హరప్పాలో కొత్త సమైక్యతా శకం

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 12. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి

Update: 2024-11-19 06:52 GMT

source: Twitter

ఆర్యులు, హరప్పనుల మధ్య సహకారం, సామరస్యం అలా వర్థిల్లుతుండగా ఒక కొత్త ఆచారానికి తెర లేచింది: మతాంతర వివాహాలు సర్వసాధారణమై పోయినై. ఉభయ సమాజాల ప్రజలు తమ సాంస్కృతిక భిన్నత్వాలకు అతీతంగా ఆలోచిస్తూ సంయుక్త వారసత్వపు సౌందర్యాన్ని, సమైక్యతని, సామర్థ్యాన్ని గుర్తించనారంభించారు.

ఒకరోజు, రాజకుమారి ఆర్మిత, తను గాఢంగా ప్రేమించిన భరద్వాజ అనే సౌమ్యుడైన, తెలివైన ఆర్యజాతి అర్చకుడిని కలుసుకుంది. అనుకోకుండా ఒకరికొకరు పరిచయమైన వారిరువురి నడుమ ప్రేమ అంకురించి, నది ఒడ్డున విహారాలు, లోతైన తత్వశాస్త్రీయ చర్చలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తోడ్పడ్డ ఏకాంత సమావేశాలతో.. దినదిన ప్రవర్థ మానమైంది.

ఒకరి అభిరుచులు, ఆలోచనలు మరొకరు పూర్తిగా తెలుసుకున్నాక సమైక్యత, సామరస్యం తామిద్దరి ఉమ్మడి ఆశయం అని వారు గ్రహించారు. భరద్వాజ లోని దయ, కారుణ్య గుణాలు ఆర్మితని ఆకర్షించాయి; ఆర్మిత లోని తెలివితేటలు, ధైర్యసాహసాలు భరద్వాజని ఆకట్టుకున్నాయి. తమ ప్రజలు శాంతి సౌభాగ్యాలతో మనుగడ సాగించగల భవిష్యత్తు గురించి వారిరువురూ కలలు గన్నారు.

భారద్వాజతో వివాహానికి సిద్ధపడ్డ రాజకుమారి ఆర్మిత, ‘‘మన ఇరు కుటుంబాలు ఒకటి కావాల్సిన సమయం వచ్చింది..’’ అని అతనితో అన్నది.

‘‘మన కలయిక మరింత ఉజ్వల భవిష్యత్తు పై ఆశకి సంకేతం కాగలదు.’’

ఆర్మిత చేయిని తన చేతుల్లోకి తీసుకుంటూ, ‘‘నా ప్రతి దినాన్ని ప్రకాశవంతం చేసే సూర్యకాంతివి నువ్వు,’’ అన్నాడు భరద్వాజ.

‘‘నిన్ను కలిసినందులకు ధన్యురాలిని, భరద్వాజా..’’ చెమ్మగిల్లిన కన్నులతో అన్నది ఆర్మిత. ‘‘మీ ప్రజల విజ్ఞానం, ఆధ్యాత్మికత ఎంత గొప్పవో నేను చూసేలా చేశావు. జీవితాంతం నీకు తోడూ నీడగా ఉంటానని మాట ఇస్తున్నాను.’’

‘‘ప్రియతమా, అర్మితా..’’ సంతోషంతో ముఖం వెలిగిపోతుండగా అన్నాడు భరద్వాజ. ‘‘ఎన్నడూ నీ ప్రేమను వీడననీ, కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాననీ వాగ్దానం చేస్తున్నా. ఇద్దరం కలిసి ఉజ్వల భవిష్యత్తుని సృష్టిద్దాం, అక్కడ మన ప్రేమ ప్రకాశవంతంగా వెలుగుతూ మన ప్రయాణంలో దారి చూపుతుంది.’’

వారి వివాహ మహోత్సవం మహదానంద వేడుకలా ఘనంగా జరిగింది, ఉభయ సంస్కృతుల కీలకాంశాలు కమనీయంగా కలసిపోయి కనుల పండుగ చేశాయి. చుట్టూ రంగురంగుల పుష్ప గుచ్ఛాలతో అందంగా అలంకరించిన పచ్చని పెద్ద తోటలో వివాహవేడుక జరిపారు. అగరొత్తుల ఆహ్లాదకరమైన సువాసన, లాంతరుల పల్చని వెలుతురు గాలి అంతటా వ్యాపించాయి, అక్కడి దృశ్యాలు అందరినీ ఆనంద పరవశుల్ని చేశాయి.

వొంటి నిండా విలువైన బంగారు నగలతో, ముఖాన్ని కప్పిన మేలిముసుగుతో.సాంప్రదాయిక హరప్పన్ దుస్తుల్లో.. ఆర్మిత ముగ్ధ మనోహరంగా వుంది. యజ్ఞోపవీతం వేసుకుని, సాదాసీదావే అయినా చక్కని ఆకర్షణీయమైన ఆర్య వస్త్రాలు ధరించాడు భరద్వాజ. కొంగులు ముడి వేసుకున్న కొత్త దంపతులు పెళ్లి ప్రమాణాలు ఉచ్చరిస్తూ హోమగుండం చుట్టూ తిరిగారు.

హరప్పన్ మృదంగాలు వినసొంపైన లయతో గట్టిగా మోగాయి. వాటితో స్వరం మేళవిస్తూ ఆర్య సంగీత కారులు వేణువుల ద్వారా శ్రావ్యమైన రాగాలు ఆలాపించారు. వివాహ బంధంలో ఒక్కటైన వధూవరులు పూలదండలు మార్చుకుంటూ వుండగా ఇరు పక్షాలవారు కరతాళ ధ్వనులతో, కేరింతలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు.

అలా ఇరు వర్గాల బంధుమిత్రుల సమక్షంలో రాజకుమారి ఆర్మిత, భరద్వాజల పెళ్లి ఘనంగా జరిగింది.

కళ్ళల్లో గర్వం ప్రతిఫలించగా బాగుహర మహదానంద పడిపోయాడు. ‘‘నా కూతురి పెళ్లి మనందరి ఆశాజ్యోతిగా వెలుగులీనుతుంది..’’ అని ప్రకటించాడు.

రాకుమారి ఆర్మిత, భరద్వాజల వివాహం హరప్పన్లు, ఆర్యుల మధ్య శాంతి సామరస్య పూర్వకమైన ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. వైమనస్యాలతో దూరదూరం వున్నా మనుషులు ఒక్కటి కాగలరని, ప్రేమ, సమైక్యతా భావన అతి తీవ్ర విబేధాలను సైతం ఛేదించగలవని అది నిరూపించింది.

సంవత్సరాలు గడిచాయి, రాకుమారి ఆర్మిత ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది, అతడి పేరు మహారుద్ర. తమ ప్రేమానురాగాల పూజాఫలంగా అతన్ని అపురూపంగా పెంచారు దంపతులు. దినదిన ప్రవర్థమానుడవుతున్న కొడుకుని చూసి మురిసి పోయిన భరద్వాజ క్షణమైనా అతన్ని విడిచి ఉండలేక పోయాడు.

కొడుకుని ప్రేమగా ముద్దాడుతూ, ‘‘మా జీవితానికి వెలుగువి నువ్వే బాబూ’’ అంది ఆర్మిత.

‘‘మా ప్రజల భవిష్యత్తువి నువ్వు..’’ అన్నాడు మందహాసం చేస్తూ భరద్వాజ.

ఆర్మిత తన ఏకైక గారాలపట్టి కాబట్టి ఆమెకు పుట్టిన మహారుద్ర అంటే బాగుహరకు అమితమైన వాత్సల్యం, ప్రేమ. తమ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయే ఒక మనుమడి కోసం ఎంతగానో తపించాడు, ఇప్పుడు ఆ కల నెరవేరింది. మనుమడి పై ఎనలేని అనురాగం కురిపిస్తూ, గంటలు గంటలు అతనితోనే గడుపుతూ, ఆడుకుంటూ, రాజ్య పాలనకి సంబంధించిన విషయాలు బోధించాడు.

తలిదండ్రుల ప్రేమానురాగాలు, తాత వాత్సల్యం నడుమ పెరుగిన మహారుద్ర చాలా విషయాలు నేర్చుకున్నాడు. సమైక్యత, కారుణ్యం, సామర్థ్యం ల ప్రాధాన్యత గురించిన పాఠాలు కుతూహలంగా విన్నాడు, వాటిని లోతుగా అర్థం చేసుకున్నాడు.

తాతతో కలిసి తోటలో పచార్లు చేస్తూ, ‘‘సంతోష సౌభాగ్యాల జీవితాన్ని సాధించే రహస్యం ఏమిటి ?’’ అడిగాడు మహారుద్ర.

‘‘సామరస్యం, సహకారం..రాకుమారా !’’ చిర్నవ్వుతో అన్నాడు బాగుహర. ‘‘విజయానికి, ఆనందానికి ఐక్యతే తాళం చెవి. అందరం కలిసి ఉంటేనే మనకు బలం అన్న సంగతి ఎన్నడూ మరవకు..’’

‘‘మరిచిపోను, తాతా..’’ చెప్పాడు మహారుద్ర.

‘‘మరోటి గుర్తుంచుకో. వివేకంతో, నిష్కాపట్యంతో వ్యవహరించేవాడే నిజమైన నాయకుడు,’’ అన్నాడు బాగుహర. ‘‘ప్రజలను కన్న బిడ్డల్లా కాపాడాలి, ఇదెన్నడూ మరవొద్దు. సమాజానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించేందుకు నిరంతరం పాటుపడాలి. ’’

‘‘అలాగే తాతా..’’ స్థిరనిర్ణయం ధ్వనించే స్వరంతో చెప్పాడు మహారుద్ర. మరో రోజు తాతని ఇంకో ప్రశ్న అడిగాడు మనుమడు. ‘‘మనకు అతి పెద్ద సవాలు ఏమిటి?’’

‘‘చీలిక, పోట్లాట..బాబూ..’’ అన్నాడు స్థిరమైన గొంతుతో బాగుహర. ‘‘మనల్ని విభజించాలని చూసే శక్తులను ఎదుర్కోవడానికి మనం కలిసికట్టుగా నిలబడాలి.’’

‘‘నాకు అర్థమైంది తాతా.’’ అన్నాడు మహారుద్ర ఒక స్థిర నిశ్చయం తీసుకున్నవాడిలా. ‘‘అయితే ఆర్యుల సంగతేమిటి? వారి వల్ల మన రాజ్యానికి ఏదైనా సమస్య వస్తుందా?’’

‘‘ఆర్యులు సంక్లిష్టమైన మనుషులు, మహారుద్రా’’ చెప్పాడు బాగుహర సాలోచనగా. ‘‘కొందరి వల్ల ముప్పు రావచ్చు, కానీ మిగతావాళ్ళు మనకు మిత్రులు. అయినా మనం జాగ్రత్తగా వుండాలి. వారితో కలిసి పని చేసే ఉమ్మడి కార్యక్షేత్రాన్ని చూసుకోవాలి.’’

‘‘కానీ, వారి విశ్వాసాలను ఎలా చూడాలి ?’’ అడిగాడు మహారుద్ర.

‘‘ఓహ్.. మంచి ప్రశ్న వేశావు. ఆర్యుల విశ్వాసాలు మనవాటి కన్నా భిన్నమైనవి – అంతమాత్రాన అవి మనకు పనికి రానివని కాదు. వాళ్ళు, మనం ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ, కలిసి పని చేసే కార్య రంగం కనుక్కోవాలి. ఎదుటి వాళ్ళను అర్థం చేసుకుని గౌరవించడం..ఎంతటి అంతరాన్ని అయినా పూడుస్తుంది..’’ వివరించాడు బాగుహర.

‘‘అలాగా.. ’’ అని మహారుద్ర దీర్ఘాలోచనలో పడ్డాడు. ‘‘అయితే వాళ్ళ వర్ణవ్యవస్థ ని ఎలా చూడాలి ? వాళ్ళు మనుషుల మధ్య బేధాలను పాటించరా ?’’

“ ఔను.. కొందరు పాటిస్తారు..’ గంభీరంగా చూస్తూ బదులిచ్చాడు బాగుహర. “అయితే కొందరి పనులను బట్టి ఆర్యులందరూ అలాంటి వారేనని తీర్మానించగూడదు. చాలా మంది వివక్షని తిరస్కరిస్తారు, సాంఘిక స్థాయి, నేపథ్యం తో సంబంధం లేకుండా మనుషులకు విలువ ఇస్తారు.”

మహారుద్ర తలూపాడు, అతని బుర్ర నిండా అనేక ఆలోచనలు, ప్రశ్నలు.”అది జ్ఞాపకం పెట్టుకుంటాను తాతా. ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు.”

రాజ్యం శాంతి సౌభాగ్యాలతో అనేక సంవత్సరాలు వర్ధిల్లింది ; వివేకవంతుడూ, దార్శనికుడూ అయిన బాగుహర పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో సామరస్యంగా జీవించారు.

బాగుహర తనువు చాలించాక అతని వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయేందుకు కొత్త తరం వచ్చింది ; అతని మనుమడు-ఆర్మిత, భరద్వాజల కొడుకైన మహారుద్ర సింహాసనం అధిష్టించాడు.

మహారుద్ర కిరీటధారణ రోజు పవిత్రమైన పర్వదినంగా, నూతన ఉషస్సుగా భావిస్తూ రాజ్య ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి ఘనంగా జరిగిన వేడుకను తనివి తీరా వీక్షించారు. విలువైన రాచరిక దుస్తులు ధరించిన మహారుద్ర ఠీవిగా సింహాసనం అధిష్టిస్తుండగా ఉదయసూర్యుని నారిజరంగు కిరణాలు రాజభవనంలో గుమి గూడిన ప్రజాసమూహాలపై ప్రకాశవంతంగా ప్రసరించాయి.

కొడుకు పక్కన ఉచితాసనాలపై కూర్చున్న ఆర్మిత, భరద్వాజల ముఖాలు కించిత్ గర్వంతో కూడిన సంతోషంతో వెలిగాయి, వారి హృదయాల్లో ఆనందం పొంగి పొర్లింది. తమ పెంపకంలో పెరిగి పెద్దవాడైన తమ పుత్రుడు వివేకవంతుడూ, న్యాయ బద్ధుడూ మాత్రమె కాదు – ప్రజల పట్ల గుండె నిండా ప్రేమ నిండిన కరుణార్ద్ర హృదయుడూ, సాటిలేని బలవంతుడు కూడా.

అధికారానికి, బాధ్యతకి సంకేతమైన రాజకిరీటాన్నిమహారుద్ర స్వీకరించగానే ప్రజలు దర్బారు అదిరిపోయేలా చప్పట్లు కొట్టి కేరింతలు వేశారు; వాళ్ళ ముఖాల్లో ఆశలు, ఆకాంక్షలు ప్రతిఫలించాయి.

కిరీట అలకరణ ఉత్సవం ముగియగానే మహారుద్ర లేచి నిలబడి ప్రేమ, ఆత్మీయత నిండిన గొంతుతో ప్రజలనుద్దేశించి బిగ్గరగా ప్రసంగించాడు.”నా ప్రియమైన ప్రజలారా..వివేకంతో, కారుణ్యంతో పరిపాలన సాగిస్తాననీ, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీకు సర్వదా సేవ చేస్తాననీ, మన ప్రియమైన రాజ్యంలో శాంతిని, సౌభాగ్యాన్ని నెలకొల్పుతానని వాగ్దానం చేస్తున్నాను. ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పని చేద్దాం, మన సమైక్యత, సామరస్యం ప్రపంచంలోనే గొప్ప ఉదాహరణగా నిలిచిపోవాలి.”

ప్రజల హర్షాధ్వానాలతో దర్బారు మారుమోగింది. ఆర్మిత, భరద్వాజ మందహాసం చేశారు, తమ కొడుకు యుగపురుషుడు గా వెలుగొందుతాడని వాళ్లకి తెలుసు.

కాలచక్రం గిర్రున తిరిగింది. ఒకప్పుడు దృఢముగా వుండిన సామాజిక సరిహద్దులు చెరిగి పోవనారంభించాయి. అన్ని జీవనరంగాల ప్రజలు ముందుకు వచ్చి విశ్వభ్రాతృత్వ స్ఫూర్తితో ముందుకు సాగడానికి నడుం బిగించారు. మత, కులాంతర వివాహాలు ఆ ప్రాంతంలో కొత్తగా నెలకొన్నసామరస్యానికి సంకేతంగా నిలిచాయి.; ఇరు సమూహాల కుటుంబాలు తమ సాంప్రదాయాలను విలీనం చేసి ఒక సరికొత్త వైవిధ్యభరితమైన సంస్కృతిని రూపొందించారు.

‘”ఇక మనం విడివిడిగా లేము..” ప్రజలనుద్దేశించి రాజు మహారుద్ర ప్రకటించాడు.”మనమంతా ఒక్కటే..శాంతి సౌభాగ్యాల సాధనలో మనం ఐక్యంగా ఉందాం.”

అలా హరప్పనులు, ఆర్యులు ఎల్ల కాలం నిలిచి వుండే వారసత్వానికి పునాది వేశారు, ఒకప్పుడు దూర దూరంగా వుండిన ప్రజాసమూహాలు ఇప్పుడు ప్రేమకి, సమైక్యతకి, తీవ్ర విభేదాలను సైతం అధిగమించగల మానవ సౌశీల్యానికి తిరుగులేని సాక్ష్యంగా నిలిచాయి. కానీ కాలప్రవాహంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గతకాలాల ద్వేషానల నీలినీడలు నిజంగా కరిగిపోయినాయా? లేక, తాత్కాలికంగా కనపడకుండా దాగి, అదను చూసి విరుచుకు పడేందుకు పొంచి ఉన్నాయా ? (సశేషం)

Tags:    

Similar News