కనుమరుగవుతున్న మనిషి మహానేస్తం

పిచ్చుకలకు అనువైన నెలవుగా మన తోటలు, ఇళ్లు, భవనాలు, పట్టణాలు మారితేనే వాటి ఇంపైన కిచకిచలు వినగలుగుతాం.;

Update: 2025-03-25 12:08 GMT

ఓ ఉషోదయాన, రోజూ మాదిరిగానే ఒక కప్పు కాఫీ తీసుకుని వార్తాపత్రిక చేతబట్టుకున్నాను. పేజీలు తిరగేస్తూ ఉండగా, ఒక్కసారిగా ఓ శీర్షిక నా దృష్టిని ఆకర్షించింది—"ప్రపంచ పిచ్చుకల దినోత్సవం". క్షణికంగా ఓపికగా చదవాలనిపించింది. ప్రతి ఏడాదిగా లాగే మొన్న మార్చి 20న ప్రపంచ పిచ్చుక (house sparrow) ల దినోత్సవంగా జరుపుకున్నారు—అంటూ మొదలైన ఆ కథనం, నన్నొక సుదూర గతకాల జగత్తులోకి తీసుకెళ్లింది.

ఒకప్పుడు మా చిన్నప్పటి ఇంటి ముంగిట్లో, తోటల్లో, అల్లివేసిన మేడమీద ఏదో ఓ మూల, కిటికీ అంచుల్లోనూ పిచ్చుకలు (Passer domesticus) గూళ్లు కట్టేవి. ఉదయం లేవగానే, వాటి కిలకిలారావాలతో ఇంటి ఆవరణ కళకళలాడేది. నాన్న కప్పు కాఫీ గ్లాస్ పట్టుకుని ఇంటి ముందర కూర్చుంటే, పక్కనే నేనూ ఒక చిన్నచిన్న గింజలు చేతబట్టి నిలబడేవాడిని. కొద్ది సేపటికి అల్లంత దూరంగా ఉన్న పిచ్చుకలు దగ్గరకు వచ్చి ఆహారాన్ని తినటం చూసి ఆనందపడేవాడిని.

ఇప్పుడు ఆ మధుర జ్ఞాపకాలు కేవలం మనసులోనే మిగిలిపోయాయి. పిచ్చుకలు మాయమైపోయాయి. ఒకప్పుడు మన జీవితాల్లో అంతర్భాగంగా మెలిగిన ఈ చిన్నపక్షులు, క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి కోసం ఇప్పుడు ఎదురుచూడాల్సిన స్థితికి చేరుకున్నాం.

2018లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఇచ్చిన నివేదిక ప్రకారం, మానవులు & పిచ్చుకల బంధం 11,000 సంవత్సరాల నాటిదట! అంటే మనిషి వ్యవసాయ నాగరికత మొదలైనప్పటినుంచే వీటి ఉనికి మన జీవితంలో భాగమై ఉందన్నమాట.మానవ పరిసరాల్లోకి ప్రవేశించాక పిచ్చుక మని నేస్తం ( human-commensal)గా పరిణామం చెందడం మొదలయిందని శాస్త్రవేత్తలు చెబుతారు. దీనికి తగిన జన్యు అధారాలను కూడా కనుగొన్నారు.

హిందూ పురాణాల్లో వీటిని ప్రేమ, ఆనందం, అదృష్టానికి చిహ్నంగా విశ్వసించేవారు. ఇంటి పరిసరాల్లో కనిపించడం శుభపురస్కారం అని భావించేవారు.

కానీ, కొన్ని చోట్ల ఈ అమాయక పక్షులకు వ్యతిరేకమైన విశ్వాసాలు కూడా కనిపించాయి. చైనా వంటి దేశాల్లో పిచ్చుకల మెదడు యొక్క పేస్ట్‌ను వైద్యంలో కొన్ని రోగాల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోని కొన్ని సంస్కృతులలో అయితే, పిచ్చుక మెదడు కామోద్దీపన లక్షణాలు కలిగి ఉందని నమ్ముతున్నారు. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు.

చైనా లాంటి దేశాలలో ఈ పిచ్చుకల పేస్ట్ను దగ్గు, ఉబ్బసం, ఆమ్లత్వం మరి కొన్ని వ్యాధుల చికిత్సకు సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తునప్పిటికి వాటిని బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవు .

కొన్ని ప్రాంతాలలో పిచ్చుక మాంసాన్ని ఆహార వనరుగా కూడా వినియోగిస్తారు, అయితే ఇది సాధారణంగా లేదా విస్తృతంగా లభించే ఆహారం కాదు, అందువలన పిచుక మాంసం ధర స్థానం, సందర్భాన్ని బట్టి మారుతుంది. ఒక సందర్భంలో, ఒక కిలోగ్రాము పిచ్చుక మాంసం పేస్ట్ ధర దాదాపు రూ. 1,౦౦౦ పలికిందంట.


ఒకప్పుడు విస్తృతంగా వున్న పిచ్చుకల జనాభా తగ్గడానికి ముఖ్యమైన కారణాలను చుస్తే .

1. పట్టణీకరణ & అటవీ నిర్మూలన

నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కొత్త భవనాలు, రోడ్లు, పారిశ్రామిక ప్రాంతాల నిర్మాణం కోసం అడవులను నరికివేయడం జరుగుతోంది. దీంతో పిచ్చుకల సహజ నివాసాలు నశించిపోతున్నాయి. చెట్ల కొరత వల్ల అవి గూడు కట్టడానికి తగిన ప్రదేశాలు దొరకడం లేదు. అంతేగాక, మొక్కల తగ్గుదలతో పిచ్చుకలకు కావాల్సిన గింజలు, పురుగులు లభించకపోవడం కూడా వాటి జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

2. ఆధునిక భవన నిర్మాణం

పూర్వం కట్టిన ఇళ్లలో చూర్లు, పగుళ్లు, పైకప్పుల అంచులు ఉండేవి. వీటిలో పిచ్చుకలు సురక్షితంగా గూడు కట్టుకునేవి. కానీ నేటి ఆధునిక భవన నిర్మాణ శైలిలో ఇటువంటి నిర్మాణ శైలి పిచ్చుకలకు గూడు కట్టడానికి అనువుగా ఉండవు. దాంతో పిచ్చుకలు నివాస ప్రదేశాలు కోల్పోతున్నాయి.

3. పెరటి తోటల & పచ్చని ప్రదేశాల తగ్గుదల

ఇంతకు ముందు చాలా ఇళ్లకు పెరటి తోటలు ఉండేవి. ఈ తోటల్లో చిన్నచిన్న మొక్కలు, చెట్లు ఉండటంతో పిచ్చుకలకు గూడు కట్టేందుకు తగిన ప్రదేశాలు దొరికేవి. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ నియమాలు, స్థల కొరత వల్ల ఇలాంటి తోటలు తగ్గిపోతున్నాయి. దాంతో పిచ్చుకలకు సురక్షితమైన ప్రదేశాలు & ఆహార వనరులు సరిగ్గా దొరకడం లేదు.

4. రసాయన పురుగుమందుల వాడకం

నేటి వ్యవసాయ విధానాల్లో రసాయన పురుగుమందుల విస్తృత వినియోగం పెరిగింది. ఈ పురుగుమందులు పొలాల్లోని కీటకాలపై ప్రభావం చూపించి, వాటిని నాశనం చేస్తాయి. పిచ్చుకలకు ఆహారంగా ఉపయోగపడే పురుగుల జనాభా తగ్గిపోవడం వాటి జీవన విధానాన్ని క్షీణింపజేస్తోంది. దీనివల్ల పిచ్చుకలు ఆకలి సమస్యతో బాధపడుతూ నెమ్మదిగా తగ్గిపోతున్నాయి.

5.సాంప్రదాయ పద్ధతులు లేకపోవడం: స్త్రీలు పూర్వం తమ ఇళ్ల ఆరు బయట ధాన్యాలలోని పరకలను, వొడ్లను, విరిగిన గింజలను వేరుచేసి బయటకు విసిరివేసేవారు కోళ్లు, కాకులు, పిచుకలు తింటాయని. కానీ నేటి రోజుల్లో పిచ్చుకలకు ఆహారం అందించడం వంటి సాంప్రదాయ పద్ధతులు మరుగున పడుతుండటం మూలాన పిచ్చుకల ఆహార వనరు లబ్యత క్షిణిస్తుంది తద్వారా పిచ్చుకల జనాభా కూడా తగ్గు మొఖం పడుతావుంది.

6.ధాన్యాల కాలుష్యం

నేటి వ్యవసాయంలో వాడే రసాయన పురుగుమందుల అవశేషాలు ధాన్యంలో మిగిలిపోతాయి. ఈ కలుషిత ధాన్యాన్ని తినడం వల్ల పిచ్చుకలు అనారోగ్యానికి గురవుతున్నాయి. పురుగుమందుల ప్రభావంతో వాటి జీవన వ్యవస్థ దెబ్బతినడంతో పాటు, జననం తగ్గిపోతుంది. దీని వల్ల వాటి జనాభా క్రమంగా తగ్గిపోతోంది.

7.సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత వికిరణం (EMR) పిచ్చుకలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, పునరుత్పత్తి సమస్యలు, అభివృద్ధి సమస్యలతో పాటు మరణానికి కూడా దారితీస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ప్రభావాల పరిధి గురించి ఇంకా పరిశోధన జరగాల్సివుంది.

8. పావురాలు ఇతర పక్షులతో పోటీ: ఈ మధ్య పావురాల పెంపకం అర్బన్ ,రూరల్ ఏరియాలలో గణనీయంగా పెరిగింది. పిచ్చుకలు వాటి ఆహార వనరుల కోసం పావురాలు వంటి ఇతర పక్షి జాతుల నుండి పోటీని ఎదుర్కోవలసి వస్తుండటం మూలానా కూడా వాటి జనాభా తగ్గుమొకం పడుతావుంది

పిచ్చుకల జనాభా తగ్గడంతో పర్యావరణంపై కలిగే ప్రభావం

పిచ్చుకలు చిన్నపాటి పక్షులే అయినా, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వాటి పాత్ర కీలకం. ఇవి కేవలం మన ఇళ్ల వద్ద సందడి చేసే పక్షులుగా కాకుండా, కీటకాల నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. దోమలు, చీమలు, మిడతలు, చిన్న పురుగులు మొదలైనవి పిచ్చుకల ప్రధాన ఆహారం. కీటకాలను తినే పక్షులు లేకపోతే అవి అధిక సంఖ్యలో పెరిగి వ్యవసాయ పంటలకు నష్టం కలిగించవచ్చు.

వ్యాధులు పెరిగే అవకాశం – దోమలు అదుపులో లేకపోతే, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు విస్తరించే అవకాశాలు పెరుగుతాయి.

వ్యవసాయ రసాయనాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి – పురుగుల సంఖ్య అధికంగా పెరగడంతో రైతులు మరింత పురుగుమందులను వాడాల్సి వస్తుంది. దీని వల్ల నేల, నీరు, గాలి కలుషితమవ్వడంతో పాటు మానవ ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది.

విత్తన వ్యాప్తి, పరాగసంపర్కం: పిచ్చుకలు విత్తనాల వ్యాప్తికి మరియు మొక్కల పరాగసంపర్కానికి దోహదం చేస్తాయి, పరాగసంపర్కం మొక్కల పునరుత్పత్తి , పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.

పిచ్చుకల క్షీణత మొక్కల వైవిధ్యం మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

జీవవైవిధ్యం: పిచ్చుకలు ఉనికి పర్యావరణ వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వాటి క్షీణత పర్యావరణ అసమానతలను సూచిస్తుంది, ఇది జీవవైవిధ్యం తగ్గడానికి దారితీస్తుంది.

పిచ్చుకల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు

పిచ్చుకల జనాభా క్షీణత అన్నది చిన్న సమస్య కాదు. వీటి సంఖ్య తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.

అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, వాటి మనుగడకు అనుకూలమైన వాతావరణాన్ని అందించవచ్చు. పిచ్చుకలకు తగిన ఆవాసాలు కల్పించడం, ఈ వేసవి కాలంలో వాటికి నీటి వనరులను, ఆహార వనరులను అందించడం, తోటల పెంపకం లో రసాయనాల వినియోగాన్ని తగ్గించడం, పిచ్చుకలను కాపాడటానికి ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా పిచ్చుకల రక్షణ కోసం కీలకమైన పాత్ర పోషించవచ్చు. మన తోటలు, ఇళ్లు, భవనాలు, పట్టణాలు పిచ్చుకలకు స్నేహపూర్వకంగా మారితే, వీటి జనాభా తిరిగి పెరిగి, ప్రకృతి సంతులనం కాపాడబడే అవకాశముంది.

ముగింపు

పిచ్చుకలు మన ఇంటికి, పరిసరాలకు అందమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని మనం కాపాడుకోకపోతే, రాబోయే తరాలు కేవలం ఫోటోలు, పురాణాలు మాత్రమే చూసి వాటిని ఊహించాల్సిన పరిస్థితి వస్తుంది.

ఈసారి మార్చి 20 - ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నాడు, మన ఇంటి ముంగిట ఓ గూడు పెట్టె ఉంచుదాం... ఓ చిన్న గింజ చల్లుదాం... పిచ్చుకలను తిరిగి ఆహ్వానిద్దాం!

Tags:    

Similar News