‘ కృంగ దీయడం కాదు, కలం ఊతకర్ర కావాలి’

బిఎస్ రాములు విశ్లేషణ: గృహ హింస, భర్తల క్రూర శృంగార హింస గురించి భయానకంగా రాస్తే పెళ్లీడు ఆడపిల్లలు దాన్ని చదివి ఎలాంటి ప్రభావానికి లోనవుతారు?

Update: 2024-06-23 13:49 GMT

సాహిత్యం పాఠకులపై ప్రభావం వేస్తుంది. గొప్ప సాహిత్యం ప్రభావం వేస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. చాలామంది విద్యావంతులు, మేధావులు పుస్తకాలు తీర్చిదిద్దిన మనిషిని నేను అని చెప్తుంటారు. గోర్కీ రాసిన 'అమ్మ' నవల చదివి ఎందరో ఉద్యమాల్లోకి నడిచారు. తెలంగాణ సాధన పాటలు, ప్రసంగాలు, దళిత బహుజన పాటలు, ప్రసంగాలు, విప్లవపాటలు, ప్రసంగాలు విని, కథలు, నవలలు చదివి లక్షలాది మంది ప్రభావితులయ్యారు. ఉద్యమాల్లోకి ఉరికారు.

ఇలా సాహిత్యం బలమైన ప్రభావం వేస్తుంది. ఇలా సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేని సాహిత్యం కాలక్షేప సాహిత్యం. కాలక్షేపం కూడా ఒక ప్రయోజనమే. సాహిత్యంలో జీవితం ఉంటుంది. మానవ సంబంధాలు ఉంటాయి. సెంటిమెంట్స్ ఉంటాయి. కష్టాలు, కన్నీళు ఉంటాయి. పాఠకుల్లో, ప్రేక్షకుల్లో ఎలాంటి స్పందనలు కలిగించాలో అనే దృష్టికోణం ఉంటుంది. ఉండాలి. అలా సాహిత్య ప్రయోజనంలో జీవితాన్ని చూపే దృష్టికోణం ఉంటుంది.

పాఠకుల ప్రయోజనమే సాహిత్య ప్రయోజనం

సాహిత్య ప్రయోజనం గురించి చూసే చూపు ప్రధానంగా పాఠకులవైపు నుండి, సమాజంవైపు నుండి చూసే చూపు రచన రచయిత సామర్థ్యాన్ని బట్టి వుంటుంది. వస్తువు గొప్పదైనపుడు రచయిత సామర్థ్యం చాలకపోతే ఫెయిలవుతుంది.

సాహిత్య విలువలు సౌందర్యాత్మకత అనేవి ఈస్థటిక్సు కోణంలో పరిశీలన. జీవిత వాస్తవికత ఏమేరకు వుంది అని చూడడం మరో పద్దతి. జీవిత వాస్తవికత ఎలా వున్నదో చెప్పడంతోపాటు ఎలా వుంటే బాగుంటుందో అని ఆదర్శ చిత్రణ సోషలిస్టు వాస్తవికత. భయానక, బీభత్స సంఘటనలు, మరిచిపోవాల్సిన రేపులు చిత్రహింసలు అంతే భీతావహంగా చిత్రిస్తే ఆ దశ ఊహించే, ఎదురయ్యే పాఠకులు భయంతో వణికిపోతారు. దయ్యాలు భూతాల కథలు చదివి పిరికివాల్లయిన వారున్నారు. ఇవన్నీ సామాజిక చరిత్ర, సంస్కృతి, సెంటిమెంట్స్, మానవ సంబంధాల పరిణామాల చిత్రణ, సాహిత్య ప్రయోజనం అనే సంశ్లేషణతో కూడి ఉంటాయి.

ఆత్మాశ్రయ సబ్జెక్టువిజం

ఆత్మాశ్రయంగా తన భావాలు అనుభవాలు అనే దృష్టి కోణంతో రాయడం మరొక రీతి. దళితవాదులు, స్త్రీవాదులు, బహుజనవాదులు మొదలైనవాళు 3 ఇతరుల భావాలు అనుభవాలు స్వీకరించి వారి ప్రతినిధిగా రాయడం మరొక తీరు. ఈ అనుభవాలు నావి అంటే ఆత్మాశ్రయం. సబ్జెక్టివ్ థింకింగ్ దృష్టి కోణం. నా వంటి వాల్లందరివి అన్నపుడవి ఆ వర్గ వ్యక్తీకరణ. నా బాధ నీకు తెలియదు అంటే పాఠకుడు అర్థం చేసుకోవడం కష్టం. కనక ఆ రచన అలాంటి పాఠకులకోసం రాయబడలేదు. అలాంటి అనుభవాలున్నవాల్లే అర్థం చేసుకోగలరు కనక ఆ సాహిత్యం అందరికోసం కాకుండా తమ వంటి వారికోసం తమ వర్గం కులం లింగం ప్రాంతం తమ వంటి సిచ్యువేషన్లో ఉ న్నవారికి పరిమితం ఆ రచన. దళిత సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర సాధన సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, బహుజన సాహిత్యం తమలో తాము, తమ కొరకు తాము రాసుకోవడం ఒక పద్దతి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమలో తాము స్పూర్తి చైతన్యం పొందడం కోసం రాస్తే అదొక కర్తవ్యం. అలాగే కుల సంఘాలు, దళిత సంఘాలు, స్త్రీవాద సంఘాలు తమలో తాము తమ కొరకు తాము రాసుకునేవి ఈ కోవలోకి వస్తాయి.

పీడితులకు, బాధితులకు బాసటగా నిలవాలి

పాఠకుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి కష్టజీవికి కుడి ఎడమల నేను ఉ న్నానని ధైర్యం కలిగించాలి. సాహిత్యంలో చిత్రించిన పాత్రల జీవితాలకు స్ఫూర్తి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఆత్మవిశ్వాసం, జీవితాన్ని గెలుచుకోగలను అనే ధైర్యం అందించడం ఒక దృష్టి కోణం. అలా కాకుండా పాఠకులను ఆకర్షించడమే ప్రధానంగా సాగితే ఆయా పాత్రల జీవితాలను సరుకుగా మార్చి ఇతరులకు అమ్ముకోవడం అవుతుంది. త్రిపురనేని గోపీచంద్ అసమర్థుడి జీవయాత్ర అందులోని పాత్రల కోసం రాయలేదు.

స్వీయ మానసిక ధోరణి రచయితలు

ఇలా సాహిత్యంలో అనేక కోణాలు. మా అంటరానితనం గురించిన బాధ మీకేం తెలుసు, మా స్త్రీల బాధల గురించి మీ మగవారికేం తెలుసు. మీకివి అర్థం కావు అనడంలో వాస్తవం వుంది. అయితే తమ రచనను సమర్థించుకోవడం, పాఠకులకు తమ బాధలను స్పందించే విధంగా రాయలేకపోవడం కూడా కావచ్చు. అతి కూడా కావచ్చు.

తెలంగాణ రాష్ట్రం ఎంత అవసరమో అని ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆమోదించే విధంగా రాయండి అచ్చు వేస్తానన్నాడు ఒక ప్రముఖ పబ్లిషర్. ప్రయత్నించి చూసాను. నాతో సాధ్యం కాలేదు. కొన్ని సందర్భాలు ఇలా కూడా వుంటాయి. అంటరాని తనం, వివక్ష, ఇతరులకా బాధ తెలియదు, స్త్రీల బాధ అణిచివేత మగవారికి అర్ధం కాదు అనేమాట కూడ ఆలోచించ దగినదే.

అయితే నీ అనుభవాలు కానివి నీవే అనినట్టు రాస్తే మొదట చెప్పినట్టు అది ఆ వర్గ ప్రాతినిధ్య సాహిత్యం అవుతుంది. ఇతరుల బాధను తన బాధగా మార్చుకొని చెప్పడం అవుతుంది. అలా కన్సర్న్ ఉన్న ఇతరులు కూడా అర్థం చేసుకోవడం రాయడం, వారి విముక్తికోసం ఉద్యమించడం కూడ సాధ్యమే. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటి మహనీయుల సంఘ సంస్కరణలు అందుకు ఉదహరించవచ్చు.

సాహిత్యంలో వాస్తవిక పరిమితులు

సాహిత్యం ఇంద్రియ సంవేదనల ద్వారా ప్రభావితం చేస్తుంది. ఏం జరిగిందో ఎలా జరిగిందో చిలవలు పలవలుగా రేప్లు చిత్రహింసలు, అవమానాలు అణిచివేతలు మొదలైనవి. ఎలా చిత్రిస్తే ఎలాంటి ప్రభావం వేస్తుంది అనేదే ముఖ్యం. రేప్ చేసారని అదంతా చిత్రిస్తే భయంకరంగా మహిళా పాఠకులను మరింత భయపెడుతాయి. పూలనేవి పై వచ్చిన హిందీ సినిమాలో రేవ్ను యధాతధంగా చిత్రించారు. నేనా సినిమా చూసినపుడు సినిమా హాల్లో ఒక్క మహిళ లేదు. ఆ సన్నివేశం తమను అవమానించినట్టు భయపడిపోయారు. ఒక స్త్రీ దయనీయ గాధను స్త్రీలే భరించలేక పోయారు. చిత్రీకరణ ఎవరిపై ఎలా ప్రభావితం చేస్తుంది అనేది గమనించి జీవితం పట్ల భయం స్థానంలో ఆత్మ విశ్వాసం కలిగించే నైపుణ్యం విధంగా రాసే సామర్ధ్యాన్ని పెంచుకోవాలి.

పెళ్లి గురించి, పెళ్లి అయ్యాక గృహ హింస, భర్తల క్రూర శృంగార హింస గురించి భయానకంగా రాస్తే పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు చదివినప్పుడు అది వారిపై ఎలాంటి ప్రభావం వేస్తుంది? పెళ్లి పట్ల, భర్త పట్ల ప్రెజిడీస్తో కుంచించుకుపోతారు. కాపురంలో ఆనందానికి బదులు ప్రతీక్షణం నెగెటివ్ ఫీలయి దుఃఖాన్ని, వేదనను వెతుక్కునే దుస్థితికి గురవుతారు. ఇలా కుల వివక్ష, స్త్రీ వివక్ష మొదలైనవి అత్యంత భయానకంగా చిత్రిస్తే ఎవరికోసం రాస్తున్నారో వారిపట్ల అణచివేతగా మసోసిజంగా పరిణమిస్తాయి. అందువల్ల మితిమీరిన ఇలాంటి వర్ణనలు, సంఘటనలు మంచిది కాదు.

ఇండియా, పాకిస్తాన్గా దేశం మూడు ముక్కలైనప్పుడు 20 లక్షల మంది హిందువులు, ముస్లింలు హత్యలకు గురయ్యారు. ఆ విషయాలను యధాతథంగా చిత్రిస్తే ఈ సమాజం భరించలేదు. అలా చరిత్ర, మనిషిలోని జ్ఞాపకశక్తిని అవి మరిచిపోవాలని కోరుకుంటారు. సామూహిక మానభంగానికి గురైన మహిళకు ఆ విషయం జ్ఞాపకం చేయడం ఒక శాడిజం. ఆత్మహత్య నుండి బయటపడిన వారిని ఆ విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తే అది ఒక శాడిజం. కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, స్త్రీవాదులు, మానవతా వాదులు, దళిత బహుజనవాదులు ఈ విషయాలు గుర్తు పెట్టుకోలేకపోతే తమ కీర్తిప్రతిష్ఠల కోసం పీడితులకు, బాధితులకు మద్దతుగా నిలబడినా నష్టం చేస్తారు. మైండ్సెట్లో ఒక భయాన్ని, ఫోబియాను చొప్పించి, పాఠకుల, ప్రేక్షకుల వ్యక్తిత్వాన్ని కుదిస్తారు. ఇలా సాహిత్య చిత్రణలో పలు అంశాలను దృష్టిలో వుంచుకోవడం అవసరం. రచయిత తన రచనా సామర్థ్యం అవగాహన పెంచుకోవడం అవసరం.


Tags:    

Similar News