తెలుగు కవిత్వంలో తిరుగులేని చెరిగిపోని సంతకం
తెలంగాణ సాహిత్యం లోనే కాదు అఖిలాంధ్ర తెలుగు కవిత్వంలో ఆయన ముద్ర దాశరధి ముద్ర అజరామమైనది.;
By : జూకంటి జగన్నాథం
Update: 2025-07-22 09:02 GMT
దాశరధి కృష్ణమాచార్య దాశరథి పేరుతో పద్యాలు, వచన కవిత్వం రాశాడు. నిజాం నవాబు పరిపాలనను ధిక్కరించిన కలం యోధుడు." ఓ నిజాం రాజ పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలోన దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ నాటి రాచరిక పాలనను సూటిగా తన పద్యాల కాగడాలతో అక్షరాల నిప్పును అంటించాడు.
ఆంధ్ర మహాసభ లో తన వంతుగా గణనీయమైన పాత్రను పోషించాడు. నిజాం ప్రభుత్వం శిక్ష ను వేయగా దాశరధిని నిజామాబాద్ కోటలో ఖైదు చేశారు. అక్కడ పళ్ళు తోముకునే బొగ్గు ముక్కతో జైలు గోడల మీద పద్యాలు రాయగా జైలు అధికారులచేత దెబ్బలు తిన్నాడు. తెలుగు సాహిత్యం గర్వించే మహాకవీ!.
ప్రాచీన అర్వాచీన భాషా ప్రయోక్త దాశరథి. అటు ఉర్దూ సాహిత్యం మీద ఇటు ఆంగ్ల సాహిత్యం పైన తెలుగు సంస్కృత భాషల పైన మిక్కిలి పట్టుగలిగిన దాశరథి కృష్ణమాచార్య ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు గ్రామంలో క్రీ. శ.22.7.1925 నాడు ప్రభవించిన ప్రజా కవి!
పువ్వు పుట్టగానే పరిమళం వెదజల్లినట్టు దాశరధి నిజాం వ్యతిరేకంగా సాగిన తొలి సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వామి అయ్యాడు. తన పద్యాలతో నాటి రాచరిక తాబేదారులైన దొరల జమీందారుల భూస్వాముల అరాచకాలను అన్యాయాలను అక్రమాలను ధిక్కరిస్తూ ప్రశ్నిస్తూ తన పద్యాల ద్వారా ఎండగట్డాడు.
తన సాహిత్య వ్యాసంగాన్ని వేనోళ్లుగా ఉపయోగించుకున్న ఉద్దండడు. తన ఉపన్యాస విన్యాసాల ద్వారా ప్రజలను ఉర్రూతలూగించిన ఉపన్యాస దక్షుడు.దక్కనీ భాష రాయబారి దాశరధి. ఉర్దూ ఆంగ్ల తెలుగు సాహిత్యాలలో గొప్ప కవిత్వం మెలకువలను ఎరిగిన లాక్షణికుడు. ఆశయ వాది మాత్రమే కాదు ఆచరణశీలి. అందుకే తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న "కలం"కారీ సమర కాళికుడు కవితా హాలికుడు.
చిన గూడూరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన చదువు నిమిత్తం ఖమ్మం వెళ్లారు. మాధ్యమిక విద్యాభ్యాసం అక్కడి ఉస్మానియా హైస్కూల్ లో జరిగింది. అదే పాఠశాలలో చదువుతున్న డి. రామలింగం, ఎంఎల్ నరసింహారావు, హీరోలాల్ మోరియాలు స్నేహితులు అయ్యారు.
స్వాభిమానం కలిగిన దాశరధి ఏడో తరగతి చదువుతున్నప్పుడే తన తోటి విద్యార్థులకు ఇంగ్లీషు వ్యాకరణం, ఉర్దూ ట్యూషన్ చెప్పగా వచ్చిన డబ్బులతో తన అవసరాలు తీర్చుకునేవాడు.
ఇక్బాల్ కవిత్వం దాశరధి బాల్యంలో ధిక్కార బీజం నాటింది. భవిష్యత్తులో ఆ చైతన్య పూరితమైన విత్తనాలే అగ్ని ధారగా మారి ప్రజలలో అగ్ని కీలలను కవితా గానం చేయించింది. తెలంగాణ మట్టి స్వభావాన్ని తన కవితా అక్షరాలలో పొదిగి, కవిగా ప్రజలతో మమేకమయ్యాడు.
అగ్ని ధార, రుద్రవీణ, దాశరధీ కరుణా పయోనిధి మకుటంతో పద్యాలు రాసారు. మహాంద్రోదయం మున్నగు కవిత ఖండకావ్యాలను వెలువరించారు. తన కవిత సంకలనం "కవితా పుష్పకం" నకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ కవిత్వం అవార్డు అందుకున్నారు అంతేకాక" తిమిరంతో సమరం "అనే కవిత గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.
దాశరధి కృష్ణమాచారి కవిగా అనేక నూతన పోకడలు పోయారు. తను చదివిన ఉర్దూ ఆంగ్లము తెలుగు భాషలలోని సాహిత్య సౌందర్యాన్ని తన కవిత్వంలో అద్భుతంగా చిత్రీకరించాడు.
మీర్జా గాలీబ్ గీతాలను తెలుగులోకి అనువదించాడు. అంతేకాకుండా పర్షియన్ భాషలోని నాలుగు పాదాలతో కూడిన రసాత్మకమైన కవిత్వాన్ని రుబాయత్ లను రుబాయిలుగా తెలుగులో ప్రయోగాత్మకంగా కవిత్వం రాశాడు.
తెలంగాణ నిజాం వ్యతిరేకతనే కాకుండా అనంతరం ఏర్పడిన స్వాతంత్ర భారత ప్రభుత్వ నాయకత్వం పైన ఒక అద్భుతమైన రుబాయి చెప్పాడు. అది "కళ్లెం ఉన్నది చేతిలో గుర్రం మాత్రం పడ్డది గోతిలో" ధ్వనాత్మకంగా వ్యంగ్యంగా పలికించాడు.
తన కవిత్వం చమకృతులతో సామాన్యులను సైతం అనేక కవితల ద్వారా ఆలోచింపచేసాడు. మొదట పద్యాన్ని ఆ తరువాత వచన కవిత్వంలో తెలంగాణ తనాన్ని పుణికి పుచ్చుకొని మహోన్నతంగా రాశాడు. వందలాది సినిమా పాటలతో ప్రజలను రస ప్లావితం మొనరించాడు.
వరంగల్ కోటలో తాటాకు చలువ పందిళ్లు వేయించి సురవరం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. అట్టి పందిళ్లను నిజాం పెంచి పోషించిన రజాకర్ల ముఠా తగలబెట్టీంది. అప్పుడు దాశరధి వేడి బూడిద మీద చెప్పులు లేని కాళ్లతో నిలబడి కవిత్వాన్ని వినిపించాడు.
ప్రతాప్ రెడ్డి అట్టి కవి మెడలో పూలదండ వేసి తగిన రీతిగా సత్కరించాడు . అనన్య సామాన్యంగా ధైర్యంగా తెగువతో ఆరోజు ఆచోట కవిత్వాన్ని వినిపించిన ఆ కవి పేరే దాశరధి కృష్ణమాచారి. ఈ సంఘటన తన కర్తవ్యం అకుంఠిత దీక్ష దక్షతలకు ఒకానొక మచ్చుతునుక.
ఇప్పటిలా కాకుండా తెలంగాణ ఏర్పడిన తొలి రోజులలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏటేటా తెలుగు ఉర్దూ కవుల ముషాయిరాలను నిర్వాహకులు ఏర్పాటు చేసేవారు. వివిధ ప్రాంతాల నుంచి పేరు మోసిన కవులను ఆహ్వానించి తమ తమ కవితాగానాలను వినిపింప చేసేవారు.
అలాగే ఒకసారి దాశరథిని ఆ కవి సమ్మేళనానికి ఆహ్వానించారు. ఆయన స్వస్థలం నుంచి రైలు ఎక్కి సికింద్రాబాద్ లో దిగి ఒక రిక్షావాలాను ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు సవారి మాట్లాడుకొన్నారు.
ఆ కవి సమ్మేళనానికి అధ్యక్షుడిగా దాశరధి వ్యవహరించారు. వరుస క్రమంలో ఉర్దూ తెలుగు కవులను వేదిక మీదికి ఆహ్వానించి తమ కవితలను శ్రోతలకు వినిపించమని కోరారు. ఇంతలో ఒక ఉర్దూ కవిని వేదిక మీదికి ఆహ్వానించాడు ఆయన కవిత వినిపించినప్పుడు ఆయననే పరిశీలనగా దాశరధి చూసాడు.
ఎవరు ఈయన అని ఆలోచించుకొని ఆశ్చర్యంతో తనను రిక్షా తొక్కుతూ ఎక్కించుకొని వచ్చిన అతడే ఇతడని గుర్తించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సంబరమాశ్చర్యాలతో తబ్బిబ్బై పోయి తన శాలువాను తీసి ఆ కవిని గొప్పగా సన్మానించాడు. ఈ మధుర జ్ఞాపకాన్ని తన ఆత్మ కథలో హైదరాబాద్ షాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాడు.
దాశరధి మహాకవిని 1977లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించింది. నిత్య జైవిక కారణాల వలన ఆ పదవిని స్వీకరించాడు.కానీ రాచరిక వ్యవస్థకు చిహ్నం అయిన ఆస్థానకవిగా దాశరధిని స్వీకరించడం లో, నాటి కొంతమంది కవులు తీవ్రంగా విభేదించి బాహాటంగా విమర్శించారు. వ్యతిరేకించారు. సదరు కవులు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ నియమించిన వివిధ పదవులను అలంకరించారు.
తెలంగాణ సాహిత్యం లోనే కాదు అఖిలాంధ్ర తెలుగు కవిత్వంలో ఆయన ముద్ర దాశరధి ముద్ర అజరామమైనది. ఆయన ఎవరి వైపు నిలబడి ఏ ప్రజల కవిత్వం రాయాలో అన్ని కాలాల్లో స్వస్థత ప్రాసంగికత కలిగిన కవి.
ఆయనే పద్యాన్ని రాసిన కవిత్వాన్ని రాసిన రేడియో నాటకం అతను యాత్రా స్మృతి (ఆత్మకథ ) రాసిన ఆయన ప్రతి వాక్యంలో తెలంగాణ తనం ఉట్టిపడుతుంది. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా సాహిత్య కార్యకలాపాలని కొనసాగాడు.
ఆయన రాసిన సినిమా పాటల్లో ఎల్లకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోయే సినీ పాట "ఆ చల్లని సముద్రంలో దాగిన బడబలాన మెంతో..." లాటి అర్థవంతమైన ఎన్నో పాటలను దాశరధి సినిమా రంగానికి అందించిన నవనీతం లాటి సునిశితమైన భావనలు కల కవి . ఆయన ముద్ర పాటించిన విలువలు నడిచిన అడుగుజాడలు తిరుగులేని చెరిగిపోని సంతకం