'టైప్ 5' షుగర్ వ్యాధి గురించి విన్నారా?

కొత్త షుగర్ వ్యాధి వచ్చేస్తున్నది, జాగ్రత్త;

Update: 2025-04-24 11:43 GMT

మధుమేహం గురించి అంతో ఇంతో తెలియని వారు ఈ రోజుల్లో లేరనే చెప్పవచ్చు. రోజు రోజుకూ మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతూ వుండటం, చాలా కుటుంబాలలో ఒకరో, ఇద్దరో మధుమేహ పీడితులు వుండటం వల్ల ఎక్కువ మందికి దీని గురించి తెలుస్తోంది. అది జీవితకాలం మందులు వాడుతూ వుండవలసిన పరిస్థితి అని కొందరూ, మేము చెప్పిన చిట్కాలు పాటిస్తే అది చిటికె లో మాయమవుతుందని కొందరూ, అది అసలు జబ్బే కాదు జీవన శైలిలో ఏర్పడిన అసమతుల్యత అని కొందరూ మీడియాలో విపరీతంగా చర్చలు జరుపుతుండటంతో ప్రతి వారికీ ఏదో ఒక అభిప్రాయం ఏర్పడుతోంది. గతంలో అది ధనవంతులకు, పెద్ద వయసు వారికి, అధికంగా తీపి పదార్ధాలు కలిగిన ఆహారం తీసుకునే వారికి వచ్చే జబ్బు అని భావించేవారు. కానీ ప్రజల జీవన శైలి మారటంతో, ఆహారపు అలవాట్లు ఆహారపదార్ధాలు మారిపోవడంతో, పేద ధనిక తారతమ్యం లేకుండా అన్ని వయసుల వారిలోనూ ఈ స్థితి కనిపిస్తోంది. ఒక అంచనా ప్రకారం త్వరలో హైదరాబాద్ నగరం మధుమేహ రాజధానిగా మారనుంది. దాదాపు 20% జనాభా దీనికి గురి కానున్నారు. అందువలన ఈ స్థితి ఏ రకంగా, ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకోవటం సామాన్యులకు కూడా అవసరం అవుతోంది. ఈ ఎరుక ఉంటే కొన్ని నివారణ చర్యలు తీసుకుని కొందరైనా దీని బారి నుండి తప్పుకోగలుగుతారు.

అందరూ సాధారణంగా వినేది టైప్1, టైప్2 అనే రకాల గురించి మాత్రమే. ఒక రకం మధుమేహం ఇన్సులిన్ ఆధారిత రకమని, మరొకటి ఇన్సులిన్ తీసుకోవలసిన అవసరం లేని రకమని చాలామందికి తెలుసు. శరీరంలో తగినంతగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం ఒక కారణమైతే, వున్న ఇన్సులిన్ ని శరీరం వినియోగించుకోలేక పోవడం మరొక కారణంగా ఇప్పటివరకూ చెప్పుకుంటున్నాము. “మీ రక్తంలో గ్లూకోజ్ అధిక స్థాయికి పెరగటానికి చాలా ముఖ్య కారణం మీరు తీసుకునే ఆహారం. కార్బోహైడ్రేట్లను, ముఖ్యంగా చక్కెర లను పరిమితం చేయకుండా మందులు తీసుకోవటం వల్ల మాత్రమే రక్తంలో గ్లూకోజ్ వాంఛనీయ స్థాయికి తగ్గదు. మెట్ఫార్మిన్, గ్లిక్లాజైడ్, లినాగ్లిప్టిన్, ఇన్సులిన్ వంటి సాధారణంగా సూచించే మందులు అందుబాటులో వున్నాయి . వాటిలో మీకు తగిన వాటిని డాక్టర్ సలహాపై దీర్ఘకాలం వాడండి. మీరు అధిక బరువు తగ్గడానికి కూడా ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.” అని చెబుతున్నాము. కొందరిలో “రక్తంలో మీ విటమిన్-డి, బి-12 తనిఖీ చేయించుకోండి. విటమిన్- డి, బి- 12లు తగ్గిపోతే అది చక్కెర స్థాయి, రక్తపోటు పెరగడానికి కారణమవుతుందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి” అని కొందరికి సలహా ఇస్తున్నాము. అయితే ఈ రెండింటికీ భిన్నమైన పోషకాహార లోప సంబంధిత డయాబెటిస్ రకం ఒకటి ఇప్పుడు అధికారికంగా గుర్తించబడింది. దానికి "టైప్ 5 డయాబెటిస్" అని పేరు పెట్టారు.

మరి టైపు3, టైపు4 రకాలు ఏమిటి?వాటి నిర్వచనం కూడా తెలుసుకుని టైపు5 గురించిన వివరాల లోకి వెళ్దాము. టైపు3 అంటే ఒక నిర్దిష్ట కారణం [ఎక్సోక్రైన్ ప్యాంక్రియాటిక్ వ్యాధులు] వల్ల సంభవించే మధు మేహం. అవి సింగిల్ జన్యువులు, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జబ్బులు కావొచ్చు లేక కొన్ని మందులు లేక రసాయనాలకు శరీరం ప్రతిస్పందించిన తీరు కావొచ్చు. వీటి వల్ల ప్రేరితమైన మధుమేహం టైపు-3 గా వ్యవహరించ బడుతోంది. ఇక "టైప్-4"అనేది స్త్రీలలో కేవలం గర్భధారణ సమయంలో కనిపించే రకం. ఇప్పుడు కొత్తగా చెబుతున్న టైపు-5 పోషకాహార లోపం వల్ల వస్తుంది. దాని గురించి తెలుసుకుందాము.

2025 ఏప్రిల్ 8న థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) వారి ప్రపంచ సదస్సులో ఈ కేటగిరీకి ఆమోదం తెలిపే ఓటింగ్ జరిగింది. అంతకుముందు జనవరిలో 2025 లో, ఈ పరిస్థితి గురించి ఏకాభిప్రాయ ప్రకటనను రూపొందించడానికి ఒక ప్యానెల్ భారతదేశంలో కూడా సమావేశమైంది. పోషకాహార లోపం వల్ల సంభవించే మధుమేహం అని ఈ రకాన్ని నిర్వచిస్తున్నారు.

"పోషకాహార లోపం-సంబంధిత డయాబెటిస్ ఇప్పటివరకూ చాలా తక్కువగా నిర్ధారణ చేయబడింది. దాని గురించి చాలా తక్కువగా తెలుసు. వైద్యులకే అది సరిగా అర్థం కాలేదు... దీన్ని 'టైప్ 5 డయాబెటిస్'గా ఐడీఎఫ్ గుర్తించడం చాలా మందికి ఈ ఆరోగ్య సమస్యపై అవగాహన పెంచడానికి ఒక ముఖ్యమైన అడుగు" అవుతుంది.

ఇది మొట్టమొదట 1955 లో జమైకాలో వివరించబడింది. పేద, మధ్య ఆదాయ దేశాల (ఎల్ఎంఐసి) కు చెందిన యువకుల లో ఇది ఎక్కువగా గమనించబడింది. శరీర ఎదుగుదలను సూచించే వారి బాడీ మాస్ ఇండెక్స్ [ఎత్తు-బరువుల నిష్పత్తి] 19 కంటే తక్కువగా ఉంటుంది. సాధారణ ప్రజలలో బాడీ మాస్ ఇండెక్స్ 19-25మధ్య వుంటుంది. దీనికంటే ఎక్కువ వున్నవారిని అధిక బరువు వున్నవారిగాను, 30 కంటే ఎక్కువ వుంటే ఊబకాయం గాను వ్యవహరిస్తారు. మరి 19 కంటే తక్కువ వుంటే అది తక్కువ బరువును, శరీరం తగినంత ఎదగలేదని సూచిస్తుంది. తగినంత ఆహారం లభ్యం కాకపోవటమే దీనికి గల ప్రధాన కారణం . తరచుగా వీరిని టైప్ 1 డయాబెటిస్ కలిగి ఉన్నారని తప్పుగా నిర్ధారించేవారు. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు, అధిక ఇన్సులిన్ అవసరాలు ఉన్నప్పటికీ వారిలో కీటోనురియా [మూత్రంలో కీటోన్ అనే వ్యర్ధ పదార్ధం] లేదా కీటోసిస్ [రక్తంలో అధిక కీటోన్] కనిపించటం లేదని కొందరు పరిశోధకులు స్పష్టంగా గుర్తించారు.

1985 లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా "పోషకాహార లోపం-సంబంధిత డయాబెటిస్ మెల్లిటస్" ను ఒక ప్రత్యేకమైన డయాబెటిస్ రకంగా వర్గీకరించింది, అయితే పోషకాహార లోపం లేదా ప్రోటీన్ లోపం డయాబెటిస్ కు కారణమవుతుందని పూర్తి ఆధారాలతో నిరూపించబడనందున 1999 లోఈ వర్గీకరణను తొలగించింది.

కానీ 2005 లో ప్రపంచ ఆరోగ్య సమావేశాలలో బోధిస్తున్నప్పుడు ప్రొ.హాకిన్స్ పోషకాహార లోపం-సంబంధిత మధుమేహం గురించి తెలుసుకున్నారు. 2010లో ఐన్ స్టీన్ గ్లోబల్ డయాబెటిస్ ఇన్ స్టిట్యూట్ ను స్థాపించి అధ్యయనం చేశారు. 2022 లో, ఆమె, సహోద్యోగుల తో కలసి 73 మంది ఆసియా [భారతీయ] పురుషులలో అత్యాధునిక జీవక్రియ పరీక్షల ఫలితాలను ప్రచురించారు, వీటిలో ఇమ్యునోజెనెటిక్ విశ్లేషణ ద్వారా ఇప్పటి వరకు తెలిసిన డయాబెటిక్ రూపాలకు చెందని వారు 20 మంది ఉన్నారు. మిగతావి కావని నిర్ధారించుకున్నాక వీరిని ఇప్పుడు "టైప్ 5 డయాబెటిస్" అని పిలుస్తున్నారు.

ఈ రకమైన డయాబెటిస్ ఉన్నవారికి ఇన్సులిన్ స్రవించే సామర్థ్యంలో గాఢమైన లోపం ఉందని తేలింది, ఇది ఇంతకు ముందు గుర్తించబడలేదు. ఈ పరిస్థితి గురించి మనం ఎలా ఆలోచిస్తామో, దానికి ఎలా చికిత్స చేయాలో ఈ పరిశోధన విప్లవాత్మకంగా మార్చింది" అని హాకిన్స్ అన్నారు.

టైప్ 5 ను టైప్ 1 డయాబెటిస్ నుండి వేరు చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఎక్కువ ఇన్సులిన్ ఇవ్వడం టైపు5 వారికి త్వరగా ప్రాణాంతకంగా మారుతుంది. టైప్ 5 చికిత్సకు ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు లేనప్పటికీ, నోటి ద్వారా తీసుకునే మందులతో కలిపి చాలా తక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఇవ్వవలసిన వుంటుందని ఇప్పటివరకు సేకరించిన డేటా సూచిస్తుంది. "వారి పోషణలో, ఆహారంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ మరియు తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉండాలని సూచిస్తున్నారు. అలాగే లోపించిన ఇతర సూక్ష్మపోషకాలపై దృష్టి పెట్టాలి... దీనిని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది” అలా చేయడానికి ప్రస్తుతం [అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్] నుండి సంకల్పం వుంది, అనుమతి వుంది. అధికారిక ఆదేశం కూడా ఉంది."

ఎల్ఎంఐసీ ల లోని విశ్వవిద్యాలయాల్లో హాకిన్స్ తరచూ ఈ అంశంపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. పాఠ్యపుస్తకాల్లో ఎప్పుడూ చదవని ఒక అనారోగ్య స్థితి మీ దేశాలలో ఎంత ఎక్కువగా వున్నదో గమనించమని ఆవిడ విద్యార్ధులకు చెబుతుంది. 'ఇంతగా ఉనికి లో వున్న స్థితి గురించి పాఠ్య పుస్తకాలలో ఎందుకు లేదు” ఆలోచించమని తరచూ అంటుంటారు. ఆ పాఠ్యపుస్తకాలు పాశ్చాత్య దేశాలలో వ్రాయబడ్డాయి, అక్కడ ఈ స్థితి కనిపించదు. ప్రపంచంలోని పేదలలో ప్రబలంగా ఉన్నప్పటికీ పాశ్చాత్య సాహిత్యంలో ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితిని మార్చివేయాలి.” అని ఆమె అంటారు. పేద దేశాలలోని పరిశోధకులు తమ అవసరాలను, తమ అనుభవాలను, పరిశోధనలను బలంగా వినిపించాలి. పాశ్చాత్యులు చెప్పిన వాటిని గుడ్డిగా నమ్మి ఆచరించటం కాక తమ జనాభాలో వున్న అనారోగ్య స్థితిగతులకు తామే కారణాలను కనుగొనాలి లేక అందుబాటులో వున్న సమాచారాన్ని తమ అనుభవాల వెలుగులో విశ్లేషించుకోవాలి. దీనికి శాస్త్రజ్ఞులలో కూడా ఆత్మ స్థైర్యం అవసరం. రాబోయే 2 సంవత్సరాలలో టైప్ 5 డయాబెటిస్ కోసం అధికారిక రోగనిర్ధారణ మరియు చికిత్సా మార్గదర్శకాలను అభివృద్ధి చేసే పనిని ఇప్పుడు ఒక వర్కింగ్ గ్రూప్ కు అప్పగించారు.

తిండి ఎక్కువైన వారికి డయాబెటిస్ వస్తుందని ఎక్కువ మంది భావిస్తున్న వేళ, పోషకాహారలోపం [మాల్ న్యుట్రిషన్] వల్లకూడా డయాబెటిస్ రావచ్చని తెలియడం ఆశ్చర్యకరమే కాదు. అలాంటి స్థితిని నివారించేందుకు తీసుకోవలసిన చర్యలను ప్రోత్సాహిస్తుంది కూడా.

Tags:    

Similar News

అరుణ తార!