పల్లెటూరిని అక్షర వనంగా మార్చిన ప్రొఫెసర్
ఆయప్ప లేకుంటే ఊరు యాడుంది అంటారు ఊరులోని జనం;
అడవినాథుని కుంట (ఎఎన్ కుంట) ఒక కుగ్రామం. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలకేంద్రానికి ఎనిమిది కిలోమీటర్లు, మదనపల్లికి ముప్పై కిలోమీటర్ల దూరాన ఉంటుంది. ఎక్కడో విసిరేసినట్లు ఉన్న ఊరు. పట్టమని ఎనభై ఇండ్లు ఉండవు, పంచాయతీ కూడా కాదు. మొన్నమొన్నటి వరకు విస్మృత గ్రామం. కాని ఇపుడావూరికి ఊరికి మోడల్ స్కూల్ వచ్చింది. జూనియర్ కళాశాల ఉంది., హై స్కూల్, ప్రాథమిక పాఠశాల, వంద మంది విద్యార్థులు ఉండటానికి వసతి గృహం ఉంది. స్పోర్ట్స్ విలేజ్ గా మారుతూ ఉంది. గ్రామీణ క్రీడల నిర్వహణకు స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు. ఊరిలో ఆయుష్మాన్ వెల్ నెస్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, పశు వైద్యశాల సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అన్నింటికి మించి అందరికీ అందుబాటులో చదువు. ఇదంతా ఒక వ్యక్తి అకుంఠిత దీక్ష ఫలితమే. 20 సంవత్సరాలుగా ఆయన చేసి కృషితో ఆ ఊరి రూపురేఖలు మారిపోయాయి.
ఆ వ్యక్తి పేరు ప్రొఫెసర్ కంజుల వెంకటరెడ్డి.
అనంతపురం జిల్లాలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పేరు చెప్పగానే గాంధీ వెంకటరెడ్డి గుర్తుకొస్తారు. అనంతపురం పట్టణంలో ఎన్నో అభ్యుదయ వేదికల రూపశిల్పి. నాస్తిక కేంద్రం, హేతువాద సంఘం, సెక్యులరిజం పరిరక్షణ సంస్థ, మానవ వికాస వేదిక, పౌర స్పందన వేదిక, సారా వ్యతిరేక ఉద్యమం, జనవిజ్ఞాన వేదిక, అభ్యుదయ వివాహ వేదిక లాంటి సంస్థలకు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు.
ముల్క్ రాజ్ ఆనంద్, గోరా, లవణం, వెనిగళ్ల సుబ్బారావు, గద్దర్, రావిపూడి వేంకటాద్రి, గుత్తా రాధాకృష్ణ మూర్తి, ప్రేమానంద్, సాంబశివరావు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజు, వివిలాల గోపాలకృష్ణయ్య లాంటి వారిని అనంతపురానికి పరిచయం చేసిన వ్యక్తి.
పదవీ విరమణ తరువాత ఉత్తమ పౌర సమాజ స్థాపనకు మూలాలైన విద్య వైద్యం మహిళా సాధికారత పర్యావరణం కళలు మానవీయ సంబంధాలు విద్య మానవ వికాసానికి, సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని తపించాడు. తన విశ్రాంత జీవితాన్ని తన గ్రామ అభివృద్ధికి ధారపోసాడు.
అడవినాథునికుంట వెంకట రెడ్డి గారి స్వగ్రామం వెంకట రెడ్డి గారు 60 సంవత్సరాల కిందట షెడ్యూలు కులానికి చెందిన ఎన్ ఈ భాగ్యవతి గారితో వివాహం వీరికి
సృజన, సుమన, స్పందన, సహన . డా సృజన డా బృహస్పతి కులాంతర వివాహం అమెరికా
డా. సుమన డా. సతీష్ ఆస్ట్రేలియా లో ఉంటారు డా. స్పందన డా పుష్కర్ సింగపూర్ లో ఉంటారు
సహన బాబు గోగినేని ఆస్ట్రేలియా లో ఉంటారు
అందరూ కులాంతర మతాంతర వివాహాలు చేసుకుని స్థిరపడ్డారు . వెంకట రెడ్డి పరివర్తన అనే సంస్థ నిర్వహిస్తున్నారు ( మానవవాద సాంఘిక మార్పు సమాఖ్య)
ఈ వూర్లోని స్కూలు ప్రభుత్వ పాఠశాల మోడల్ జూనియర్ కళాశాల, జెడ్పి హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రం, హాస్టల్ అన్నీ ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి, అయే, వాటికి స్థలాన్ని వెంకట రెడ్డి గారు డొనేట్ చేశారు. తనకున్న చింత చెట్ల ద్వారా వచ్చే ఆదాయం స్కూలు కు ఇస్తుంటారు.
గ్రామాన్ని చక్కబెట్టడం ద్వారా మనిషి విశ్వమానవుడు అవుతారని నమ్మాడు. ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకుని ఆయన భార్య ప్రొఫెసర్ భాగ్యవతి కూడా ఆయన బాటపట్టారు. భాగ్యవతి అనియత విద్య వయోజన విద్య లో ఆచార్యులుగా పనిచేసి రిటైర్ అయిన తరువాత మదనపల్లి కి మకాం మార్చారు.
ఈ ఆదర్శ పాఠశాల స్థాపించడమే కాదు అందుకు అనువైన వసతులు, రవాణా మౌలిక సదుపాయాల రూపకల్పన ఉపాధ్యాయుల ఎంపిక అలాగే పాఠశాల వాతావరణం స్ఫూర్తిదాయంగా మార్చడం, దీని కోసం జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ఆమె తోడ్పడ్డారు.
ఈ విద్యాసంస్థలో ఆవరణలో ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం స్టేజి నిర్మించారు. అందులో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ఏర్పాటు చేయడమైనది. పిల్లల్లో సృజనాత్మకత నింపడానికి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తారు. సమాజ పురోభివృద్ధికి ప్రతిబంధకాలైన అవిద్య, అజ్ఞానం మూఢ నమ్మకాల పై అవిశ్రాంత పోరాటం ద్యేయంగా ఎంచుకున్నారు. వాటి నిర్మూలన కోసం కళాజాతలు, పాట మాట, నాటికలు, వీధి ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తూ సమాజ సమగ్రత కోసం పరితపించే వ్యక్తి ప్రొఫెసర్ వెంకట్.
దేశంలోని చాలా గ్రామాల ప్రజలకు ఇప్పటికీ విద్య అందుబాటులో లేదు. ఆరోగ్య సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, క్రెడిట్, మార్కెట్ సమాచారం అందుబాటులో లేవు. దీనికి భిన్నంగా ఒక గ్రామాన్ని ఆదర్శవంతంగా తయారు చేయడం చాలా కష్టం. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలోని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయడం ఇంకా కష్టం. అభివృద్ధికి ప్లాన్ తయారు చేసి అమలుచేయడంలో చాలా అవరోధాలను ఎదుర్కోవచ్చు. గ్రామాభివృద్ధి అనేది గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యత మెరుగుపరిచే ప్రక్రియ. దీనికోసం ఉద్యోగాలు సృష్టించాలి. జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి స్థానిక వ్యాపారాలు పెంచాలి. వనరుల కేటాయింపు జరగాలి. అట్టడుగు వర్గాలకు అధికారం కల్పించడం మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యానవనాలతో కాంపాక్ట్ సెటిల్మెంట్లను నిర్మించడం విద్యుత్ వంటి సేవలను అందించడం, స్థానిక వనరులను నైపుణ్యాలను వినియోగంలోకి తీసుకురావడం జరగాలి. ఈ దిశలో ముందుకు సాగుతున్న గ్రామం ఎఎన్ కుంట.