ఈ తరానికి చూపునిచ్చే నవల ‘అనేక వైపుల’

ఈ నవల రాయలసీమ ప్రాంతంలో సాగినా పీడిత ప్రజలంతా ఒక్కటే అనే వర్గ పోరాటం సూత్రీకరణలో భాగంగా నడుస్తుంది.;

Update: 2025-02-17 03:05 GMT

-వంగల సంతోష్‌


విప్లవరచయిత పాణి రాసిన ‘అనేక వైపుల’ నవల విప్లవ రాజకీయ ఆచరణకు సంబంధించినది. ఈ నేల మీద జరుగుతున్న విస్తృత ప్రజా పోరాటం గురించి రాయడం ఒక సాహసమే. ఎన్నో కోణాల నుండి, ‘అనేక వైపుల’ నుండి, రాజకీయంగా, మానవీయంగా, సాంస్కృతికంగా ఈ కాలపు ప్రజా జీవిత సంఘర్షణ నుంచి రూపుదిద్దుకున్నందువల్ల విప్లవోద్యమ చరిత్రలో నిలిచిపోయే నవల ఇది. ఈ నేల మీద ఎదుగుతున్న వర్గ పోరాట ప్రస్తుత దశను తెలియజేసే నవల. ఎన్నో ఎగుడు- దిగుళ్లకు లోనైన వర్గ పోరాటం అన్ని జీవన తలాలకు ఎట్లా విస్తరించిందో, ఎన్ని రూపాలను అది సంతరించుకున్నదో మనకు కండ్ల ముందు దృశ్యాలతో తెలియజేసే నవల. తెలుగు నేల మీద రాజుకున్న నిప్పు రవ్వ దావానంలా దేశవ్యాప్తంగా అంటుకున్న విప్లవం గురించి తెలియజెప్పే నవల ఇది.


ఈ నవల అంతా రాయలసీమ ప్రాంతంతో సాగుతుంది. ప్రాంతం ఏదైనా పీడిత ప్రజలంతా ఒక్కటే అనే వర్గ పోరాటం సూత్రీకరణలో భాగంగా చూడాలి. అసలు వర్గ పోరాటం గూర్చి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ నవల చదివితే ఇట్టే అర్ధం అవుతుంది. ఇప్పుడు నడుస్తున్న ఐదో తరానికి విప్లవోద్యమం అవగాహన, రాజకీయాలు, ఆచరణ, విధానం తెలియాలంటే ‘అనేక వైపుల’ నవల చదవాలి. అది ఈ తరానికి ఒక చూపునిస్తుంది.

ఈ నవలలోని ప్రాంతాలు ఇట్టే మనలను లాగేస్తుంటాయి. ఆ పాత్రలు అన్నీ మన చుట్టూ, మన జీవితానికి దగ్గరగా నడిచినట్టుగా ఉంటాయి. అలాంటి జీవితాలు కొనసాగించిన వారితో సాన్నిహిత్యం కలిగిన వారు, తెలిసిన వాళ్లు ఎందరో ఉన్నారు. చరిత్ర నిర్మిస్తున్నవాళ్లు, పునర్నిర్మాణం చేస్తున్న వాళ్లు ఎందరో. చలన స్థితిలో ఉన్న సమాజంలో ఎక్కడో ఒకచోట పోరాటం రూపు దాల్చకుండా పోదు. ఆ పోరాటంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా పోదు. ఆ క్రమంలో సాగుతున్నదే ఈ నవల. 

‘అనేక వైపుల’ నవలలో సాధన జీవితం ఎన్నో మలుపులకు లోనవుతుంది. అయినా తన రాజకీయ విశ్వాసం ఎక్కడా సన్నగిల్లదు. ఈ దేశంలో బూర్జువా రాజకీయాల్లో వారసత్వంగా నాయకులుగా ఎదిగివస్తున్న చోట, తన పుట్టుక ఎక్కడో, ఎట్లా జరిగిందో తెలియని సాధన ఆ తర్వాత మొదట సుధ`సత్యం దగ్గర పెరుగుతుంది. కన్నవాళ్లకు దూరంగా బాల్యం సాగుతుంది. సాధన తల్లిదండ్రులు రఘు సరోజ.. ఈ అస్తవ్యస్థ సమాజానికి చికిత్స చేయడానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ విప్లవ మార్గంలోనే తల్లి సరోజ అమరురాలు అవుతుంది. ఆమెను పెంచుతున్న సుధ, సత్యం విడిపోయాక శ్రీనివాసులు, విజయలక్ష్మి దగ్గర పెరిగి పెద్దది అవుతుంది. పదకొండేళ్ల వయసులో ఉద్యమంలో ఉన్న కన్న తండ్రి దగ్గరికి వెళినప్పుడు తల్లి చనిపోయాక ఆ వార్త తెలుస్తుంది. కన్న తల్లి ప్రేమకు దూరం అయిన సాధన ఈ దేశంలో సాధన లాంటి బిడ్డలు తల్లుల ప్రేమ కోసం తల్లులు బిడ్డల కోసం తపించిన వాళ్లు ఎందరో ఉన్నారు.

సుధ కూడా విప్లవోద్యమంలో పని చేస్తూ అరెస్టు అవుతుంది. చాలా సంవత్సరాల తరువాత సాధనను సుధ కలుస్తుంది. తనకంటే కూతురు ఎంతో రాజకీయంగా ఆలోచించే శక్తిగా మారిందని సుధ గ్రహిస్తుంది. శ్రీనివాసులు- విజయలక్ష్మిలను వదిలి సాధన అమ్మమ్మ ఊరు కర్నూలుకు చేరుకుంటుంది. ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది. అలా తన రాజకీయ క్షేత్రాన్ని ఎంచుకుని ఆచరణకు పూనుకుంది. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలంటూ అడుగులు వేస్తున్న సాధనకు, సదాశివం గారు, వారి మనవడు బిస్మిల్‌, చందన్‌, జయ, జన్ని, సుదర్శన్‌ సార్‌, వెంకట్‌ రెడ్డి, జార్జ్‌ పరిచయం. ఇక్కడ మొదట సాధనతో మాట్లాడే బిస్మిల్‌ రోజులు గడుస్తున్నా కొద్ది, సాధన విశ్వసించే రాజకీయాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. చందన్‌ అయితే మేధావి, సాధన అంటే ఇష్టం. కానీ సాధన విశ్వసించే రాజకీయాలంటే నచ్చవు. ఒకసారి సాధన చందన్‌ను సుధమ్మకు పరిచయం చేస్తుంది. తన అనుభవంతో పసిగట్టి సాధనతో ‘చందన్‌ నిన్ను ఇష్టపడుతున్నాడు’ అని దానికి సాధన సమాధానంగా అతని రాజకీయాలు వేరు, నా రాజకీయాలు వేరు. ఎలా ఒక్కటిగా సాగుతాం అంటూ సింపులుగా చెపుతుంది.

ఈ నవలలో విప్లవోద్యమం దండకారణ్యంలో చేస్తున్న ప్రయోగం మానవుల హృదయ స్పందనలను కూడా ఎట్లా మారుస్తుందో తెలుసుకోడానికి సుల్తానా పాత్ర దోహదం చేస్తుంది. మానవీయతను, మనిషిని అర్థం చేసుకోవడంలో సుల్తానా తరువాతే ఎవరైనా అనిపిస్తుంది. రసూల్‌ అనే అమర విప్లవకారుడి తల్లి సుల్తానా. కొడుకు విప్లవోద్యమంలో అమరుడైనాడని తెలిసినప్పటి నుంచి తాను ఉన్న గది నుండి బయటకు కూడా కదలకుండా కుంగిపోయి ఉంటుంది. ఒక రోజు సాధన రసూల్‌ ఉద్యమంలో ఉన్నప్పుడు తనకు దొరికిన సమయాన్ని తన తల్లికి ఉద్యమం గూర్చి ఆ ఉద్యమ ప్రాంతాలోన్ని ఉద్యమ తల్లుల గూర్చి తన డైరీలో రాసుకుంటాడు. తాను అక్కడ ఒక మానవీయ మనిషిగా ఎదిగిన క్రమాన్ని తెలుపుతాడు. అక్కడే తన పెళ్లి జరిగినది, తన సహచరి హిడ్మే గురించి పోరాట గాథను వివరిస్తాడు. ఇప్పుడా డైరీ సాధన తీసికెళ్లి సుల్తానాకు ఇస్తుంది. ఆ డైరీని సుల్తానా ఆలింగనం చేసుకొని కన్నీటి పర్యంతం అవుతుంది. కొన్ని రోజులకు సుల్తానా డైరీ చదివి నాలుగు గోడలను వదిలి తాను మొదట్లో ఆ ఇంటికి పెళ్లి అయినాక వచ్చినప్పుడు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఉన్న ఆనందం లాగా మారిపోయింది.
ఇది రజాక్‌ వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. అంతే కదా. వర్గ పోరాటం ఏ మనిషినైనా మానవీయ మనిషిగా తీర్చిదిద్దడం. ఇప్పుడు తల్లి సుల్తానా కొడుకు రసూల్‌ ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడో అని సంతోషంగానే అయినా ఇంకా బతికి ఉంటే బాగుండు అనే దిగులు కూడా ఉంది. కోడలు హిడ్మే జైలు నుండి వచ్చి కలిసినప్పుడు తన చేతుల్ని సుల్తానా తన చెంపలకు అనించింది, దుఃఖ పడ్డది. నా కడ చూపుకు రావాలని కోరింది. అయితే పోరాటంలో ఎప్పడు ఏం జరుగుతుందో తెలియని జీవితాలు. అలాంటి స్థితిలో అబద్ధపు వాగ్దానాలు చేయని మనుషులు వాళ్లు. ఏదో సంతోషపెడుదామని మాట వరసకైనా అబద్ధం చెప్పని వాళ్లు. ఏ మాట చెప్పకుండానే హిడ్మే తన అడుగుల గమ్యం సాగింది..

కర్నూలులో మొదట ఉద్యమాలు సాగుతున్న రోజుల్లో రఘుకు నాగులు కుటుంబం ఆసరా అయింది. అలాంటి కుటుంబాలు తెలుగు నేల మీద అనేకం. అట్లా పోరాటాలకు నాగులు లాంటి కుటుంబాలు ఉండటమే ఉద్యమాల బలం. వాళ్ల వల్లే ఇన్నేళ్ళుగా విప్లవోద్యమం కొనసాగుతూ వస్తున్నది. అలాంటి వారు ఎక్కడ కానరారు. వారి పనులు వాళ్ళు చేసుకొని ఉద్యమాలకు బాసటగా నిలిచారు. నాగులు వాళ్ళ ఇల్లు రఘుకు కేంద్రం. ఇప్పుడు నాగులు బతికి లేదు. ఈ వార్త తెలిసిన రఘు విలపించాడు. నాగులు అంతిమ యాత్ర నాడు సాధన వాళ్ళు సుదర్శన్‌ సార్‌తో శవంపై ఎర్ర గుడ్డ కప్పి జోహార్లు పలికారు. తెలుగు నేల మీద ఎందరో నాగులు లాంటి కుటుంబాలు ఉన్నాయి.

పోరాటంలో ప్రభావం వేసే నాయకులుంటారు అలా ప్రధాన్‌ మనకు కనిపిస్తాడు. నిజంగా వర్గ పోరులో నాయకులు ఎంత పాజిటివ్‌గా ఉంటారో, అందరి విషయాలను ఎలా వింటారో మనకు కండ్ల ముందు ప్రధాన్‌ పాత్ర ద్వారా రచయిత పాణి తెలియజేస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యమం ఎగుడు దిగుడుల నడుమ సాగుతున్న చోట రాజ్యం ఫాసిస్టు ముఖాలతో పాటు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌, సమాధాన్‌ అంటూ ఒక తేదీని పెట్టి ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలని చేయాలనుకుంటున్న వేళ సమాజం స్తబ్దతకు గురి కాకుండా పోదు. ఇలాంటి నిర్బంధపు కాలంలోనే అన్ని తలాలకు, అన్ని విధాలుగా ఎలా విస్తరించాలో, ‘అనేక వైపులు’గా మన ఉద్యమం కార్యరూపం దాల్చాలని చెపుతాడు. సాధన అరెస్టు అయినప్పుడు ప్రధాన్‌ కొంత బాధపడుతూనే, ఈ తరం కూడా వర్గ పోరాటంలో భాగ మవుతున్నందుకు సంతోషిస్తాడు. అరెస్టులు, నిర్బంధాల వల్లనే కదా మనిషి తన రాజకీయ ఆచరణ తేలేది అంటాడు. ప్రధాన్‌ పథకాలు కార్యరూపం దాల్చి, నగరంలో ఓ మీటింగ్‌కి వస్తాడు. ఆ మీటింగ్‌ జరిగే ప్రాంతంలో నడి రోడ్‌పై ఆయనను హత్య చేస్తారు. తాను మరణిస్తున్నా అని తెలిసినా తన రాజకీయాల కోసం ఇంకా బతికి ఉంటే కొంతైనా మార్పులో భాగం అవుతామనే తాపత్రయం ఉండే మనిషి ఉత్తగా కూర్చోకుండా ఏదో ఒక పని చెయ్యాలి అది ఇతరులకు, సమాజ మార్పుకు దోహదం చేసేలా ఉండాలి అంటూ చెప్పే ప్రధాన్‌ లేకపోవడం సుధను తీవ్రంగా కలిచివేసింది. సుధ సత్యంతో విడిపోయినప్పుడు కూడా ఇంత బాధ అనుభవించలేదు. అదే కదా వర్గపోరాటం ప్రేమ, ఆప్యాయత, రాజకీయ నిబద్ధత మనిషిని చలింప చేసింది. ప్రధాన్‌ ఉద్యమంలో పనిచేసే ఊరే అనే ఆదివాసీ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వెన్నెలతో పుట్టి పెరిగిన ఉరే వెన్నెల లాంటి సమాజం రావాలని చీకటిని చిదిమెయ్యడానికి నిరంతరం పోరాడిరది. చివరికి ఆ వెన్నెలలా మారి ఆదివాసీ గూడాలపై వెలుగుతూ ఉంటుంది.

ఆదివాసీ గూడాల్లో బద్రు దీదిలా ఎందరో తల్లులు పోరాటంలో భాగంగా కొనసాగుతున్నారు. విప్లవోద్యమం వాళ్ళ గడపలకు చేరుకున్నాక మనిషి రూపాంతరం చెందడం జరిగింది. వారి జీవితంలోకి అక్షరాలు చేరాయి. ప్రశ్నలు వచ్చాయి. రాజకీయాలు అందాయి. ఆదివాసీ ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయని గూడేలను తగలబెట్టి రాజ్యం ఎందరినో బలిగొన్నది. అయినా గూడేలను వదలం అని ఆదివాసులు కాలిన గూడాల వద్దనే మళ్లీ గూడేన్ని నిర్మించుకున్నారు. అలా ఎందరి ప్రాణాలను ఈ రాజ్యం కార్పొరేట్‌ సంస్థల కోసం చంపిందో. ఎందరి తల్లుల కడుపు కోత కోసిందో ఈ దుర్మార్గపు రాజ్య వ్యవస్థ. ఈ కోవలోనే బద్రు దీదీ తన ఇద్దరి కుమారులను విప్లవోద్యమంలో కోల్పోతుంది. అయినా విప్లవం మీద ఆశ సడలదు. వెన్నెల వెలుగు రాక తప్పదు అనే ఆలోచన బద్రు దీదీది. ఓ సారి ప్రజా గెరిల్లా సైన్యానికి జిల్లా కలెక్టర్‌ అభిషేక్‌ బందీగా దొరుకుతాడు. కలెక్టర్‌కు తాను భాగమైన రాజ్యం నిత్యం చేస్తున్న హత్యలాగే గెరిల్లాలు తనను కూడా చంపుతారేమో అని ఆందోళన చెందుతాడు. నిజంగా ప్రజా గెరిల్లా సైన్యం ప్రాణాలు తీయాలని అనుకోదు. దానికి మానవీయత, మంచి, చెడులు, ఉద్యమ అనుభవం, అంతిమంగా ప్రజా తీర్పే ముఖ్యంగా తన బాధ్యతను కొనసాగిస్తుంది. ప్రజా కోర్టులో విచారించి కలెక్టర్‌ అభిషేక్‌ను ప్రజా సైన్యం ప్రాణాలతో వదిలేస్తుంది. అక్కడ నిజమైన మనుషులు, మనస్సు, మానవీయత, మనిషిని మనిషిగా చూసే వాళ్లు ఉన్నారని కలెక్టర్‌ అభిషేక్‌కు అర్థమైంది.

రాయలసీమ ప్రతి మూడేళ్లకు కరువుతో అల్లాడుతుంది.అప్పుడు అక్కడి జనం గొడ్డు గోదాను అమ్ముకుని వలస ప్రయాణం చేయాల్సిందే. వందేండ్లు దాటిన శ్రీబాగ్‌ ఒప్పందం నోచుకోదు. రాయలసీమ అసలు పట్టించుకునే పాలకుడు లేడు. రాయలసీమను దోచుకునే దొంగలున్నారు. ఈ ప్రాంతం వాళ్ళే ముఖ్యమంత్రులు అయినా సీమను ఆదుకున్న వాళ్లు లేరు. నీటితో భూములు తడవని చిత్తడి నేల. సీమ అంతో ఇంతో బాగు అయిందంటే విప్లవోద్యమం ద్వారానే. స్వాతంత్ర సమర యోధుడు సదాశివం భవిష్యత్‌పట్ల ఎంతో ఆశతో ఉండే వాడు. నిత్యం రాజకీయాలను ఫాలో అయ్యేవాడు. ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని బాధపడే వారు. అయితే ఈ తరం సాధన లాంటి అమ్మాయిలు ఉద్యమంలో ఉన్నందుకు ఆనందిస్తాడు.

పాణి రాసిన నవల స్థల కాలాలు పూర్తిగా మనం జీవిస్తున్న సమాజానివి. పూర్తిగా విప్లవోద్యమం నేపథ్యంగా సాగిన నవల ఇది. ‘అనేక వైపుల’ నవల విప్లవోద్యమ చరిత్రలో నిలుస్తుంది. దీన్ని ఈనాటి తరం చదవాలి. ఈనాటి తరానికి ఈ నవల ఉద్యమం గురించి చూపునిస్తుంది. ఉద్యమం ఎన్నో వైపుల నుండి ఎట్లా సాగుతుందో ఈ నవల చెబుతుంది. ఈ కాలాన్ని అర్థం చేసుకోడానికి, విప్లవోద్యమాన్ని లోతుల నుంచి తెలుసుకోడానికి ఈ నవల ఉపయోగపడుతుంది. ‘అనేక వైపుల’ నవల చదువుదాం. చర్చిద్దాం.. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో ఈ పుస్తకం లభిస్తుంది.


Tags:    

Similar News