పద్మశ్రీ నాజర్ పడిన పాట్లెన్నో.. ఎర్రజెండా చెప్పిన పాఠమేంటో!!

బుర్రకథ పితామహుడు నాజర్ మరో పేరేంటో తెలుసా.. ఎర్రజెండాను ఎత్తిపట్టిన తీరు తెలిస్తే గుండెలు నీరవుతాయి.. మనసు మూగబోతుంది..;

Update: 2025-02-07 06:31 GMT
Ballad singer, Padma sri Nazar portright
బుర్రకథ పితామహుడు నాజర్ మరో పేరేంటో తెలుసా.. ఎర్రజెండాను ఎత్తిపట్టిన తీరు తెలిస్తే గుండెలు నీరవుతాయి.. మనసు మూగబోతుంది.. పగోడికి కూడా వద్దురా సామీ ఇలాంటి కష్టాలనిపిస్తుంది. సన్నాయి వాయిద్యం నుంచి సమరశంఖం పూరించే వరకు ఆయన సాగించిన ప్రస్థానం మనల్ని కంట నీరు పెట్టిస్తుంది. కష్టజీవులపార్టీ కమ్యూనిస్టు పార్టీ నా జీవితాన్ని తీర్చిదిద్దిందనే నాజర్ పుట్టిన తేదీ, గిట్టిన తేదీ కూడా ఫిబ్రవరిలోనే వస్తాయి. పుట్టింది ఫిబ్రవరి 5న, కన్నుమూసింది ఫిబ్రవరి 27న. ఈ సందర్భంగా ఆయన తన ఆత్మకథలో తన గురించి ఏమి రాసుకున్నాడో ది ఫెడరల్ పాఠకుల కోసం..
ఇలా మొదలైంది ఆయన జీవనం..
బుర్రకథా పితా మహుడుగా విఖ్యాతిగాంచి 'నాజర్‌' పేరుతో ప్రసిద్ధుడైన షేక్‌ నాజర్‌ సాహెబ్‌ గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లితండ్రులు షేక్‌ బీబాబి, షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌. పద్మశ్రీ నాజర్‌ జీవిత చరిత్ర 'పింజారి' పేరుతో ముద్రితమైంది. ఆయన స్వయంగా రాసుకున్న 'ఆత్మకథ' ముద్రణకు నోచుకోకుండానే పద్మశ్రీ షేక్‌ నాజర్‌ సాహెబ్‌ 1997 ఫిబ్రవరి 21న గుంటూరులో కన్నుమూశారు.
ఆయన తన ఆత్మకథలో రాసుకున్న మాటలు యధాతథంగా...
"పుట్టింది పేద ముస్లిం కుటుంబంలో నా తాతల నాటి నుండీ - సన్నాయి వాయిద్యానికి ఇచ్చిన దేవుడి మాన్యం 3.5 ఎకరాలు మాత్రం వుంది. అదైనా మెట్ట పొలం. చిన్నప్పటి నుండీ సంగీతమంటే చెవి కోసుకునేవాడిని. నన్ను బాగా చదివించాలనీ - గొప్పవాణ్ణిగా చేయాలనీ తల్లిదండ్రుల కోరిక. ఐదో ఏట పొన్నెకల్లు (గుంటూరు తాలూకా) బడిలో వేశారు. 4వ తరగతి చదువుతూండగా బడిలో పంతులుగారు వేయించే 'ఏకాంకిక' నాటికలలో నటించేవాణ్ణి. ప్రథమ బహుమతులు వచ్చేవి.
ఒకనాడు మాచేత నాటకం వేయించాడు మా పంతులుగారు. ఆ నాటకానికి బాలరత్నసభ (తెనాలి)కు చెందిన హార్మోనిస్టును పిలిపించారు. నేను మంచి నటకుడుగా రాణించగలనని తెలుసుకున్నాడా హార్మోనిస్టు. తన కంపెనీ డైరెక్టరుతో చెప్పాడు. వెంటనే నన్ను బాలరత్న సభలోకి తీసుకున్నారు. చదువుకు స్వస్తిజెప్పి కంపెనీలో చేరా.
“నాజర్” అనే ముస్లింపేరు బాగుండదనుకున్నారు గాబోలు; “గోపి” అని మారు పేరెట్టారు. రామదాసులో కబీరు, ఇతర నాటకాలలో స్త్రీ పాత్రలూ ధరించేవాణ్ణి. పొగడ్తలూ, బంగారు పతకాలూ వచ్చేవి. ఖర్చులుగాక నెలకు రూ.15/-లు మాత్రం ఇచ్చేవారు కంపెనీవారు. 1935లో కంపెనీ ఆర్థికంగా చితికిపోవడంతో ఆ రాబడి పోయింది.
నా కష్టాలు ఇప్పుడు మొదలు...
నా తండ్రి చాలా నిరుత్సాహపడ్డాడు. చేతిలో చిల్లిగవ్వకూడా లేక నన్ను అభివృద్ధి చేయడానికి ఏ మార్గమూ కనుపించక - ఎప్పుడూ దిగులు పడుతూండేవారు. చివరకు ధైర్యం చేసి నర్సరావుపేటలో సంగీతం పంతులుగారి వద్దకు పంపించాడు. తన రెక్కల కష్టం నుండి ఎలాగో మిగిల్చి నెలకు రూ. 3/- ల చొప్పున నాకు పంపించేవాడు. పంతులుగారు సంగీతం ఉచితంగా చెప్పబట్టి ఆ మూడు రూపాయలతోనూ ఎలాగో ఒకలాగు పొట్ట పోసుకుంటూ విద్యాభ్యాసం సాగించా. కాని కొన్నాళ్ళకు ఆ మూడు రూపాయల మొత్తంకూడా మోయరాని బరువైపోయింది. తండ్రికి. నిరాశ చేసుకున్నాడు - ఏం చేస్తాం? ఇక మానుకో నాయనా! అంటూ కంటతడిబెట్టాడు. నా శరీరమంతా నీరైపోయింది. పంతులుగారు జాలిపడి, తానే తిండిపెట్టి సంగీతం నేర్పుతానన్నారు. ఆరు మాసాల కాలం ఆ విధంగా చెప్పారు. కాని హఠాత్తుగా తండ్రి మరణించాడు. నా నడుం విరిగిపోయింది. గత్యంతరం లేక ఇంటికొచ్చా.
పొట్టకూటి కోసం జోలి కట్టుకున్నా..
ఇల్లు గడిచే దారిలేదు. తల్లిని పోషించే బాధ్యత నా మీదే వుంది. "నే నెలాగో బతుకుతాను. నీవు పోయి చదువుకో" అని తల్లి ధైర్యం చెప్పసాగింది. ఈ మారు తాడికొండ సంగీతోపాధ్యాయుల వద్ద కెళ్లా. తెలిసిన వారవడం చేత పంతులుగారు. ఉచితంగానే చెబుతామన్నారు. కాని తిండి సమస్య పెద్దదయింది. వారాలు చేసుకోవడంకోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. సంగీతం చాలించడమా? సాధించడమా? అన్న సమస్య తీవ్రంగా ఎదుర్కొంది. చివరకు సాధించడానికే నిశ్చయం చేసుకుని "నేను జోలి కట్టుకుంటానండీ". - అన్నా పంతులుగారితో, ఆయన ఆశ్చర్యపోయాడు. పట్టుదలకెంతో మెచ్చుకొని, ప్రోత్సాహకరంగా ఒక అంగవస్త్రాన్నిచ్చాడు.
ఆ అంగవస్త్రాన్నే జోలి కట్టుకున్నా. ఉదయం, సాయంత్రం ఇళ్ళ వెంట తిరిగా. పాటలు పాడించి పట్టెడన్నం పెట్టేవారు తాడికొండ ప్రజలు. కొన్నాళ్ళకి మా పంతులుగారివద్దకొక విద్యార్థి వచ్చాడు. ఆయన కూడా నాకు నకలే. కాని భిక్షమెత్తుకోవడం - నామోషీగా తోచిందతనికి. నేనే మరికాస్త భిక్షమెత్తి అతణ్ణి కూడా పోషించా. ఇలా ఏడాది గడిచింది.
నాలో నేనే కుమిలిపోయే వాణ్ణి...
కడుపునిండా అన్నం దొరుకుతోంది. కాని, కంటినిండా నిద్రలేదు. నా స్థితిని చూచుకుని, నాలో నేనే కుమిలిపోయేవాడిని. "ఎంతకాలం ఇలా బతకడం? తల్లిని పోషించడమెలా? ఈ సంగీతంలో ఎన్నాళ్ళకు నిపుణత్వం సంపాదించగలను? కుటుంబాన్ని పోషించగలిగే స్థితికి ఎప్పటికి రాగలను? అంతవరకూ అడుక్కు తినవలసిందేనా? నేనడుక్కుతింటూ జీవిస్తా. కాని, వృద్ధురాలు - తల్లి మాటేమిటి? ఆమె కూడా తిరిపెమెత్తవలసిందేనా? కాదు - కాలుచేతులు తిన్నగావుండి - కష్టించి పొట్టపోసుకోగలిగిన శక్తివున్నప్పుడు - అడుక్కు తినడం - ఆత్మగౌరవానికి భంగకరం' అనుకున్నా. నిరాశతో కూడిన విరక్తితో సంగీతానికొక సలాంకొట్టి ఇంటికొచ్చా.
“మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ" అనే 'పోతన' నీతి జ్ఞాపకమొచ్చింది. అప్పుదెచ్చి రెండు దున్నల్నికొని వ్యవసాయం బెట్టా. ఎంత బండచాకిరి చేసినా, ఫలితం మాత్రం అల్పంగా వుండేది - ఆ కౌలు సేద్యంలో మేపలేక ఒక దున్ననమ్మివేసి వ్యవసాయం ఎత్తివేశా.
ఇక జీవించడానికే మార్గమూ కనిపించక కూలికి బయలుదేరా, మిరప కోతలకు, జొన్న కోతలకు వెళితే రోజుకు ఎనిమిదణాల వరకూ గిట్టేది. కాని సంవత్సరం పొడుగునా ఇలాంటి కూలిపని ఎలా దొరుకుతుంది? అంచేత పొగాకు కంపెనీలో కూలికివెళ్ళి ముఠాలో చేరా. మా ముఠాలో ఏబదిమందిమి పనిచేసేవారం. అలసట లేకుండా, పెండెలు కట్టడం వగైరా పనులన్నీ పూర్తిజేసుకుని, సాయంత్రం మా ముఠాజేసిన పనిని గురించి వివరంగా లెక్కలు రాసేవాణ్ణి.
నెలాఖరుకు జూస్తే, కంపెనీ లెక్కకూ - మా లెక్కకూ రూ.25/- తేడా వచ్చింది. కంపెనీలో పనిజేసే కూలీలెవరూ స్వంత లెక్కలు రాసుకునేవారు కాదు. కండలు కరిగించి, బండ చాకిరి చేసి కూడా కంపెనీవారిచ్చిందే మహాప్రసాదమనుకుంటూ కిక్కురు మనకుండా పట్టుకుపోయేవారు. అంచేత నేను వివరంగా లెక్కలు చూపించి, రూ 25/-లు విరగగోయడమేమిటని నిలదీసి అడగడాన్ని సహించలేకపోయాడు కంపెనీ యజమాని. ఈ జాడ్యమే? కూలీలందరికీ అంటుకుంటుందేమోననుకున్నాడు. గుడ్లెర్రజేస్తూ, "పనిలో నుండి తొందరగా బయటికి దయచేయండి" అన్నాడు.
దున్ననమ్మి కుట్టుమిషన్ కొన్నా..
చేసేదేమీలేక రెండో దున్ననమ్మి కుట్టుమిషన్ కొన్నా. మిషన్ కుడుతూనే, వూళ్లో పిల్లలకు సంగీతం నేర్పేవాణ్ణి. సంవత్సరం గడిచేటప్పటికి రెండువందలు వెనకేశా. కాసినిగాదు - కూసినిగాదు - రెండువందల రూపాయలు. రెండువందలు సంపాదించడమంటే నాబోటి గర్భదరిద్రునికి సామాన్యమైన విషయంకాదు. పట్టరాని సంతోషంతో - కష్టార్జితమైన రెండు వందలూ బెట్టి పెళ్ళిచేసుకున్నా.
గారపాడు (సత్తెనపల్లి తాలూకా)లో అత్తవారింటి వద్ద వుండగా, చుట్టుప్రక్కల గ్రామాల యువకులతో ఎక్కువగా పరిచయమేర్పడింది. నెలజీతం పద్ధతిమీద, నాటకాలు నేర్పమన్నారు యువకులు. క్రమేణా నెలకు రూ.30/-లనుండి రూ.75/- లకు పెరిగింది సంపాదన. సంసారం ఒడుదుడుకులు లేకుండా, సాఫీగా నడిచిపోతోంది.
కమ్యూనిస్టు పార్టీతో పరిచయం...
నాటక దళాలను తయారుచేస్తూ, స్వగ్రామమైన పొన్నెకల్లు వస్తూపోతూ వుండగా, అక్కడ పార్టీసభ్యులతో పరిచయం కలిగింది. వారు నాకు రాజకీయ పుస్తకాలూ 'స్వతంత్రభారత్' పత్రికా ఇచ్చేవారు. 'స్వతంత్రభారత్' చదువుతూంటే కమ్యూనిస్టుపార్టీ కష్టజీవుల పార్టీయనీ, స్వాతంత్య్రం కోసం - కూలీ రైతుల అభివృద్ధికోసం ఎడతెగకుండా నిరంతరం పనిచేస్తూన్న పార్టీయనేభావం కలిగింది. అక్కడి నుంచి ఎక్కువగా రాజకీయ పుస్తకాలు చదువనారంభించా.
"ఇంకేముంది" కమ్యూనిస్టు పుస్తకాలనూ చదువుతున్నాడు. మీ అబ్బాయి. పోలీసులు పట్టుకుపోతారమ్మో!" అని ఎవరో మా తల్లిని భయపెట్టారు. ఒకనాడు గోర్కి రాసిన "అమ్మ" చదువుతూండగా, గోల చేయడం మొదలుపెట్టింది మా అమ్మ. గోర్కీ "అమ్మ" కూడా తనకొడుకు పావెల్ను గురించి సరిగ్గా ఇలాగే భయపడింది మొదట్లో. ఫరవాలేదులే అమ్మా: అని మా అమ్మకు ధైర్యం చెప్పి గోర్కి "అమ్మ"ను పూర్తిగా తెలుసుకున్నా. నా జోలిసంచీ- దున్నల నాగలీ - కూలీ చెమటా - కుట్టుపనీ - బుర్రలో ఒకసారి గిర్రున తిరిగాయి. "పావెల్"ను జ్ఞాపకముంచుకున్నా. పార్టీ కరపత్రాలను ఎక్కువగా చదువనారంభించా. క్రమేణా పార్టీ అంటే అభిమానమెక్కువయింది.
1942లో పార్టీ మీద నిషేధం తొలగిన తర్వాత...
1942 లో పార్టీ మీద నిషేధం తొలగింది. చీకట్లను చీల్చుకొని వెలుగులోకొచ్చింది పార్టీ. కొన్నాళ్ళకు తాళ్ళూరులో జరిగిన గుంటూరు తాలూకా యువజన మహాసభకు హాజరయి, పాటల పోటీలో పాల్గొన్నా. ప్రథమ బహుమతి వచ్చింది. తరువాత 1943లో తెనాలిలో జరిగిన జిల్లా పార్టీ మహాసభకూ, గుంటూరు తాలూకా పార్టీ సభకూ వెళ్ళా ఆ సభల్లో పాటలు పాడా. పార్టీసభ్యులు, ప్రదర్శించిన వివిధ రకాల ప్రదర్శనలను చూశా. అవి నన్నెంతో ఉత్తేజపరిచాయి. వివిధ కళారూపాలను ప్రదర్శించవలసింది పొట్టకోసం కాదనీ, ప్రజల కోసమనీ, తెలుసుకున్నా.
ఇంతవరకూ నేనాడిన నాటకాలకూ, పార్టీ సభ్యులిచ్చే ప్రదర్శనాలకూ, వున్న తేడాను గ్రహించా. నేనాడిన నాటకాలలో లాగా వీటిలో భగవంతుని సాక్షాత్కారాలు లేవు. కైలాసమసలే లేదు. కాని మానవ ప్రపంచముంది. వివిధ కళారూపాలను అభివృద్ధిపరచి, వాటిద్వారా ప్రజా సామాన్యంలో చైతన్యాన్ని పెంపొందించాలనే కమ్యూనిస్టుపార్టీ ఆశయాన్ని తెలుసుకున్నా, చిన్ననాటినుండీ కళలంటే నాకున్న ప్రీతి - నిరుపేదలనుభవించే కష్టాల అనుభవం - నా స్థాన మెక్కడో చూపించినాయి. వెంటనే పార్టీలో చేరా.
వివిధ రకాల ప్రదర్శనలు నేర్చుకొని ప్రదర్శించా. తోటి కామ్రేడ్స్ బుర్రకథలు చెబుతున్నారు. నేను మాత్రమెందుకు చెప్పగూడదనే పట్టుదల కలిగింది. కామ్రేడ్స్ రామకోటి, పురుషోత్తములను కలుపుకొని బుర్రకథలను సాధనచేశా. క్రమేణా “బెంగాల్ కరువు" బుర్రకథరాశా. ఈ బుర్రకథలద్వారా ఇంతవరకూ, మా దళమొక్కటే ఆరు లక్షలమంది ప్రజలలోకి స్వాతంత్య్ర సందేశాన్ని తీసుకువెళ్లగలిగింది. ఈ విధంగా ప్రజాసేవచేసే భాగ్యం నాకు కలిగించింది పార్టీ.
బళ్లారికి ఆహ్వానం..
నాట్యకళా ప్రపూర్ణ శ్రీ బళ్లారి రాఘవాచార్యులుగారు బాపట్లలో కథవిని, అమితానందంతో ఆశీర్వదించారు. బళ్లారికి ఆహ్వానించారు. మద్రాసు ప్రదర్శనలలో డాక్టరు గోవిందరాజుల సుబ్బారావుగారు కౌగలించుకొని హరిప్రసాదరావును జ్ఞాపకం చేశావన్నారు. అనేకమంది ప్రముఖులీవిధంగానే పొగిడారు.
పూట కూటికి గతిలేని పేద ముస్లిం కుటుంబంలో పుట్టి అష్టకష్టాలు పడిన నాకు చిన్ననాటినుండీ ఎన్ని నాటకాలాడినా, ఊరు పేరులేని నాకు - ఇన్ని గౌరవ మర్యాదలు ఎలా కలుగుతున్నాయి? ఎలా ప్రజాసేవ చేయగలుగుతున్నాను? నాకు రాజకీయాలు నేర్పి, చైతన్యం కలిగించి, అన్ని విధాలా అభివృద్ధిచేసి - కష్టజీవులపార్టీ కమ్యూనిస్టు పార్టీ నా జీవితాన్ని తీర్చిదిద్దింది కనుకనే..." అంటారు నాజర్ తన ఆత్మకథలో.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించిన నాజర్ చిన్నతనం నుండి సంగీతం పట్ల మక్కువ చూపిన నాజర్‌ నాటకాలు, నాటికలు రచిస్తూ, నటిస్తూ తొలుత గ్రామ ప్రజల మన్నన పొందారు. ఆ తరువాత నాట్యం, నటనను నేర్చుకున్న ఆయన ప్రజా నాట్యమండలి సభ్యుడిగా బుర్రకథను ప్రచార సాధనంగా స్వీకరించి బుర్రకథ కళాకారుడిగా స్థిరపడ్డారు.
జానపద కళలను బాగా అధ్యయనం చేసిన నాజర్‌ 'బెంగాల్‌ కరువు', 'రాయలసీమ కరువు' లను బుర్రకథలుగా మలచి తన అద్భుత గానంతో, అద్వితీయ నటనతో ప్రజలను ఉర్రూతలూగించే విధంగా బుర్రకథలను చెబుతూ ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ స్థాయికి చేరుకున్నారు. ఆ తరువాత 'పల్నాటి యుద్ధం' 'బొబ్బిలి యుద్ధం' 'వీరాభిమన్యు' చారిత్రక పౌరాణిక కథలను బుర్రకథలుగా రాశారు. 'ఆసామి' అను సాంఘిక నాటకాన్ని, 'నా చేతిమాత్ర' ఏకపాత్రాభినయం, 'భక్త ప్రహ్లాద' యక్షగానం, రూపొందించారు.
ప్రజా కళాకారుడిగా ప్రజా హృదయాలను చూరగొన్న ఆయనను 1986లో 'పద్మశ్రీ' అవార్డు వరించింది. ఆనాటికి మరే జానపద కళాకారుడికి అంతటి గౌరవం దక్కకపోవడంతో జానపద కళాకారులలో 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న తొలి జానపద కళాకారునిగా ఆయన చరిత్ర సృష్టించారు. జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖుల, ప్రముఖ సాహిత్య సంస్థల ప్రసంశలు, పురస్కారాలు అందుకున్నారు. బుర్రకథకు పర్యాయపదంగా మారిన పద్మశ్రీ షేక్‌ నాజర్‌ సాహెబ్‌ చలన చిత్రాలలో నటించడమే కాకుండా 'నిలువుదోపిడి', 'పెత్తందార్లు', 'సగటు మనిషి', చిత్రాలకు రచనా సహకారం అందించారు. ఆయన సాహిత్యం, కళాజీవితం విూద అంగడాల వెంకట కృష్ణమూర్తి పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసం సమర్పించి ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం (గుంటూరు) నుండి 'పి.హెచ్‌డి' పట్టా పొందారు. పద్మశ్రీ నాజర్‌ జీవిత చరిత్ర 'పింజారి' పేరుతో ముద్రితమైంది. 'జాతి జీవితం -కళాపరిణామం' పేరుతో ఆయన రాసిన పరిశోధనాత్మక గ్రంథం 1997లో ప్రచురితమైంది. ఆయన స్వయంగా రాసుకున్న 'ఆత్మకథ' ముద్రణకు నోచుకోకుండానే పద్మశ్రీ షేక్‌ నాజర్‌ సాహెబ్‌ 1997 ఫిబ్రవరి 21న గుంటూరులో కన్నుమూశారు.
Tags:    

Similar News

అవిటి నత్త