కరెంట్ లేకపోతే ఆ ఇంట్లో ఒకరి ఊపిరి ఆగిపోతుంది !
‘కరెంట్' పోతే మా నాన్న బతకరు.;
ఆయనకు ఊపిరి కావాలి ! ’ అని దీనంగా ప్రభుత్వాన్ని, సమాజాన్ని వేడుకుంటున్నారు ఇద్దరు బిడ్డలు, వారి తల్లి. ఇంటికి పెద్ద దిక్కు అయిన ఒక తండ్రి 37 ఏండ్లకే మంచానికే ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చింది ?
గుండెల్ని పిండేసే ఈ జీవన పోరాటం తెలుసుకోవాలంటే తెలంగాణ, హనుమకొండ లోని దర్గా కాజీపేటకు చెందిన తీగల సాంబమూర్తి ఇంటికి వెళ్లాలి.
‘ నేను స్వీపర్‌గా పనిచేస్తాను. మా ఆయన సాంబమూర్తి ఎలక్ట్రీషియన్.
నాలుగేళ్ల క్రితం ఆయనకు కోవిడ్ సోకింది. దాంతో ఆసుపత్రుల్లో చేరి ఇంతకాలం రెక్కల కష్టం మీద సంపాదించుకున్న దంతా ఖర్చుపెడితే ప్రాణాలతో బయటపడ్డారు.
కానీ, వైరస్ ఆయన ఊపిరి తిత్తులపై ఎక్కువ ప్రభావం చూపడంతో శ్వాస ఆడటం కష్టం అయిపోతుంది. ఇక బతికినంత కాలం ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పైనే ఆధారపడాలని, డాక్టర్లు చెప్పారు. అప్పటి నుండి మంచానికి పరిమితమై బతుకు పోరాటం సాగిస్తున్నారు.’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన భార్య సంధ్య. ఆమె కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో దినసరి కూలీగా స్వీపర్ పనిచేస్తారు.
ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్‌తో ఊపిరి పీల్చుకుంటున్న సాంబమూర్తి .
ఊపిరి పోసిన విసి
‘ డాక్టర్లు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పైనే ఆధారపడాలని చెప్పడంతో ఆ పరికరం కొనుక్కునే స్తోమతు లేక మా కష్టాలను కాళోజీ యూనివర్సిటీ ( Kaloji Narayana Rao University of Health Sciences ) పూర్వ విసి డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి సార్ కి చెప్పాను. ఆయన మా బాధలు తెలుసుకొని ఒక ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ మాకు ఇచ్చారు. అప్పటి నుండి దాని ద్వారా మా ఆయన ఊపిరి తీసుకుంటున్నారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ లేకపోతే మా ఆయన ఊపిరి తీసుకోలేరు. దీన్ని వినియోగించడం వల్ల మా ఇంట్లో కరెంట్ బిల్లు నెలకు రూ. 7వేలకు పైగా వస్తోంది. ఆ బిల్లును కట్టే స్థోమత లేక అప్పులు చేస్తున్నాం... ’ అని వివరించారు సంధ్య.
Dr.B. Karunakar Reddy
ఆక్సిజన్ కన్సెంట్రేటర్: ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు
‘ కొన్ని వ్యాధుల కారణంగా మన ఊపిరితిత్తులు వాతావరణం నుండి తగినంత ఆక్సిజన్‌ను తీసుకోలేకపోతాయి. ఇలాంటి సమయాల్లో, వాతావరణంలో ఉండే సాధారణ 21% ఆక్సిజన్ సరిపోదు. అప్పుడు రోగులకు ఎక్కువ సాంద్రతతో ఆక్సిజన్‌ను అందించాల్సి ఉంటుంది, దీనినే ఆక్సిజన్ థెరపీ అంటారు.
సాధారణంగా ఆసుపత్రులలో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్‌లను ఉపయోగిస్తారు, వీటిలో దాదాపు వంద శాతం ఆక్సిజన్ ఉంటుంది. కానీ దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలున్న రోగులకు ఎక్కువ కాలం పాటు ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో, ఆక్సిజన్ కన్సెంట్రేటర్లు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి ఇంట్లో లేదా ప్రయాణాల్లో కూడా ఆక్సిజన్‌ను నిరంతరం అందిస్తాయి.
రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్ థెరపీ అవసరం అవుతుంది. ముఖ్యంగా ఈ క్రింది వ్యాధులకు చికిత్సలో ఆక్సిజన్ కన్సెంట్రేటర్లు కీలక పాత్ర పోషిస్తాయి.
ఊపిరితిత్తులలో వచ్చే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్, నిద్రలో శ్వాస ఆగిపోయే తీవ్రమైన సందర్భాలు, కొరోనావైరస్ వల్ల ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు ఆక్సిజన్ కన్సెంట్రేటర్ వాడుతారు.’ అని వివరించారు ప్రముఖ వైద్యుడు డా.యనమదల మురళి కృష్ణ.
Yanamadala Murali Krishna
కరోనా కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఏర్పడిన అనేక అపోహలను నివారించడంలో ఈ డాక్టర్ ఎంతో కృషి చేశారు.
ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్‌ని ఒక రకంగా మినీ ‘ఆక్సిజన్ ఫ్యాక్టరీ’ గా భావించ వచ్చు.అంటారు నిపుణులు.
హనుమకొండలోని దర్గా కాజీపేటకు చెందిన 37 ఏండ్ల సాంబమూర్తి
ఎలక్ట్రీషియన్‌గా స్వయం ఉపాధి పొందుతూ భార్య సంధ్య, కుమార్తె రిషిక, కుమారుడు ప్రణయ్‌లను పోషించుకునే వారు.కోవిడ్ కాటుతో ఆ కుటుంబంలో పెద్ద దిక్కు ఆసరా లేకుండా పోయింది. సంధ్యకు వచ్చే జీతం కుటుంబ అవసరాలకు బిడ్డల ( కుమార్తె రిషిక, కుమారుడు ప్రణయ్ ) చదువుకు, భర్త మందులకే సరిపోతుండటంతో వేలల్లో వచ్చే విద్యుత్ బిల్లులను గత రెండేళ్లుగా కట్టడం లేదు.
విద్యుత్ బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటున్నారు
‘ మా కుటుంబ పరిస్ధితిని అర్ధం చేసుకున్న విద్యుత్తు శాఖ ఉద్యోగులు మానవతా దృక్పథంతో ఇంత కాలం గడువు ఇస్తూ వచ్చారు. ఇకపై బిల్లు కట్టకపోతే కనెక్షన్ తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. ఇది తెలిసిన కొందరు దయామయులు కొంత ఆర్ధిక సాయం చేసినప్పటికీ అది సరిపోవడం లేదు’ అని ఆవేదనతో ‘ ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి చెప్పారు సంధ్య,
‘ ఇప్పటికే బిల్లు రూ.80 వేలకు పైగా బకాయి పడ్డాం. మా మీద దయతో ఇన్నాళ్లూ గడువు ఇచ్చిన విద్యుత్ శాఖ వారు కనెక్షన్ తొలగిస్తామని అంటున్నారు. అదే జరిగితే నా ఊపిరి ఆగి పోతుంది. ఎవరైనా దాతలు ఊపిరి పోసి ఆదుకోండి’ అని మంచానికే పరిమితమైన బాధితుడు సాంబమూర్తి ఆందోళనతో అంటున్నాడు.
ఆ పేద కుటుంబంలో కరోనా సృష్టించిన విధ్వంసం ఇప్పటికీ తగ్గలేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్ధలు, కార్పొరేట్ కంపెనీలు ఈ కుటుంబానికి ఆసరగా నిలిస్తే ఒక ఊపిరి ఆగకుండా కాపాడి కుటుంబాన్ని నిలబెట్టిన వారు అవుతారు.
సాయం చేసే మానవీయులు ఈ ఫోన్ నంబరు 7396174727 ను సంప్రదించాలి.