రాజ్యాంగం నిర్మాణంలో సప్తరుషులున్నా అంబేద్కర్ సారథ్యమే కీలకం
జనవరి, 26, 2025 : 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ప్రత్యేక వ్యాసం;
కేవలం ఈ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యవస్థలో అసమానతలను, వివక్షను అంతం చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగ రూపొందించినపుడు తాను ఉండాలని బి ఆర్ అంబేడ్కర్ అనుకున్నారు. కాని అధ్యక్షుడుగా ఎదిగి, ఆ తరువాత మొత్తం భారత రాజ్యాంగ సంవిధానానికి నిర్మాత అయినారు. ఎనిమిది గంటల పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు, మరెందరో అయిన హక్కుకలకు కారణం ఈయనే. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలనడం అంబేడ్కర్ సిద్ధాంతం. "రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగాలంటే, సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా ఉండాలి. సామాజిక ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని జీవిత సూత్రాలుగా గుర్తించే జీవన విధానం" అని ఘంటాపథంగా చెప్పారు. అంతేకారు భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపనలో అంబేడ్కర్ ప్రతిపాదించిన ఆర్థిక సిద్ధాంతాలు కీలక పాత్ర నిర్వహించారు.
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త. 1891లో జన్మించారు. ముంబయిలోని ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చేరిన తొలి దళిత విద్యార్థి అంబేడ్కరే. 1912లో బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా సాధించి తరువాత బరోడా రాజ్యంలో ప్రభుత్వం ఉద్యోగంలో చేరారు. 1913లో అమెరికాలోని కొలంబియా యునివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1923లో బొంబాయి(ముంబై)లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసారు. 1927లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు. 1930లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత 1947లో మొదటి న్యాయశాఖ మంత్రి. రాజ్యాంగ రచనా ఉప సంఘంలో అధ్యక్షుడు.
(1947 ఆగస్టు 29 నాడు)
భారత రాజ్యాంగం రచనలో సప్తరుషులు
కూర్చున్న వారు ఎడమ నుంచి కుడికి : 1. దేబీ ప్రసాద్ ఖైతాన్, (డిపి ఖైతాన్), (తన మరణంతో తరువాత వారు టీటీ కృష్ణమాచారి చేరారు) 2. సర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా , 3. బాబాసాహెబ్ అంబేద్కర్, 4.అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, 5. సర్ బెనెగల్ నర్సింగ రావ్: నిలుచున్న వారు: 6. సర్ బ్రొజేంద్రలాల్ మిట్టర్(బి ఎల్ మిట్టర్), 7. కె ఎమ్ మున్షీ, 8. సర్ నరసింహ గోపాలస్వామి అయ్యంగార్.( శ్రీమిట్టర్ స్థానంలో మాధవరావు వచ్చారు)
మన రాజ్యాంగ నిర్మాతలు
దేబీ ప్రసాద్ ఖైతాన్ (తరువాత చేరిన వారు టీటీ కృష్ణమాచారి)
దేవి ప్రసాద్ ఖైతాన్ సుప్రసిద్ధ న్యాయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు, గొప్ప రాజకీయవేత్త. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థి. 'ఖైతాన్ & కో' లా ఫర్మ్ వ్యవస్థాపకులు. మొదటి రోజుల్లో ప్రైవేటు న్యాయ సంస్థల్లో నిర్మించారు. 1911లో తన సోదరులతో కలిసి ఈ సంస్థను స్థాపించారు. 1925లో ఏర్పడిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సహ వ్యవస్థాపకులు కూడా. రాజ్యాంగ నిర్ణాయక సభ (Constituent Assembly) రచనా కమిటీ సభ్యుడుగా కొద్దికాలం నిర్వహించినా 1948లో వారు మరణించడం వల్ల ఆ స్థానంలో టీటీ కృష్ణమాచారి ఆయన భర్తీ చేశారు.
సర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా
సయ్యద్ మహ్మద్ సాదుల్లా మరో ప్రసిద్ధ 1910 నుంచి న్యాయవాది, అస్సాం ముస్లిం లీగ్ నాయకుడు. 1885లో అస్సాంలోని గౌహతిలో జన్మించారు. గౌహతిలోని కాటన్ కాలేజీ, కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సర్ బిరుదు సాధించారు. 1936లో బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి అస్సాంకు తొలి ముఖ్యమంత్రి అయినవారు. కాని 1938లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి రాజీనామా చేసారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి డ్రాఫ్టింగ్ కమిటీకి ఎన్నికైన ఒకే ఒక్క సభ్యుడు సాదుల్లా. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న ఒకే ఒక్క ముస్లిం లీగ్ సభ్యుడు కూడా. అస్సాం ఆర్థిక స్థిరత్వం, మైనారిటీ హక్కులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
అంబేడ్కర్ తరువాత, మరో సందర్భంలో వారికన్న గొప్ప నిర్మాతకుడనగలిగే రచనా సంఘంలో ప్రధాన సభ్యుడు సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. వివిధ దేశాల రాజ్యాంగాల గురించి, ఉండవలసిన రీతిలో నిర్మించవలిసిన న్యాయవ్యవస్థ గురించి కృష్ణస్వామి అయ్యర్ తెలిసిన వారు. ఆయనది అపారమైన జ్ఞానం కలిగిన గొప్పవాడని అంబేడ్కర్ స్వయంగా అంగీకరించారు. "నా కన్నా మెరుగైన, సమర్థవంతులైన వ్యక్తులు. నా స్నేహితుడైన కృష్ణస్వామి అయ్యర్ వంటి కమిటీలో ఉన్నారు కదా‘‘ అని అంబేడ్కర్ ముగింపు ప్రసంగంలో పేర్కొన్నారు. కృష్ణస్వామి అయ్యర్ రాజ్యాంగ సభ లో అనేక కమిటీల్లో ముఖ్యమైన వ్యక్తి.
రాజ్యాంగంలో ఛేర్చవలిసిన పౌరసత్వ హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి బలంగా వాదించారు కృష్ణస్వామి అయ్యర్. "పౌరసత్వానికి హక్కులు, బాధ్యతలు కూడా ఉంటాయని" వాదిస్తూ పౌరసత్వ రాజ్యాంగ నియమాలను ఆర్టికల్ 5 లో చర్చించిన వారు అల్లాడి. మరో సందర్భంలో లౌకికరాజ్య ఎందుకు అవసరమో వివరిస్తూ, "మన విధానాలు, నిబద్ధత విషయంలో జాతి, మత లేదా ఇతర ప్రాతిపదికన వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య బేధాలు చూపకూడదు" అని స్పష్టంగా చెప్పారు. తమిళ కుటుంబానికి చెందిన అయ్యర్ 1883లో నెల్లూరులో పుట్టారు. ఈ ప్రాంతం అప్పట్లో మద్రాస్ స్టేట్‌లో ఉండేది. 1930లో దివాన్ బహదూర్ బిరుదును, 1932లో సర్ బిరుదును సాధించారు. న్యాయవాది. 1929 నుంచి 1944 వరకు మద్రాస్ స్టేట్‌కు అడ్వకేట్ జనరల్‌గా వ్యవహరించారు. వ్యక్తిగత కొందరి స్వేచ్ఛకన్నా వారి హక్కుల కన్నా, మొత్తం దేశరక్షణకోసం, సమాజం ముఖ్యమన్నారు. "దేశంలో శాంతి, సుస్థిరత ఉంటేనే భావప్రకటనా స్వేచ్ఛ, ప్రభుత్వం ఏర్పరుచుకునే హక్కు, ఇతర హక్కుల వంటివి వర్థిల్లుతాయి. దేశానికి భద్రత లేకపోతే ఈ హక్కులు అమలుకావు" అని స్పష్టంగా వాదించారు. రాజ్యాంగ సంవిధానాన్ని నిర్మించిన కీలకమైన పనిచేసిన అల్లాడి ఆ తరువాత అయ్యర్ మళ్లీ న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1953లో కన్నుమూశారు. ఆయన కుమారుడు అల్లాడి కుప్పుస్వామి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన వాడు. (ఈ రచయిత న్యాయమూర్తి కుప్పుస్వామిగారి ఆశీస్సులు తీసుకుని న్యాయవాదుల సంఘానికి చేరాను)
సర్ బెనెగల్ నర్సింగ రావ్ (బిఎన్ రావ)
ఇప్పడికీ కొందరు మన భారత రాజ్యాంగాన్ని రచించిన వారు అంబేడ్కర్ కాదనీ, బి ఎన్ రావ్ అని వాదించే వాళ్లున్నారు. సర్ బెనెగల్ నర్సింగ రావ్ బ్రిటిష్ పాలనలో తయారు చేసిన 'భారత ప్రభుత్వ చట్టం 1935' ఆ తరువాత రాజ్యాంగానికి ఇదే మూలరూపమనీ అనేవారూ ఉంటారు. అయితే ఆ 1935 రూపకల్పనలో బి ఎన్ రావ్ కీలక పాత్ర నిర్వహించారు. అంతే కాదు. అంతకుముందు 1948 ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం తొలి ముసాయిదాను బీఎన్ రావు గారే తయారుచేశారు. వివిధ దేశాల రాజ్యాంగాలను స్వయంగా అధ్యయం చేసి, ఆయా ప్రముఖులను కలిసి రాజ్యాంగ సాధికారిక వ్యక్తులతో చర్చించినారు. అమెరికా, కెనడా, ఐర్లండ్, బ్రిటన్ వంటి దేశాలలో పర్యటించి అక్కడి న్యాయమూర్తులు, పరిశోధకులు, అధికారులతో చర్చించారు. ఆయా దేశాల రాజ్యాంగాలను నిశితంగా పరిశీలించారు.
బీఎన్‌రావు 1909లో బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వెంట్‌గా చేరారు. తొలి పోస్టింగ్ బెంగాల్‌లో, తరువాత న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేసారు. అనేక కోర్టులలో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలు కమిటీలలో, పలు ముసాయిదాల తయారీలో ప్రముఖమైన వ్యక్తి.
బీఎన్ రావు సేవలకు గుర్తింపుగా 1938లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 'సర్' బిరుదును ఇచ్చింది. అంతకుముందు 1934లో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (సీఐఈ) పురస్కారాన్ని అందించింది. తరువాత కాలంలో, బీఎన్‌రావు అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా (1952-53) వ్యవహరించారు. 1950 నుంచి 1952 వరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రతినిధిగా ఉన్నారు.
సర్ బ్రొజేంద్రలాల్ మిట్టర్ (ఆ స్థానంలో ఎన్ మాధవరావు)
సర్ బ్రొజేంద్రలాల్ మిట్టర్ (బి ఎల్ మిట్టర్) పశ్చిమ బెంగాల్‌కి చెందిన బీఎల్ మిట్టర్ బరోడా దివాన్‌గా వ్యవహరించారు. భారత్ రాజ్యాంగ రచనలో భాగంగా, దేశంలో ప్రిన్స్‌లీ స్టేట్స్ విలీనం కావడానికి నియమాలు, దేశ, రాష్ట్ర, జిల్లా పాలనకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. (అనారోగ్యం కారణంగా మిట్టర్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఎన్ మాధవరావు రచనా ఉప సంఘం లోకి వచ్చారు.)
కె ఎమ్ మున్షీ
కన్నయ్యలాల్ మాణిక్‌లాల్ మున్షీ న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడు. ఘనశ్యామ్ వ్యాస్ అనే కలం పేరుతో అద్భుతమైన రచనలు చేసిన వ్యక్తి. వీరే 1938లో గాంధీ సహాయంతో 'భారతీయ విద్యా భవన్' స్థాపించారు. మున్షీ 1887లో గుజరాత్‌లో జన్మించారు. బరోడా కాలేజీలో చదువుకున్నారు. 1907లో ముంబై లో న్యాయవాదాన్ని చదివారు. న్యాయవాది ప్రాక్టీస్ చేస్తూ అనేక చారిత్రక నవలలు రచించారు.
1916లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరి స్వతంత్రోద్యమంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుకుగా పనిచేసారు. తరువాత రాజ్యాంగం రచన సంఘంలో అనేకానేక కమిటీల్లో సభ్యుడు కూడా. రాజ్యాంగ రచనలో భాగంగా ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, మైనారిటీ హక్కుల చర్చల్లో కీలక పాత్ర పోషించారు. 1953 వరకు వ్యవసాయ, ఆహార మంత్రిగా పనిచేసారు. వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడే, దేశంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు 'వన్ మహోత్సవ్' ఉద్యమం వలె ఇప్పడికీ నిర్వహించారు. 1971లో తన 83 ఏట మరణించారు.
సర్ నరసింహ గోపాలస్వామి అయ్యంగార్.
ఎన్ గోపాల స్వామి అయ్యంగార్ గారిని ఎన్ జి ఏ అని పిలిచేవారు. మద్రాస్ నుంచి సివిల్ అధికారిగా పనిచేసారు 1937లో జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. ఆ రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేయించారు. రాజ్యాంగ సభలో ఎన్నికై మొత్తం అయిదు కీలకమైన కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. వాక్ స్వాత్రంత్ర్యం, భూములు సేకరిస్తే నష్టపరిహారాలు ఇవ్వడం, శాసనసభతో మరో మండలి ఉండాలని వాదించిన వారాయన. ఆంగ్లేయ రాజులు ఇచ్చిన అవార్డ్ లు కైట్ గుడ్ వంటి గొప్ప పురస్కారాలను తిరస్కరించిన దేశభక్తుడాయన. విదేశీయుల బిరుదులను స్వీకరించకుండా ముఖ్యంగా గవర్నర్ జనరల్ మౌన్ బట్టెన్ గార్లు రాజ్యాంగ సభలో ఉన్న పెద్దలకు ఇవ్వరాదని వాదించిన వారాయన. ఎన్ జి ఏ తోపాటు కె ఎం మున్షీ తో కలిసి మున్షీ అయ్యంగార్ ఫార్ములా ను రచించారు. భాషకు సంబంధించిన వివాదాలపై ముగించడానికి ప్రయత్నం చేసారు. హిందీ అధికారిక భాషగా పెంచడానికి తాత్కాలికంగా ఇంగ్లీష్ ను అంగీకరించాలని అన్నారు కశ్మీర్ వివాదాలలో షేక్ అబ్దుల్లా తో కలసి రాజ్యాంగ పరమైన ఒక హోదా గురించి చర్చించారు. అంతేగాకుండ ఆర్టికిల్ 370 నిర్మాణాన్ని రచించిన ముఖ్యుడు.
టీటీ కృష్ణమాచారి
రాజ్యాంగ రచన కమిటీ సభ్యునిగా, టి.టి.కృష్ణమాచారి 4014 గంటలపాటు ఆకమిటీకి అనేక రాజ్యాంగ రచన పనుల్లో అంకితం చేశారు. ముఖ్యంగా వాక్ స్వాతంత్య్రం గురించి, ఎమర్జన్సీ అత్యవసర నిబంధనలు తదితర అంశాలపై ఆయన చర్చలలో చురుగ్గా పాల్గొన్నారు. తిరువెల్లూరు తట్టై కృష్ణమాచారి (1899–1974) గారు 1899లో మద్రాసు నగరంలో జన్మించాడు. వారి తండ్రి మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి. టి.టి.కె మద్రాసు కైస్తవ కళాశాలలో పట్టభధ్రుడయ్యాడు. 1928లో కృష్ణమాచారి టిటికె గ్రూపును ప్రారంభించారు. మన దేశ వ్యాపారసమాఖ్య. ప్రెస్టేజ్ బ్రాండ్ సంపాదించారు.
మొదట మద్రాసు శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై, ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరారు. 1946లో కేంద్రంలోని రాజ్యాంగ నిర్ణాయక పరిషత్తుకు ఎన్నికయ్యాడు. 1956 నుండి 1958 వరకు, మళ్లీ 1964 నుండి 1966 వరకు రెండు పర్యాయాలు భారతదేశ ఆర్థికమంత్రిగా పనిచేశారు. తొలి వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా, ఆ తర్వాత ఆర్ధిక శాఖా మంత్రిగా, చాలాకాలం ఉక్కు శాఖకు కూడా మంత్రిగా వ్యవహరించాడు. 1962 కొంత పోర్టుఫోలియో లేని మంత్రిగా, ఆ తర్వాత ఆర్థిక, రక్షణ సహకార మంత్రిగా పని చేసారు. కీలకమైన పన్ను సంస్కరణలను తీసుకువచ్చారు. మూలధన లాభాలు, సంపద, ఎస్టేట్ వ్యయంపై పన్నులను ప్రవేశపెట్టాడు. ముంధ్రా అవినీతి కుంభకోణం మధ్య, 1958 లో రాజీనామా చేయవలసి వచ్చింది. 1963లో స్వయంగా నెహ్రూ క్యాబినెట్‌కు ఆహ్వానించారు. ఆ తరువాత మళ్లీ రెండు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో సహా ఆర్థిక సంస్థల ఏర్పాటులో టిటికె కీలక పాత్ర నిర్వహించారు. 1954లో కృష్ణమాచారి లోక్‌సభ సెక్రటేరియట్ ప్రచురించిన సిల్వర్ జూబ్లీ స్మారక సంపుటిలో భాగంగా '1929-54లో పార్లమెంటరీ జీవితం' అనే తన జ్ఞాపకాలను రచించారు.
ఎన్ మాధవ్ రావ్
ఎన్ మాధవ్ రావ్ గారు మైసూర్ సివిల్ అధికారి. తరువాత ఆ రాజ్యానికి దివాన్ అయ్యారు. రెండో రౌండ్ టేబుల్ కాన్ఫెరన్స్ లో పాల్గొన్నారు. ఒరిస్సా నుంచి సంస్థాన రాజ్యాల పక్షాన రాజ్యాంగ సభలో ప్రతినిదులైనారు. గ్రామపంచాయితీలు సమాఖ్యల గురించి అడిగేవారు.
ఇంక ఎంతో మంది మహానుభావులు ఈ దేశనిర్మాణంలో పనిచేసిన వారు ఉన్నారు. అందులో జగజీవన్ రామ్, జియోమ్ డిసౌజా, డిఎన్ రావ్ మ్రుదులా సారాభాయ్ వంటి ఫెద్దలు రాజ్యాంగ నిర్మాణాని చేసిన వారు ఎంతో మంది ఉన్నారు.
(మాడభూషి శ్రీధర్ ‘భారత రాజ్యాంగం పీఠిక’ పుస్తకం రెండవ ప్రచురణ, డిసెంబర్ 2024 ఒక భాగంలో)