ఇల్లు మారాలి ( ఆదివారం కవిత)
ఇల్లు మారడం సామాన్లన్నింటిని మరో ఇంటికి తరలించడం కాదు. పాత ఇంటి గోడగోడకు అత్కుకు పోయిన జీవితం పొరల్ని జాగత్రగా చిరిగిపోకుండా వూడదీసి మోసుకెళ్లడం...ఎంత కష్టం...
By : The Federal
Update: 2024-03-10 03:21 GMT
ఇల్లు మారాలి !
--గీతాంజలి
ఇల్లు మారాలి ..
ఇల్లొక్కటేనా మారేది ?
నా సమస్త అనుభూతుల్ని ఇంటితో పాటు మోసుకెళ్లాలి.
ఇల్లు మారడమంటే...ఉన్న ఇంటిని..
నేను ప్రేమించిన ఇంటిని అతలాకుతలం చేయడమే కదా...
ఇంటిని అవమానించడామేగా ?
హృదయంతో అక్కువ చేర్చుకున్న ఇంటిని...
అమ్మ కొంగులా నీడ నిచ్చిన ఇంటిని ..
నువ్విక వద్దని విడిచి వెళ్లిపోవడమేగా..?
ఇల్లో..నేనో వియోగ దుఃఖాన్ని భరించడమేగా..
నా అడుగులు ముద్దాడిన ఇల్లు...
నా ఏకాంతపు ఒంటరి తనానికి
"చుప్ కే.. చుప్ కె రాత్ భర్ ఆంసూ బహనా యాద్ హై.".అంటూ
గులాం అలీ గజల్ ల్లా.. తోడై ఓదార్చిన ఇల్లు..
నిద్రరాని నా రాత్రుల్లోకి
వెన్నెలని ఒంపి నన్ను నిద్రపుచ్చిన ఇల్లు..
అంతేనా ..
నా నిద్రలోకి కొన్ని మధురమైన కలల్ని
నా కనురెప్పల తలుపులు తీసి కళ్ళల్లోకి పంపిన ఇల్లు కాదూ ఇది ?
ఇది ఒక్క ఇల్లేనా..
హృదయంలా స్పందించిన మనిషి కదూ ఈ ఇల్లు ?
నేను నవ్వితే నవ్విన ఇల్లు..నేను ఏడిస్తే తానూ ఏడ్చేసిన ఇల్లు !
ఎలా..ఖాళీ చేసి వెళ్లను ?
నాలాగా ..నన్ను తలుచుకోకుండా ఉంటుందా ఈ ఇల్లు ?
నేను వెళ్ళిపోయాక నేను మిగిల్చిన శూన్యంలో వచ్చి నిలుచున్న అపరిచితుల్ని చూసి భయపడి ..బెంగటిల్లిపోదూ నా ఇల్లు..
నా కోసం తల్లడిల్లుతూ పసిదానిలా దిక్కులన్నీ వెతుక్కోదూ ?
కొత్త ఇల్లు ..
నా ప్రాణ పదమైన పుస్తకాల్ని..పదిలంగా ఉంచుతుందా..
నాకు ఇష్టమైన కిటికీ మూలని..
కిటికీకి ఆవల ఆకు పచ్చని బాదం చెట్టుని..
ప్రక్కనే ప్రేయసిలా తీగలు చుట్టుకున్న పరిమళాల మాధవీ లతని ఇస్తుందా ?
ఇదిగో..పిట్టల్లా గోల చేస్తూ ఆటలాడే
చిన్న పిల్లల లేత గొంతుల సెలయేటి చప్పుడు లాంటి సంగీత సరిగమల్ని ..
బాల్కనీలో కరివేపాకు చెట్టుని గూడు చేసుకుని..
నాతో పాటు ఈ ఇంట్లో సాధికారత సంపాదించిన చిన్ని పక్షుల కువ కువ..వినిపిస్తాయా ?
అవునూ..వీటన్నింటినీనా ఇప్పటి ఇల్లు వేసవిలో మల్లె పూల పొట్లంలా .
..అమ్మ మమకారంతో వడ్డించిన అన్నం కంచంలా ఇచ్చినట్లు...
కొత్త ఇల్లు ఇస్తుందా...
ఏమో..
నా కథలన్నీ విన్న పురా జ్ఞాపకం కాబోతున్న ఈ ఇంటినే అడగాలి.
వెళ్లిపోయే ముందు
ఈ ఇంటి గోడల్ని గాఢంగా కౌగలించుకుని ...
వీడ్కోలు కవిత ఒక్కటైనా ఈ గోడల మీద రాయాలి !
ఎండా వానల నుంచి..
గాయం చేసే మనుషుల నుంచి పారిపోయి వచ్చే నన్ను తనలోకి దాచుకున్న
ఈ ఇంటి తలుపుకి ఒక దుఃఖపు ముద్దు ఇచ్చి మరీ కదలాలి !
తప్పదిక...
ఇల్లు ఖాళీ చేయాలి !
-