‘హక్కులను కాలరాయడం దినచర్య అయిపోయింది’
ఖైదీల పరిస్థితిని తెలుసుకోవడానికి మానవ హక్కుల సంఘాలను అనుమతించాలి.;
‘దేశంలో ఏ మాల చూసినా ప్రతిరోజూ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. హింస, అత్యాచారం, హత్యలు లేకుండా ఏ ఒక్క రోజు లేదు. దీనికి తోడు భావప్రకటనా స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు, ఆత్మాభిమానంతో జీవించే హక్కు, పత్రికా స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ, అణచివేతతో పాటు భయకంపిత వాతావరణం అలుముకుంది.’ అని మానవ హక్కుల జాతీయసదస్సు ఆవేదన వ్యక్తం చేసింది.
‘మానవహక్కులు, లౌకికత్వం’ అన్న అంశం పైన గత ఆదివారం న్యూఢిల్లీలోని గాలిబ్ ఇన్ స్టిట్యూట్ హాల్ లో సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్(సీపీడీఆర్ఎస్) జాతీయ కన్వీనర్లు ప్రొఫెసర్ కుంచె శ్రీధర్, ద్వారకానాథ్ రథ్ ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు ఈ కింది తీర్మానాలను ఆమోదించింది.
‘ప్రాథమిక హక్కులకు, ప్రాజాస్వామిక హక్కులకు, పౌరహక్కుల వంటి అన్నిరకాల చట్టబద్దమైన హక్కులకు, భావప్రకటనా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలకు భద్రత కల్పించాలి. చట్టవ్యతిరేక చర్యల నిరోధక చట్టం(ఉపా), భద్రతా బలగాల ప్రత్యేక రక్షణ చట్టం, (ఏ.ఎఫ్.ఎస్.పి.ఏ), జాతీయ భద్రతా చట్టం(ఎన్ ఎస్ ఏ), తదితర అన్ని రకాల నిరంకుశ చట్టాలను ఉపసంహరించుకోవాలి. మతోన్మాదాన్ని అరికట్టి, లౌకికత్వాన్ని పరిరక్షించి, కాపాడాలి.
దీర్ఘ కాలంగా ఉన్న కేసులను తక్షణం విచారించి, న్యాయాన్ని చేకూర్చాలి. ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయడానికి పోలీసు బలగాలను ఉపయోగించడాన్ని మానుకోవాలి. కస్టడీలో చిత్రహింసలను, హత్యలను నిలిపివేసి, అంతర్జాతీయ నిబంధనల మేరకు లాకప్ లో ఉన్న ఖైదీల పరిస్థితులను, జైళ్ళల్లో, అంతర్గత జైళ్ళల్లో ఉన్న ఖైదీల పరిస్థితిని తెలుసుకోవడానికి మానవ హక్కుల సంఘాలను అనుమతించాలి.
నిరసన తెలిపే వారికి, ఆందోళనచేసేవారికి ఉన్న హక్కులను ఉల్లంగించ కూడదు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలన్నిటినీ ఉపసంహరించుకోవాలి. మహిళలపైన, ముఖ్యంగా వారు పనిచేసే స్థలాల వద్ద జరిగే దౌర్జన్యాలను అరికట్టి, దీనికి సంబంధించిన వర్మ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపి, పిల్లలపైన జరిగే అన్నిరకాల దౌర్జన్యాలను, ముఖ్యంగా మహిళలను, పిల్లలను వ్యభిచారంలోకి దింపే చర్యలను అరికట్టాలి.
అందరికీ విద్య, ఆరోగ్యం, ఉపాధి పొందే హక్కులను అమలుచేయాలి. సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలన్న నిబంధనను అమలు చేయాలి. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించే చట్టాలను ప్రవేశ పెట్టాలి.’ వంటి తీర్మానాలను 22 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాలతో పాటు పాలస్తీనా పైన కూడా చేసిన తీర్మా నా న్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.
పాలస్తీనా ప్రజల పోరాటానికి సంఘీభావంగా..
‘ప్రజాస్వామిక హక్కులు, మానవహక్కులు,లౌకికత్వం, పౌర స్వేచ్ఛ వంటి వాటి గురించి చర్చించడానికి మనం ఇక్కడ సమావేశమైన సమయంలో, గతంలో కనీవినీ ఎరుగని దారుణమైన కాలంలో ప్రపంచం సాగిపోతోంది. వివిధ దేశాల్లోని కార్పొరేట్ కార్యాలయాల్లో జరుగుతున్న యుద్ధాలు, ధరల యుద్ధాలు, వ్యాపార యుద్ధాల భార మంతా సామాన్యుల పైన పడుతోంది. ఉక్రెయిన్ కావచ్చు, సిరియా కావచ్చు, లెబెనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, ఈ భూగోళంలో సగ భాగం మారణ యుద్ధాలతో నిండిపోయింది. వీటి వల్ల బాగా దెబ్బతినేది పిల్లలు, మహిళలు.
అన్ని మానవీయ విలువలను వదిలేసిన ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రజలపైన అమానుషమైన జాతి నిర్మూలనా యుద్ధాన్ని చేస్తోంది. పాలస్తీనాలోని అన్ని ప్రాంతాల్లో పిల్లలను, స్త్రీలను పెద్ద ఎత్తున చంపేస్తోంది. నివాసాలపైన, ఆస్పత్రులపైన, పాఠశాలలపైన మాత్రమే కాదు, పునరావాస శిబిరాలపైన కూడా దాడిచేస్తోంది. అమెరికా సాగిస్తున్న ఆయుధ పోటీలో జియోనిస్ట్ ఉన్మాదంతో ఇజ్రాయిల్ సాగిస్తున్న ఈ మారణహోమాన్ని మేం ఖండిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తరచూ జరిగే యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలకు భారత ప్రభుత్వం అనుమతించకపోవడం మరింతగా ఖండించదగింది. ఇటీవల జమ్ము కశ్మీర్ లోని బారాముల్లా, బుడ్ గాం జిల్లాల్లో జరిగిన పాలస్తీనా అనుకూల ప్రదర్శనలను నిర్వహించిన వారిపై చట్టవ్యతిరేక చర్యల నిరోధక చట్టం(ఉపా) కింద భారత ప్రభుత్వం కేసులు పెట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా యుద్ధవ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. పాలస్తీనాలో జరుగుతున్న జాతి నిర్మూలనా యుద్ధానికి వ్యతిరేకంగా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. పోలీసుల నుంచి దారుణమైన, హీనమైన అణచివేతను ఎదుర్కొంటున్నప్పటికీ వీరు వీరోచితంగా పోరాడుతున్నారు. వందలాది మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, అనేక మంది గాయపడుతున్నారు, జైళ్ళ పాలవుతున్నారు. కాలేజీల్లో అనేక ఆంక్షలకు గురవుతున్నారు, ఉద్యోగాలను మాత్రమేకాదు, అమెరికాలో తమ పౌరసత్వాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నా, పాలస్తీనాకు సంఘీభావంగా తమ నిరసన ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. వీరి వీరోచిత పోరాటానికి నమస్కరిస్తూ, భారత దేశంలో యుద్ద వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించడానికి వారి నుంచి స్ఫూర్తిని పొందుతున్నాం.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ తో సీ పీ డీ ఆర్ ఎస్ కు అనుబంధంగా ఉన్న పౌర చైతన్య వేదిక తిరుపతి జిల్లా ప్రతినిధులు.
ఈ సదస్సు పాలస్తీనా ప్రజల పోరాటానికి సంఘీభావం తెలుపుతోంది. భారత దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాపితంగా యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని బలపరచి ముందుకు తీసుకుపోవాలని కోరుతోంది.’