నివురు కప్పిన నిప్పు రాజుకుంగులబోతున్న సందర్భం

నా నుంచి నా వరకు :12 (కవి, రచయిత జూకంటి జగన్నాథ జ్ఞాపకాలు);

Update: 2025-05-26 09:13 GMT

ఇంతకుముందు మనవి చేసినట్టు ఆ రోజుల్లో సిరిసిల్ల యువ సాహితి సమితి కార్యక్రమాలు స్థానిక మార్కండేయ గుడిలో నిర్వయిస్తుండేది. అప్పట్లో కుటుంబ నియంత్రణ ఆవశ్యకత గురించి హైదరాబాద్ ఏ కేంద్రం రేడియో నుంచి వారం వారం కవిత్వం ప్రసారమయ్యేది. మా ఇంటి పక్కన ఉన్న వైద్య ఉమాశంకర్ గారి ఇంట్లో రేడియో ఉండేది. వారం వారం కవిత్వం ప్రసారం అయ్యే సమయానికి వాళ్ళ ఇంటికి చేరి వినేవాడిని. పైగా ఈ ప్రాంతానికి చెందిన సి.నా.రె.అనుయాయులు కనపర్తి సారు జక్కని వెంకటరాజం కుడిక్యాల లింగయ్య వడ్డేపల్లి కృష్ణ గోలి కృష్ణ హరి తదితరులు ఉండేవారు.

కనపర్తి లక్ష్మీ నరసయ్య సార్ స్థానిక బాయ్స్ హై స్కూల్లో టీచర్గా పని చేస్తుంటే, జక్కని వెంకటరాజు స్థానిక విద్యుత్ సరఫరా సంఘంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేవాడు. ఇకపోతే కుడిక్యాల లింగయ్య వారి చేనేత వ్యాపారం చూస్తుంటే, వడ్డేపల్లి కృష్ణ గాంధీ చౌక్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లో పనిచేస్తుండేది. గోలి కృష్ణహరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో పని చేసేవాడు. నాదే గ్రామ నివాసి అంతేవాసి కనపర్తి లక్ష్మీనరసయ్య సార్ సారధ్యంలో అందరూ కలిసి యువ సాహితి సంస్థను స్థాపించారు.

అప్పుడప్పుడు ఆగస్టు 15న, జనవరి 26 సందర్భంగా మరియు ఉగాది దీపావళి పురస్కరించుకొని కవి సమ్మేళనాలు స్థానిక మార్కండేయ గుడి హాలులో నిర్వహించేవారు. పుస్తకాల ఆవిష్కరణలు ప్రత్యేకంగా జరిగేవి.. ఈ సమాచారం నాకన్నా సీనియర్ అయిన హెచ్. నాగేంద్రం తంగళ్ళపల్లి లోని వాళ్ళ మేనత్త ఇంట్లో ఉండి సిరిసిల్లలో ఇంటర్మీడియట్ చదువుకునేవాడు. అతను ఈ సాహిత్య సమావేశాల వివరాలను తెలియ చెప్పి అందులో పాల్గొన్నమని నన్ను ప్రోత్సాహించేవాడు. మెల్లగా సాహితీ పెద్దలతో పరిచయాలు ఏర్పడినది.

అందులో భాగంగా నాలోని సాహిత్య అభిలాషకు గ్రహించి నన్ను బాగా ప్రోత్సాహించిన వారు జక్కని వేంకటరాజం సార్ ఆయన అప్పటికే స్థానిక కోపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లై సొసైటీ సిరిసిల్లలో (సెస్ )లో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటికే ఆయన సిరిసిల్ల యువ సాహితీ సమితి లోని మిగతా సాహితీ మిత్రులందరికీ కన్నా భిన్నంగా కృష్ణాపత్రికలో కథలు రాశాడు. కవిత్వం లో తనకంటూ ప్రత్యేకత ను విలక్షణంగా నిలబెట్టుకున్నాడు. నన్ను ఆయన వ్యక్తిత్వం కవిగా ప్రత్యేక శైలి భావాలతో మిక్కిలి ఆకర్షించాడు.

అప్పుడు నాకు కనీస పుస్తకాల కొనుక్కోవడానికి సిరిసిల్ల యువ సాహితీ సంస్థలో సభ్యత్వం తీసుకోవడానికి ఆర్థిక స్తోమత లేకుండేది. పొద్దంతా కూలి పనికి పోయి వచ్చి సాయంత్రం తొందర తొందరగా సిరిసిల్ల లైబ్రరీకి పోయి చదువుకునేవాడిని. అప్పుడప్పుడు జరిగే సమావేశాలకు హాజరయ్యేవాన్ని. దీన్ని గమనించి వెంకటరాజం సార్ నాకు తన పట్టణ లైబ్రరీ కార్డు నెంబర్ 123 ఇవ్వడమే కాకుండా లైబ్రేరియన్ దగ్గరికి వచ్చి చదువుకోవడానికి అన్ని రకాల అడిగిన పుస్తకాలు నాకు ఇవ్వమని చెప్పాడు. అందుకోసం ఇంకా ఏమైనా అవసరమైతే అదనంగా రుసుము కూడా చెల్లిస్తానన్నాడు .

నాటి గ్రంధాపాలకుడు అంతకుముందు కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ఇవ్వకపోయేది. కానీ సార్ వచ్చి చెప్పిన తరువాత అన్ని రకాల పుస్తకాలు నీ ఇష్టమైనవి తీసుకొని చదువుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. అంతేకాకుండా వారపత్రికలు నెలనెలా మాస పత్రికలతో పాటు దీపావళి దసరా ఉగాది యువ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ, జ్యోతి ప్రత్యేక సంచికలు తెప్పించేవాడు. ఇప్పుడు తర్వాత్తర్వాత ఆలోచిస్తే ఆ పత్రికలన్నీ నేను చదువుకోవడం కోసం తెప్పించేవాడు అనిపిస్తుంది. అనిపించడమే కాదు వాస్తవంగా అందుకోసమే కొనేవాడు. పత్రికల కోసం ఆదివారాలలో ఉదయం మిగతా రోజుల్లో సాయంత్రం మానేరు వాగులో నుంచి పైకి నడిచి నెహ్రూ నగర్ చింత చెట్ల వద్ద నుంచి సిరిసిల్ల ఒడ్డున ఉన్న వాళ్ల ఇంటికి పోయేవాడిని. ఆ వారం వచ్చిన పత్రికలను చూడగానే నాకు సంబురంగా ఉండేది.

ఆ పత్రికలను అపురూపంగా తిప్పేస్తుంటే లోపలి నుండి సార్ వచ్చి జగన్నాథం ఇంటికి తీసుకుపోయి చదివినంక తీసుక రమ్మనేవాఢు. మీరు చూడండి సార్ ముందు తర్వాత తీసుకపోతాను అంటే దానికి సారు లేదు లేదు నువ్వే ముందు తీసుకుపోయి చదివి ఇవ్వమనేవాడు. విన్న నేను ఎగిరి గంతేసినంత లోపల సంతోషపడుతూ తీసుకొని, సమయం ఉంటే ఉత్సాహంగా వాగులోనే కూర్చొని చదువుకొని,ఇంటికి పోయేవాడిని. తెల్లవారి చదివి మళ్ళీ వాళ్ళింట్లో ఇచ్చేవాణ్ణి. నేను ప్రాథమికంగా సాహిత్యంలో నిలబడడానికి జక్కని వెంకట్రాజం సార్ ఇచ్చిన చేయూత అసామాన్యమైనది. ఆ రోజుల్లో యువ సాహితి సమితి కార్యదర్శి వడ్డేపల్లి కృష్ణ స్థానిక పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేసేవాడు. మొదటిసారిగా ఆయనను మా నాగేంద్రం పరిచయం చేశాడు. ఆ ఇంటి ముందు గద్దెల మీద కూర్చొని ఆయన కోసం ఎదురు చూడగా వచ్చాడు.

ఆయన అప్పటికే "కనరా నీ దేశం" గేయ కవిత్వం పుస్తకం తీసుకొచ్చాడు. ఆ పుస్తకాన్ని మా నాగేంద్రం ఇవ్వమని కోరినాడు. అందుకాయన రూపాయి పావుల అవుతుంది కొనుక్కుంటే ఇస్తాను అన్నాడు. అప్పుడు మా దగ్గర సరిపోయే డబ్బులు లేకుండెను. కానీ మా నాగేంద్రం 2,3 రోజుల్లో పట్టుపట్టి వాళ్ల మేన బావ వైద్య ఉమాశంకర్ వకీల్ అప్పుడు అప్పుడు ఇచ్చిన చిల్లర పైసలు జమ చేసుకొని మొత్తానికి వడ్డేపల్లి కృష్ణ గేయ కవిత్వం పుస్తకాన్ని కొనుక్కొని వచ్చి ఇచ్చాడు.

అది చదివిన తర్వాత గేయం రాయడం పెద్ద కష్టమేమి కాదని జక్కని వెంకటరాజం సార్ తో భయం భయంగా అన్నాను. ఆయన అలా కాదు గాని కనపర్తి సార్ దగ్గర మాత్ర చందస్సు నేర్చుకుంటే ఇంకా రాయగలవని చెప్పాడు. రేపు వస్తే నన్ను తీసుకుపోయి సారుకు మాత్రా ఛందస్సు చెప్పవని చెప్తానన్నాడు. అలాగే తెల్లారి ఆఫీసుకు సార్ దగ్గరికి పోగానే వెంకటేశ్వర దేవాలయం గుడి పక్కన ఉన్న సార్ ఇంటికి తీసుకెళ్లాడు. కనపర్తి సార్ తో అప్పటికే నాకు సాహిత్య సమావేశాల ద్వారా కొంచెం పరిచయం ఏర్పడినది. సరే చెప్తాను ఆదివారం రమ్మని చెప్పాడు. అలా రెండు మూడు ఆదివారాలలో కనపర్తి సార్ సోదరణంగా ఉదాహరణలతో పాటు చెప్పగా గేయ కవిత్వం లోని బిన్న నడకలను తిశ్రగతి, మిశ్రగతి, చతురశ్రగతి తదితరాలు నేర్చుకున్నాను.

ఆ క్రమంలో అనేక గేయాలు రాసి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ డైరెక్టర్కు ప్రసారం నిమిత్తం మా నాగేంద్రం సారు పోస్టల్ స్టాంపులతోపాటు తెచ్చి ఇచ్చిన కవర్ లో ఆయనే కవిత్వాన్ని ఫెయిర్ చేసి, అడ్రస్ రాసిపెట్టి సిరిసిల్లలో పోస్టు వేసేవాడు .ఆ రోజుల్లో పంపినవి ఆల్ ఇండియా రేడియో వారు తమ సొంత ఖర్చుతో ప్రసారం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నామంటూ తిరిగి పంపేవారు. ఇలా రేడియో రూపకం కూడా పంపాను .అది కూడా తిరుగు టపాలో గోడకు కొట్టిన బంతిలా వాపస్ వచ్చేది.

పంపేముందు వెంకట రాజం సార్ కు చూపించేవాడిని. బాగా ఉన్నాయి పంపమని చెప్పాడు. అవి తిరిగి వచ్చేటివి. నేనొక రోజు బాధపడుతూ ఇంతకన్నా నాసిరకం పాటలు వస్తున్నాయి కదా నేను రాసి పంపిన పాటలు ఎందుకు ప్రసారం కాలేకపోతున్నాయని వేదనతో అడిగాను. ఆయన అసలు విషయం అది కాదని మనకు నేరుగా వారితో పరిచయం ఉంటేనే ప్రసాదం అవుతాయని చెప్పాడు.

ఇది ఇలా ఉండగా మరోవైపు ఉగాది ప్రత్యేక సంచిక లో ప్రచురణ కోసం కవిత్వం వ్రాయమని తానే పంపిస్తానని నాగేంద్రం ప్రోత్సాహించేవాడు నేను జనవరి సంక్రాంతి ముందు జోరు చలికాలంలో కూర్చొని మామిడి చెట్లు పూసినట్టు, కోకిల కూసినట్టు ఇంకా ఏవేవో ఊహించుకొని ఏదో కవిత్వం అల్లి తర్వాత ఆత్మీయ మిత్రుడైన సాయంత్రం చూపెట్టగా బాగుందని శుభ్రప్రతి రాసి పోస్టులో వేసేవాడు. ఉగాది సంచికలో వస్తుందేమోనని లైబ్రరీ కి పోయి చూసేవాడు రాకపోయేసరికి నాకన్నా ఎక్కువ నిరాశ చెందేవాడు.

ఇలా ప్రతి సందర్భంలో సీజన్లో వచ్చే పండుగల కోసం అన్ సీజన్లో నన్ను కవిత్వం రామని మా ఊరిలో అత్యంత ఉత్సాహపరిచిన మిత్రుడు ఆయన ఒక్కరే. ఇప్పుడు ఆ రాతలు బాల క్యాలి చేతలు అన్నీ జ్ఞాపకం వచ్చి కలిసినప్పుడు నవ్వుకుంటూ ఉంటాం. తీరని దాహంతో మరో వైపు ఎదురుపడిన అనేక కథలు నవలలు కవిత్వం పుస్తకాలను చదువుతూనే ఉండేవాడిని.చదివిన వాటి గురించి కొంచెం బెరుకు బెరుకుగా చొరవతో సార్ తో చర్చించేవాడిని.

ఒకరోజు బతుకమ్మ పండుగకు ముందు వెంకట రాజం సార్ ఈ దసరాకు నిజాం వెంకటేశం అనే నా సాహిత్య మిత్రుడు వస్తాడు.ఇక నీవు చదివిన సాహిత్యం చాలు . మరింత ముందుకు నీవు పోవాలంటే నీకు అతనితో పరిచయం చేస్తాను. బాగా చదువుకున్నవాడు చాలా విషయాలు తెలిసిన వాడు అని చెప్పాడు.నిజాం వెంకటేశం సార్ తో ఏర్పడబోయే పరిచయం కోసం నేను ఉత్సుకతతో రానున్న దసరా పండుగ కోసం ఎదురు చూడ సాగాను.

Tags:    

Similar News