళలను కూడా ఉత్సాహ పరిచింది. ఇవాళ మన గ్రామం వ్యవసాయంలో ప్రగతి సాధించడానికి ఆమె ఆదర్శంగా మారింది,” అని అభిప్రాయపడ్డారు.
మహిళలకు సందేశం – "మీరు కూడా సాధించగలరు!"
పుష్పారాణి తన కృషితో "సహనం, పట్టుదల, సమర్థత ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు" అనే సందేశాన్ని అందిస్తోంది.
వ్యవసాయం లాభసాటి కాదు అనేమాటని అంగీకరించదు. “వ్యవసాయాన్ని అనుబంధవృత్తులో జోడించుకొని ముందుకు పోవాలి. సాగుభూములు ఉన్న యువత వ్యవసాయాన్ని ఉపాధిగా తీసుకోవాలి,” అని చెబుతూ తాను మేకలు పెంచడం, తాటి ముంజలు అమ్మడం వల్ల రాబడిలో సమతౌల్యం వచ్చిందని ఆమె చెప్పారు.
" శ్రమిస్తే ఫలితం ఉంటుందనేందుకు నా విజయం నా శ్రమకు నిదర్శనం. ఇతరులు నన్ను నమ్ముతారా లేదా అనేది ముఖ్యం కాదు. నేను నన్ను నమ్ముకోవాలి!" అని అన్నారు.
(రామగిరి ఏకాంబరం, సీనియర్ జర్నలిస్ట్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా)