రాయలసీమ నుండి యువ రచయితలు దూసుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. వారు తమ ముందటి రచయితలను చదవకపోయినా, బాగా రాస్తూండటం నాకయితే చాలా ఆశ్చర్యంగా వుంది. తమ ముందటి రచయితలతో పాటు పక్క భాషల వారి రచనలూ చదివితే ఇంకెంత బాగా రాస్తారోనని ఆశగానూ వుంది.
పార్వేట సురేంద్ర పూర్తి నంద్యాల, కోయిలకుంట్ల మాండలికంలో రాసిన ఈ నవల తన ప్రాంతపు సామాజిక, రాజకీయ జీవన వైచిత్రిని పట్టం గట్టింది. ఆ ప్రాంతపు భాష పూర్తి నిడివిలో రాసినా ఎక్కడా విసుగనిపించకుండా, దొర్లుకుంటూ పోవటం రచయిత రచనా చమత్కృతి.
చాలా ఇబ్బందికరమయిన ఇతి వృత్తాన్ని సురేంద్ర చక్కటి సమన్వయంతో తీర్చి దిద్దటం గొప్పగా వుంది.
మనుషులతో పాటు జంతువులు, పక్షులు కూడా పాత్రలయి నవల కొత్త దనాన్ని సందర్శింప జేసింది.
పెద్దిరెడ్డి, సిన్నోడి న్యాస్తం చదువరుల గుండెల్ని తడి చేస్తుంది. ఇట్టాంటి పాడు కాలంలో గొప్ప ఆశాజనకమయిన కంటెంట్ తో సురేంద్ర అధ్భుతమయిన నవల నందించినాడు.
చివరి భాగమయితే పరుగులు పెట్టిస్తూ, కవితాత్మకంగా ఉంది. ఈ నవల వొక కావ్యం, వొక ధీర్ఘ కవిత, రాయలసీమ నుండి వచ్చిన, వస్తున్న వొక బలమయిన గొంతుక. ఆ అక్షరాలు, వాక్యాలు వెనక కేశవరెడ్డి ఆత్మ దాగి వున్నదేమోనన్నట్టుగా ఉంది.
పార్వేట సురేంద్ర రాయల సీమ PROMISING WRITER. మన అన్నమయ్యను బాగా చదువు, మంచి భాషే వంట బడుతుంది సురేంద్ర.
ఇంత మంచి నవలను వెలుగులోకి తెచ్చిన అన్వేక్షకి అభినందనలు.