నది (కవిత)

మనిషికి నదికి ఉన్నది యుగాల అనుబంధం. ఈ అనుబంధం గురించి చిత్తలూరి కవిత

Update: 2023-12-27 13:04 GMT
నది నైరూప్య చిత్రం


నదికి నాకు మధ్య

నిత్య సంభాషణ

చాలాసార్లు నది నాతో

ముచ్చట్లాడుతుంది

నదిలో నేనూ నాలో నది

మునకలేస్తూ వుంటాం

నది నిశ్శబ్దంగా కళ్లలోంచి పెల్లుబికి

పాదాలను తడిపేస్తుంది

నా నదిలో మరెవరూ మునగటానికి

ఇష్టముండదు నాకు

చాలాసార్లు నా నదిలో నేనే

ఒంటరిగా ఈదుతూ వుంటాను

కొన్నిసార్లే నది తగ్గుముఖం పడుతుంది

అనేకసార్లు ఉధృతమవుతుంది

గుండె గోడల్ని ఒరుసుకుంటూ ప్రవహించే

నాలోని నదికి

నలుగురిని పచ్చగా బతికించటమే తెలుసు

ప్రవహించినంత మేర

పచ్చదనాన్ని మొలకెత్తించటమే తెలుసు

నాలో శుభ్రపరుచుకుంటున్న అనేక మలినాల్ని

తేటగా మెరిపించటమే తెలుసు

నది మీద పూలలాంటి పడవలతోపాటూ

ముళ్ల కంపల్నీ తీరం చేర్చుతుంది నది

నదిలేనిదెవరికి?

నదికానివాళ్లెవరు?

నదిని వెంటేసుకునే పుడతాం

నలుగురిని నదిలా మార్చే

చివరికి వెళ్లిపోతాం

- చిత్తలూరి

Tags:    

Similar News