పునరావాస కేంద్రం ( నేటి కవిత)

అలక బారిన పడి నలగని జీవితం ఉండదు. తాత్కాలికమే అయినా అలక మనసులో సృష్టించే భావబీభత్సం అంతా ఇంతకాదు. అలక ఎనాటమీని అద్భుతంగా చూపింపిన చిత్తలూరి కవిత.

Update: 2024-03-03 07:43 GMT




పునరావాస కేంద్రం (కవిత)

 

చిత్తలూరి


అలక
ఒక నిశ్శబ్ద యుద్ధం

తుపాకుల శబ్దముండదు
బాంబుల చప్పుడుండదు
ఫిరంగి‌ మోతలుండవు
రాకెట్ లాంఛర్లుండవు
యుద్ధం జరుగుతూనే వుంటుంది

ఏ శబ్దమూ లేకుండా
ఎవరి గుండె శబ్దం వారికే వినబడుతూ
ఇద్దరు తిరుగాడే‌ ఒక గది మాత్రమే
యుద్ధభూమిలా‌ మారి
మౌనం విస్ఫోటిస్తుంది

అలకకి‌ కారణమైన వాడి గుండె
తునకా తునకలవుతుంది
మాట్లాడని మాటలన్నీ తెగిన అవయవాలై
విలవిలలాడుతూ పోగుపడతాయి

ఆమె అలిగిన నాడు
నల్లని నిరసన మబ్బులతో
నింగీ నేలా ఏకమై
ఏమీ తోచని సమయం
తుపానులా విరుచుకుపడి
మనసు తీరం
చిగురుటాకులా వణికిపోతుంది

మళ్లీ తను మాట్లాడేదాకా
ఇల్లే ఒక పునరావాస కేంద్రమవుతుంది


Tags:    

Similar News