సుమ గీతం
నేటి మేటి అనువాద కవిత: డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి ;
ప్రకృతి స్వరం లో పదే పదే పలికే
సున్నిత పదాన్ని నేను
నీలి గుడారం నుంచి ఆకుపచ్చని తివాచి మీదకు
రాలిపడిన నక్షత్రాన్ని నేను
నేను పంచ భూతాల తనయను
నన్ను శీతాకాలం తన గర్భంలో ధరిస్తే
వసంతం నాకు జన్మ నిచ్చింది
గ్రీష్మపు ఒడి లో పెరిగి
శిశిరపు పక్క లో నిదురించాను
తెల్లవారు జామున గాలితో కలిసి
వెలుతురు ఆగమనాన్ని ప్రకటిస్తాను
సాయం సంధ్య లో నేను పక్షులతో కలిసి
వెలుగుకు వీడ్కోలు గీతాన్ని ఆలపిస్తాను
మైదానాలు నా అందమైన రంగులను
అలంకరించుకున్నాయి
గాలి నా సుగంధంతో పరిమళ భరిత మవుతుంది
నేను గాఢ సుషుప్తిని
కౌగిలించుకుంటుండగా
రాత్రి తన కన్నులతో నన్ను
గమనిస్తుంది
నేను మేల్కొని, పగటికి
ఏకైక నేత్రమైన సూర్యుణ్ణి
తదేకంగా చూస్తున్నాను
నేను తుషార మధురసాన్ని గ్రోలుతూ
పక్షుల స్వరాలను స్వాగతిస్తాను
గాలికి ఊగుతూ
లయబద్ధంగా నర్తిస్తున్న
పచ్చికను స్వాగతిస్తాను
నేను ప్రేమికుల బహుమతిని
పెళ్ళికి పూలదండను
నేను ఆనంద క్షణాల జ్ఞాపకాన్ని
నేను మరణించిన వారికి కానుకను
నేను సంతోషం లో భాగాన్ని
విచారంలో భాగాన్ని
కాని, నేను వెలుతురును చూడటానికి
మాత్రమే
పైకి చూస్తుంటాను
నా నీడను చూడటానికి ఎప్పుడూ
తల వంచను
తప్పనిసరిగా
మనిషి నేర్చుకోవలసిన
వివేచన ఇదే!
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
( Source :Song of the flower By khaleel Gibran)